మహారాష్ట్ర: పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారనే అనుమానంతో ఐదుగురిని కొట్టి చంపారు

ఫొటో సోర్స్, BBC/PravinThakare
- రచయిత, ప్రవీణ్ ఠాకరే, సంజయ్ తివారీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
మహారాష్ట్ర పోలీసుల కథనం ప్రకారం ధులే జిల్లాలోని ఆదివాసీ ప్రాంత గ్రామంలో పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారనే అనుమానంతో ఐదుగుర్ని చితక్కొట్టి హత్య చేశారు.
చనిపోయిన ఆ ఐదుగురూ షోలాపూర్ జిల్లా మంగళ్‌వేద్ ప్రాంత వాసులని పోలీసులు తెలిపారు.
ధులే నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని సకారీ మండలం రాయినపాఢా గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
ధులే పోలీసు ఉన్నతాధికారి రామ్‌కుమార్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘వీళ్లు బస్సులో ప్రయాణిస్తూ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గ్రామంలో దిగారు. వీళ్లను అనుమానాస్పద వ్యక్తులుగా భావించిన గ్రామస్తులు పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. తర్వాత వాళ్లను ఒక ఇంట్లో నిర్బంధించి కొట్టారు. ఈ క్రమంలో వాళ్లు చనిపోయారు’’ అని తెలిపారు.
మృతులు.. భరత్ శంకర్ భోసలే (45), దాదారావ్ శంకర్ భోసలే (36), రాజూ భోసలే (47), అగణూ శ్రీమంత్ హింగోలే (20), భరత్ మావలే (45) అని పోలీసులు వెల్లడించారు.
అయితే ఈ ఐదుగురూ రాయినపాఢా గ్రామానికి ఎందుకు వచ్చారనే విషయాన్ని పోలీసులు చెప్పలేదు.

ఫొటో సోర్స్, Deepak Khairnar

ఫొటో సోర్స్, DEEPAK KHAIRANAR

ఫొటో సోర్స్, Manohar Boros
జోరుగా పుకార్లు
పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాలు తిరుగుతున్నాయంటూ మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో సోషల్ మీడియాలో పుకార్లు చెలరేగుతున్నాయి.
మరీ ముఖ్యంగా ధులే, నందుర్‌బార్ జిల్లాల్లో పిల్లల్ని ఎత్తుకెళ్లే బృంద సభ్యులు తిరుగుతున్నారనే అపోహలు పెరిగాయి.
ఈ పుకార్లను నమ్మొద్దంటూ, అపోహల్ని తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ అవి ఆగలేదు.
ఈ పుకార్ల కారణంగా తమకు తెలియని అజ్ఞాత వ్యక్తులపై ప్రజలు దాడులు చేయటం మొదలు పెట్టారు. ధులే జిల్లాలో జరిగిన ఈ ఘటనే మొదటిది కాదు.
గతవారం కూడా నందుర్‌బార్ జిల్లాలోని షహాదా ప్రాంతంలో పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్లంటూ ముగ్గురు వ్యక్తులపై ప్రజలు దాడి చేశారు. వారు ప్రయాణిస్తున్న కారుకు నిప్పంటించారు. ఈ ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు.
నాసిక్ జిల్లాలోని సటానా, ధులే జిల్లాలోని సిర్‌పుర్ ప్రాంతాల్లో కూడా ఇలాంటి దాడులే జరిగాయి.

ఫొటో సోర్స్, NILESH PARDESHI
పోలీసుల్ని అడ్డుకున్న గ్రామస్తులు
పోలీసు ఉన్నతాధికారి రామ్‌కుమార్ కథనం ప్రకారం.. ఆదివారం జరిగిన దాడి గురించి సమాచారం అందుకోగానే పోలీసులు గ్రామానికి వెళ్లారు. పోలీసుల బృందాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో మరింతమంది పోలీసుల్ని గ్రామానికి పంపించాల్సి వచ్చింది.
ఈ దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్న 20 మందిని ఇప్పటి వరకూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో పాల్గొన్న మరింతమందిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాయినపాఢా గ్రామంలో ఆదివారం సంత జరుగుతుంది. దీంతో ఘటన జరిగినప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో నివసించే వారు సహా చాలామంది ప్రజలు అక్కడ ఉన్నారు.
ఈ ఘటనపై గాంధేయవాది జస్పాల్ సిసోడియా స్పందిస్తూ.. ‘‘ఈ ఐదుగురిపైనా దాడి చేసి, కొట్టి చంపటం ఆందోళనకరమైన అంశం. సాధారణ ఆదివాసీలు, గ్రామీణులు ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తారు? అల్లరి మూక చేసిన పిచ్చిపని ఇది. గుంపులో కలసిపోయి కిరాతకమైన పనులు చేసినా ఎవరూ గుర్తించరని జనాలు భావిస్తున్నారు’’ అని బీబీసీతో అన్నారు.
ధులే జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దాదా భూసే స్పందిస్తూ.. ‘‘ఇది చాలా తీవ్రమైన, బాధాకరమైన సంఘటన. పుకార్ల కారణంగా ఐదుగురి ప్రాణాలు పోయాయి. ఈ పుకార్లను పుట్టిస్తున్నవారికి, ఈ రకంగా తప్పులు చేస్తున్నవారికి శిక్ష పడేలా తక్షణం చర్యలు తీసుకుంటాం’’ అని బీబీసీకి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మత్తు మందుల్ని మించిన వ్యసనం
- అమ్మాయిలు నలుగురిలో చెప్పుకోలేని ఆ విషయాలు!
- సోషల్ మీడియా హీరోగా మారిన నిరసనకారుడు
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- దెయ్యాన్ని చూపిస్తే రూ.20 లక్షలు.. చర్చికి సవాల్!
- రాబిన్ హుడ్ బాపు: 'కృష్ణా నది దగ్గర బొబ్బిలి పులి'
- మహిళల శరీరంపై వెంట్రుకలు కనిపించే ఆ ప్రకటనపై అంత చర్చ ఎందుకు?
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: బహుశా.. ఈ తరానికి పెద్దగా తెలియని చరిత్ర ఇది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









