పూజకు ముందు.. పీరియడ్లను వాయిదా వేసే పిల్ తీసుకుంటున్నారా? అయితే మీరు ఇది చదవాలి...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనఘా పాఠక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘అవును. నేను పిల్స్ తీసుకుంటా. మొన్న కూడా.. ఒక టాబ్లెట్ వేసుకున్నా. మా ఇంట్లో సత్యన్నారాయణ వ్రతం ఉందని...’’ అని చెప్పారు 27 ఏళ్ల కళ్యాణి. ఆమె ఒక ఇంట్లో పని మనిషి.
కళ్యాణికి ఇద్దరు పిల్లలున్నారు. ఆమె అత్త కూడా పూజలు ఎక్కువగా చేస్తుంటారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లందరిలో.. కళ్యాణి మినహా అందరూ వితంతువులే. అందుకే ఇంట్లో పూజ పనులు చేయటానికి ఆమె ఒక్కరికే అనుమతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆమె రుతుక్రమం మొదలైతే.. అన్ని పనులనూ నిర్వహించటం అసాధ్యమవుతుంది.
ఆమెకు పీరియడ్స్ వచ్చినపుడు.. కుటుంబ సభ్యులు ఆమెపై చిరాకుపడుతూ కేకలు వేసేవారు. ఈ సమస్యకి కొన్నేళ్ల కిందట ఆమెకి ఒక పరిష్కారం దొరికింది. అది రుతుక్రమాన్ని వాయిదా వేసే టాబ్లెట్.
‘‘ఈ కాలంలో చాలా పండగలు ఉంటాయి. ఈ పండుగల సందర్భంగా అంటు ముట్టుకు సంబంధించిన మతపరమైన పరిమితుల విషయాల్లో నా కుటుంబం చాలా ఖచ్చితంగా ఉంటుంది. పైగా.. నేను పని చేసే ఇళ్లలోని మహిళలు.. గౌరీ వ్రతం సమయంలో నాకు పీరియడ్స్ ఉన్నాయా అని అడుగుతుంటారు’’ అని చెప్పారు కళ్యాణి.

ఫొటో సోర్స్, Getty Images
‘‘వారి దృష్టి నుంచి చూస్తే వారి ఆలోచనలు కూడా సరైనవే. దేవుడి విషయంలో ఎవరైనా ఎలా నటించగలరు? అందుకే నేను పీరియడ్స్‌లో ఉంటే రావద్దని చెప్తారు. కొన్నిసార్లు వాళ్ల నుంచి రావలసిన డబ్బులు కూడా పోతాయి. అలా నష్టపోవటం కన్నా టాబ్లెట్లు వేసుకోవటం మంచిది.. కాదంటారా?’’ అనేది ఆమె అభిప్రాయం.
ఆగస్టులో ఈ పండుగల సీజన్ మొదలవుతుంది. పూలు, పూజ సామాన్లు, సత్యనారాయణ పూజ పుస్తకాలు, అగరవత్తులు, మిఠాయిలకు డిమాండ్ పెరుగుతుంది. రుతుస్రావాన్ని వాయిదావేసే టాబ్లెట్లకు కూడా ఈ సీజన్‌లో డిమాండ్ పెరుగుతుంది.
‘‘గణపతి, మహాలక్ష్మి పండుగల సమయంలో ఈ టాబ్లెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ కాలంలో మహిళలు ఈ పిల్స్ తీసుకుంటుంటారు. ఈ సీజన్‌లో మా షాపులో రోజుకు పది నుంచి పదిహేను స్ట్రిప్‌లు అమ్ముడవుతాయి’’ అని చెప్పారు మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లా దౌల్గాం రాజాలో మెడికల్ స్టోర్స్ నడిపే రాజు ఝోరే.
పండుగల సమయంలో ‘మైల’ లేదా ‘అపవిత్రం’ కాకుండా చూసుకోవటం దీనికి ప్రధాన కారణం. భారత్ వంటి దేశంలో ఈ కాలంలో కూడా రుతుస్రావం గురించి జనం బాహాటంగా మాట్లాడరు.
పీరియడ్స్ సమయంలో మహిళల మీద చాలా ఆంక్షలు ఉంటాయి. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ స్త్రీలను ఇంటి బయట కూర్చోబెడతారు. చలిలో ఆరుబయట, పశువుల పాకలో నిద్రపోవాల్సి ఉంటుంది. వాళ్లు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనటం అసాధ్యం.
