దేశంలో 'వాట్సప్ హత్యలను' ఎవరు ఆపగలరు?

వాట్సప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆయేషా పెరీరా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రమాదకర, బాధ్యతారహిత వదంతులు, సమాచారం వాట్సప్‌ ద్వారా వ్యాప్తిచెందడాన్ని సత్వరం అడ్డుకోవాలని వాట్సప్ యాజమాన్యాన్ని భారత ప్రభుత్వం నిర్దేశించింది. పిల్లల అపహరణ గురించి వాట్సప్‌ ద్వారా వ్యాపించిన వదంతులవల్ల కొత్తవారిని స్థానికులు కొట్టి చంపుతున్న ఘటనలు పెరిగిపోతున్న తరుణంలో ప్రభుత్వం ఇలా స్పందించింది. ఈ హత్యల నియంత్రణకు ఇది ఎంత మేరకు తోడ్పడుతుంది?

భారత్‌లో గత మూడు నెలల్లో మనుషులను కొట్టి చంపిన ఘటనలు చాలా జరిగాయి. ఇలా కనీసం 17 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంతకన్నా ఎక్కువే ఉందని మీడియా చెబుతోంది. పిల్లలను ఎత్తుకెళ్లేవారు తిరుగుతున్నారనే ప్రచారం వాట్సప్‌లో జరుగుతుండటంతో కొత్తగా, అనుమానాస్పదంగా అనిపించినవారిపై స్థానికులు దాడులకు దిగుతున్నారు.

ఈ ప్రచారంలో నిజంలేదని, అదంతా బూటకమని ప్రజలకు తెలియజెప్పడం తమకు చాలా కష్టంగా ఉంటోందని పోలీసులు చెబుతున్నారు.

ఇటీవల ఈశాన్య భారత రాష్ట్రం త్రిపురలో జరిగిన ఇలాంటి ఘటన విస్మయకరంగా ఉంది. సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వదంతులను నమ్మొద్దని గ్రామాల్లో లౌడ్‌స్పీకర్‌లో చెప్పేందుకు ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన ఒక వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారు.

వాట్సప్ ద్వారా వైరల్ అవుతున్న తప్పుడు సమాచారం కట్టడికి ఏంచేయాలి, ఈ సమాచారం వ్యాప్తి చెందకుండా టెక్నాలజీ సంస్థలు చర్యలు చేపట్టాలంటే ఏంచేయాలనే విషయాల్లో భద్రతాధికారులకు దిక్కుతోచడం లేదు.

వాట్సప్‌ను వాడుకొని యూజర్లు పంపుకొనే సమాచారానికి వాట్సప్ జవాబుదారీ అవుతుందని, ఈ విషయంలో తన బాధ్యత నుంచి వాట్సప్ తప్పించుకోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మొబైల్ స్క్రీన్

ఫొటో సోర్స్, AFP

పరిస్థితి ఎందుకు చేయి దాటిపోయింది?

భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) సమాచారం ప్రకారం దేశంలో వంద కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. చాలా తక్కువ సమయంలోనే కోట్ల మంది భారతీయులు ఇంటర్నెట్ వాడకాన్ని మొదలుపెట్టారు. వీరిలో అత్యధికులకు మొబైల్ ఫోనే ఇంటర్నెట్ సాధనంగా ఉంది.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ వాడకందార్లకు సమాచారం ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతోందని, ఇందులో ఏది నిజమో, ఏది కాదో వారు గుర్తించలేకపోతున్నారని, తమకు వచ్చిందంతా నిజమేనని వారు నమ్ముతున్నారని నిజనిర్ధరణ వెబ్‌సైట్ 'ఆల్ట్ న్యూస్' వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా ఇంతకుముందు బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

దేశంలో సుమారు 20 కోట్ల మంది వాట్సప్ వాడుతున్నారు. వాట్సప్‌కు అతిపెద్ద మార్కెట్ భారతే. దేశ ప్రజలకు అందుబాటులో ఉన్న అతిపెద్ద ఇంటర్నెట్ ఆధారిత సర్వీసు కూడా ఇదే. ఫలితంగా వాట్సప్ వల్ల చాలా ఎక్కువ మందికి వేగంగా సమాచారం చేరుతుంది. ఇలాంటి సమాచారానికి సంబంధించి జనం పోగయ్యేందుకు కూడా వాట్సప్‌కు ఉన్న 'రీచ్' కారణమవుతోంది.

వాట్సప్‌లో వదంతుల వ్యాప్తి కారణంగా వ్యక్తులపై జరిగే దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవి అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.

అప్పుడు ఎలా ఉంటుందో!

దేశంలో రానున్న మూడేళ్లలో మరో 30 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులోకి రానుందని, అప్పుడు ఇలాంటి పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని టెక్నాలజీ నిపుణుడు ప్రశాంతో కె.రాయ్ బీబీసీతో చెప్పారు.

