"చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బ్రజేష్ మిశ్రా
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘చపాతీ సైజు 20 సెంటీమీటర్లు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువున్నా, తక్కువున్నా నన్ను కొట్టేవాడు. చపాతీని కొలవడానికి రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు. నేను రోజంతా ఏమేం పనులు చేశానో మొత్తం ఎక్సెల్ షీట్‌లో రాయాలి’.. ఇవీ పుణెలో విడాకులకు దరఖాస్తు చేసుకున్న ఓ మహిళ తన భర్త గురించి చెప్పిన మాటలు!
భర్త అమిత్ తనను నిత్యం శారీరకంగా, మానసికంగా వేధించేవాడని పాయల్ (పేర్లు మార్చాం) ఆరోపించారు.
ఈ విషయమై పాయల్ బీబీసీతో మాట్లాడారు. ఎవరూ ఊహించలేనంత చిత్రంగా తన భర్త తనను వేధించేవాడని చెప్పారు.
‘‘రోజూ నేనేం పనులు చేశానో, ఇంకా ఏ పనులు చేయాల్సి ఉందోనన్న వివరాలన్నీ ఒక ఎక్సెల్ షీట్‌లో రాయాలి. ఏదైనా పని చేయకపోతే దానికి కారణాలు కూడా అందులో రాయాలి. ఆఖరికి ఆయనతో మాట్లాడాలన్నా ఈమెయిల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవాలి‘’ అంటూ భర్త విధించే ఆంక్షల గురించి ఆమె వివరించారు.
‘‘పెళ్లయిన తొలి రాత్రి నుంచి ఇప్పటిదాకా.. అంటే పదేళ్లుగా అతడు నన్ను వేధిస్తూనే ఉన్నాడు. పెళ్లయిన కొన్నాళ్లకు నన్ను మా ఇంట్లో ఉండమన్నాడు. తను వేరుగా ఉంటాననీ, ఎప్పుడైనా అవసరముంటే పిలుస్తాననీ చెప్పాడు. అప్పుడుప్పుడూ కేవలం రాత్రుళ్లు మాత్రమే నన్ను కలవడానికి పిలిచేవాడు.

ఫొటో సోర్స్, Science Photo Library
తాను విదేశాలకు వెళ్లాలనీ, అందుకే నాతో ఉండటం కుదరదనీ చెప్పేవాడు’’ అంటూ పాయల్ చెప్పుకొచ్చారు. 2008లో అమిత్ పాయల్‌ల వివాహమైంది. వాళ్లకో కూతురు కూడా ఉంది. తాను గృహ హింసకు గురవుతున్నట్లు ఆరోపిస్తూ పాయల్ విడాకులకు దరఖాస్తు చేశారు.
గతంలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకుంటూ.. ‘‘ఓ రోజు నా భర్త కోపంతో తన డంబెల్‌తో కంప్యూటర్‌ని విరగ్గొట్టాడు. అదే కోపంతో నన్ను గట్టిగా కొట్టడంతో స్పృహ కోల్పోయా. నన్ను స్నానాల గదిలోకి తీసుకెళ్లి ట్యాప్ కింద కూర్చోబెట్టాడు. నాకు మెలకువ వచ్చాక మళ్లీ కొట్టాడు. తరవాత తడి బట్టలతోనే ఇంట్లోంచి బయటకు పంపించేశాడు.
అప్పటిదాకా మా అమ్మానాన్నలకు నా మాటలపైన కొంత సందేహం ఉండేది. కానీ ఆ రోజు నన్ను చూశాక వాళ్లకు విషయం మొత్తం అర్థమైంది’’ అంటారు పాయల్.
‘‘ఆయన నన్ను హింసించడానికి రకరకాల మార్గాలు వెతికేవాడు. గతంలో నా ఆర్కుట్ ఎకౌంట్ హ్యాక్ చేసి అందులో అసభ్యకరమైన పోస్టులు పెట్టి నాకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేశాడు.
నా ఫేస్‌బుక్ ఎకౌంట్ నుంచి వేరే వాళ్లకు మెసేజ్ చేసి నా వ్యక్తిత్వాన్ని కించపరిచేవాడు. నన్ను ఏదో ఒక ఉద్యోగం చేయమని ఒత్తిడి చేసేవాడు. కానీ అప్పట్లో ఆర్థిక మాంద్యం కారణంగా నాకు సరైన ఉద్యోగం రాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
అతి కష్టమ్మీద రూ.10వేల రూపాయల జీతంతో బ్యుటీషియన్‌గా ఉద్యోగం దొరికింది. రోజూ వేరేవాళ్ల ఇళ్లకు వెళ్లి ఫేషియల్ చేయాల్సి వచ్చేది. ఆ పని చేయడానికా నేను ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ చదివింది?
