హైదరాబాద్‌లో రోహింజ్యాల ఫుట్‌బాల్ జట్టు ఇదీ

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
''మా మనసులు కుదుటపడేలా చేస్తోంది ఫుట్‌బాలే''- ఇది హైదరాబాద్‌లోని రోహింజ్యా ఫుట్‌బాల్ జట్టులో గోల్‌కీపర్ అయిన సాదిక్ మాట.
మూడేళ్ల క్రితం అబ్దుల్లా అనే మరో రోహింజ్యా యువకుడితో కలిసి సాదిక్ ఫుట్‌బాల్ జట్టును సమీకరించాడు. బాలాపూర్‌లో పాత మసీదుకు దగ్గర్లో వీరంతా రోజూ సాధన చేస్తారు.
మియన్మార్‌లో రోహింజ్యా ముస్లింలపై దాడుల నేపథ్యంలో 2013లో అబ్దుల్లా భారత్‌కు వచ్చేశాడు.
''మియన్మార్ నుంచి భారత్‌లోకి వచ్చేందుకు చాలా మంది మధ్యవర్తులకు మేం డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. దేశంలోకి అక్రమంగానే ప్రవేశించాం. తర్వాత ఆశ్రయం కోరాం. ఇప్పుడు హైదరాబాదే మా ఇల్లు'' అని బీబీసీతో చెప్పాడు అబ్దుల్లా.

కాలక్షేపం కోసం మొదలుపెట్టిన అబ్దుల్లా
అబ్దుల్లా నిర్మాణ రంగంలో కార్మికుడిగా పనిచేసేవాడు. పని తర్వాత కాలక్షేపం కోసం ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టాడు. ''పని చేసే స్థలం (సైట్)లో ముగ్గురం ఉండేవాళ్లం. మూడు నెలలపాటు రోజూ పని ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండాల్సి వచ్చింది. తలా కొంత డబ్బు పోగేసి, ఫుట్‌బాల్ కొన్నాం'' అని అతడు వివరించాడు.
'సైట్'లో నిర్మాణ పనులు పూర్తయి, అక్కడి నుంచి వచ్చేశాక ఫుట్‌బాల్ వదిలేయాల్సి వస్తుందేమో అని అబ్దుల్లా అనుకున్నాడు. కానీ అలా జరగలేదు.
ఓ సందర్భంలో, బాలాపూర్‌లో క్యాంప్-1లో ఉండే సాదిక్‌ను అతడు కలిశాడు. వారిద్దరూ కలిసి అక్కడికి సమీపంలో బార్కాస్‌లోని ఒక మైదానంలో ఫుట్‌బాల్ ఆడే స్థానికులతో పరిచయం, స్నేహం పెంచుకున్నారు.

''మాకు ఇక్కడి భాష కూడా సరిగా రాదు. అయినా మమ్మల్ని కూడా జట్టులో చేర్చుకోవాలని వారిని అడిగాం. మమ్మల్ని చేర్చుకున్నారు. తర్వాత మా క్యాంపుల్లోని ఇతర కుర్రాళ్లు కూడా మాతో కలిసి ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టారు. అప్పుడే మేమంతా కలిసి ఒక జట్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం'' అని అబ్దుల్లా తెలిపాడు.
డంప్ యార్డ్‌గా వాడుతున్న ఓ పాత మైదానాన్ని ఈ జట్టు గుర్తించింది. ఈ మైదానం నిండా ముళ్లపొదలు, చెత్త ఉండేవని, ఫుట్‌బాల్ సాధన చేసేందుకు ఇందులో కొంత భాగాన్ని తాము శుభ్రం చేసుకున్నామని జట్టులో సభ్యుడైన నూర్ అనే కుర్రాడు చెప్పాడు. స్థానిక రెస్టారెంట్లు ఇప్పటికీ ఇక్కడ చెత్త వేస్తున్నాయని తెలిపాడు.
నూర్ ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు.

