విశాఖపట్నం గ్యాస్ లీక్: ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? దర్యాప్తు నివేదిక ఎప్పుడు వస్తుంది?

కేజీహెచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రి ఎదుట బాధితుల కుటుంబ సభ్యులు
    • రచయిత, వి. శంకర్
    • హోదా, బీబీసీ కోసం

విశాఖపట్నంలో ప్రమాదకర వాయువుల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటించింది. దాని కోసం ఐదుగురు ఉన్నత స్థాయి అధికారులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీ వేసింది. ఈలోగా ఏపీ పోలీసులు కూడా కంపెనీపై కేసు నమోదు చేశారు. పరిశ్రమల శాఖ కూడా ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది.

అయితే ఇంత పెద్ద ప్రమాదం వెనుక కారణాలేంటి, కారకులెవరు అన్నది ఎప్పటికి తేలుతుంది అనే దానిపై స్పష్టత లేదు. ఈ పరిణామాలు మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న వైజాగ్ నగరంలోని పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అనే ప్రశ్న కూడా ఈ సందర్భంగా ఉదయిస్తోంది.

ఎల్జీ పాలిమర్స్

ఫొటో సోర్స్, Getty Images

విస్తరిస్తున్న రసాయన పరిశ్రమలు

దేశంలో రసాయన పరిశ్రమలు వేగంగా అభివృద్ధి అవుతున్నాయి. అందులో భాగంగా కొన్ని జోన్లను కేంద్రం గుర్తించింది. గుజరాత్‌లోని డేహెజ్, తమిళనాడులోని కడలూరు, ఒడిశాలోని పారదీప్‌తో పాటుగా ఏపీలోని విశాఖపట్నంలో ఇలాంటి పరిశ్రమలకు ఎక్కువ అవకాశం ఉంటుందని ఇండియన్ కెమికల్ కౌన్సిల్ గుర్తించింది.

రాబోయే ఐదేళ్లలో ఈ పరిశ్రమలు వేగంగా విస్తరించవచ్చని అంచనా వేస్తున్నారు. రసాయనాలతో కూడిన వివిధ పరిశ్రమల ద్వారా దేశ జీడీపీలో ప్రస్తుతం 3శాతం వాటా వస్తోంది. 2018-19లో రూ. 16,300 కోట్ల ఆదాయం వస్తే అది 2025 నాటికి రూ. 30,400 కోట్లకు పెరుగుతుందని లెక్కలేస్తున్నారు.

విశాఖను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫార్మా, పెట్రో కెమికల్స్, పెస్టిసైడ్స్, పెయింట్స్ సహా పలు పరిశ్రమలకు అవకాశం ఉంటుందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఎల్జీ పాలిమర్స్‌లో తాజాగా జరిగిన ప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. వాస్తవానికి ఎల్జీ పాలిమర్స్ కర్మాగారానికి వ్యతిరేకంగా చాలాకాలంగా ఆందోళనలు సాగుతున్నాయి.

తొలిసారిగా 1998లో ఇదే పరిశ్రమలో ప్రమాదం జరిగింది. జనావాసాల మధ్య రసాయన పరిశ్రమల మీద అప్పట్లోనే అభ్యంతరాలు వచ్చాయి. స్థానికులు నిరసనలకు కూడా దిగారు. అయితే ప్రభావిత ప్రాంతాల ప్రజలకు తగిన భద్రత కల్పించేందుకు, ఇతర రక్షణ ఏర్పాట్లతో పాటుగా సమీప గ్రామాల అభివృద్ధికి హామీ ఇవ్వడంతో అప్పట్లో ఆందోళన విరమించారు.

కేజీహెచ్

ఫొటో సోర్స్, Getty Images

తాజా ప్రమాదం నేపథ్యంలో తలెత్తిన పలు ప్రశ్నలు ఇవి...

పునః ప్రారంభానికి అనుమతి

లాక్ డౌన్‌లో సడలింపు ఇచ్చి, అత్యవసర సర్వీసు కింద ఎల్జీ పాలిమర్స్‌కి ఎలా అనుమతి ఇస్తారని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ప్రశ్నించారు. ఆయన ఈమేరకు ప్రభుత్వానికి ఓ లేఖ కూడా రాశారు.

