#BBCShe విశాఖ: 'పెద్ద మనిషి' అయితే అంత ఆర్భాటం అవసరమా?

ఫొటో సోర్స్, Anuradha
- రచయిత, రిపోర్టింగ్: దీప్తి బత్తిని, షూట్/ఎడిట్: నవీన్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఇంట్లో ఓ మూలన కూర్చోవాలి, ఎటూ వెళ్లకూడదు, స్నానం చేయకూడదు అన్న ఆలోచన తలచుకుంటేనే భయమేస్తోంది. అలా నన్ను వేరు చేయకుండా, ఆ సమయంలో అవసరమైన జాగ్రత్తలు చెప్పి, కావాల్సిన పోషకాహారం ఇచ్చిన తల్లితండ్రులు ఉండటం నా అదృష్టం.
కానీ చాలా మంది నా స్నేహితులకు మొదటి నెలసరి వచ్చినప్పుడు ప్రత్యేకమైన ఉత్సవం జరిగింది. కొన్నింటికి నాక్కూడా ఆహ్వానం అందింది.
పుష్పవతి (రజస్వల) వేడుక జరిగినప్పుడు నా స్నేహితులు పది రోజుల పాటు స్కూల్ మానేయాల్సి వచ్చేది. అమ్మాయికి మొదటి పీరియడ్ వచ్చినప్పుడు ఆమెను ఇంట్లో ఒక మూలన కూర్చోపెట్టి, ఆమెకు అవసరమైన వస్తువులు ఇచ్చేసి, ప్రత్యేక బాత్రూం కేటాయించేవారు.
కనీసం 5 నుంచి 11 రోజుల పాటు స్నానం చేయనిచ్చేవారు కాదు. 11 రోజుల తరువాత బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారితో వేడుక చేస్తారు.
పుష్పవతి అయినప్పుడు చేసే వేడుకల వల్ల బాలికలు మానసికంగా ఎంతగా ఇబ్బంది పడతారన్న విషయంపై విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన బీబీసీ షి పాప్‌అప్‌లో అమ్మాయిలు మాతో మనసు విప్పి మాట్లాడారు.
'మంచి' సంబంధం కోసమే అలా..
"అమ్మాయిలు పుష్పవతి కావడాన్ని అంత ఉత్సవంలా చేసి, నెలసరిని మాత్రం ఏదో తప్పులా చూడటం ఏంటో విడ్డూరం" అని అన్నారు బిహార్ నుంచి వచ్చి ఏయూలో చదువుకుంటోన్న ఒక అమ్మాయి.
నేను దీని గురించి అడిగితే అమ్మాయికి మంచి సంబంధం రావడానికి, అందరికీ తెలిసేలా ఘనంగా చేయడం అని చెప్పారు. ఆమె లాగే చాలా మంది తాము పెద్దమనిషి అయినప్పటి కార్యక్రమాలు తమపై ఎటువంటి ప్రభావం చూపాయో చెప్పుకొచ్చారు.
పుష్పవతి అయినప్పుడు ఒంటరిగా కూర్చోబెట్టడం, స్నానం చేయనివ్వకపోవడం గురించి రకరకాల సామాజిక, ఆర్థిక నేపథ్యాల నుంచి వచ్చిన భిన్న వయసు మహిళలను అడిగినప్పుడు అందరూ ఆ ఆచారాన్ని ముక్తకంఠంతో తప్పుబట్టారు.

స్వప్నను 'పెద్ద మనిషి' అయిన ఆరు నెలల్లోపే, 15 ఏళ్ల వయసులోనే కార్పెంటర్ పనిచేసే తన బావకిచ్చి పెళ్లి చేశారు.
ఇప్పుడామెకు 22 ఏళ్లు. ఇద్దరు పిల్లల తల్లి అయిన స్వప్న ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాశారు.
"నాలో (శరీరంలో) ఏం జరుగుతుందో తెలిసే లోపే పెళ్లయిపోయింది, పదహారేళ్లు వచ్చేసరికి గర్భవతి అయ్యాను. పుష్పవతి అవడం వల్ల ఆగిపోయిన నా కలలను ఇప్పుడు నెరవేర్చుకోవాలని పట్టుదలతో ఉన్నాను" అని చెప్పారు స్వప్న.