కొత్తగా ఇంటర్నెట్ వాడబోయే వారిలో ఎక్కువ మంది ఇంగ్లిష్ తెలియనివారే ఉంటారని, అక్షరాస్యత తక్కువగా ఉన్న సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన సముదాయాలకు చెందినవారు ఉంటారని ఆయన వివరించారు. వారు ఎక్కువగా వీడియోలు చూస్తారని, సంగీతం వింటారని తెలిపారు.

వాహనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇటీవల త్రిపురలో సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వదంతులను నమ్మొద్దని గ్రామాల్లో లౌడ్‌స్పీకర్‌లో చెప్పేందుకు ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన ఒక వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారు

'ఫేక్ న్యూస్ వ్యాప్తికి వీడియో తేలికైన సాధనం'

బూటకపు వార్తల వ్యాప్తికి వీడియో అత్యంత తేలికైన సాధనమని ప్రశాంతో కె.రాయ్ అభిప్రాయపడ్డారు.

''వీడియోలో సమాచారాన్ని తప్పుగా అన్వయించడం చాలా తేలిక. ఏదైనా ఘర్షణ లేదా దారుణమైన మరణానికి సంబంధించిన పాత వీడియోను ఇంటర్నెట్‌లో సేకరించి, అది ఇటీవల జరిగిన ఘటనదని, విద్వేషపూరితమైనదని చెప్పి అందరికీ పంపొచ్చు. కొన్ని నిమిషాల్లోనే అది ఫేస్‌బుక్, వాట్సప్‌లలో వైరల్ అవుతుంది'' అని ఆయన వివరించారు.

సమస్యను సంక్లిష్టం చేస్తున్న ఆ టెక్నాలజీ

వాట్సప్‌ వాడే టెక్నాలజీ కూడా సమస్యను సంక్లిష్టం చేస్తోంది. ఈ టెక్నాలజీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో కూడినది. ''మీరు పంపుతున్న సందేశాన్ని మీరు, అవతలి వ్యక్తి తప్ప ఎవ్వరూ చూడలేరు. వాట్సప్ కూడా ఈ సందేశాన్ని చూడలేదు'' అని వాట్సప్ స్వయంగా చెబుతుంది.

వాట్సప్ ద్వారా పంపుకొనే సందేశాలు వాట్సప్ సర్వర్‌లో నిక్షిప్తం కావు. అయితే సందేశాలు ఎవరు ఎవరికి పంపారు, కాల్స్ ఎవరు ఎవరికి చేశారు అనే వివరాలు మాత్రం నిక్షిప్తమవుతాయి. ఈ సమాచారాన్ని మెటాడేటా అంటారు. అమెరికాలో కోర్టు ఉత్తర్వుల మేరకు వాట్సప్ అక్కడి ఫెడరల్ విచారణ సంస్థలకు ఈ డేటాను అందించిందని ప్రశాంతో కె.రాయ్ తెలిపారు.

చైనాలో వాడే వియ్‌చాట్ లాంటి సర్వీసులతో పోలిస్తే వాట్సప్ భిన్నమైనది. వియ్‌చాట్‌ ద్వారా పంపుకొనే సందేశాలను అవసరమైతే ప్రభుత్వం చూసేందుకు చైనా చట్టం వీలు కల్పిస్తుంది. వియ్‌చాట్ వాడే టెక్నాలజీ అందుకు అనువుగా ఉంటుంది. ఈ యాప్ సిగ్నల్, టెలిగ్రాం లాంటి యాప్‌లకు దగ్గరగా ఉంటుంది. ఈ యాప్‌లను ఇక్కడ ఎక్కువ మంది వాడటం లేదు.

వీడియో క్యాప్షన్, వైరల్ వీడియో: ఆ చిన్నారి అపహరణ నిజం కాదు.. అది ఫేక్ వీడియో

వాట్సప్ ఏమంటోంది?

వ్యక్తులను కొట్టిచంపుతున్న ఘటనలపై వాట్సప్ స్పందిస్తూ- దారుణమైన ఈ హింసాత్మక ఘటనలు తమకు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని తెలిపింది. ఈ సవాలును ఎదుర్కోవాలంటే ప్రభుత్వం, పౌరసమాజం, టెక్నాలజీ కంపెనీలు కలసికట్టుగా పనిచేయాల్సి ఉందని వ్యాఖ్యానించింది.

సందేశాల ఎన్‌క్రిప్షన్ విధానంలో మార్పులకు మాత్రం వాట్సప్ అంగీకరించలేదు. వాట్సప్‌ను యూజర్లు వినియోగించే తీరు పూర్తిగా వారి వ్యక్తిగత గోప్యతతో ముడిపడి ఉందని, అందువల్ల ఈ విధానంలో మార్పులు సాధ్యం కాదని చెప్పింది.

