కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు WHO చెప్పిన అయిదు ఆహార చిట్కాలు

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్-19 మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు జరుగుతున్నాయి. మన పనితీరు, పరిశుభ్రత నుంచి మన ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి.

మనం ప్రాధాన్యం ఇవ్వాల్సిన వాటిలో ఆరోగ్యం, ముఖ్యంగా ఆహారం, పరిశుభ్రత చాలా ముఖ్యమైన అంశాలయ్యాయి. అంటే, అంతకు ముందు జనం వాటికి ప్రాధాన్యం ఇవ్వలేదని కాదు.

అవును. ఆహారపు అలవాట్లు, పరిశుభ్రత అనేవి మన జీవనశైలికి సంబంధించినవి. అందులో మనం ఇష్టాలు-అయిష్టాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాం.

ఇప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి కూడా కోవిడ్-19 ఎక్కడ వ్యాపిస్తుందోనని జనాలకు భయం మొదలైంది.

సురక్షిత ఆహార అలవాట్ల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత ముఖ్యమైన ఐదు టిప్స్ షేర్ చేసింది.

కరోనావైరస్

1. ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండడం

  • వంట చేసే ముందు, వంట చేస్తున్న సమయంలో కచ్చితంగా చేతులు కడుక్కుంటూ ఉండాలి.
  • టాయిలెట్‌కు వెళ్లి వచ్చాక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
  • వంట చేసే ప్రాంతం, స్టవ్, పాత్రలను కూడా శుభ్రంగా కడగాలి. వాటిని శానిటైజ్ చేయాలి.
  • వంటగదిలోకి కీటకాలు, ఇతర జంతువులు ఏవీ రాకుండా సురక్షితంగా ఉంచాలి.

ఇదంతా ఎందుకు?

సూక్ష్మజీవుల్లో చాలా రకాలు ఎలాంటి వ్యాధులనూ కలిగించవు. కానీ వాటిలో కొన్ని ప్రమాదకరమైన జీవులు ఉంటాయి. అవి మట్టి, నీళ్లు, జంతువులు, మనుషుల్లో విస్తృతంగా ఉంటాయి.

ఆ సూక్ష్మ జీవులు మన చేతుల్లో, మసిగుడ్డలో, పాత్రల్లో, చాపింగ్ బోర్డ్ (కూరగాయలు తరిగే బోర్డు)పై కూడా ఉంటాయి.

మనం తినే వస్తువులు వాటికి ఏమాత్రం తగిలినా ఆహారం ద్వారా వచ్చే వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

2. పచ్చివి, వండిన ఆహార పదార్థాల మధ్య దూరం

  • పౌల్ట్రీ ఉత్పత్తులు, పచ్చి మాంసం, సీఫుడ్ (చేపలు, రొయ్యలు లాంటివి)ను మిగతా ఆహార పదార్థాలకు దూరంగా ఉంచండి.
  • పచ్చిగా ఉన్న ఆహార పదార్థాలను హ్యాండిల్ చేస్తున్నప్పుడు కత్తి, కటింగ్ బోర్డ్ లాంటి వాటిని ఉపయోగించండి.
  • వండిన ఆహార పదార్థాలను, పచ్చిగా ఉన్న వాటికి దూరంగా ఉంచండి. దానికోసం వాటిని మూత ఉన్న పాత్రలు, డబ్బాలలో ఉంచండి.

ఇది ఎందుకు?

పచ్చిగా ఉన్న ఆహార పదార్థాలు, ముఖ్యంగా మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులలో ప్రమాదకరమైన సూక్ష్మ జీవులు ఉంటాయి. వంట చేస్తున్న సమయంలో అవి వేరే ఆహార పదార్థాల్లోకి కూడా చేరవచ్చు.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

3. ఆహారం బాగా ఉడికించాలి

  • ముఖ్యంగా మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు, గుడ్లు, చేపల్లాంటి వాటిని బాగా ఉడికించాల్సి ఉంటుంది.
  • సూప్, పులుసు లాంటివి ఉడికిస్తున్నప్పుడు వాటి ఉష్ణోగ్రత 70 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉండేలా చూసుకోవాలి. మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు వండుతుంటే, పులుసు గులాబీ రంగులో లేకుండా చూడాలి.
  • వండిన ఆహారం చల్లబడితే దాన్ని తినే ముందు మళ్లీ వేడి చేయడం చాలా మంచిది.

