ఉత్తర కొరియా అణు కార్యక్రమాలు కొనసాగిస్తోంది: యూఎన్

పేలుతున్న క్షిపణి

ఫొటో సోర్స్, EPA

ఐక్యరాజ్యసమితి ఆంక్షలు ఉల్లంఘిస్తూ ఉత్తర కొరియా అణు కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉందని భద్రతా మండలి నియమించిన ప్రత్యేక పరిశోధక బృందం సమర్పించిన నివేదిక స్పష్టం చేసింది.

పెట్రోలియం ఉత్పత్తులను ఆ దేశం సముద్రం మార్గంలో అక్రమంగా తరలిస్తోందని, విదేశాలకు ఆయుధాలను అమ్మేందుకు ప్రయత్నిస్తోందని తెలిపింది.

ఉత్తర కొరియా అణు కార్యక్రమాలపై స్వతంత్ర నిపుణులతో కూడిన బృందం ఓ రహస్య నివేదికను శుక్రవారం యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు అందజేసింది. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఉత్తర కొరియా స్పందించలేదు.

కొత్తగా బాలిస్టిక్ క్షిపణిని నిర్మించేందుకు ప్యాంగ్యాంగ్ సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోందని గతవారమే అమెరికా వ్యాఖ్యానించింది.

ఉత్తర కొరియాలో బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను తమ 'నిఘా ఉపగ్రహాలు' గుర్తించాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అమెరికా అధికారి ఒకరు వాషింగ్టన్ పోస్ట్ మీడియాకు తెలిపారు.

ఉత్తర కొరియాలో అణు నిరాయుధీకరణపై ఆ దేశ పాలకుడు కిమ్‌తో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ జూన్‌లో సింగపూర్ వేదికగా చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

అయితే, ఆ చర్చల్లో జరిగిన ఒప్పందానికి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు పరిస్థితులు కొనసాగుతున్నాయి.

అణు కార్యక్రమాలు, క్షిపణి పరీక్షల మూలంగా ఉత్తర కొరియా అంతర్జాతీయంగా అనేక ఆంక్షలు ఎదుర్కొంటోంది.

ఉత్తర కొరియా పాలకుడు కిమ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా సైన్యంతో ఆ దేశ పాలకుడు కిమ్

యూఎన్ నివేదిక ఏం చెబుతోంది?

ఉత్తర కొరియా మీద ఆంక్షలు విధించిన ఐక్యరాజ్య సమితి కమిటీ సభ్యులే ఈ నివేదికను రూపొందించారు.

''ఉత్తర కొరియా తన అణు, క్షిపణి కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంది. యూఎన్ విధించిన ఆంక్షలను ధిక్కరిస్తోంది. అక్రమంగా పెట్రోలియం ఉత్పత్తులను, బొగ్గును సరఫరా చేస్తోంది'' అని ఆ నివేదిక తెలిపింది.

అంతేకాకుండా లిబియా, యెమెన్, సౌదీ దేశాలకు చిన్నపాటి తుపాకులు, మిలటరీ సామగ్రిని ప్యాంగ్యాంగ్ తరలిస్తోందని పేర్కొంది.

ఇవికూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)