అదే సమయంలో, తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించడానికి తాము చర్యలు చేపడుతున్నామని వాట్సప్ తెలిపింది. గ్రూప్‌ల నుంచి బయటకు రావడం, ఎవరినైనా బ్లాక్ చేయడం యూజర్లకు సరళతరం చేశామని చెప్పింది. ఫార్వర్డ్ అయిన సందేశాన్ని ఫార్వర్డ్ అయిన సందేశంగా చూపుతున్నామని పేర్కొంది.

ఇలా చూపడంపై ప్రశాంతో కె.రాయ్ మాట్లాడుతూ- దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేదని, ఎందుకంటే ఫార్వర్డ్ అయిన సందేశం ఎంత విస్తృతంగా ఫార్వర్డ్ అవుతూ వచ్చిందనేది వెల్లడికావడం లేదని చెప్పారు.

మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ''వాట్సప్ లాంటి వేదికలు యూజర్లకు స్వేచ్ఛను కల్పిస్తాయి. వీటిపై ఆంక్షలు ఉండకూడదు''

'కాపీ-పేస్ట్‌కు వీల్లేకుండా చేయాలి'

ఈ అంశంపై మీడియానామా వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు, ఎడిటర్ నిఖిల్ పాహ్వా మాట్లాడుతూ- తప్పుడు వార్తల వ్యాప్తిని అడ్డుకొనేందుకు వాట్సప్ చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇలాంటి వేదికలు యూజర్లకు స్వేచ్ఛను కల్పిస్తాయని, వీటిపై ఆంక్షలు ఉండకూడదని చెప్పారు. అయితే ఫేక్ న్యూస్ వ్యాప్తి నియంత్రణలో వీటికి బాధ్యత ఉండదని అనలేమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి నిఖిల్ కొన్ని సూచనలు చేశారు.

''వాట్సప్‌లో పంపుకొనే అన్ని సందేశాలను ప్రైవేటు సందేశాలుగా పరిగణించాలి. వాటిని కాపీ-పేస్ట్‌కు వీల్లేకుండా చేయాలి. ఫార్వర్డ్‌ చేయడానికి వీల్లేకుండా చేయాలి. ఒకవేళ ఫార్వర్డ్‌ను అనుమతించేట్లయితే ఫార్వర్డ్ చేసిన సందేశాన్ని ట్రాక్ చేసేందుకు వీలుగా దానికి ఒక ఐడీని జనరేట్ చేయాలి'' అని ఆయన వివరించారు.

అభ్యంతరకరమైన సందేశాన్ని వాట్సప్ దృష్టికి తీసుకెళ్లేందుకు యూజర్లకు వీలు కల్పించాలని నిఖిల్ అభిప్రాయపడ్డారు. వాట్సప్‌ను తొలిసారిగా వాడేవారి కోసం ఈ వేదిక ఎలా పనిచేస్తుందో వివరిస్తూ ప్రత్యేకంగా వీడియో రూపొందించాలని, ఈ వీడియో వీక్షణను వారికి తప్పనిసరి చేయాలని సూచించారు.

వాట్సప్ కేవలం సమాచారాన్ని చేరవేసే సాధనం మాత్రమేనని, దానినే లక్ష్యంగా చేసుకోవడం కూడా సబబు కాదని నిఖిల్ చెప్పారు. వాట్సప్‌లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేది ప్రధానంగా రాజకీయ పార్టీలేనని ఆయన ప్రస్తావించారు.

బూటకపు సమాచారాన్ని ఆదిలోనే అడ్డుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ముఖ్యంగా పాలక భారతీయ జనతా పార్టీ(బీజేపీ)పై ఉందని నిఖిల్ చెప్పారు. వాట్సప్‌తో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయబోమని ప్రతి రాజకీయ పార్టీ ప్రతినబూనాల్సి ఉందన్నారు.

భద్రతా సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

చట్టం ఏమంటోంది?

వాట్సప్‌ ద్వారా సమాచార వ్యాప్తి నియంత్రణను చట్టపరమైన కోణంలోంచి కూడా చూడాల్సి ఉంది. భారత ఐటీ చట్టం 'ఇంటర్మీడియరీ' మార్గదర్శకాల ప్రకారం ఈ విషయంలో వాట్సప్‌కు కొన్ని షరతులకు లోబడి చట్టపరమైన రక్షణ ఉంది. ఈ మార్గదర్శకాల ప్రకారం వాట్సప్ లాంటి వేదికలు సమాచారాన్ని చేరవేసే సాధనాలు మాత్రమే. వీటిని 'ఇంటర్మీడియరీలు' అని వ్యవహరిస్తారు. వీటి ద్వారా పంపుకొనే సమాచారానికి వీటిని బాధ్యత వహించేలా చేయడం అంత తేలిక కాదు.

ఇలాంటి విషయాల్లో వెబ్‌సైట్లపై చర్యల ప్రక్రియకు సంబంధించి ఈ మార్గదర్శకాలు స్పష్టత ఇస్తున్నాయని, కానీ వాట్సప్ లాంటి ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ వేదికల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని ప్రశాంతో కె.రాయ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)