ఇది ఎందుకు?

ఆహార పదార్థాలను బాగా ఉడికించినపుడు, వాటిలోని సూక్ష్మజీవులన్నీ పూర్తిగా నాశనం అవుతాయి.

70 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఆహార పదార్థాలను ఉడికించినపుడు, అవి తినడానికి సురక్షితం అని మనం భావించవచ్చని పరిశోధనల్లో తేలింది.

ముఖ్యంగా కీమా లేదా మొత్తం కోడిని ఉడికిస్తున్నప్పుడు ఇలా చేయడం చాలా అవసరం.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

4. వండిన పదార్థాలను సురక్షిత ఉష్ణోగ్రతల్లో ఉంచాలి

  • వండిన భోజనాన్ని సాధారణ గది ఉష్ణోగ్రతలో రెండు గంటల కంటే ఎక్కువ సమయం ఉంచకూడదు.
  • వండిన పదార్థాలను, ముఖ్యంగా త్వరగా పాడైపోయే వంటకాలను, ఫ్రిజ్‌లో ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచాలి.
  • వడ్డించడానికి ముందు వాటిని బాగా వేడి (60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ) చేయాలి.
  • వండిన పదార్థాలను ఫ్రిజ్‌లో ఎక్కువ సేపు ఉంచడం కూడా మంచిది కాదు.
  • ఫ్రోజెన్ ఫుడ్ అంటే గడ్డకట్టిన ఆహార పదార్థాలను సాధారణ గది ఉష్ణోగ్రతలో కరిగిపోయేలా ఉంచేయకూడదు.

ఇవి ఎందుకు అవసరం?

వండిన ఆహార పదార్థాలను గది సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల సూక్ష్మజీవులు వేగంగా అభివృద్ధి చెందుతాయి.

ఐదు డిగ్రీల కంటే తక్కువ, 60 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో సూక్ష్మజీవుల వృద్ధి ఆగడం, లేదంటే అవి చనిపోవడం జరుగుతుంది.

అయితే, కొన్ని ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా వృద్ధి చెందుతాయి.

మంచి నీరు

ఫొటో సోర్స్, Getty Images

5. శుభ్రమైన నీళ్లు, పరిశుభ్రమైన ఆహార పదార్థాలు

  • వంటకు శుభ్రమైన నీళ్లు ఉపయోగించాలి. అవి అందుబాటులో లేకపోతే ఆహార పదార్థాలను సురక్షితంగా ఉపయోగించడానికి తగినట్లు శుభ్రం చేయాలి.
  • తాజా, పుష్టికరమైన ఆహార పదార్థాలనే ఉపయోగించాలి.
  • పాశ్చరైజ్ చేసిన పాలు లాంటి సురక్షితంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలనే ఎంచుకోవాలి.
  • పండ్లు, కూరగాయలను కడగాలి. ముఖ్యంగా వాటిని పచ్చిగా తింటున్నప్పుడు శుభ్రంగా కడగాలి.
  • ఆహార పదార్థాలు ఉపయోగించే గడువు తేదీ ముగిసి ఉంటే వాటిని వాడకండి.

ఇవి ఎందుకు అవసరం?

నీళ్లు, ఐస్ లాంటి వాటిలో సూక్ష్మ జీవులు లేదా కొన్ని హానికారక పదార్థాలు ఉండచ్చు. పాడైన, వాసన వచ్చే ఆహార పదార్థాల్లో విషపూరిత రసాయనాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

ఆహార పదార్థాలను ఎంచుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని కడగడం, తొక్క తీయడం లాంటి చిన్న చిన్న పద్ధతుల వల్ల ప్రమాదాన్ని చాలావరకూ తగ్గించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)