తండ్రి ఆస్తిలో కూతురి వాటా ఎంత? తాత ఆస్తిలో ఆమెకు హక్కుందా లేదా?

తాత-తండ్రుల ఆస్తిలో హక్కు ఎవరికి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, భూమిక రాయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆస్తి మీ తండ్రిదో, తాతదో అయినపుడు దానిపై మీకు మాత్రమే హక్కుండాలా? ఒకవేళ అలా అనుకుంటే చట్టపరంగా ఇబ్బందులు ఎదురు కావొచ్చు.

ఎందుకంటే తండ్రి, తాత ఆస్తి పంపకంలో చాలా రకాల నియమాలు-చట్టాలు ఉన్నాయి.

ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో తీర్పు ఇస్తూ, తండ్రి ఆస్తి మొత్తం కొడుకుకే దక్కదని చెప్పింది.

ఆ వ్యక్తి తల్లి ఇంకా బతికే ఉన్నపుడు ఆ తల్లికి, కూతురికి కూడా ఆస్తిలో హక్కు ఉంటుందని వివరించింది.

ఇంతకూ కేసు ఏంటి?

దిల్లీలో నివసించే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆస్తి పంపకాలు జరిగాయి.

చట్టప్రకారం ఆయన ఆస్తిలో సగ భాగం ఆయన భార్యకు దక్కాలి. మిగతా సగభాగం ఆయన పిల్లలు ( ఒక అబ్బాయి, ఒక అమ్మాయి)కి దక్కాలి.

కానీ కూతురు.. తండ్రి ఆస్తిలో తన భాగం అడిగినప్పుడు, సోదరుడు ఆమె వాటా ఇవ్వడానికి నిరాకరించారు.

దాంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తల్లి కూడా కూతురివైపే నిలిచారు..

తాత-తండ్రుల ఆస్తిలో హక్కు ఎవరికి

ఫొటో సోర్స్, Getty Images

కేసు విచారించిన దిల్లీ హైకోర్టు హిందూ వారసత్వ చట్టం ప్రకారం తీర్పు ఇచ్చింది.

మృతుడి భార్య ఇంకా సజీవంగా ఉన్నారు కాబట్టి ఆమెకు, కూతురికి కూడా ఆస్తిపై సమాన హక్కు ఉంటుదని న్యాయస్థానం పేర్కొంది.

దీనితోపాటు ఈ కేసు వల్ల తల్లి ఆర్థికంగా నష్టపోయిందని, మానసిక ఒత్తిడికి గురైందని భావించిన న్యాయస్థానం కుమారుడికి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.

తాత-తండ్రుల ఆస్తిలో హక్కు ఎవరికి

ఫొటో సోర్స్, Getty Images

తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు లేదా?

సాధారణంగా మన సమాజంలో కుమారుణ్ని తండ్రి వారసునిగా భావిస్తారు.

2005కు ముందు హిందూ కుటుంబాల్లో కొడుకును మాత్రమే ఇంటికి కర్తగా భావించేవారు. తాతతండ్రులు సంపాదించిన ఆస్తిలో కూతురికి వాటా దక్కేది కాదు.

కానీ 2005లో చట్ట సవరణ ద్వారా తండ్రి ఆస్తిపై కొడుకు, కూతురికి సమాన హక్కు కల్పించారు.

"ఏదైనా పిత్రార్జిత ఆస్తి పంపకం 2004 డిసెంబర్ 20 ముందు జరిగి ఉంటే, అందులో అమ్మాయికి హక్కు ఉండదు. ఎందుకంటే ఈ కేసులో పాత హిందూ వారసత్వ చట్టం అమలవుతుంది. దాని ప్రకారం ఆ పంపకాన్ని రద్దు చేయడం కుదరదు" అని దిల్లీ న్యాయవాది జయతి ఓఝా చెప్పారు.

ఈ చట్టం హిందూ మతంలో ఉన్న వారితో పాటు బౌద్ధులు, సిక్కులు, జైనులకు కూడా వర్తిస్తుంది.

అయితే ఆస్తిలో హక్కు ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉండదు అనేది తెలుసుకునే ముందు పిత్రార్జితం అని దేన్ని అంటారో కూడా తెలుసుకోవడం అవసరం.

