రాయలసీమలోని ఈ గ్రామంలో ప్రతి ఇంటి ముందూ సమాధులు ఎందుకున్నాయ్?

ఫొటో సోర్స్, Shyam Mohan
- రచయిత, శ్యాంమోహన్
- హోదా, బీబీసీ కోసం
'అయ్య కొండ'. పేరుకు తగ్గట్టే కొండమీద ఉంది ఈ గ్రామం.
పాడుబడిన ఇంటి గోడ మీద వెలిసిపోతున్న అక్షరాలు ఊరి వైపు చూపించాయి.
ఆ ఊరి నిండా గోరీలే. ప్రతీ ఇంటి ముందు కనీసం ఒక సమాధి ఉంది.
ఆడవాళ్లు వాటి మధ్యే నీళ్లు మోసుకుంటూ వెళ్తారు. పిల్లలు సమాధుల ముందే ఆడుకుంటారు.
ఇక్కడ బడి, గుడి ముందు కూడా సమాధులే ఉన్నాయి.
ఊరి మధ్యలో సమాధులు ఉన్నాయో.. సమాధుల మధ్య ఊరుందో అక్కడ అడుగు పెట్టిన మాకు అర్ధం కాలేదు.
కానీ, అక్కడ సమాధులే సర్వస్వం. వాటితోనే ప్రజల జీవితం పెనవేసుకుపోయింది.
ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ ఉందో తెలుసా? రాయలసీమలో.
కర్నూలు నుంచి పడమర వైపున 66కిలోమీటర్ల దూరంలో గోనెగండ్ల మండలంలో గంజిహల్లి పంచాయితీ పరిధిలోని కుగ్రామమే అయ్యకొండ.

ఫొటో సోర్స్, Shyam Mohan
సమాధుల ముందు నిత్య నైవేద్యాలు!
ఇక్కడ ప్రతీ ఇంటి ముందు కనీసం ఒక సమాధి ఉంది.
ఇంటి ముందు ఉన్న గోరీలకు ప్రతీరోజూ నైవేద్యాలు పెడతారు.
వంట చేసిన తర్వాత గోరీల ముందు నైవేద్యం పెట్టిన తర్వాతే ఇంట్లోని వారు తింటారు.
'ఈ సమాధులు మా తాత, ముత్తాతలవని మా పెద్దలు చెప్పారు. వాటిని భక్తితో పూజిస్తాం. నిత్యం నైవేద్యం సమర్పిస్తాం. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని అలాగే కొనసాగిస్తున్నాం' అని గ్రామస్తులు బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Shyam Mohan
'ఈ గ్రామం సమాధులకు నిలయంగా ఎలా మారింది'
ఇళ్ల మధ్యలో సమాధులు ఎందుకు! దాని వెనుకున్న రహస్యం ఏమిటి.. ?
గ్రామ సర్పంచ్ శ్రీనివాసులును ఈ ప్రశ్నలు అడిగితే ఆసక్తికర సమాధానాలు చెప్పారు.
'పూర్వం నల్లారెడ్డి అనే గురువు ఈ ఊరి కోసం శ్రమించి, తన సర్వస్వం ధారపోశాడట. ఆయన శిష్యుడు ఈ గ్రామానికి చెందిన మాలదాసరి చింతల మునిస్వామి. అయ్యకొండ అభివృద్ధికి వీరిద్దరు కృషి చేశారట. వారు చేసిన మేలుకు కృతజ్ఞతగా వారి మరణానంతరం వారికి ఇక్కడే గుడి కట్టి పూజిస్తున్నారు. అప్పటి నుంచి ఎవరు మరణించినా వారి ఇంటి ముందే సమాధి కడుతున్నారు' అని శ్రీనివాసులు చెప్పారు.
కొత్త వస్తువు కొన్నా, ఏదైనా వండినా ఈ ఇద్దరు స్వాముల సమాధుల వద్ద పెట్టి, ఆ తర్వాత, ఇంటి ముందున్న సమాధులకు సమర్పించాలి. ఆ తర్వాతే ఇంట్లోని వాళ్లు ముట్టుకోవాలి.
నైవేద్యం పెట్టకుండా నేరుగా తింటే అరిష్టం జరుగుతుందని గ్రామస్తుల గట్టి నమ్మకం.
‘40 మందికి పైగా పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. అంగన్ వాడీ కేంద్రం ఏర్పాటు అవసరం చాలా ఉంది. కొండ కింద స్థలం కేటాయిస్తే అక్కడ ఇళ్లు కట్టుకుంటామని ప్రజలు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు' అని ఆయన బీబీసీకి వివరించారు.
గ్రామ అభివృద్ధిలో ముందుండే సర్పంచ్ శ్రీనివాసులు రోజూ ఉచితంగా చిన్నారులకు చదువు చెబుతారు. అయ్యకొండలో మార్పు తేవాలనుకున్నారు. కానీ, మూఢ నమ్మకాలతో సావాసం చేస్తున్న పెద్దలను ఒప్పించ లేక, చదువుతో విద్యార్థులను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Shyam Mohan
ఊరి నిండా వింత ఆచారాలే!
ఈ గ్రామంలో ఎన్నో వింత ఆచారాలు ఉన్నాయి.
ఇక్కడి వారు ఈ ఊరిలోని వారినే పెళ్లి చేసుకోవాలి.
ఈ గ్రామస్థులతోనే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలి. బయటి సంబంధాలు చేసుకోరు.

