కరోనావైరస్ లాక్‌డౌన్: చేనేత కార్మికులు నేసిన బట్టలు కొనేవారూ లేరు.. పని చేసేందుకు సరకూ లేదు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అప్పటికే దారుణ పరిస్థితుల్లో ఉన్న వృత్తులను లాక్ డౌన్ మరింత ప్రమాదంలోకి తోసింది. చేనేత, మరనేత రంగాలు ఇప్పుడు ఇదే ఇబ్బందుల్లో ఉన్నాయి. లాక్ డౌన్ వల్ల బట్టల వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది. లాక్ డౌన్ తరువాత కూడా పాత వేగంతో ముందుకెళుతుందన్న భరోసా లేదు. దీని ప్రభావం నేత కార్మికులపై తీవ్రంగా ఉంది.
ప్రస్తుతం నేత కార్మికులుగా పిలుస్తున్న వారిలో రెండు రకాలు ఉంటారు. ఒకరు చేతితో మగ్గంపై నేతనేసే వారు, చేనేత కార్మికులు. రెండోవారు, కరెంటు మెషీన్ల మీద నేతనేసేవారు. వీరినే మరనేత కార్మికులు అంటున్నారు. లాక్ డౌన్ ఇప్పుడు ఇద్దర్నీ ఇబ్బంది పెడుతోంది.
పెళ్లిళ్ల సీజన్లు, రెగ్యులర్‌గా వచ్చే ఆర్డర్లు అన్నీ పోయాయి. ఒక అంచనా ప్రకారం ఒక్క తెలంగాణలోనే చేనేత కార్మికుల దగ్గర వంద కోట్ల రూపాయల విలువైన వస్త్రాలు ఉండిపోయాయి. తెలంగాణలో సగటున నెలకు 40-50 కోట్ల రూపాయల విలువైన చేనేత వస్త్రాలు ఉత్పత్తి అవుతాయి. వాటిలో సగం పట్టు చీరలే.
ఇప్పటి వరకూ నేత కార్మికులు తమ దగ్గర ముడి సరకు ఉన్నంత వరకూ పనిచేశారు. లాక్ డౌన్ వల్ల మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకల నుంచి వచ్చే ముడి సరకు ఆగిపోయింది. దీంతో పని ఆపేయాల్సి వచ్చింది. మిగతా వారిలా కాకుండా, పని ఆగిపోతే ఉత్పత్తి ఆగిపోతుంది. ఉత్పత్తి, కొనుగోలు లేకపోతే వీరికి రోజు గడవడమే ఇబ్బంది అయిపోతుంది.

ఫొటో సోర్స్, Getty Images
చాలా మంది నేత కార్మికులకు సొంతంగా ముడి సరకు కొని, నేసిన వాటిని షాపులకు అమ్మే అంత పెట్టుబడి కానీ, మార్కెటింగ్ నైపుణ్యం కానీ ఉండవు. దీంతో వ్యాపారులు వారికి ముడిసరకు ఇచ్చి, బట్ట నేసిన తరువాత సొమ్ము చెల్లించి పట్టుకెళ్తారు. దీంతో వీరందరికీ లాక్ డౌన్ సంకటంగా మారింది. వ్యాపారం సాగడం లేదు కాబట్టి, పెట్టుబడిగా ముడిసరకు ఇచ్చిన వారి నుంచి డబ్బు అందడంలేదు.
ఇక మరికొందరు మాత్రం సొంతంగా నేసి, షాపులకు ఇస్తారు. వారికి మరింత ఇబ్బంది. వారంతా చాలా చిన్న వ్యాపారులకు కావడంతో, ఇన్ని రోజులు సరకు ఆగిపోతే తట్టుకునే శక్తి లేదు వారికి.
''మేం ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే. రైతుల ఉత్పత్తులు కొన్నట్టే, వీరి ఉత్పత్తులన్నీ ప్రభుత్వమే కొనాలి. సొసైటీల నుంచి వచ్చేది కేవలం 15 శాతమే. మిగతా అంతా వ్యక్తులు చేసేదే. ప్రతి కార్మికుడిపై మరికొందరు ఆధారపడి ఉంటారు. ప్రభుత్వం సరకు కొని మొత్తం డబ్బు ఇస్తే బావుంటుంది. కాని పక్షంలో, కనీసం సగం డబ్బు, సగం ముడిసరకు రూపంలో ఇచ్చినా బావుంటుంది. అలాగే లాక్ డౌన్ సమయంలో రిలీఫ్ కోసం ఒక్కొక్కరికీ 5-6 వేల రూపాయలు ఇవ్వాలి'' అన్నారు తడ్క యాదగిరి. పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న యాదగిరి, సుదీర్ఘ కాలం చేనేత రంగంపై అధ్యయనం చేశారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డులో సభ్యులుగా పనిచేశారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా


చేనేత కార్మికులు ఎక్కువగా ఉండే పోచంపల్లి వంటి గ్రామాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడి నేత కుటుంబాల నుంచి చాలా మంది యువత హైదరాబాద్ వచ్చి చిన్నా చితకా పనులు, చిరుద్యోగాలు చేస్తుంటారు. ఒక అంచనా ప్రకారం ఈ పట్టణం నుంచి సుమారు వెయ్యి మంది రోజూ హైదరాబాద్ వచ్చి వెళ్తుంటారు. వారి పనీ ఆగిపోవడంతో కుటుంబాల్లో రెండు ఆదాయాలూ పోయాయి.