తాత-తండ్రుల ఆస్తిలో హక్కు ఎవరికి

ఫొటో సోర్స్, Thinkstock

పిత్రార్జిత ఆస్తి అంటే?

ఎవరైనా ఒక పురుషునికి తన తండ్రి, తాత, ముత్తాత నుంచి వారసత్వంగా లభించిన ఆస్తిని పిత్రార్జితం అంటారు.

మగబిడ్డ పుట్టగానే పిత్రార్జిత ఆస్తికి హక్కుదారుడు అవుతాడు.

ఆస్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్వయంగా ఆర్జించిన ఆస్తి, రెండోది వారసత్వంగా లభించిన ఆస్తి.

తన సంపాదనతో కూడబెట్టిన ఆస్తిని స్వార్జితం అంటారు. వారసత్వంగా లభించిన ఆస్తిని పిత్రార్జితం అంటారు.

పిత్రార్జిత ఆస్తిలో ఎవరెవరికి భాగం ఉంటుంది?

ఒక పురుషుడి పిత్రార్జితంలో పిల్లలకు, భార్యకు సమాన హక్కులు ఉంటాయని న్యాయ నిపుణులు డాక్టర్ సౌమ్యా సక్సేనా తెలిపారు.

ఉదారహణకు, ఏదైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ముగ్గురు పిల్లలు ఉంటే, పిత్రార్జిత ఆస్తిలో ఆ వ్యక్తి ముగ్గురు పిల్లలకు, భార్యకు సమాన భాగాలు లభిస్తాయి.

తాత-తండ్రుల ఆస్తిలో హక్కు ఎవరికి

ఫొటో సోర్స్, Getty Images

పిత్రార్జితం విక్రయించే నియమాలు ఉన్నాయా?

పిత్రార్జితంలో చాలా మందికి వాటాలు ఉంటాయి కాబట్టి, ఆ ఆస్తిని అమ్మడంపై చాలా కఠిన నియమాలు ఉన్నాయి.

పిత్రార్జిత ఆస్తి విక్రయించడానికి భాగస్తులందరి అనుమతి తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. ఎవరైనా ఒకరు దీనికి ఒప్పుకోకపోయినా ఆ ఆస్తిని విక్రయించడం కుదరదు. కానీ భాగస్తులందరూ ఆస్తి అమ్మడానికి రాజీ అయితే ఆ పిత్రార్జితాన్ని విక్రయించవచ్చు.

రెండో భార్య పిల్లలకు కూడా సమాన హక్కు లభిస్తుందా?

హిందూ వివాహ చట్టం ప్రకారం మొదటి భార్య ఉండగా రెండో వివాహం చేసుకోవడం చట్టవిరుద్ధం అవుతుంది. కానీ మొదటి భార్య మరణించిన తర్వాత ఎవరైనా వ్యక్తి రెండో పెళ్లి చేసుకుంటే దానిని చట్టబద్ధమైనదిగా భావిస్తారు.

అలాంటి పరిస్థితిలో రెండో భార్య పిల్లలకు కూడా అతని ఆస్తిలో వాటా లభిస్తుంది. కానీ పిత్రార్జితంలో వాళ్లకు భాగం ఉండదు.

స్వార్జిత ఆస్తిని దాని యజమాని తన జీవితకాలంలో లేదా చనిపోయిన తర్వాత వీలునామా ద్వారా ఎవరికైనా ఇవ్వవచ్చు.

వీలునామా లేకుంటే?

"పిత్రార్జితం కాకుండా స్వార్జిత ఆస్తి ఉన్నప్పుడు, అందులో ఆ వ్యక్తి భార్యకు, పిల్లలకు హక్కు ఉంటుంది. వారితోపాటు ఆ వ్యక్తి తల్లిదండ్రులు కూడా జీవించి ఉంటే, వారు తమ కొడుకుపై ఆధారపడి ఉంటే, వారికి కూడా ఆ ఆస్తిలో భాగం లభిస్తుంది" అని డాక్టర్ సౌమ్య తెలిపారు.

"ఆ వ్యక్తి తల్లిదండ్రులు ఆస్తిలో భాగం కోరుకోకుంటే, వారసులు ఎవరైనా వారి భాగాన్ని తీసుకుని, వారి బాధ్యతను చూసుకోవచ్చు" అని ఆమె వెల్లడించారు.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)