ఫొటో సోర్స్, Shyam Mohan
ఊరంతా మాలదాసరులే!
ఇక్కడ ఎవరూ పట్టె మంచాల మీద పడుకోరు. దాని వల్ల కూడా అరిష్టం అని వీరి నమ్మకం. ఈ ఊరిలో మాల దాసరులే తప్ప వేరే కులం వారు ఉండరు.
గతంలో వాల్మీకి బోయకు చెందిన రెండు కుటుంబాలుండేవి. కానీ వారు అంతుచిక్కని వ్యాధులకు గురై ఊరు విడిచి వెళ్లి పోయారని గ్రామస్థులంటారు.
పొద్దు దిగక ముందే ఇంటికి చేరాలి !
ఇక్కడ అందరూ కష్టపడి పని చేస్తారు. వీరిలో 80శాతం మందికి కొండకింద భూములున్నాయి.
కొర్రలు, సజ్జలు, పల్లీ, మిరప, ఉల్లి వంటి పంటలు పండిస్తారు. తెల్లవారుజామునే పొలం పనులకు వెళ్లి, సూర్యుడు అస్తమించక ముందే గ్రామానికి చేరుకోవడం వీరి ఆనవాయితీ.

ఫొటో సోర్స్, Shyam Mohan
అసలు పేరు కుందేలుపడ
"అయ్యకొండ" ను ఒకప్పుడు "కుందేలు పడ" అని పిలిచేవారు.
ఇక్కడ కుందేళ్లు ఎక్కువగా ఉండేవి. మాల దాసరులు వాటిని వేటాడి బతికేవారు. "కుందేలు పడ" కాలక్రమంలో అయ్యకొండగా మారింది.
ఇక్కడ 150 కుటుంబాలున్నాయి. రేషన్ సరుకుల కోసం, పింఛన్ల కోసం, సంతకు కొండకింద ఉన్న గంజిహల్లికి వెళ్లాల్సిందే.
'మరోచోట శ్మశానవాటిక ఏర్పాటు చేస్తే, ఈ విశ్వాసాల నుంచి గ్రామస్తులు బయటపడే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవడం లేదు' అని ఎంపీటీసీ ఖాజా నవాబ్ అన్నారు.

ఫొటో సోర్స్, Shyam Mohan
మారాలనే ఉంది కానీ..!
'ఇది తరతరాలుగా వస్తున్న అచారం. కట్టు తప్పితే కీడు జరుగుతుందని మా నమ్మకం. కానీ, ఎంత కాలమిలా? భవిష్యత్‌లో ఇక్కడ సమాధులకు స్థలం ఉండదేమోనని దిగులు వేస్తోంది. శ్మశాన వాటికకు ఎక్కడైనా చోటు ఇవ్వమని ప్రభుత్వ అధికారులను అడిగాం కానీ, ఇపుడు పట్టించుకునే నాధుడే లేడు. నాయకులు ఎన్నికల సమయంలోతప్ప మా వైపు తొంగి చూడరు' అని గ్రామపెద్ద రంగస్వామి నిరాశ కూడిన స్వరంతో చెప్పారు.

ఫొటో సోర్స్, Shyam Mohan
స్పందించిన స్థానిక ఎంపీ
ఈ గ్రామం కర్నూల్ పార్లమెంటరీ నియోజక వర్గం పరిధిలో ఉంది. మూఢ నమ్మకాల మధ్య జీవిస్తున్న అయ్యకొండ గ్రామస్థుల పరిస్ధితి మీ దృష్టికి వచ్చిందా? అని కర్నూల్ ఎంపీ బుట్టారేణుకను బీబీసీ ప్రశ్నించింది.
దానికామె 'మా పార్లమెంట్ నియోజకవర్గంలో ఇలాంటి గ్రామం ఒకటి ఉందని ఇపుడే మీ ద్వారానే తెలిసింది. అక్కడి ఫొటోలు తీసి పంపమని మా సిబ్బందికి చెప్పాను. జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక తెప్పించి అక్కడి ప్రజలకు వీలైనంత వరకు సాయం చేస్తాం' అని పేర్కొన్నారు.
గ్రామస్థులు కోరితే వేరేచోట శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం గానీ, లేదా వారిని అక్కడి నుంచి తరలించి అనువైన చోట ఇంటి స్థలం ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తాం' అని ఎంపీ రేణుక అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