లాక్ డౌన్ తరువాత కూడా వెంటనే పుంజుకునే రంగం కాదు బట్టల వ్యాపారం. ఒకవేళ మామూలు బట్టలు కొన్నా, నేత బట్టలు కొనే సందర్భాలు తక్కువే ఉండడం కూడా వీరికి మరో ఇబ్బంది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరిస్థితి అలానే ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఆప్కోకి రూ.176 కోట్లు బకాయి పడింది. ఆప్కో ద్వారా ఆ సొమ్ము సొసైటీలకు, అక్కడ నుంచి నేత కార్మికులకూ చేరాల్సి ఉంది. అది జరగలేదు. తాజాగా ప్రభుత్వం మాస్కుల కోసం ఆప్కో నుంచి కొన్న గుడ్డకు కూడా సగమే చెల్లించిందని విమర్శించారు మాచర్ల మోహన రావు. మోహన రావు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు.

''ప్రభుత్వం ఆప్కోకి చెల్లించాల్సిన రూ.176 కోట్లు తక్షణం చెల్లిస్తే కొంత సమస్య తీరుతుంది. ఇంత క్రైసిస్‌లో కూడా వారు అరువుతో సరుకు కొన్నారు. చేనేత పనులకు తక్షణం అనుమతిస్తే కాస్త ఉపశమనం ఉంటుంది. కనీసం ఆరు నెలల పాటు నెలకు మూడు వేలు తగ్గకుండా ప్రభుత్వం వారికి సాయం చేస్తే కుటుంబాలు కుదుటపడతాయి. లేదంటే వారికి చాలా ఇబ్బంది'' అన్నారు మోహన రావు.
లాక్ డౌన్ వల్ల దీర్ఘ కాలం ఈ రంగంపై ప్రభావం పడుతుంది. లాక్ డౌన్ ఎత్తేసినా వెంటనే వ్యవస్థ గాడిన పడుతుందన్న నమ్మకమూలేదు. దీనివల్ల ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవడానికి దీర్ఘకాలిక ఉపశమన చర్యలు కోరుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''సెంట్రల్ ప్యాకేజీ పరిధిలో డీసీసీబీల దగ్గర రుణ మాఫీ చేయాలి. నాబార్డు కింద రుణాల రీషెడ్యూలు చేయాలి. ప్రొడక్షన్ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కొనసాగించాలి. రూ.200 కోట్ల మూలధనంతో సరకు కొనుగోలు చేయాలి'' అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మోహన రావు.
ఇక సిరిసిల్ల పట్టణంలో ఎక్కువ మంది ఆధారపడ్డ మరమగ్గాల పరిస్థితి కూడా బాలేదు. ఇక్కడ బతుకమ్మ చీరలు, మహిళల పెట్టీకోట్స్‌కి అవసరమయ్యే ముడి సరకు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఈ మర మగ్గాలకు అదనంగా డయింగ్, సైజింగ్, వార్పింగ్ వంటి పనులు ఉంటాయి. వీరందరూ లాక్ డౌన్ వల్ల పనులు కోల్పోయారు. సిరిసిల్లలో కలెక్టర్ ప్రత్యేక నిధి నుంచి 4500 మరనేత కార్మికులకు ఒక్కొక్కరికీ 500 రూపాయలు ఇచ్చారు.
''ప్రస్తుతం ఇక్కడి కార్మికులు దారుణ స్థితిలో ఉన్నారు. మరనేత పనిలో సోషల్ డిస్టెన్స్ పక్కాగా పాటించే అవకాశం ఉంది. ఒకరి దగ్గర మరొకరు ఉండాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి వీరి పని వల్ల నష్టం ఉండదు. ముడి సరకు రవాణాకు అనుమతిచ్చి, వీరు పనిచేసుకోవడానికి అనుమతిస్తే చాలా సమస్య తీరుతుంది'' అన్నారు సిరిసిల్ల స్థానిక మీడియాలో పనిచేసే మచ్చా ఆనంద్. సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మహత్యలను ముందుగా వెలుగులోకి తెచ్చిన వారిలో ఆనంద్ ముఖ్యులు.
