వాటర్ బాబా: నీళ్లు చల్లితే రోగాలు నయమవుతాయట!

- రచయిత, డీఎల్ నరసింహ
- హోదా, బీబీసీ కోసం
కర్నూలు జిల్లా బనగానపల్లెలో పన్నెండేళ్ల బాలుడు బాబా అవతారమెత్తాడు. అతను చల్లే నీళ్లలో తడిస్తే రోగాలు మటుమాయం అవుతాయని ప్రచారం జరుగుతోంది.
అతని వద్ద ఉన్న పావురం మీద వాలిందంటే అదృష్టం వరిస్తుందని అతని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ బాల బాబా చల్లే నీటిలో తడిసిముద్దవుతున్నారు. అందుకే ఆ బాలుణ్ని 'వాటర్ బాబా' అని కూడా పిలుస్తున్నారు.
బనగానపల్లె బీసీ కాలనీలో నివసిస్తున్న రఫీ, రమీజాబీల కొడుకే షాహిద్. ఈ బాలుడు గత కొంతకాలంగా వాటర్ బాబా, బాలబాబా, షాహిద్ బాబాగా పేరు పొందాడు.
అతను అనుగ్రహిస్తే ఎంతటి అనారోగ్య సమస్యలైనా దూరమవుతాయని ఆ నోటా, ఈ నోటా ప్రచారం జరుగుతోంది.
దీంతో ఈ బాలుడికి మహత్తులున్నాయంటూ జనం క్యూలు కడుతున్నారు. టోకెన్లు తీసుకొని మరీ అతని దర్శనం కోసం ఎగబడుతున్నారు.
తోటి పిల్లలతో కలిసి ఆటలాడుకునే ఈ బాల బాబా ప్రతి గురువారం రాత్రి పూజలో కూర్చుంటాడు. తనకిష్టమైనప్పుడు భక్తుల మీద నీళ్లు చల్లుతాడు. అ నీటిలో తడిచేందుకు జనం పోటీ పడుతుంటారు.
నీళ్ళతోనే కాదు, అతనింట్లో ఉన్న పావురం కూడా రోగాలను నయం చేస్తుందని భక్తుల నమ్మకం. ఆ పావురం ఎవరిపై వాలితే వారిని అదృష్టం వరిస్తుందని వారంటారు. అందుకే ఆ పావురం పొడుస్తుంటే తన్మయత్వం చెందుతుంటారు.
జై మాహీష్మతీ.. అంటూ సినిమా డైలాగులు చెబుతూ కేరింతలు కొడుతూ ఆటలాడుకొనే ఈ పిల్లాడు పూజలో కూర్చున్నప్పుడు మాత్రం ఏమీ మాట్లాడడు. జనం తమ సమస్యలను ముందు అతని తల్లికి చెప్పుకోవాలి. ఆమె వాటిని బాల బాబాకు వివరిస్తుంది.
స్వామి చిన్నపిల్లాడు కాబట్టి సరిగా అర్థం కాదని, అందుకే తనకు చెప్పాలని బాలుని తల్లి అంటోంది.

అయితే పావురం వాలితేనో, నీళ్ళు చల్లితేనో రోగాలు పోతాయనుకోవటం మూఢనమ్మకమేనని జనవిజ్ఙానవేదిక అంటోంది. తల్లిదండ్రుల మానసికస్థితి సరిగా లేనందునే షాహిద్‌ను బాబాగా ప్రచారం చేస్తున్నారని ఆ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మియా తెలిపారు.
ఇది ఇలాగే కొనసాగితే అమాయక ప్రజలకు నష్టం జరగటంతోపాటు భవిష్యత్తులో పిల్లాడు అసాంఘిక శక్తిగా మారే ప్రమాదముందన్నారు.
తల్లిదండ్రులే చిన్నపిల్లాడిని చదువు మాన్పించటంపట్ల విద్యాశాఖాధికారులు కూడా అభ్యంతరం చెబుతున్నారు. షాహిద్‌ను బడికి పంపేందుకు ప్రయత్నిస్తున్నామని ఎంఈఓ స్వరూప తెలిపారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే షాహిద్ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇప్పిస్తామని అన్నారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









