కరోనావైరస్: ‘1940లో మా తాతయ్య ఇచ్చిన సలహాలు ఇప్పుడు కూడా పనికొస్తాయా?’

డాక్టర్ జాన్ డేవీ రోల్‌స్టన్

ఫొటో సోర్స్, FRANK GARDNER

    • రచయిత, ఫ్రాంక్ గార్డెనర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘ఇంట్లో రోగికి విడిగా వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసుకున్న గదిలో వెలుతురు బాగా ఉండాలి. గాలి బాగా రావాలి. ఇంట్లో వాళ్లంతా నివసించే,తిరిగే చోటుకు వీలైనంత ఆ రోగి గది దూరంగా ఉండాలి.’’

80 ఏళ్ల క్రితం మా తాతయ్య డాక్టర్ జాన్ డేవీ రోల్‌స్టన్ రాసిన ‘అక్యూట్ ఇన్ఫెక్షియస్ డిసీసెస్ -ఎ హ్యాండ్‌బుక్ ఫర్ ప్రాక్టిషనర్స్ అండ్ స్టూడెంట్స్’ పుస్తకంలో ఉన్న వాక్యాలివి.

కోవిడ్-19 అలుముకున్న ప్రస్తుత చీకటి రోజుల్లోనూ అందులోని విషయాలు ప్రాధాన్యం కోల్పోలేదు.

‘‘మంట కాచుకునే ఫైర్ ప్లేస్ ఉల్లాసం కలిగించడమే కాదు, వైద్యానికి ఉపయోగించిన దూదిని, ఇతర వ్యర్థాలను పడేయడానికి కూడా ఉపయోగపడుతుంది. చికిత్సకు ఉపయోగిస్తున్న గదిలో కార్పెట్లు, అలంకరణ సామగ్రి, అవసరం లేని వస్తువులేవీ ఉంచవద్దు. సులభంగా కడిగే సాధారణ ఫర్నిచర్ ఉంటే మేలు’’ అని అందులో రాసి ఉంది. ఈ సలహా ఇప్పటికీ ఉపయోగకరమైందే.

జాన్ డేవీ రోల్‌స్టన్ రాసిన ‘అక్యూట్ ఇన్ఫెక్షియస్ డిసీసెస్ - ఎ హ్యాండ్‌బుక్ ఫర్ ప్రాక్టిషనర్స్ అండ్ స్టూడెంట్స్’ పుస్తకం

ఫొటో సోర్స్, FRANK GARDNER

ఫొటో క్యాప్షన్, జాన్ డేవీ రోల్‌స్టన్ రాసిన ‘అక్యూట్ ఇన్ఫెక్షియస్ డిసీసెస్ - ఎ హ్యాండ్‌బుక్ ఫర్ ప్రాక్టిషనర్స్ అండ్ స్టూడెంట్స్’ పుస్తకం

రోల్‌స్టన్ ఎప్పుడో కాలం చేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో స్మాల్ పాక్స్ (స్ఫూటకం), టైఫస్ (విష జ్వరం), స్లార్లెట్ ఫీవర్ (ఎర్ర మచ్చల జ్వరం) లాంటివి వ్యాపించినప్పుడు బ్రిటన్ అధికారులు ఆయన్నే ఆశ్రయించేవాళ్లు. 1930ల్లో లండన్‌లోని వెస్టర్న్ హాస్పిటల్‌కు ఆయన మెడికల్ సూపరింటెండెంట్‌గా ఉండేవారు.

ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్న పుస్తకాన్ని మా తాతయ్య డాక్టర్ రొనాల్డ్సన్‌తో కలిసి రాశారు.

మా అమ్మ దాచిపెట్టుకున్న పాత పుస్తకాల్లో ఇది దాగి ఉండిపోయింది. పోయిన వారం నా కూతురు దాన్ని బయటకు తీసింది.

‘‘స్కార్లెట్ ఫీవర్, మీజిల్స్ (తట్టు) వంటి వాటికి ఇంట్లోనే చికిత్స చేసేందుకు కుటుంబ పరిస్థితులు సహకరించవచ్చు. కానీ, బాగా ప్రబలే అవకాశం ఉన్న స్మాల్ పాక్స్ లాంటి అంటు వ్యాధులకు ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆసుపత్రిలోనే విడిగా ఉంచి చికిత్స చేయడం అవసరం’’ అని అందులో పేర్కొన్నారు.

స్మాల్ పాక్స్ లాంటి ప్రాణాంతక అంటు వ్యాధుల గురించి మా తాతయ్య ఎపిడమాలజిస్ట్‌గా ప్రత్యేక అధ్యయనం చేశారు. ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధంలో 1870-74లో 20 వేల మంది సైనికులను స్మాల్ పాక్స్ బలి తీసుకున్న ఉదంతంపై జరిగిన అధ్యయనంలోనూ పాల్గొన్నారు.

చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

ఫొటో సోర్స్, Getty Images

రోగులను ఇంట్లో విడిగా ఉంచడం గురించి 1940ల్లో ఆయన ఇచ్చిన సలహాల్లో కొన్ని విషయాలు ఇప్పుడు విచిత్రంగా అనిపిస్తాయి.

గది ఉష్ణోగ్రత 55 నుంచి 60 డిగ్రీల ఫారన్‌హీట్ ఉండాలని ఆయన సూచించారు. అంటే 12 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్. అప్పట్లో జనం ధృఢంగా ఉండేవాళ్లని చాలా మంది చెప్పారు కానీ, ఇంత చలిలో ఉంచడం వారికి మంచిది కాదు.

గది బయట డిస్‌ఇన్ఫెక్టెడ్ సొల్యూషన్ ఉన్న తొట్టి పెట్టాలని, లోపల నంచి తీసుకువచ్చిన బట్టలు అందులో నానబెట్టాలని సూచించారు.

రాయల్ లండన్ హాస్పిటల్‌లో కొన్ని రోజుల క్రితం వరకూ పనిచేసిన డాక్టర్ ఫ్రాంక్ క్రాస్ ఈ సలహాలపై స్పందించారు.

టీబీ, సిఫలిసిస్, స్మాల్ పాక్స్‌కు చికిత్స లేని రోజుల్లో అలా చేయాల్సి వచ్చేదని, పడక మీదుండే బట్టలతో సహా అన్నింటినీ శుభ్రంగా ఉంచడం ముఖ్యమయ్యేదని ఆయన అన్నారు.

రోగి ఉన్న గదిని పూర్తిగా స్టెరిలైజ్ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని... స్కార్లెట్ ఫీవర్, సాధారణ నిమోనియా లాంటి స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ల విషయంలో మాత్రం సబ్బు నీళ్లతో కడగడం, సూర్యరశ్మి తాకేలా చేయడం ఉపయోగపడవచ్చని ఆ పుస్తకం చెబుతోంది.

ఐసోలేషన్ వార్డ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1947లో లండన్‌లో ఓ ఆసుపత్రిలో చిన్నారుల ఐసోలేషన్ వార్డు

ఆసుపత్రుల్లో మూడింట ఒక వంతు పడకలు ఐసోలేషన్‌లో ఉండాలని ఆ పుస్తకం సూచిస్తోంది.

‘‘ఓపెన్ వార్డులో ఉన్న రోగికి అన్నింటి కన్నా పెద్ద ముప్పు అక్కడ ఉండే సహచర రోగుల నుంచే’’ అని అందులో పేర్కొన్నారు.

లక్షణాలు చూపకుండానే వ్యక్తులు వ్యాధులను ఇంకొకరికి అంటించగలరన్న ప్రమాదం గురించి ఆ రోజుల్లో కూడా అవగాహన ఉన్నట్లే కనబడుతోంది. కోవిడ్-19 కూడా ఈ తరహా వ్యాధే.

రోగులను కలిపి ఉంచడం వల్ల వచ్చే ముప్పుల గురించి ఈ పుస్తకం హెచ్చరించింది. అయితే, ప్రతి రోగినీ వేరుగా ఉంచడం, ఆచరణలో ఇంకా సాధ్యం కాని విషయమని పేర్కొంది.

ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో శిక్షణ పొందుతున్న సిబ్బంది

ఫొటో సోర్స్, JOHN WRIGHT

ఫొటో క్యాప్షన్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో శిక్షణ పొందుతున్న సిబ్బంది

‘‘స్మాల్ పాక్స్‌కు అప్పట్లో చికిత్స లేదు. అది సోకినవాళ్లలో 30 శాతం మంది చనిపోయేవారు. ఇప్పుడు కోవిడ్-19కు కూడా చికిత్స లేదు. అందుబాటులో ఉన్న యాంటీ వైరస్‌ ఔషధాలను ఉపయోగించి, కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. చేతులు, ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే వస్తువులను కడుక్కోవడం అప్పుడూ, ఇప్పుడూ ఉత్తమమే’’ అని డాక్టర్ ఫ్రాంక్ క్రాస్ అన్నారు.

మా తాతయ్య రాసిన పుస్తకం అట్ట ముదురు నీలం రంగులో ఉండేది. కాలం గడిచిపోయింది, దాని రంగు వెలిసిపోయింది. మళ్లీ దీన్ని బైండింగ్ చేయించాలేమో.

మనం ఇప్పుడు మరో యుద్ధంలో ఉన్నామని రాజకీయ నాయకులు అంటున్నారు. ప్రస్తుతం జనాలు పాటిస్తున్న సామాజిక దూరం, లాక్‌డౌన్, పోలీసు పర్యవేక్షణ గురించి మా తాతయ్య ఏమని ఉండేవారో? హృదయపూర్వకంగా సమర్థించేవారేమో!

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)