యాపిల్: 12 ఏళ్ల పాటు నష్టాలు చూసిన ఈ కంపెనీ నేడు ప్రపంచంలో నం.1

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సారా పోర్టర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కంపెనీగా పేర్కొనే యాపిల్ ఇటీవలే ప్రపంచపు మొట్టమొదటి ట్రిలియన్ డాలర్ (రూ.68.5లక్షల కోట్లు) పబ్లిక్ కంపెనీగా అవతరించింది.
ఇంతకూ యాపిల్ ఈ విజయాన్ని ఎలా సాధించింది? ఆరా తీస్తే.. యాపిల్ ఆ విజయాన్ని అందుకోవడానికి సహకరించిన ఐదు ముఖ్యాంశాలు ఇవేనని తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
1.స్టీవ్ జాబ్స్ - తనే ఒక బ్రాండ్
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కంపెనీలలో ఒకటైన యాపిల్ సహవ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్.
పర్సనల్ కంప్యూటింగ్ విప్లవంలో యాపిల్ పేరును ఆయన ముందు వరుసలో నిలిపారు. ఐపాడ్ నుంచి ఐప్యాడ్ వరకు - అన్నింటి వెనుకా ఆయన మేధస్సు, కృషి ఉంది.
ఆధునిక ప్రపంచపు మొట్టమొదటి అమెచ్యూర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పేర్కొనే స్టీవ్ జాబ్స్... తానే ఒక బ్రాండ్.
1976లో స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి కాలిఫోర్నియాలోని సిలికాన్ వేలీలో యాపిల్‌ను స్థాపించిన నాటి నుంచి అది అనేక విజయాలు సాధించింది.

ఫొటో సోర్స్, Getty Images
1985లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ స్కల్లీతో అభిప్రాయభేధాల కారణంగా స్టీవ్ జాబ్స్‌ను తొలగించారు.
అయితే 12 ఏళ్ల పాటు యాపిల్‌లో నష్టాలు వచ్చాయి. దీంతో 1997లో స్టీవ్‌ను తిరిగి తీసుకున్నారు.
నాటి నుంచి ఆయన థింక్ డిఫరెంట్ అనే ప్రచారంతో యాపిల్ ఉత్పత్తుల ప్రచారాన్ని ప్రారంభించారు. ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని పెంచారు. దీంతో యాపిల్ లాభాల బాట పట్టింది.
2011లో స్టీవ్ జాబ్స్ మరణించినప్పుడు, నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా, ''మనం ఒక దార్శనికుణ్ని కోల్పోయాం'' అన్నారు.
స్టీవ్ జాబ్స్ పేరు లేకుండా యాపిల్, ఆ పేరుతో నిలవగలిగేది కాదు.

ఫొటో సోర్స్, Getty Images
2. ఐఫోన్ విప్లవం
ఆధునిక మొబైల్ కమ్యూనికేషన్ ప్రపంచంలో 2007లో విడుదలైన ఐఫోన్ ప్రభావం సాటిలేనిది.
మార్కెట్‌లో ప్రవేశించిన మొదటి ఏడాదే దాదాపు 14 లక్షల ఐఫోన్లు అమ్ముడుపోయాయి. అప్పటివరకు మార్కెట్‌ను శాసించిన నోకియా, బ్లాక్ బెర్రీలాంటి కంపెనీలు పోటీలో వెనకబడిపోయాయి.
ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇటీవల ఐఫోన్ మూడో స్థానానికి చేరినా.. డిమాండ్ మాత్రం కొనసాగుతోంది.
యాపిల్ ఇటీవల మూడు నెలల కాలంలో 4.13 కోట్ల ఐఫోన్లను విక్రయించింది. అదే గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 21.6 కోట్ల ఐఫోన్లు అమ్ముడుపోయాయి.
యాపిల్ లాభాలలో అత్యధికం ఐఫోన్ల ద్వారానే వస్తోంది. ఇటీవల ప్రకటించిన త్రైమాసికం ఫలితాలలో యాపిల్ ఆదాయంలో 56 శాతం ఐఫోన్ ద్వారానే వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
3. యాపిల్ సేవలు - బ్రాండ్‌పై విశ్వాసం
యాపిల్ ఐట్యూన్స్, యాప్ స్టోర్, ఐక్లౌడ్, యాపిల్ పే - యాపిల్ సర్వీస్ బిజినెస్‌లో ఇవి కొన్ని.
ఇవన్నీ కంపెనీకి ఆదాయాన్ని తెచ్చే మార్గాలు.
ఈ ఏడాది జూన్‌కు ముగిసిన త్రైమాసికంలో యాపిల్ సర్వీసెస్ ఆదాయంలో 31 శాతం వృద్ధి నమోదైంది.
యాపిల్‌కు ఐఫోన్ ద్వారంలాంటిది అయితే, యాపిల్ మ్యూజిక్, యాప్ స్టోర్ లాంటివి ఆ బ్రాండ్‌పై విశ్వాసాన్ని పెంచుతున్నాయి.
బ్రాండ్‌మ్యాటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పాల్ నెల్సన్, ''బలమైన బ్రాండ్ల వినియోగదారులు ఇతర ప్రత్యామ్నాయాలను పట్టించుకోరు. యాపిల్ అలాంటిదే. యాపిల్ బలం అక్కడే ఉంది'' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
4. యాపిల్ వృద్ధిలో చైనా పాత్ర
అతి పెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ చైనా లేకుంటే, యాపిల్ సక్సెస్ స్టోరీ భిన్నంగా ఉండేది.
మొత్తం యాపిల్ లాభాలలో పాతిక శాతం మెయిన్ ల్యాండ్ చైనా నుంచే వస్తోంది.
దీనికితోడు యాపిల్ ఫోన్లలో ఎక్కువ భాగం దక్షిణ చైనాలోని షెన్‌జెన్‌లో ఉత్పత్తి అవుతున్నాయి.
చైనాలో సంపన్న, మధ్యతరగతి వర్గాలలో, పట్టణాలలో ఆదాయానికి, ప్రతిష్టకు యాపిల్ ప్రతీకగా మారింది.
అందువల్ల తక్కువ ధరకు లభించే స్వదేశీ ఉత్పత్తులు ఉన్నా, యాపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్‌లకు మాత్రం డిమాండ్ తగ్గలేదు.

ఫొటో సోర్స్, Getty Images
5. యాపిల్ బ్రాండ్ నేడు
ఫోర్బ్స్ లిస్ట్ వరుసగా ఎనిమిదేళ్ల పాటు యాపిల్‌కు అతి విలువైన బ్రాండ్ అన్న ర్యాంక్ ఇచ్చింది. ఈ ఏడాది దాని విలువను రూ.12.5 లక్షల కోట్లుగా పేర్కొంది.
ఒకప్పుడు ప్రపంచంలో నెంబర్ వన్ బ్రాండ్‌గా గుర్తించిన కోలాకోలా బ్రాండ్ విలువ ఈ ఏడాది రూ.3.9 లక్షల కోట్లు మాత్రమే.
‘‘యాపిల్ చేసింది, కోకాకోలా చేయలేకపోయింది ఏమిటంటే - సందర్భోచితంగా ఉండడం, కాలనుగుణంగా మారడం'' అని బ్రాండ్‌మ్యాటర్స్‌కు చెందిన పాల్ నెల్సన్ అన్నారు.
''యాపిల్ చేసే ప్రతి పనికి మనిషి కేంద్రంగా ఉంటాడు. మొత్తం బ్రాండ్ టెక్నాలజీని మానవీకరించడం - అదే యాపిల్ రహస్యం''
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