ప్రస్తుతానికి సిరిసిల్ల మరనేత కార్మికులకు మాత్రం పని మొదలుపెట్టడానికి మే 5 నుంచి అనుమతించారు. కానీ ఇప్పటి వరకూ వచ్చిన నష్టాలను పూడ్చుకోవడం వారికి పెద్ద సమస్యే.

చేనేత సమస్య ఎప్పుడూ ఎందుకు ఉంటోంది?
లాక్ డౌన్ సరే, కానీ మామూలు రోజుల్లో కూడా చేనేత రంగం ఏమంత బాలేదు. ఎప్పుడూ ఈ రంగం సంక్షోభంలోనే ఉంటుంది. దానికి అసలు కారణం ఏంటి?
భారతదేశంలో అతి ప్రాచీన పరిశ్రమ ఇది. ఒకప్పుడు దేశానికి పేరు, డబ్బు తెచ్చిన, వందల ఏళ్ల క్రితం నుంచీ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిన ఘనత ఈ పరిశ్రమకు ఉంది. శాతవాహనుల కాలంలో ఇక్కడి వస్త్రాలు యూరప్‌కి ఎగుమతి అయిన ఆధారాలున్నాయి. కాలక్రమేణా బ్రిటిష్ పాలనలోనూ, ఆ తరువాత పారిశ్రామికీకరణలోనూ ఈ రంగం భారీగా దెబ్బతింది.
ముఖ్యంగా 80ల చివర నుంచి చేనేత పరిశ్రమకు దుర్భర రోజులు మొదలయ్యాయి అంటారు యాదగిరి. చేనేత రంగం గతంలో కూడా దెబ్బతింటూ వచ్చినా, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది మాత్రం ఆ తరువాతేనన్నది ఆయన అభిప్రాయం.
''1980ల చివర్నుంచి దేశంలో రెండు రంగాలు బాగా దెబ్బతిన్నాయి. ఒకటి వ్యవసాయం, రెండు చేనేత. రైతులు, నేత కార్మికుల ఆత్మహత్యలు ఆ తరువాతే పెరిగాయి'' అన్నారు యాదగిరి.

ఫొటో సోర్స్, Getty Images
చేనేత కార్మికులు చాలా మందికి బయట పనులు రావు. చాలా చేతి వృత్తులు, కులాల వారికి తమ పని లేనప్పుడు ఏదో రూపంలో వేరే పని దొరికే పరిస్థితి ఉంటుంది. కానీ చేనేత అలా కాదు. పైగా మిగతా వారికి ఉన్న వెసులుబాటు, అంటే తమ పని ఒక రోజు, బయట పని ఒక రోజులాగా వారు చేయలేరు. ఒక చీర నేయాలంటే వారం నుంచి మూడు వారాల పని దినాలు తీసుకుంటాయి. కానీ అమ్మినప్పుడు, వచ్చేది ఒక్క చీర ధర మాత్రమే! దానికితోడు ఒక మనిషి కాకుండా, కుటుంబ సభ్యుల సాయం కూడా అవసరం ఉన్న పని ఇది. దీంతో అదే వృత్తిలో ఉన్నవారు వేరే పని లేక, రాక ఇబ్బంది పడుతున్నారు. ఆకలి సమస్య, ఆత్మగౌరవం సమస్య.. రెండూ కలసి ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి.
చేనేత కేవలం భౌతిక వృత్తే కాకుండా, కళాత్మకంగా, నైపుణ్యంతో కూడిన పని. నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. సహజంగా కుటుంబ సభ్యులే ఎక్కువగా ఆ కళ నేర్చుకుంటారు. కాకపోతే వారు చేసే పనిని కేవలం భౌతిక శ్రమగానే చూస్తే ఎంత కూలీ వస్తుందో వారికి అంతకంటే ఎక్కువ దక్కదు. కానీ వారి నైపుణ్యము, కళా.. ఈ రెండూ ప్రత్యక్ష పరిగణనలోకి రావు.
మిల్లు చేసే పనికీ చేయి చేసే పనికీ ఉత్పత్తిలో తేడా ఉంటుంది. దాంతో మిల్లు నుంచి వచ్చేవి తక్కువ ధరకు వస్తాయి. ప్రస్తుతం చేతితో నేసే వస్త్రాలు సంప్రదాయ కార్యక్రమాలు, పెళ్లిళ్లకూ పరిమితమయ్యాయి. కొన్ని సందర్భాల్లో అక్కడా లేకుండా పోతున్నాయి. అయితే ప్రత్యేక అభిరుచి ఉన్నారు, వాటిని ట్రెండుగా చేసుకుంటున్నారు. అప్పుడు ఖరీదు కూడా బాగా ఉంటోంది. కానీ ఆ ఫలితం అందరికీ అందడం లేదు. ఆ గ్యాప్ ఎలా పూరించడం అనేదానిపైనే ఈ రంగం భవిష్యత్తు ఉంది. ప్రభుత్వం తాత్కాలిక ఏర్పాట్లు చేస్తూ ఉంది. శాశ్వత పరిష్కారాలు తమ దగ్గర ఉన్నాయంటున్నారు ఆ రంగంలో పనిచేసేవారు.

