డయాబెటిస్ అన్నం తింటే వస్తుందా.... మరేం తినాలి?

ఫొటో సోర్స్, NurPhoto/gettyimages
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
దక్షిణ భారతదేశంలో వరి అన్నం లేకుండా భోజనం ఊహించడమే కష్టం. అల్పాహారం నుంచి పిండివంటల వరకు చాలా వంటలలో బియ్యంతో చేసిన పదార్ధాలు కనిపిస్తాయి.
పిల్లలకు అన్నప్రాసన చేసేటప్పుడు బియ్యంతో వండిన పదార్థాలనే చాలా ప్రాంతాలలో తినిపిస్తారు.
ఇక పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాలలో సైతం బియ్యంతో చేసిన రక రకాల పదార్థాలు వడ్డిస్తారు.
ఆలయాలలో దేముడికి సమర్పించే నైవేద్యాలలో, పంచే ప్రసాదాలలో కూడా పులిహోర, పొంగలి, చక్కెర పొంగలి, దద్దోజనం లాంటి బియ్యంతో చేసే పదార్ధాలే ఉంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మందికిపైగా ప్రజలకు వరి అన్నం ప్రధాన ఆహారం.
ఇంత ప్రాముఖ్యమున్న వరి అన్నం తినడం వలన చక్కెర వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందని 21 దేశాలలో పరిశోధకులు 10 ఏళ్ల పాటు 1,30,000 మందిపై చేసిన అధ్యయనంలో తేల్చారు.
ఈ ముప్పు ఆగ్నేయ ఆసియా దేశాలలో నివసించే ప్రజలకు మరింత ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధన తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
పాపులేషన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, హామిల్టన్ హెల్త్ సైన్సెస్, కెనడాకి చెందిన మెక్ మాస్టర్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన ఈ పరిశోధనలో భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి పరిశోధకులు పాల్గొన్నారు.
ప్రజల ఆహారంలో ప్రధానమైన అన్నం చక్కెర వ్యాధికి దారి తీస్తుందని పరిశోధనలు చెబుతుంటే అన్నం తినాలో వద్దో అనే అనుమానాలు తలెత్తుతాయి.
మరి దీనిపై వైద్య నిపుణులు, పోషకాహార నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

ప్రకృతిలో సహజంగా లభించే ఏ ఆహార పదార్ధమైనా ఆరోగ్యానికి మంచిదేననీ, కానీ, దానిని ప్రకృతి నుంచి వేరు చేసి తినే ప్రక్రియలో వాటి సహజత్వాన్ని నాశనం చేయడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతాయని రాజమండ్రికి చెందిన డయాబెటాలజిస్ట్ కరుటూరి సుబ్రహ్మణ్యం అన్నారు.
పొట్టు తీయని బియ్యం ఆరోగ్యానికి హానికరం కాదని ఆయన అన్నారు.
“బ్రౌన్ రైస్ స్వల్ప మోతాదులో తినేసరికే ఆకలి తీరిపోవడం వలన ఎక్కువ తినలేరు. అదే, పాలిష్ చేసిన బియ్యం అయితే ఎక్కువ తినగలుగుతారు. అలా ఎక్కువ తినడం వల్ల శరీరంలోకి వెళ్లే కార్బోహైడ్రేట్ల శాతం కూడా పెరిగిపోతుంది. అలా అని మార్కెట్లో లభించే సెమీ బ్రౌన్ రైస్ వల్ల కూడా ఎలాంటి మేలు జరగదు” అన్నారాయన.
మన తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు తిన్నటువంటి ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలే జరుగుతుంది కానీ, వారు చేసినంత పని మనం చేస్తున్నామా లేదా అనే విషయాన్ని పరిశీలించి చూసుకోవాల్సి ఉందని చెప్పారు.
“పీచుతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వలన శరీరంలోకి చేరే గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది” అని ఆయన చెప్పారు.
“అన్నం మాత్రమే శత్రువు కాదని, అన్నం మానేసి నాలుగు సార్లు నాలుగు స్పూన్ల చక్కెరతో టీ తాగినా, మరో రకమైన చక్కెరతో కూడుకున్న పదార్ధాలు తీసుకున్నాఅది మరింత ప్రమాదం అని” ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, NOAH SEELAM/gettyimages
రోజూ తినే ఆహార మోతాదులు పరిశీలించుకుంటూ తగిన శారీరక వ్యాయామం చేసినప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తవని కరుటూరి సుబ్రహ్మణ్యం చెప్పారు.
ఇలాంటి అభిప్రాయాన్నే ముంబయికి చెందిన న్యూట్రిషనిస్ట్ రుజుత దివేకర్ కూడా తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసిన వీడియోలో వ్యక్తం చేశారు.
"మంచి ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి ఒకే చోట దొరకవు. మంచి ఆరోగ్యం మన ఇంట్లో, స్థానికంగా, కాలానుగుణంగా లభించే సంప్రదాయ ఆహారంలో దాగి ఉంటుంది", అని రుజుత దివేకర్ అంటారు.