కానీ ఉద్యోగం చేయక తప్పలేదు. మరోవైపు ఆర్థిక మాంద్యం కారణంగా అమిత్ ఉద్యోగం పోయింది. దాంతో రోజంతా అతడు ఇంట్లో ఉండేవాడు. నేను ఆఫీసులో ఉండేదాన్ని. ఆ కారణంతో కూడా మా ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి.
తరవాత అతడికి దిల్లీలో ఓ కంపెనీలో ఉద్యోగమొస్తే నన్ను పుణెలోనే వదిలేసి తను వెళ్లిపోయాడు. ఏడాది తరవాత అనేక షరతులు పెట్టి నన్ను దిల్లీకి రమ్మన్నాడు. అంతకుముందోసారి నేను గర్భం దాలిస్తే, అమిత్ బలవంతంగా అబార్షన్ చేయించాడు.
దిల్లీ వెళ్లాక కొన్ని నెలల తరవాత మళ్లీ గర్భం దాల్చాను. అప్పుడు కూడా నన్ను అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేశాడు. కానీ చేయించుకోనని మొండికేశా. దాంతో పుట్టబోయే బిడ్డ బాధ్యతలన్నీ నేనే తీసుకోవాలనే షరతుపై బిడ్డను కనడానికి ఒప్పుకున్నాడు. డెలివరీకి 15రోజుల ముందు వరకూ కూడా నేను పనికి వెళ్లాల్సొచ్చింది. ఆ సమయంలో నన్నేమాత్రం పట్టించుకోలేదు’’ అంటూ తన గతాన్ని పాయల్ వివరించారు.
2013లో ఓ రోజు పాయల్ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లడం ఆలస్యమైంది. దాంతో రాత్రి 10 గంటల వరకూ ఆమె కూతురు డే కేర్ సెంటర్‌లోనే ఉండిపోయింది. ఆ చిన్నారిని ఇంటికి తీసుకురావడానికి తండ్రి ప్రయత్నించలేదు. ఆ రోజు నుంచి పాయల్ పని చేయడం మానేశారు. అప్పట్నుంచీ తన సమస్యలు ఇంకా ఎక్కువయ్యాయంటారు పాయల్.

ఫొటో సోర్స్, Science Photo Library
‘‘నా సంపాదన ఆగిపోవడంతో వేధింపులు మరింత పెరిగాయి. ‘కారు మీద గీతలేమైనా పడ్డాయా?’, ‘టైర్లలో గాలి ఎప్పుడు కొట్టించారు?’, ‘పెట్రోల్ ఎప్పుడు పోయించారు?’.. ఇలా ప్రతిదీ లిస్ట్ రాసి పెట్టాలి.
స్కూల్‌కి వెళ్లడం మొదలుపెట్టినప్పటి నుంచి నా కూతురికి కూడా ఓ లిస్ట్ తయారు చేసిచ్చాడు. రోజూ ఉదయం 8.10 లోపల ఆ లిస్ట్‌లో ఉన్న పనులన్నీ నా కూతురు చేయాలి. కరెక్టుగా 8.11కి స్కూల్‌కి బయల్దేరాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా దానికీ శిక్ష తప్పదు.
ఆయన వేధింపులు భరించలేక రెండు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశా. కానీ దాని వల్ల ఎలాంటి ఫలితమూ లేదు.
రోజూ ఆయన టిఫిన్ చేసేప్పుడు ఎదురుగా ఓ నోట్‌బుక్ పెట్టుకు కూర్చొని ఆయన చెప్పేవన్నీ రాసుకోవాలి. అవన్నీ తూ.చ. తప్పకుండా చేయాలి. చిన్న తేడా వచ్చినా గొడవ చేసేవాడు.
ఖర్చులకు కూడా డబ్బులిచ్చేవాడు కాదు. కొన్నాళ్లకు బంధువుల ఒత్తిడిపై నెలకు రూ.500 ఇచ్చేవాడు. వాటిలో కూడా ప్రతి రూపాయి ఎలా ఖర్చు పెట్టిందీ ఎక్సెల్ షీట్‌లో రాయాలి. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే ఆ రూ.500 కూడా ఇచ్చేవాడు కాదు.
