ఒసామా బిన్ లాడెన్ తల్లి: నా బిడ్డ చిన్నప్పుడు చాలా మంచివాడు

ఒసామా బిన్ లాడెన్ తల్లి ఇంటర్వ్యూ

ఫొటో సోర్స్, Getty Images

అల్ ఖైదా నేత ఒసామా-బిన్-లాడెన్ చనిపోయిన ఏడేళ్ల తర్వాత ఆయన తల్లి మొదటిసారి తన కొడుకు గురించి మాట్లాడారు.

లాడెన్ తల్లి ఆలియా ఘానెమ్ సౌదీ అరేబియాలోని జెడ్డాలోని తన నివాసంలో బ్రిటన్ వార్తాపత్రిక ది గార్డియన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

లాడెన్ చిన్నప్పుడు చాలా సిగ్గరి అని, చాలా మంచి పిల్లవాడని ఆలియా గుర్తు చేసుకున్నారు. అయితే, యూనివర్సిటీలో ఉన్నప్పుడే అతడికి 'బ్రెయిన్‌వాష్' చేశారని ఆమె చెప్పారు.

బిన్ లాడెన్‌ను చివరగా, 9/11 ఘటనకు రెండేళ్ల ముందు 1999లో అఫ్గానిస్తాన్‌లో చూశామని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.

మొదట ఆయన సోవియట్ సేనలతో యుద్ధం చేసేందుకు అఫ్గానిస్తాన్ వచ్చారు. కానీ, 1999 నాటికి ప్రపంచమంతా ఆయనను ఒక అనుమానిత తీవ్రవాదిగా గుర్తించింది.

ఒసామా బిన్ లాడెన్ తల్లి ఇంటర్వ్యూ

ఫొటో సోర్స్, Getty Images

లాడెన్ తల్లి ఏం చెప్పారు?

కొడుకు జిహాదీగా మారాడని తెలిసినపుడు ఎలా అనిపించిందని ఆలియాను అడిగితే, "మేం చాలా కంగారుపడ్డాం. అలా అసలు జరగకూడదని నేను అనుకున్నా. అతడు అన్నిటినీ అలా ఎందుకు నాశనం చేస్తాడు?" అని సమాధానం ఇచ్చారు.

చదువుకునే సమయంలో తన కొడుకు లాడెన్‌కు 'ముస్లిం బ్రదర్‌హుడ్ సంఘం'తో పరిచయం అయ్యిందని, అది అప్పట్లో ఒక రకమైన విశ్వాసంలా ఉండేదని ఆలియా చెప్పారు.

బిన్ లాడెన్ కుటుంబం సౌదీ అరేబియాలో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటి. భవననిర్మాణ వ్యాపారంతో ఆ కుటుంబం భారీగా ఆస్తులు సంపాదించింది.

బిన్ లాడెన్ తండ్రి మొహమ్మద్ బిన్ అవాద్ బిన్ లాడెన్. ఒసామా పుట్టిన మూడేళ్ల తర్వాత ఆయన ఆలియా ఘానెమ్‌కు తలాక్ ఇచ్చారు. అవాద్ బిన్ లాడెన్‌కు 50 మందికి పైగా పిల్లలు ఉన్నారు.

ఒసామా బిన్ లాడెన్ తల్లి ఇంటర్వ్యూ

ఫొటో సోర్స్, Reuters

9/11 తరువాత ఏమైంది?

సౌదీ ప్రభుత్వం 9/11 దాడుల తమను విచారించిందని, తమ రాకపోకలపై ఆంక్షలు కూడా విధించిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

అల్ ఖైదా మాజీ అథినేత దేశ బహిష్కృతుడని, కొంతమంది ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వ ఏజెంట్ కాదని చాటుకున్నట్లుగా ఉంటుందని సౌదీ సీనియర్ అధికారులు భావించడం వల్లే తనను ఆలియా ఘానెంతో మాట్లాడడానికి అనుమతించి ఉండవచ్చని జర్నలిస్ట్ మార్టిన్ చులోవ్ రాశారు.

ఈ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు బిన్ లాడెన్‌ ఇద్దరు సోదరులు హసన్, అహ్మద్ కూడా తల్లితో పాటే ఉన్నారు. 9/11 దాడుల్లో ఒసామా పాత్ర ఉందని తమకు తెలిసినప్పుడు నిర్ఘాంతపోయామని వారు చెప్పారు.

"ఇంట్లో ఉన్న అందరికీ ఆయన చేసిన పని తలవంపులుగా అనిపించింది. దానివల్ల ఎలాంటి భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయో మాకందరికీ తెలుసు. ఆ ఘటనతో వివిధ దేశాల్లో ఉన్న మా కుటుంబ సభ్యులందరూ తిరిగి సౌదీకి వచ్చేశారు" అని అహ్మద్ గుర్తు చేసుకున్నారు.

అయితే, లాడెన్ తల్లి మాత్రం 9/11 దాడులు జరిగి 17 ఏళ్లవుతున్నా అందుకు తన కుమారుడిని తప్పు పట్టడం లేదు. అతని చుట్టూ ఉన్న వారే అందుకు కారణమని ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)