రోగ నిరోధక శక్తి పెంచే ఆహారంలో అన్నం, పప్పు ఉండాలంటారు ఆమె. అన్నం, జొన్న, గోధుమలు ఏడాది పొడవునా తినొచ్చని ఆమె సూచించారు.
“బరువు తగ్గాలంటే సంప్రదాయ ఆహారాన్ని వదిలిపెట్టాలని చెప్పడం అతి పెద్ద అబద్ధమని” ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వరి ఎప్పుడు పుట్టింది?
దక్షిణ భారతదేశంలో క్రీస్తు పూర్వం 1400లోనే వరి పండిస్తున్నట్లు పురావస్తు శాఖ పరిశోధనలలో తేలింది.
యజుర్వేదం( క్రీస్తు పూర్వం 1500- 800 )లోనూ వరి ప్రస్తావన ఉంది.
వరి పండించడం చైనాలో మొదలైందా, భారతదేశంలో మొదలై ఇతర ఆగ్నేయ ఆసియా దేశాలకు పాకిందా అనే విషయాల పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
వరి పండించడం భారతదేశంలో క్రీస్తు పూర్వం 8000 నుంచి ఉన్నట్లు పురావస్తు శాఖ అంచనాలు చెబుతున్నాయి.
కోట్లాది ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో వరి గోధుమ లాంటి ఆహార ధాన్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
వరి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. అయినప్పటికీ, ఆకలితో ఉన్న ప్రపంచ జనాభాలో పావు వంతు మంది, పోషకాహార లోపంతో బాధపడుతున్న 190 లక్షల ప్రజలు భారతదేశంలోనే ఉన్నట్లు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) పేర్కొంది.
2020లో భారత్ 1.08 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేయనున్నట్లు అంచనా.
దక్షిణాదిలో అన్నంతో చేసే పులిహోర, పలావు, కొత్తిమీర అన్నం, కొబ్బరి అన్నం, పుదీన అన్నం, టమాటో అన్నం, వంకాయ రైస్, పొంగలి లాంటి పదార్ధాలు కనీసం 30కి పైగానే ఉంటాయి. ఇక పిండి వంటలలో రకాలలో అయితే లెక్కకు మించి ఉంటాయి.
వరితో ఆహార పదార్ధాలు తయారు చేయడం మాత్రమే కాకుండా దాని సంబంధిత పదార్ధాలను అనేక రకాలుగా వినియోగిస్తారు. బియ్యం పొట్టును పశువులకు గ్రాసంగా, వంట చెరుకుగా , నూనె తయారీకి కూడా వాడతారు.

ఫొటో సోర్స్, Getty Images
మ్యాజిక్ ఫార్ములా ఏమీ లేదు
దేశ ఆర్థిక వ్యవస్థలో, ఆహార భద్రత కల్పించే విషయంలో ఇంత ప్రాధాన్యం గల వరిని పండించడం, తినడం మానేయమని చెప్పడం ఒకేసారి సాధ్యమయ్యే పని కాదని సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ డైరెక్టర్, వ్యవసాయ శాస్త్రవేత్త జీవీ రామాంజనేయులు అంటారు.
భారతదేశంలో ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉండేవి. శారీరక శ్రమ ఎక్కువగా అవసరమయ్యే వ్యవసాయ పనులు చేసేవారు వరి, గోధుమతో చేసిన ఆహార పదార్ధాలు ఆహారంలో చేర్చుకోవడం వలనే శక్తిని సమకూర్చుకుంటారని ఆయన అన్నారు.
కానీ, మారుతున్న కాలంతో పాటు ప్రజల వృత్తులు, జీవన విధానాలు మారాయి కానీ, ఆహార పద్ధతులు పూర్తిగా మారకపోవడంతో సమస్యలు మొదలయ్యాయని అన్నారు.
కార్పొరేట్ ఆఫీసులలో ల్యాప్ టాప్ల ఎదురుగా 10 నుంచి 12 గంటలు పని చేస్తున్నపరిస్థితుల్లో శారీరక శ్రమ లేకపోవడం వలన కార్బోహైడ్రేట్లతో కూడిన పదార్థాలు తీసుకోవడం వలన ఆరోగ్యానికి జరిగేది హాని కాక ఇంకేమిటని ఆయన ప్రశ్నించారు.
గోధుమ, బంగాళ దుంప అన్నీ కార్బోహైడ్రేట్లతో కూడినవే అంటూ ఆహారంలో వాటి మోతాదు తగ్గించి ఎక్కువ కాయగూరలు, పండ్లు తినడం వలన సమతుల ఆహారం లభిస్తుందని చెప్పారు.
పాలిష్ చేసిన బియ్యంలో పోషకాలు పోవడం వలన కూడా శరీరానికి హాని జరుగుతోందని శరీర తత్వం, చేసే పనిని బట్టి ఆహారపు అలవాట్లు ఉండాలని సూచించారు.