ఒక్కోసారి నా కూతురిని తీసుకెళ్లి బాల్కనీలోంచి బయటకు విసిరేస్తానని బెదిరించేవాడు’’ అంటూ భర్తనుంచి ఎదురైన సమస్యల గురించి వివరించారు పాయల్.

అన్నీ అబద్దాలే: అమిత్
పాయల్ చేస్తున్న ఈ ఆరోపణలను అమిత్ ఖండించారు. అవన్నీ ఒట్టి అబద్దాలేననీ, తన నుంచి డబ్బులు రాబట్టేందుకే ఆమె ఇలా ఆరోపిస్తోందని ఆయన బీబీసీతో చెప్పారు.
‘‘నేనో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. నా భార్య చేసేవన్నీ నిరాధారమైన ఆరోపణలే. నేను ఆమెను ఉద్యోగం చేయమని ఒత్తిడి చేయలేదు. తనే కెరీర్ గురించి ఎక్కువ ఆలోచించేది. ఆమెకు ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఆ మాటల్ని మార్చి చెబుతోంది.
ఇంటి ఖర్చుల లెక్కలు పక్కాగా ఉండాలనే ఎక్సెల్ షీట్‌లో వాటిని రాయించేవాణ్ణి. కానీ నేనెప్పుడూ ఆమెను లెక్కలు అడగలేదు.
నా భార్య చట్టాన్ని వాడుకొని నా నుంచి డబ్బు రాబట్టాలని ప్రయత్నిస్తోంది.
ఆమెను ఓసారి సైకాలజిస్ట్ దగ్గరకి కూడా తీసుకెళ్లా’’ అని అమిత్ అన్నారు.
కానీ పాయల్ మాత్రం తానే అమిత్‌ని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.
ఎక్సెల్ షీట్లలో ప్రతి పనీ నోట్ చేయడం గురించి చెబుతూ, ‘‘ఏ పనికైనా డెడ్‌లైన్ ఉంటేనే అది సమయానికి పూర్తవుతుంది. అందుకే డెడ్‌లైన్లు పెడతా. అందులో తప్పేంటి?’’ అని అమిత్ ప్రశ్నిస్తారు.

ఫొటో సోర్స్, PRESS ASSOCIATION
‘‘పెళ్లికి ఎనిమిది నెలల ముందు నుంచే మేం కలుసుకునేవాళ్లం. ఆమే పెళ్లికి ప్రపోజ్ చేసింది. ఒకవేళ నేను చెడ్డవాడినైతే నన్నెందుకు పెళ్లిచేసుకుంది? తనే నన్ను పెళ్లి చేసుకోమని బలవంత పెట్టింది. చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది’’ అని అమిత్ చెప్పారు.
ప్రస్తుతం వారిద్దరి విడాకుల కేసు కోర్టులో ఉంది.
మరోపక్క దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, వేధింపుల కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2016 లెక్కల ప్రకారం ఆ ఏడాది 1,10,378 గృహహింస కేసులు రిపోర్టయ్యాయి.
వీటిలో చాలా కేసుల్లో ఎలాంటి పురోగతి ఉండదు. సమాజానికీ, పోలీస్ స్టేషన్లకు భయపడి మహిళలు వెనకడుగు వేయడమే అందుకు కారణం.
ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం మెట్రోపాలిటన్ నగరాల్లో మహిళలపై 2014లో 38,385, 2015లో 41,011, 2016లో 41,761 నేరాలు జరిగాయి. అందులో 2016లో గృహహింస కేసులే 12,218 ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
- వీర్యకణాలు ప్రయాణించే దారిలో ఎన్ని ఆటంకాలో...!
- ‘అందరూ పడుకున్నాక ఇంటి యజమాని నా దగ్గరకు వచ్చేవాడు’
- కామన్వెల్త్ డైరీ: మాటలాపి ఆటపై దృష్టి పెట్టండని అంపైర్ ఎందుకన్నాడు?
- ‘అప్పుడు అంబేడ్కర్ పేరు పలకడానికి సిగ్గుపడేదాన్ని.. ఇప్పుడు గర్వపడుతున్నా’
- BBC SPECIAL: సల్మాన్ ఖాన్ ఆ రోజు రాత్రి మొత్తం చెక్‌పోస్టు దగ్గరే ఉన్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