కానీ.. ఈ పండుగలకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తిచేయాల్సిన బాధ్యత మాత్రం ఇంట్లో మహిళల మీదే ఉంటుంది. అలాంటపుడు వారికి పీరియడ్స్ మొదలైతే.. ఈ పనుల భారం ఎవరు మోస్తారు? కాబట్టి.. ఇంటి పనుల్లో తలమునకలవటానికి మహిళలకు ‘ఖాళీ’ సమయం కావాలి. ఇక్కడ వారికి సైన్స్ సాయం చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
పండుగలు, పూజల క్రతువుల్లో అవరోధాన్ని అధిగమించటానికి మహిళలు ఈ టాబ్లెట్లను విస్తృతంగా ఉపయోగిస్తారు. ‘‘ఈ టాబ్లెట్లు కొనటానికి మా దగ్గరకు వచ్చే మహిళలు ఎటువంటి ప్రిస్క్రిప్షన్ తీసుకురారు. సాధారణంగా వాళ్లు ఈ టాబ్లెట్లు తీసుకునే ముందు సలహా కోసం ఏ డాక్టర్‌నీ కలవరు. ఇంట్లో ఏదైనా మతపరమైన క్రతువు ఉన్నపుడు వాళ్లు ఈ టాబ్లెట్లు తీసుకుంటారు. మామూలుగా మూడు టాబ్లెట్లు సరిపోతాయి. కానీ ఈ రోజుల్లో మహిళలు ఒకేసారి ఆరేడు టాబ్లెట్లు కొంటుంటారు’’ అని చెప్పారు ఝోరే.
ఈ టాబ్లెట్ల వాడకం వల్ల సైడ్-ఎఫెక్ట్స్ - దుష్ర్పభావాలు ఏమీ లేవా?
‘‘ఈ టాబ్లెట్లు వాడాలని ఏ గైనకాలజిస్టూ (మహిళల వైద్య నిపుణులు) సిఫారసు చేయరు’’ అని స్పష్టంచేశారు సహ్యాద్రి ఆస్పత్రిలో గైనకాలిజస్టుగా పనిచేస్తున్న డాక్టర్ గౌరీ పింప్రాల్కర్.
‘‘రుతుచక్రం మహిళల శరీరాల్లోని రెండు హార్మోన్ల మీద - ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరోన్‌ల మీద - ఆధారపడి ఉంటుంది. రుతుస్రావాన్ని వాయిదా వేయాలంటే.. ఈ హార్మోన్లకు సంబంధించిన టాబ్లెట్లు వేసుకోవాల్సి ఉంటుంది. అంటే.. ఈ టాబ్లెట్లు మహిళల హార్మోన్ల చక్రం మీద ప్రభావం చూపుతాయి. ఈ హార్మోన్ల టాబ్లెట్లను తరచుగా ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే.. బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, ఫిట్స్ వంటి తీవ్ర పరిణామాల ప్రమాదం పెరుగుతుంది. ఇటువంటి కేసులు మా దగ్గరకు వస్తుంటాయి కూడా. పీరియడ్స్‌ని వాయిదా వేయటానికి మహిళలు పది, పదిహేను రోజుల పాటు.. అది కూడా ఎక్కువ మోతాదుల్లో ఈ టాబ్లెట్లు తీసుకుంటూనే ఉన్నారు. ఇలా చేయటం వల్ల దుష్ప్రభావాలు ప్రాణాంతకంగా ఉండొచ్చు’’ అని ఆమె హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ టాబ్లెట్లు ఎవరు వేసుకోకూడదు?
మహిళలు ఈ టాబ్లెట్లు వేసుకునే ముందు అసలు ఏ డాక్టర్‌నీ సంప్రదించటం లేదని డాక్టర్ గౌరి చెప్తున్నారు. ‘‘మందుల షాపుల్లో ఈ టాబ్లెట్లు విరివిగా దొరుకుతున్నాయి. దీంతో తమకు అవసరం అనుకున్నపుడల్లా మహిళలు నేరుగా ఈ పిల్స్ కొనుక్కుని వేసుకుంటున్నారు’’ అని ఆమె పేర్కొన్నారు.