అన్నానికి ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాలు పని చేస్తాయా అని ప్రశ్నించినప్పుడు కార్బో హైడ్రేట్లు ఎందులోనైనా సుమారుగా ఒకేలా ఉంటాయని, కాకపొతే, చిరు ధాన్యాలను తక్కువ మోతాదులో తీసుకోవడం వలన హాని ఉండదని అభిప్రాయ పడ్డారు.
భారతదేశంలో 50 శాతం పంట భూముల్లో వరి పండుతోంది. దేశ ప్రజల వినియోగానికి తగినట్లుగా చిరు ధాన్యాలను పండించాలంటే పంటలు పండించే తీరు నుంచి ప్రభుత్వం పంటలను సమకూర్చుకునే పద్ధతి వరకు మొత్తం వ్యవసాయ ప్రక్రియనే మార్చాల్సి ఉంటుందని చెబుతూ, వినియోగంలో మార్పులు వస్తే కానీ, ఇదంతా సాధ్యమయ్యే పని కాదని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అన్నం తింటే డయాబెటిస్ రావడం ఖాయమా?
భారతదేశంలో 20 - 79 ఏళ్ల మధ్య వయస్కులలో 10.39 శాతం టైపు 2 డయాబెటిస్ బాధితులని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫౌండేషన్ 2017 గణాంకాలు చెబుతున్నాయి.
ఆహారంలో బియ్యంతో తయారు చేసిన పదార్థాల వినియోగానికి చక్కెర వ్యాధికి సంబంధం ఉందని అనేక పరిశోధనలు పేర్కొన్నాయి.
అన్నంలో అధిక స్థాయిలో పిండి పదార్థాలు, గ్లైసెమిక్ శాతం ఉండటంతో చక్కెర వ్యాధితో భాదపడుతున్న వారిని అన్నం తినొద్దని వైద్యులు సూచిస్తారు.
ఆహారంలో ఉండే పిండి పదార్థాలు రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను ప్రభావితం చేసే స్థాయిని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు.
డయాబెటిస్ తో ఉండేవారు కేవలం ఆహారంలో అన్నంతో కూడిన పదార్ధాలను తగ్గించడం వలన మాత్రమే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గవని చెబుతూ, రోజులో ఎంత శాతం పిండి పదార్ధాలతో కూడిన ఆహారం తీసుకుంటున్నారో చూసుకోవడం అవసరమని ముంబయికి చెందిన క్లినికల్ న్యూట్రిషనిస్ట్, డయాబెటిస్ ఎడ్యుకేటర్ డాక్టర్ శుభశ్రీ రే చెప్పారు.
చక్కర వ్యాధితో ఉండేవారిలో ఎముకల బలహీనత త్వరగా ఏర్పడటం వలన ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాలు ఆహారంలో ఉండేలా చూసుకోవడం ముఖ్యమని, ఆమె సూచించారు.
వారంలో కనీసం మూడు సార్లు బియ్యంతో వండిన పదార్ధాలైన ఇడ్లీ, దోస స్థానంలో ఓట్స్, గోధుమ నూక, తృణ ధాన్యాలతో చేసిన బ్రెడ్ తీసుకోవచ్చు. మిగిలిన రోజుల్లో ఎప్పుడూ తీసుకునే అల్పాహారాన్ని తీసుకోవచ్చు.
తెల్లని అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ తినవచ్చు. తినలేకపోతే, అన్నం మోతాదు తగ్గించి తీసుకోవచ్చు.
తక్కువ మోతాదులో అన్నం, ఎక్కువ పప్పు, ఆకు కూరలు, పెరుగు, ప్రోటీన్ ఉండే చికెన్, కోడి గుడ్డులోని ప్రోటీన్ , చేపలు, బీన్స్, తక్కువ కొవ్వు ఉండే పనీర్ తీసుకోవచ్చు.
చక్కెరకు బదులుగా పళ్ళు తీసుకోవచ్చు.
పచ్చి మొలకలతో చేసిన చాట్, ఫ్రూట్ సలాడ్ లాంటివి తీసుకోవాలి
ప్రతి రోజు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలి
రాత్రి భోజనం 8 గంటల లోపే ముగించాలి.
ఏ ఆహార విధానమైనా అందరికీ ఒకేలా పని చేసే మ్యాజిక్ చిట్కా ఏమీ లేదని, మనం చేసే పని, శరీర తీరుకి అనుగుణంగా మనం ఆహారం తీసుకునే విధానం చూసుకోవాలని రామాంజనేయులు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కొబ్బరి చరిత్ర ఏమిటి? హిందూ ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్లా?
- మహిళలు గర్భం దాల్చినప్పుడు రకరకాల ఆహార పదార్ధాలు తినాలని ఎందుకనిపిస్తుంది?
- కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు WHO చెప్పిన అయిదు ఆహార చిట్కాలు
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- 2 వేల సంవత్సరాలు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయా?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








