దెయ్యాన్ని చూపిస్తే రూ.20 లక్షలు.. చర్చికి సవాల్!

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ హమీద్ దభోల్కర్
- హోదా, సామాజిక కార్యకర్త
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు వాటికన్ సిటీ పవిత్ర స్థలం. క్రైస్తవ అత్యున్నత మతాధికారి పోప్ ఇక్కడే ఉంటారు.
మతానికి సంబంధించిన అనేక అంశాలపై వివిధ దేశాల్లోని క్రైస్తవ మతబోధకులకు ఇక్కడే శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉంటారు.
తాజాగా వాటికన్ సిటీ భూతవైద్యం కోర్సు ప్రవేశపెట్టింది.
50దేశాలకు చెందిన సుమారు 250 మంది మత బోధకులకు ఈ కోర్సు నేర్చుకునేందుకు ఆహ్వానం పలికింది.
తమకు దెయ్యం పట్టిందని చెప్పేవారి సమస్యలు, దుష్టశక్తులు తమను పీడుస్తున్నాయని చెప్పేవారి సమస్యలు పరిష్కరించడం ఎలా అన్న అంశంపై వారికి శిక్షణ ఇస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
వాటికన్ సిటీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
అతీంద్రియ శక్తులు, దుష్టశక్తులు, దెయ్యాలు వంటి వాటిని నమ్మడం క్రైస్తవ మతంలో కొత్తేమీ కాదు.
క్రైస్తవ మతబోధకులు అద్భుతాలను ఎంత చక్కగా ప్రదర్శిస్తారన్న అంశం వారికి సెయింట్‌హుడ్ ప్రకటించడంలో ఒక ముఖ్యమైన ప్రమాణంగా భావిస్తారు.
అద్భుతాలు సృష్టించారన్న ఆధారంగానే మదర్ థెరిస్సాకు సెయింట్ హుడ్ ప్రకటించారు.
హేతువాదులు గట్టిగా వ్యతిరేకించినా, సెయింట్ హుడ్ ప్రకటించడంలో ఇప్పటికీ చర్చి అదే విధానం అనుసరిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం భూతవైద్యం కోర్సు ప్రకటించడం క్రైస్తవ మతాన్ని ఒకరకంగా పురాతన కాలానికి తీసుకెళ్లడమే.
అందుకే ఈ విషయంపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
మత బోధకుల నుంచి గట్టి ఒత్తిడి వచ్చినందునే తాము భూతవైద్యం కోర్సు ప్రవేశపెట్టామని వాటికన్ సిటీ చెబుతోంది.
దెయ్యాలు, భూతాల నుంచి విముక్తి పొందేందుకు ఒక్క ఇటలీలోనే 50వేల మంది చర్చి సాయం తీసుకుంటున్నారని ఒక నివేదిక చెబుతోంది.
యూరప్ మొత్తం లెక్కిస్తే ఇలాంటి వారి సంఖ్య 10లక్షల వరకు ఉండొచ్చు.
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. అంతమంది చర్చి సాయం ఎందుకు తీసుకుంటున్నారో సైన్స్, ఆధునిక మానసిక చికిత్స విధానంతో సులువుగా తెలుసుకోవచ్చు.
కానీ మానసిక బాధితులకు అలాంటి ఆదిమ సాయం చర్చి ఎందుకు చేస్తోందో అర్ధం కావడం లేదు.
అవాస్తవ శబ్దాలు, కనిపించని దృశ్యాలు చూశామని చెప్పే వారికి వచ్చిన రోగమేమిటో ఆధునిక వైద్య విజ్ఞానం, మానసిక చికిత్స విధానం ఆధారంగా తెలుసుకోవచ్చు.
వ్యక్తుల్లో మనోవైకల్యం కారణంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మెదడులో అసమతౌల్యం కారణంగా ఎలాంటి ప్రేరణ లేకుండా లేని శబ్దాలను విన్నట్టుగా, కనిపించని దృశ్యాలను చూసినట్లుగా మానసిక రోగులకు అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇలాంటి వ్యాధులు కూడా ఉంటాయని, వాటికి చికిత్స తీసుకోవాలని తెలియని వాళ్లు భూతవైద్యాన్ని ఆశ్రయిస్తారు.
ఆర్థిక, ఉద్యోగ, మానవ సంబంధాల విషయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యే వ్యక్తులు కూడా ఇలాంటివి నమ్ముతారు. తమ సమస్యలకు దుష్టశక్తులే కారణమన్న భ్రమలో వారు ఉంటారు.
ఒక మంచి నమ్మకం సమస్యకు నిజమైన కారణమేంటో కనిపెట్టేలా ప్రజలను ప్రోత్సహించాలి. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం చూపించాలి.
కానీ చర్చి చూపించిన పరిష్కార మార్గం ప్రజలను తప్పుతోవపట్టించేలా ఉంది.
ఇలాంటి బాధితులకు సాయం చేయాలని చర్చి నిజంగానే అనుకుంటే, మత బోధకులకు ముందు మానవ మెదడు గురించి కనీస అవగాహన కల్పించాలి.
కొందరు వ్యక్తులు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? దానికి శాస్త్రీయ కారణాలు ఏమిటి? అన్న అంశాలపై వారికి శిక్షణ ఇప్పించాలి. అంతేకాదు, మానసిక వైద్య నిపుణులను సంప్రదించేలా అలాంటి బాధితులను ప్రోత్సహించాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఇలాంటి విశ్వాసాలకు మద్దతివ్వడం చర్చికి కొత్తేమీ కాదు. ఎన్నో ఏళ్లగా అశాస్త్రీయ విధానాలకు అండగా నిలుస్తూనే ఉంది.