ఇప్పుడు అమ్మాయిలు 12-13 ఏళ్లకే పెద్ద మనిషి అవుతున్నారని చెబుతున్నారు సామాజిక కార్యకర్తలు.
ఆ వయసులో అమ్మాయిలను అనవసరపు ఒత్తిళ్లకు గురి చేయడం, అందరి కళ్లూ వారిపై పడేలా చేయడం కంటే, వాళ్ల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి, వాళ్ల చదువు, ఎదుగుదలపై దృష్టి పెడితే మంచిదని సూచిస్తున్నారు.
"అమ్మాయి వయసులో వచ్చే మార్పుల గురించి, పరిశుభ్రత గురించి చెప్పకుండా తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఫంక్షన్లు చేయడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడి మరీ ఖర్చు పెట్టి ఆడంబరంగా ఫంక్షన్లు చేస్తున్నారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు" అని వివరించారు స్వర్ణ కుమారి.
ఆమె బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, లింగ సమానత్వం కోసం పనిచేస్తోన్న 'మహిళా యాక్షన్' అనే సంస్థలో పనిచేస్తున్నారు.
నెలసరి సమయంలో బాలికలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విశాఖపట్టణంలో మురికివాడల్లోని పాఠశాలల్లో ఈ సంస్థ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

తనకు కూడా ఫంక్షన్ చేస్తారేమో అన్న వ్యక్తం చేశారు మత్స్యకారుల వీధిలో ఉండే పన్నెండేళ్ల బాలిక. ఫంక్షన్ చేయొద్దు అని చెబితే అమ్మానాన్నలు ఒప్పుకుంటారో లేదో అని ఆమె భయపడుతున్నారు.
"ఫంక్షన్ గురించే నా భయమంతా. ఇప్పుడు నేను చుట్టుపక్కల పరుగెడుతూ, అబ్బాయిలతో ఆడుకుంటున్నాను. కానీ ఈ విషయంలో మా అక్కకు అయినట్టే నాకూ అవుతుందని తెలుసు. ఇప్పుడు నేను కానీ, మా తమ్ముడు కానీ లేకుండా కనీసం మా అక్క బయట నడవడం లేదు. అబ్బాయిలు ఆమె శరీర ఆకృతి మీద కామెంట్లు చేసి ఆమె వంకే చూస్తున్నారు. అదే నా భయమంతా" అని ఆ బాలిక ఆందోళన వ్యక్తం చేశారు.

కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల ఉత్సవం చేస్తోన్న తల్లితండ్రులు కూడా ఉన్నారు. ఇలాంటి ఫంక్షన్లు తనకు ఇష్టం లేకపోయినా తన తల్లి ఒత్తిడితో బంధుమిత్రులను ఆహ్వానించాల్సి వచ్చిందని అన్నారు మధు అనే పదహారేళ్ల అమ్మాయి తండ్రి.
"నాకు స్వీట్ 16 గురించి తెలుసు. కానీ, ఇది అది కాదు. స్వీట్ 16 పుట్టినరోజు పండుగ, కానీ ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. నేను మా అమ్మాయితో కూర్చుని శరీరంలో వచ్చే మార్పులు సహజమేననీ, వాటిని స్వాగతించాలనీ, సిగ్గుపడాల్సింది, అతిగా ఆలోచించాల్సిందేమీ లేదనీ చెప్పాను" అని తెలిపారు మధు.

ఫొటో సోర్స్, Deepthi/BBC
ఇలాంటి వాటికి తల్లితండ్రులు డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లుతున్నారని చెప్పారు పేరు చెప్పడానికి ఇష్టపడని హైదరాబాద్‌కి చెందిన ఒక ప్రముఖ ఫొటోగ్రాఫర్.
"నాలాంటి ఏ ఫొటోగ్రాఫర్ అయినా కనీసం 2- 3 లక్షల వరకూ తీసుకుంటారు. ఈ ఫంక్షన్లకు పెళ్లితో సమానంగా అలంకరణలు చేయడం చూశాను" అన్నారాయన.
అంతెందుకు సోషల్ మీడియాలో వెతికితే చాలు, ఎందరో అమ్మాయిల పుష్పవతి ఫంక్షన్లు వీడియోలు వేల వ్యూస్‌తో కనిపిస్తాయి.

మధ్యతరగతి కుటుంబానికి చెందిన 19 ఏళ్ల గౌరి తండ్రి ఆమె ఫంక్షన్ చేయడానికి భారీగానే ఖర్చు పెట్టారు.
"మా నాన్న నా ఫంక్షన్ ద్వారా తన గొప్పతనం చాటాలనుకున్నాడు. ఆరేళ్ల క్రితం ఆ ఫంక్షన్ చేయడానికి అప్పులు కూడా తీసుకున్నారు. మేం ఇంకా ఆ అప్పులు తిరిగి కడుతూనే ఉన్నాం" అని చెప్పారు ఆ యువతి.

"ఈ ఫంక్షన్ల పేరుతో అనవసరంగా డబ్బు వెదజల్లే బదులు అమ్మాయిలకు అవగాహన కల్పించి, పోషకాహారం అందించడం తక్షణ అవసరం. ఇలాంటి అదనపు ఖర్చులు వల్ల అమ్మాయిలంటేనే భారం అనే భావన తల్లితండ్రులకు కలుగుతోంది" అని అభిప్రాయపడ్డారు డా. ఎ సీతారత్నం.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