ఎటువంటి మందులు తీసుకోవాలన్నా దానికి ముందు సదరు రోగి ఆరోగ్య చరిత్రను పరిగణనలోకి తీసుకోవటం చాలా ముఖ్యం. ఏ మహిళకైనా తలతిరగటం (వర్టిగో) పార్శ్వనొప్పి (మైగ్రేన్) ఉన్నా.. గతంలో ఎప్పుడైనా స్ట్రోక్ వచ్చినా.. రక్తపోటు ఉన్నా.. అధిక బరువు ఉన్నా.. ఆమె ఆరోగ్యాన్ని ఈ టాబ్లెట్లు మరింతగా దెబ్బతీయగలవు.
మహిళా అథ్లెట్లకు ఈ టాబ్లెట్లతో ఇబ్బందులు లేవా?
ఆటల పోటీల సమయంలో క్రీడాకారిణిలు కూడా పీరియడ్లను వాయిదా వేయటానికి ఈ టాబ్లెట్లు వేసుకుంటారు. మరి ఇవి వారి శరీరాల మీద ప్రతికూల ప్రభావం చూపటం లేదా?
‘‘క్రీడాకారిణిల విషయం భిన్నమైనది. వారు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటుంటారు. శరీరం బలంగా ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటారు. కాబట్టి వాళ్లు ఇటువంటి టాబ్లెట్లు వేసుకున్నపుడు సైడ్-అఫెక్ట్స్ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అదీగాక అథ్లెట్లు ఈ టాబ్లెట్లు అంత తరచుగా తీసుకోరు. కానీ.. మతపరమైన కారణాల వల్ల రుతుస్రావాన్ని వాయిదా వేయటానికి ఈ టాబ్లెట్లు వేసుకునే మహిళల సంఖ్య చాలా చాలా ఎక్కువ. పైగా వీరు చాలా తరచుగా ఈ టాబ్లెట్లు వాడుతుంటారు’’ అని డాక్టర్ గౌరి వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘నేను పీరియడ్స్ సమయంలో కూడా గణపతి పూజలకు వెళ్తాను’’
అయితే.. రుతుస్రావం సమయంలో ఇంటి బయట కూర్చోవాల్సి వచ్చే మహిళల సంఖ్య కనీసం నగరాల్లో అయినా తక్కువగా ఉంది. కానీ రుతుస్రావం అవుతున్న మహిళలు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనటం నిషిద్ధం. అందుకే చాలా మంది మహిళలు ఈ టాబ్లెట్లు వాడుతున్నారు.
‘‘రుతుస్రావంలో ఉన్నపుడు పూజలు చేయొద్దు అని కానీ.. మతపరమైన పనుల్లో పాల్గోవద్దు అని కానీ దేవుడు చెప్పలేదు. కాబట్టి.. ఇటువంటి అపోహల కోసం మహిళలు తమ శరీరాలకు హానిచేసుకోకూడదు’’ అని సూచిస్తున్నారు డాక్టర్ గౌరి.
ఆలయ ప్రవేశ ఉద్యమం ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన భూమాత బ్రిగేడ్‌కి చెందిన తృప్తి దేశాయ్ ఏమంటున్నారు?
‘‘నెలసరి రుతుస్రావం అపవిత్రం కాదు. అది ప్రకృతి కానుక. దానిని సంతోషంగా అంగీకరించాలి. మహిళలు పీరియడ్స్ సమయంలో ఆలయాలకు వెళ్లరు.. పండుగల సమయంలో రుతుస్రావాన్ని వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇదంతా పూర్తిగా తప్పు. చాలా గణపతి పూజలకు నన్ను ఆహ్వానిస్తుంటారు. ఆ రోజుల్లో నాకు పీరియడ్స్ ఉన్నా సరే.. నేను వెళ్లి పూజలు చేస్తాను. హారతిలు పాడతాను. నాకు పీరియడ్స్ ఉన్నందు వల్ల ఫలానా కార్యక్రమానికి హాజరుకాలేను అని నేను ఎప్పుడూ చెప్పలేను. ఈ ముట్టు వంటి ఆంక్షలు.. మైల వంటి భావనలు.. ఈ దురాచారాలన్నిటికీ మనం స్వస్తిచెప్పాల్సి ఉంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ధర్మశాస్త్రాలలో ఏమీ చెప్పలేదు...
‘‘మహిళలు నెలసరి సమయంలో మతపరమైన పనులు చేయకూడదని ధర్మశాస్త్రాలు ఎక్కడా చెప్పటం లేదు’’ అని పంచాంగ కర్త డి.కె.సోమన్ ఉద్ఘాటించారు.