అనంత విశ్వానికి భూమి కేంద్ర బిందువు అన్న కల్పిత సిద్ధాంతాన్ని సుమారు 3వందల సంవత్సరాల క్రితం గెలీలియో బద్దలుకొట్టారు.
భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతోందని, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని నిరూపించారు.
ఒక అద్భుత ఆవిష్కరణ చేసిన గెలీలియోను అభినందించాల్సింది పోయి చర్చి అతనికి మరణ శిక్ష విధించింది.
ఆ తర్వాత గెలీలియో చర్చికి క్షమాపణ చెప్పడంతో అతని మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది.

ఫొటో సోర్స్, Getty Images
గెలీలియో క్షమాపణ చెప్పిన 3 వందల ఏళ్ల తర్వాత చర్చి తన తప్పు తాను తెలుసుకుంది.
గెలీలియోకు క్షమాపణ చెప్పింది. చర్చి హుందాతనాన్ని ఇది మరింత పెంచింది.
పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు సైన్స్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.
3వందల ఏళ్ల క్రితం చేసిన పొరపాటు మళ్లీ చేయకూడదని చర్చి అనుకుంటే, భూతవైద్యం కోర్సును వెంటనే విరమించుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
క్రైస్తవ మతంలో ఉన్న అశాస్త్రీయ విధానాలపై రిచర్డ్ డౌకిన్, శామ్ హర్రీస్ వంటి చాలామంది శాస్త్రవేత్తలు, రచయితలు తమ గళం వినిపించారు.
ఈ విషయాన్ని సమగ్రంగా తెలుసుకోవాలని కోరుకునే వాళ్లు శామ్ హర్రీస్ రాసిన 'ఎ లెటర్ టు క్రిస్టియన్ నేషన్', 'ఎండ్ ఆఫ్ ఫేయిత్' పుస్తకాలు తప్పనిసరిగా చదవాల్సిందే.
పోప్ ఫ్రాన్సిస్ ఆధునిక భావాలున్న వ్యక్తి. హోమోసెక్సువాలిటీ వంటి అంశాలపై చర్చించేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు.
ఇప్పుడు చర్చికి, పోప్‌కు మరొక అవకాశం వచ్చింది. శాస్త్రీయ విధానాలకు మద్దతు ఉంటుందా లేదా అని స్పష్టంగా చెప్పడానికి వారికి అద్భుత అవకాశం లభించింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత దేశంలో కూడా స్వయం ప్రకటిత బాబాలు, స్వాములు, మతాధికారులు ఎంతోమంది ఉన్నారు.
తమకున్న మానవాతీత శక్తులతో దెయ్యాలను వదిలిస్తామని, దుష్టశక్తులను వదిలిస్తామని చెబుతూ ఉంటారు.
చేతబడిని నేరంగా పరిగణిస్తూ 2013లోనే చట్టం చేసిన తొలిరాష్ట్రం మహారాష్ట్ర.
మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి - మాన్స్ సుమారు దశాబ్దం పాటు చేసిన పోరాటం ఫలితంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టం తీసుకొచ్చింది.
ఈ విషయంలో మాన్స్ నాయకుడు డాక్టర్ నరేంద్ర దభోల్కర్ చేసిన త్యాగం మరవలేనిది.
ఇలాంటి చట్టం ఒకటి చేయడం భారత దేశంలో ఇదే తొలిసారి.
మతం పేరుతో తనకు మానవాతీత శక్తులు ఉన్నాయని నమ్మించి, ప్రజలను మోసం చేయడం ఈ చట్టం ప్రకారం నేరం. అలాంటి వ్యక్తులు శిక్షార్హులు.
ఇప్పటి వరకు మతం పేరుతో ప్రజలను మోసం చేసిన సుమారు 400 మంది స్వయం ప్రకటిత బాబాలు, స్వాములు ఈ చట్టం కింద కటకటాల వెనక్కి వెళ్లారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవల కర్ణాటక కూడా ఇలాంటిదే ఒక చట్టం చేసింది. పంజాబ్, హర్యానా, అసోం వంటి ఇతర రాష్ట్రాలు కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి.
శాస్త్రీయత విషయంలో ఇతర యూరోపియన్ దేశాల కంటే భారతదేశం ఒకడుగు ముందు ఉందనేందుకు ఈ చట్టాలు ఉదాహరణగా చూపొచ్చు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి - మాన్స్ ఒక బహిరంగ సవాల్ విసిరింది.
దెయ్యాలు, భూతాలు, దుష్ట శక్తులు ఉన్నాయని ఎవరైనా శాస్త్రీయంగా నిరూపిస్తే వారికి 20 లక్షల రూపాయలు ఇస్తామని మాన్స్ ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఒకవేళ భూతవైద్యం కోర్సును ఉపసంహరించుకోకపోతే, చర్చి ఈ సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేసింది. దెయ్యాలు, దుష్టశక్తులు ఉన్నాయని నిరూపించాలని కూడా సవాల్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హేతువాదులందరి మద్దతుతో ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లేందుకు, అశాస్త్రీయ కోర్సుకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు మాన్స్ ప్రయత్నం చేస్తోంది.
(వాటికన్ సిటీకి సవాల్ విసిరిన మహారాష్ట్ర మూఢ విశ్వాసాల నిర్మూలన కమిటీ సభ్యుడు, నరేంద్ర దభోల్కర్ కుమారుడు డాక్టర్ హమీద్ దభోల్కర్ బీబీసీ కోసం ఈ వ్యాసం రాశారు.)
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