ఇండియన్ కెమికల్స్ కౌన్సిల్ ఏప్రిల్ మొదటి వారంలోనే కేంద్రానికి లేఖ రాసింది. కొన్ని రకాల ఔషధాల తయారీకి తమ రసాయనాల సరఫరా అత్యవసరం అని పేర్కొంది. తమ రంగాన్ని కూడా అత్యవసరంగా గుర్తించి అనుమతి ఇవ్వాలని కోరింది. ఆమేరకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలోనే వీటికి మినహాయింపు ఇచ్చింది. అప్పుడు విశాఖపట్నం రెడ్‌ జోన్‌లో ఉండటం వల్ల ఈ సంస్థ ఉత్పత్తిని ప్రారంభించలేదు.

మే 4 తర్వాత విశాఖపట్నం ఆరెంజ్ జోన్‌లోకి వెళ్లింది. దీంతో ఎల్జీ పాలిమర్స్ ఉత్పత్తికి సిద్ధపడిందని ఏపీ పరిశ్రమల శాఖ చెబుతోంది.

ఎన్ఓసీ ఇచ్చిన విషయం వాస్తవం కాదని పరిశ్రమల శాఖ జీఎం (వైజాగ్) రామలింగేశ్వర రావు బీబీసీకి తెలిపారు. ఈనెల 4 నుంచి ప్రారంభించే పరిశ్రమలకు ప్రత్యేకంగా అనుమతులు అవసరం లేదని నిర్ధరించారు.

పర్యావరణపరంగా ఈఐఏ నిబంధనలు ఈ పరిశ్రమకు వర్తించవని అధికారులు చెబుతున్నారు. 1968 నుంచి ఉన్న పరిశ్రమకు 2006 నాటి నిబంధనల ప్రకారం అనుమతులు అవసరం లేదంటున్నారు.

ఎల్జీ పాలిమర్స్
ఫొటో క్యాప్షన్, ఎల్జీ పాలిమర్స్

స్టైరీన్ గ్యాస్ లీకేజీని ఎందుకు నియంత్రించలేకపోయారు?

జీవీఎంసీ పరిధిలోని 66వ వార్డులో ఆర్ఆర్ వెంకటాపురం సమీపంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌ మార్చి 24 తర్వాత నుంచి లాక్ డౌన్ అమలు కారణంగా మూతపడింది. మొత్తం 363 మంది శాశ్వత సిబ్బంది, 70 మంది తాత్కాలిక సిబ్బందితో నడుస్తున్న ఈ యూనిట్‌లో ఉత్పత్తి నిలిపివేశారు.

అయితే, నిబంధనల ప్రకారం ద్రవరూప స్టైరీన్ ట్యాంకుల వద్ద స్వీయ పాలిమరైజేషన్ చేసే క్రమంలో ప్రమాదం సంభవించినట్టు అధికారులు భావిస్తున్నారు.

విశాఖలోని పరిశ్రమల శాఖ జాయింట్ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్ జె.శివశంకర్ రెడ్డి ఈ విషయంపై బీబీసీతో మాట్లాడారు.

"స్టైరీన్ నిల్వ చేసిన ట్యాంకుల వద్ద నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఉష్ణోగ్రతలను నిర్వహించలేకపోయారు. దాంతో ద్రవరూపంలో ఉన్న స్టైరీన్ ఆవిరిగా మారింది. ఎల్జీ పాలిమర్స్‌లో 2వేల మెట్రిక్ టన్నుల స్టైరీన్ నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తుతం లీకైన గ్యాస్‌ను నియంత్రించలేకపోవడానికి తగిన అప్రమత్తత లేకపోవడమే కారణం. సమస్యను సకాలంలో గుర్తించడంలో జాప్యం జరిగింది. దాంతో అది చేయిదాటిపోయినట్టు ప్రాథమికంగా భావిస్తున్నాం. పూర్తిస్థాయిలో పరిశీలన అవసరం. దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తాం" అని తెలిపారు.

సైరన్ ఎందుకు పనిచేయలేదు?