‘‘పాత రోజుల్లో మహిళలను వారి రుతుస్రావం సమయంలో ఇంట్లో ఒక మూలన కూర్చోబెట్టేవారు. వారికి కొంత విశ్రాంతి లభించాలని.. మొత్తంగా పరిశుభ్రంగా ఉండాలన్నది దాని ఉద్దేశం. కానీ ఇప్పుడది అవసరం లేదు. ఉదాహరణకి.. ఒక ఇంట్లో ఒక మహిళ ఒంటరిగా ఉన్నపుడు.. ఆమె పీరియడ్స్‌లో ఉంటే.. దేవుడికి ఆమె నైవేద్యం వండకూడదా? ఆమె తప్పకుండా వండాలి. ఎలాగూ.. దేవుడికి నైవేద్యం సమర్పించే ముందు దానిని పవిత్రం చేయటానికి దాని మీద తులసిదళం లేదా దువ్వగడ్డి ఉంచుతాం. కాబట్టి.. పీరియడ్స్‌లో ఉన్నపుడు నైవేద్యం వండటంలో.. చివరికి పూజలు చేయటంలో అయినా ఎలాంటి ప్రమాదం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘ఒకవేళ మహిళలు టాబ్లెట్లు తీసుకోవటం ద్వారా పీరియడ్లను వాయిదావేస్తున్నట్లయితే.. అది పూర్తిగా తప్పు. దేవుడికి కోపం రాదని.. ఆయన శిక్షించడని.. ఆయన ఎల్లప్పుడూ క్షమిస్తాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. కాబట్టి.. మత ఛాందసం సృష్టించిన అనవసర భయాలతో మహిళలు తమ శరీరాలకు హాని చేసుకోకూడదు’’ అని సోమన్ సూచించారు.
‘నేను ఈ టాబ్లెట్లు వేసుకుంటా.. కానీ నాకు ఎప్పుడూ ఏ సమస్యా రాలేదు’
ఒక ప్రైవేట్ కంపెనీలో ఉన్నతస్థాయి ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే మేఘా.. ఇంట్లో మతపరమైన కార్యక్రమాల సమయంలో తాను ఇటువంటి టాబ్లెట్లు వేసుకున్నానని.. అయితే తనకు ఎప్పుడూ ఎటువంటి ఆరోగ్య సమస్యలూ రాలేదని చెప్తున్నారు.
‘‘రుతుస్రావంలో ఉన్న ఒక మహిళను పూజలు చేయకుండా నిషేధించటాన్ని నేను సమర్థించను. కానీ మా అత్త తన విశ్వాసాల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. ఆమె సంతృప్తి కోసం నేను ఈ టాబ్లెట్లు వేసుకుంటుంటాను. కొన్ని రోజుల కిందట మేం మా కుటుంబ దేవత ఆలయానికి వెళ్లాం. ఆ సమయంలో మా అత్త సూచించినట్లు నేను ఈ టాబ్లెట్లు వేసుకున్నాను. నాకు ఎటువంటి సమస్యలూ రాలేదు’’ అని మేఘా పేర్కొన్నారు.
ఈ టాబ్లెట్ల వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఉంటాయా లేదా అన్న విషయంలో నిపుణుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే.. కాలం చెల్లిన దురాచారాల కోసం మహిళలు తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారా? అన్నది ప్రశ్న.
- #UnseenLives: బాలింతలైతే 3 నెలలు ఊరి బయటే: ఇదేం ఆచారం?
- అభిప్రాయం: ఫెమినిస్ట్ అమ్మాయిలు ఎలా ఉంటారు?
- అమ్మాయిలు నలుగురిలో చెప్పుకోలేని ఆ విషయాలు!
- అమ్మా..నాన్నా.. వింటున్నారా?
- భారతదేశంలో మహిళల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి?
- తండ్రి ఆస్తిలో కూతురి వాటా ఎంత? తాత ఆస్తిలో ఆమెకు హక్కుందా లేదా?
- అమృత కన్నీటి కథ : ‘‘నన్ను గదిలో బంధించే వారు... ప్రణయ్‌ని మరచిపోవాలని రోజూ కొట్టేవారు’’
- ‘నా శంకర్‌ను చంపినట్లే ప్రణయ్నూ చంపేశారు’
- ‘భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్న భారతీయులు’
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- ‘రాజకీయ నేతల ప్రేమ వ్యవహారాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎందుకు మాట్లాడరు?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