ఫొటో సోర్స్, RUBAIYAT BISWAS/BBC
చేనేత కార్మికులు ఎంత మంది?
తెలంగాణలో సుమారు 18-19 వేల మంది చేనేత కార్మికులు ఉంటారు. వీరికి అనుబంధంగా ఇతర పనులు చేసేవారు ఉంటారు. అంటే ఆసులు పోయడం, సైడింగ్ చేయడం, వార్పులు, ఇక్కత్ డిజైన్లు చేసేవారు ఉంటారు. వీరంతా కలపి 15-16 వేల మంది ఉండొచ్చని అంచనా. మొత్తం కలిపి 35 వేల మంది వరకూ చేనేతపై ఆధారపడి ఉంటారు. వీరిలో సగం పాత నల్లగొండ జిల్లాలోనే ఉంటారు. గద్వాల, నారాయణపేటల్లో కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. మిగిలిన వారు తెలంగాణ అంతా ఉన్నారు.
ఇక చేనేతతో సమానంగా మరమగ్గం నేత కార్మికులూ ఉన్నారు. ఒక్క సిరిసిల్లలోనే వీరు 34 వేలు ఉంటారని అంచనా. వీరికి అనుబంధంగా మరో 25 వేల మంది ఆధారపడ్డారని అంచనా. సిరిసిల్ల కార్మికులకు అనుబంధంగా పనిచేసే వారిలో చుట్టుపక్కల జిల్లాలతో పాటు, గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చే వారూ ఉన్నారు. సిరిసిల్లతో పాటు ఇతర పట్టణాల్లో కూడా పవర్ లూమ్స్ కొన్ని ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇక ఆంధ్రప్రదేశ్‌లో వీరి సంఖ్య ఎక్కువ. లక్షకుపైగా ఉంటారని ఒక అంచనా. శ్రీకాకుళం జిల్లా పొందూరు నుంచి అనంతపురం జిల్లా ధర్మవరం వరకూ అనేక ప్రాంతాల్లో వీరు విస్తరించి ఉన్నారు. ఒక అంచనా ప్రకారం ఏపీలో 94 వేల మంది కార్మికులు ఉన్నారు. వారు కాక అదనంగా మరో 70 వేల మంది అనుబంధ పనులు చేసేవారు ఉంటారు. ఇక పవర్ మెషీన్లు 7 వేల వరకూ ఉంటాయి. కరెంటు మెషీన్లు కోస్తాతో పోలిస్తే రాయలసీమలోని కడప, అనంతపురంలో ఎక్కువ. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రలో మరనేత తక్కువ.
సాధారణ రోజుల్లో ఒక నేత కార్మికుడు నెలకు 8 వేల నుంచి 15 వేల వరకూ సంపాదిస్తాడు. వీరి కంటే మరనేత కార్మికులు రెండు మూడు వేలు ఎక్కువ సంపాదిస్తారు.
కాగా, ఏపీలో మాస్కులకు కావల్సిన 1.5 కోట్ల మీటర్ల బట్ట ఆప్కో నుంచే కొన్నారు. కానీ దీనికి పూర్తి డబ్బు ఇవ్వలేదన్నది ఆరోపణ. దీనిపై అధికారులను బీబీసీ సంప్రదించింది, వారు ఇంకా స్పందించ లేదు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- సామాన్యుడి విజయాన్ని సహజంగా చూపించిన 'మల్లేశం'
- కరోనావైరస్: విదేశాల్లోని భారతీయుల తరలించేందుకు 'వందే భారత్ మిషన్' ప్రారంభం
- కరోనావైరస్: పుకార్లు, తప్పుడు సమాచారాన్ని వైరల్ చేసే మనుషులు ఏడు రకాలు
- కరోనావైరస్: తెలంగాణలో వలస కూలీల బతుకు బండి ఆగినా... రైలు బండి కదిలింది
- ఫేస్ మాస్కులు ధరించిన దేవుళ్లు: కరోనావైరస్ మీద జానపద చిత్రకారుల పోరు
- కరోనావైరస్తో మనుషులు చనిపోతుంటే... మరో వైపు మాఫియా డాన్లు ఏం చేస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