పరిస్థితులు ఎలా ఉన్నా రోజూ సాధన మాత్రం విడిచిపెట్టబోమని రోహింజ్యాల జట్టులోని ఆటగాళ్లు చెప్పారు.
''మాలో అత్యధికులం సమీపంలోని నిర్మాణ ప్రాజెక్టుల్లో రోజు కూలీలుగా పనిచేస్తున్నాం. పొద్దున ఏడు గంటలకు పనికి వెళ్తాం. సాయంత్రం నాలుగు గంటలకల్లా అందరం గ్రౌండ్‌కు చేరుకుంటాం'' అని మరో ఆటగాడు వివరించాడు.
మైదానంలో రోజూ 30 మంది రోహింజ్యా కుర్రాళ్లు సాధన చేస్తారు. టోర్నమెంట్లలో పాల్గొనేందుకు రెండు జట్లు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు ఈ జట్లు 20 టోర్నమెంట్లలో ఆడాయి.

ఆ మ్యాచ్ మాకు మంచి అవకాశం
జూన్ 20న ప్రపంచ శరణార్థి దినోత్సవం సందర్భంగా 'యునైడెట్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (యూఎన్‌హెచ్‌సీఆర్)' నిర్వహించిన స్నేహపూర్వక మ్యాచ్ తమ ప్రతిభా సామర్థ్యాలను చాటేందుకు మంచి అవకాశాన్ని కల్పించిందని ఈ రోహింజ్యాలు చెప్పారు.
స్వచ్ఛంద సంస్థ 'సేవ్ ద చిల్డ్రన్'కు చెందిన ఆసిఫ్ బీబీసీతో మాట్లాడుతూ- ఈ ఆటగాళ్లు సాధనలో బాగా కష్టపడతారని చెప్పారు. ఫుట్‌బాల్ టోర్నమెంటు నిర్వహించాలని తమను అడుగుతూ ఉండేవారని, ఆ నేపథ్యంలోనే యూఎన్‌హెచ్‌సీఆర్ స్నేహపూర్వక మ్యాచ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.

హాస్టల్‌లో చేర్చుకుంటామన్న అసోసియేషన్
రోహింజ్యా ఆటగాళ్లను ప్రతిపాదిత స్పోర్ట్స్ హాస్టల్‌లో చేర్చుకునేందుకు తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ సంసిద్ధత వ్యక్తం చేసింది.
''ఈ హాస్టల్ ఆటగాళ్లకు విద్య, క్రీడాశిక్షణ ఉచితంగా అందిస్తుంది. 10 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలను ఇందులోకి తీసుకుంటాం. ఎంపిక ప్రక్రియ చేపడతాం. ఎంత మంది ఎంపికవుతారో చూడాల్సి ఉంది'' అని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీపీ ఫాల్గుణ చెప్పారు. రోహింజ్యా ఆటగాళ్ల ప్రతిభా సామర్థ్యాలకు సానబెట్టాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రొడ్యూసర్: సంగీతం ప్రభాకర్, బీబీసీ ప్రతినిధి
కెమెరా: శివకుమార్ వలబోజు, బీబీసీ కోసం
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రా, తెలంగాణల్లో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అమలు చేస్తారా? ముస్లింలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
- హైదరాబాద్ రోహింజ్యాలు: ఆధార్ కార్డులు ఎందుకు, ఎలా పొందుతున్నారంటే..
- హైదరాబాద్: బాలాపూర్‌లో ఉన్న రోహింజ్యాలు బర్మాకు వెళ్లాల్సిందేనా?
- చర్చిలో లైంగిక వేధింపులు: కన్ఫెషన్స్పై ప్రశ్నలు
- ‘అడల్టరీ చట్టం’లో మార్పులతో వైవాహిక బంధాలు ప్రమాదంలో పడతాయా?
- గొడ్డలివేటు నుంచి 16 వేల చెట్లను దిల్లీ ప్రజలు కాపాడుకున్న తీరిదీ
- దేశంలో 'వాట్సప్ హత్యలను' ఎవరు ఆపగలరు?
- డొనాల్డ్ ట్రంప్: థెరెసా మే నా మాట వినలేదు
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- ప్రజ్ఞానంద: అక్కను ఓడించాలని చెస్ నేర్చుకున్నాడు.. ఇప్పుడు గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు
- #FIFA2018: క్రికెట్లో ప్రపంచాన్ని శాసిస్తున్న భారత్ ఫుట్‌బాల్‌లో ఎందుకు వెనకబడింది?
- దక్షిణాది పురుషుల్లో తగ్గుతున్న వీర్య కణాలు.. ఏపీలో 5శాతం మందికి సంతాన లేమి
- ఏడాదికి రూ.81 లక్షలు సంపాదించినా 'పేదోళ్లే'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