పరిశ్రమలో పనిచేస్తున్నవారితో పాటుగా ప్రభావిత ప్రాంతాల ప్రజలందరినీ అప్రమత్తం చేయాల్సిన సైరన్ ఎందుకు పనిచేయలేదనే ప్రశ్న ఉదయిస్తోంది. సైరన్ పనిచేయకపోవడానికి యాజమాన్యానిదే బాధ్యత అంటున్నారు సీఐటీయూ ఏపీ అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు.

"ఈ ప్రమాదం తర్వాత కూడా ఎల్జీ కంపెనీ పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉన్నా ఇప్పటి వరకూ అధికారికంగా నోరు మెదపలేదు. సైరన్ సకాలంలో మోగి ఉంటే స్థానికులు ప్రాణాపాయం నుంచి తప్పించుకునే వారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో లీకేజీ మొదలైతే 3.30 వరకూ చాలామంది గుర్తించలేకపోయారు. అప్పటికే ఆ ప్రాంతమంతా స్టైరీన్ వ్యాపించింది. అందుకే ఎక్కువ మంది తప్పించుకోలేకపోయారు" అని అభిప్రాయపడ్డారు.

సైరన్ విషయంలో ఎందుకు సమస్య వచ్చిందన్న అంశంపై సీఎం వైఎస్ జగన్ కూడా స్పందించారు. ఉన్నత స్థాయి అధికారులతో వేసిన కమిటీ దానిపై దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇస్తుందని తెలిపారు.

రెడ్ కేటగిరీ కన్నా తీవ్రంగా కాలుష్యం వెదజల్లే 'గ్రూప్ ఆఫ్ 17' కేటగిరీ పరిశ్రమల్లో ప్రతి ఆరు నెలలకు ఓసారి పరీక్షలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జాయింట్ చీఫ్‌ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ బి.శివకుమార్ తెలిపారు.

"ఏదైనా కంపెనీలో సైరన్ వంటి సమస్యలు మా తనిఖీలో బయటపడితే దానికి తగిన సమయం ఇస్తాం. ఒకటి రెండు రోజుల్లో దానిని సరిచేసి పనిచేస్తుందని నిరూపించుకుంటేనే ఆయా కంపెనీలకు అనుమతి ఇస్తాం. కానీ ఎల్జీ పాలిమర్స్‌లో నిర్వహించిన గత తనిఖీలలో సమస్య రాలేదు. కానీ కొన్నిసార్లు సాంకేతిక, మరికొన్నిసార్లు మానవ తప్పిదం మూలంగా కూడా ఇలాంటివి జరగవచ్చు. ప్రమాదం జరిగిన సమయంలో సైరన్ పనిచేయకపోవడానికి కారణం ఏమిటనేది దర్యాప్తులో తేలుతుంది" అన్నారు.

కాగా, ఈ ప్లాంటులో ఏదైనా ప్రమాదం జరిగితే సిబ్బందిని అప్రమత్తం చేసే సైరెన్ ఆటోమేటిక్ గానే పనిచేస్తుందని శివకుమార్ వెల్లడించారు. సైరన్‌కు సంబంధించి కానీ, మరే ఇతర ప్రమాణాల నిర్వహణకు సంబంధించి కానీ అక్కడ గతంలో ఎటువంటి ఫిర్యాదులు లేవని తెలిపారు.ప్రతీసారి తనిఖీల సందర్భంగా అందరినీ అప్రమత్తం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని, ప్రమాదాలు జరిగితే ఎలా తప్పించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదానిపై అవగాహన కల్పించేందుకు గతంలో మాక్ డ్రిల్స్ కూడా జరిగాయని వెల్లడించారు.

విశాఖ గ్యాస్ ప్రమాదం

తనిఖీలు ఎందుకు చేయలేదు?

లాక్ డౌన్ తర్వాత పరిశ్రమ పునఃప్రారంభించే సమయంలో ఎందుకు తనిఖీలు చేయలేదనే ప్రశ్న చాలామంది నుంచే వినిపిస్తోంది. ఈఏఎస్ శర్మ తన లేఖలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు.

