యెమెన్ యుద్ధం: సౌదీ సేనల వైమానిక దాడిలో 29 మంది పిల్లలు మృతి

దాడిలో గాయపడిన బాలుడు

ఫొటో సోర్స్, Reuters

సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు చేసిన వైమానిక దాడిలో కనీసం 29 మంది చిన్నారులు చనిపోయారని, మరో 30 మంది దాకా గాయపడ్డారని రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ తెలిపింది.

ఆ పిల్లలంతా ఒక బస్సులో ప్రయాణిస్తున్నారు. సాదా ఉత్తర ప్రావిన్స్‌లోని దహ్యాన్ మార్కెట్ సమీపంలోకి రాగానే ఆ బస్సు మీద బాంబు దాడి జరిగింది.

హూతీ రెబెల్స్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఈ దాడిలో 43 మంది చనిపోయారని 61 మంది గాయపడ్డారని చెప్పింది.

యెమెన్ ప్రభుత్వ మద్దతుతో హూతీ రెబెల్స్ మీద యుద్ధం చేస్తున్న సంకీర్ణ సేనలు, తమ చర్యలన్నీ "చట్టబద్ధంగా"నే ఉన్నాయని అంటోంది. తాము ఏనాడూ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయలేదని చెబుతోంది. కానీ, వారు మార్కెట్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, జనావాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని మానవ హక్కుల పరిరక్షణ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

సాదాలో అసలేం జరిగింది?

సామాన్య ప్రజలు, పిల్లలు ప్రయాణిస్తున్న బస్సు మీద దహ్యాన్ మార్కెట్ వద్ద వైమానిక దాడి జరిగిందని యెమెని ఆదివాసీ పెద్దలు అసోసియేటెడ్ ప్రెస్‌తో చెప్పారు.

పిక్‌నిక్ వెళ్ళి తిరిగి బడికి వస్తున్నప్పుడు పిల్లలకు డ్రింక్స్ ఇవ్వడానికి డ్రైవర్ బస్సును మార్కెట్ వద్ద ఆపినప్పుడు ఈ దాడి జరిగిందని తమ సభ్యులు చెప్పారని సేవ్ చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది.

దాడి జరిగినప్పుడు బస్సు ఆగి ఉంది.

ఆస్పత్రిలో గాయపడిన చిన్నారులు

ఫొటో సోర్స్, Reuters

సాదాలోని తాము సహకారం అందిస్తున్న ఆస్పత్రికి 29 మంది పిల్లల మృతదేహాలు వచ్చాయని, వారంతా 15 ఏళ్ళ లోపు వారేనని, గాయాలతో వచ్చిన మరో 48 మందిలో కూడా 30 మంది పిల్లలు ఉన్నారని ఐసిఆర్‌సి తెలిపింది.

హూతీల ఆధ్వర్యంలోని అల్-మసిరా టీవీ ఈ వార్తను ప్రసారం చేస్తూ మొత్తం 47 మంది చనిపోయారని, 77 మంది గాయపడ్డారని ప్రకటించింది. ఈ చానల్ చిన్న పిల్లలు కొందరు యూనిఫారాలు ధరించి ఉండడాన్ని చూపించింది.

దుర్ఘటనపై ప్రతిస్పందన

సంకీర్ణ సేనలు పౌరుల ప్రాణాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయనడానికి ఈ సంఘటనే తాజా నిదర్శనమని హూతీ అధికార ప్రతినిధి మహమ్మద్ అబ్దుల్ సలాం అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అంతర్జాతీయ మానవీయ చట్టాల ప్రకారం ఏ యుద్ధంలోనైనా పౌరులకు రక్షణ కల్పించాలని ఐసిఆర్‌సి గుర్తు చేసింది. నార్వే రెఫ్యూజీ కౌన్సిల్‌కు చెందిన జాన్ ఇగేలాండ్, దీన్ని ఒక ఘాతుకంగా, సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. యుద్ధ నియమాలను సంకీర్ణ సేనలు పూర్తిగా గాలికి వదిలేశాయని ఆయన ఆరోపించారు.

వైమానిక దాడులకు ఈ బస్సును లక్ష్యంగా చేసుకున్నారా అన్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ, సంకీర్ణ దళాల అధికార ప్రతినిధి కల్నల్ టుర్కీ అల్-మాల్కి మాత్రం, ఈ దాడి "నిబంధనలకు అనుగుణంగానే జరిగిన సైనిక చర్య" అని అన్నారు. హూతీ రెబెల్స్ తమ తీవ్రవాద కార్యకలాపాలకు పిల్లలను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

యెమెన్ యుద్ధం

ఫొటో సోర్స్, Reuters

ఆ తరువాత యెమెనీ రాజధాని సనాలో కూడా వైమానిక దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి.

వారం కిందట తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న హుదాయదా రేవు నగరం మీద జరిగిన వరస దాడుల్లో కనీసం 55 మంది సామాన్య పౌరులు చనిపోయారు. 170 మంది గాయపడ్డారు. అప్పుడు కూడా సంకీర్ణ దళాలు ఆ వైమానిక దాడులు తాము చేయలేదని తోసిపుచ్చాయి. రెబెల్స్ మోర్టార్ కాల్పులే అందుకు కారణమని ఆరోపించాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)