అయితే అలాంటి తనిఖీలు చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఏపీ పరిశ్రమల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫ్యాక్టరీస్ విభాగం అధికారులు కూడా అదే సమాధానం చెప్పారు. ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే లేదా ఇతర అవసరాలు ఏర్పడితే తప్ప లాక్ డౌన్ తర్వాత పరిశ్రమలను తనిఖీ చేయాలనే ఆదేశాలు లేవని తెలిపారు.

విస్తరణకు ఎలా అనుమతి ఇచ్చారు?

ఎల్జీ పాలిమర్స్‌ను ప్రభుత్వానికి చెందిన మిగులు భూముల్లో నిర్మించారని ఈఏఎస్ శర్మ చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశంలో న్యాయపరమైన వివాదం ఉందని ఆయన తెలిపారు. అలాంటి సమయంలో జనావాసాల మధ్య విస్తరణకు ఎలా అనుమతి ఇచ్చారని సీఎంకు రాసిన లేఖలో శర్మ ప్రశ్నించారు.

భూముల విషయంపై విశాఖ ఆర్డీవో ఎన్.తేజ్ భరత్‌ను బీబీసీ వివరణ కోరింది. ఎల్జీ పాలిమర్స్ భూములకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి వివాదం లేదని ఆయన తెలిపారు.

పరిశ్రమ విస్తరణకు సంబంధించి సంబంధిత విభాగాలే స్పందించాలని, భూములకు సంబంధించి తమను ఎవరూ ఎన్ఓసీ కోరలేదని, తాము ఇవ్వలేదని స్పష్టం చేశారు.

విశాఖపట్నం డీఐసీ జీఎం రామలింగేశ్వర రాజు స్పందిస్తూ.. ‘‘2017లో కొత్తగా ప్లాంటు విస్తరణ జరగలేదు. అయితే, ఇంజనీరింగ్ కాంప్లెక్స్ అని ఒక భవనాన్ని నిర్మించారు. దానికి స్టైరీన్ అవసరం ఉండదు. రా మెటీరియల్ ఎప్పుడయినా ఆర్డర్ వచ్చినప్పుడు అక్కడ పని చేస్తారు. లేదంటే నిలిపివేస్తారు. దానికి అనుమతులు ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ విస్తరణ ఏమీ జరగలేదు’’ అని వెల్లడించారు.

అయితే ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని టీడీపీ విమర్శిస్తుంటే, గత ప్రభుత్వ హయాంలోనే విస్తరణకు అనుమతులు ఇచ్చినట్టు వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

ఎల్జీ పాలిమర్స్

ఫొటో సోర్స్, Getty Images

రంగంలోకి దర్యాప్తు కమిటీ

విశాఖలో ప్రమాద బాధితులను పరామర్శించి, పరిస్థితిని సమీక్షించిన అనంతరం సీఎం జగన్ చేసిన ప్రకటనకు అనుగుణంగా ఐదుగురు సభ్యులతో హైపవర్ కమిటీని నియమించారు.

ఈ కమిటీకి అటవి, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కమిటీలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్కే మీనా సభ్యులుగా, ఏపీ పొల్యూషన్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ వివేక్ యాదవ్‌ని కన్వీనర్‌గా నియమించారు. ఈ మేరకు జీవో నెంబర్ 803 విడుదలైంది.

ఈ కమిటీ తన నివేదికను నెల రోజుల్లోగా సమర్పించాలని జీవోలో పేర్కొన్నారు. దాని ప్రకారం కమిటీ చేయాల్సిన విధులను కూడా పేర్కొన్నారు.

దర్యాప్తులో భాగంగా గ్యాస్ లీకేజీకి కారణాలు, సేఫ్టీ ప్రోటోకాల్ పరిస్థితిని పరిశీలిస్తారు.

ఈ ప్రమాదంలో లీకైన గ్యాస్ కారణంగా సమీప ప్రాంతాల ప్రజలపై దీర్ఘకాలిక ప్రభావాల గురించి అధ్యయనం చేస్తారు.

గ్యాస్ లీకేజీలో కంపెనీ నిర్లక్ష్యం ఉందని గుర్తిస్తే దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ ప్రతిపాదించాలి.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేఫ్టీ ఆడిట్‌కి సంబంధించిన అంశాలను సూచించాలి.

అదే పరిస్థితిలో ఉన్న ఇతర పరిశ్రమలను గుర్తిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)