కరోనావైరస్: తెలంగాణలో వలస కూలీల బతుకు బండి ఆగినా... రైలు బండి కదిలింది

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
చంకన చంటి బిడ్డలను వేసుకొని, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా, మండుటెండలో వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్న వలస కార్మికుల దృశ్యాలు గత నలభై రోజుల్లో ఎన్నో కనిపించాయి. నిండు గర్భీణులు, పండు ముసలివాళ్లు కూడా ఆ కార్మికుల్లో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో అలాంటి దృశ్యాలకు తెరపడే సమయం వచ్చింది.
గత వారం వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రైలును నడిపించడంతో ఇతర కార్మికుల్లో ఆశలు చిగురించాయి.
మే 1న కేంద్ర హోం శాఖ ఆదేశాలతో వలస కార్మికుల తరలింపునకు రైళ్ల ఏర్పాటు ప్రారంభమైంది. అదే రోజున 1230 మంది కార్మికులతో ఒక రైలు హైదరాబాద్ నుంచి ఝార్ఖండ్ బయల్దేరింది. ఆ తరువాత తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు 40 ప్రత్యేక రైళ్లను నడపుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. వలస కార్మికుల కోసం వారం పాటు వీటిని నడుపుతామని తెలిపింది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, దామరచర్ల వంటి ప్రాంతాల నుంచి బిహార్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు ఇవి ప్రయాణించి కూలీలను గమ్యస్థానాలకు చేరుస్తాయి.

సొంతూళ్లకు వెళ్లాలనుకునే వలస కార్మికుల వివరాలను నమోదు చేసే ప్రక్రియను ఇప్పటికే పోలీసు శాఖ ప్రారంభించింది.
"పొద్దున 10.30కి పోలీస్ స్టేషన్‌కి వచ్చాను. లైన్లో నిల్చున్నాను. నా కంటే ముందు 20 మంది ఉన్నారు. 11.30కి నా వంతు వచ్చింది. నేనెక్కడకు వెళ్లాలనుకుంటున్నాను.. అక్కడి అడ్రస్.. ఇక్కడ ఉంటోన్న అడ్రస్.. ఇలా అన్ని వివరాలనూ పోలీసులు తెలుసుకున్నారు. రైల్వే స్టేషన్ వరకూ వెళ్లడానికి మూమెంట్ పాస్ ఇచ్చారు. నా పేరు, వయసు, వెళ్లే రాష్ట్రం, సెల్ నంబర్ వారి దగ్గర ఉన్నాయి. మా ఫోన్‌కి అప్లికేషన్ నంబర్‌తో కూడిన ఒక మెసేజ్ వస్తుందని, తరువాత ఏం చేయాలనే వివరాలు కూడా వస్తాయని చెప్పారు. వాటికి ఆధారంగా మాకు కేటాయించిన సమయానికి స్టేషన్‌కు చేరుకోవాలి. దానికి కూడా బస్సులు ఏర్పాటు చేశారంట'' అంటూ ట్రెయిన్ పాస్ కోసం మంగళవారం హైదరాబాద్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర వేచి చూసిన బిహార్‌కి చెందిన ఒక వలస కార్మికుడు తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఇలా వందలాది కార్మికులు సొంతూళ్లకు వెళ్లడం కోసం పోలీస్ స్టేషన్‌లు, రెవెన్యూ కార్యాలయాల ముందు క్యూ కట్టిన దృశ్యాలు మంగళవారం హైదరాబాద్‌లో కనిపించాయి. కొన్ని పోలీస్ స్టేషన్ల దగ్గర జనం భారీ సంఖ్యలో చేరడంతో గందరగోళం నెలకొంది. కొన్ని చోట్ల ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం కోసం పోలీసులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఫంక్షన్ హాళ్లకు మార్చాల్సి వచ్చింది.

మంగళవారం తెల్లవారుజామున 1250 మంది వలస కార్మికులతో మొదట ఘట్‌కేసర్ నుంచి బిహార్‌లోని ఖగారియాకి ఒక ప్రత్యేక రైలు బయల్దేరింది. వీరిని ఆర్టీసీ బస్సుల్లో రైల్వే స్టేషన్‌కు చేర్చారు. తరువాత స్క్రీనింగ్ చేసి, శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించి రైల్లోకి అనుమతించారు. ప్రయాణంలో సరిపడా నీళ్లు, ఆహారాన్ని కూడా అందజేశారు.
ఇలా ఇప్పటి వరకూ వేర్వేరు రాష్ట్రాలకు మొత్తం 13 ప్రత్యేక రైళ్లు నడిపినట్టు కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం బిహార్‌కు 5 రైళ్లు, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌కు చెరో 2 రైళ్లు, రాజస్థాన్, ఝార్ఖండ్‌లకు చెరో రైలు వెళ్లినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రయాణ ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరించినట్టు చెప్పిన సీఎం, వలస కార్మికుల ప్రయాణాలకు డబ్బు వసూలు చేస్తున్న కేంద్ర విధానాలను తప్పుబట్టారు.
''తెలంగాణ ప్రభుత్వం ఈ రైళ్ల కోసం 4 కోట్లు ఖర్చు పెట్టింది. ముందుగా ప్రకటించిన 40 రైళ్లకు గాను ప్రస్తుతానికి 13 రైళ్లనే పంపగలిగాం. కానీ, వారిని కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలోకి తీసుకోవడానికి ఇబ్బందులున్నట్లు బిహార్, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఎక్కువ మంది జనం కోసం క్వారంటైన్‌కి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు చెప్పారు. ఇప్పటికే రోజుకు లక్ష మంది వరకూ కార్మికులు వస్తున్నట్టు ఆ రాష్ట్రాలు చెబుతున్నాయి'' అని కేసీఆర్ అన్నారు.

మంగళవారం సాయంత్రానికి దాదాపు లక్షన్నర మంది తమను సొంతూళ్లకు పంపమని కోరుతూ వివరాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇక్కడి నుంచి వెళ్లే కార్మికులే కాదు, తెలంగాణలో పనిచేయడానికి తిరిగొస్తున్న కార్మికులూ ఉన్నారు. ఇక్కడి రైసు మిల్లుల్లో పనిచేయడానికి బిహార్‌కు వెళ్లిన రైలులో 1200 మంది వస్తున్నట్లు సీఎం తెలిపారు.
మరోవైపు తెలంగాణలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంతో, నిర్మాణ రంగంలోని వలస కార్మికులు ఆ దిశగా పనుల కోసం ఎదురు చూస్తున్నారు. ''అనుమతులు రావడం సంతోషమే. కానీ ఇంకా మా సూపర్వైజర్లు మాకేం చెప్పలేదు. వాళ్ల సమాచారం కోసం ఓ రెండు రోజులు చూస్తాం. ఒకవేళ పోన్ చేస్తే మేం ఉండిపోవాలి. లేకపోతే ఇప్పుడు ఇంటికి వెళ్లిపోయి, అన్నీ సర్దుకున్నాక వస్తాం'' అన్నారు ఉత్తర ప్రదేశ్‌కి చెందిన రుక్మాన్.
అయితే, జ్యూస్ స్టాల్ నడిపే అమర్జీత్ లాంటి కొందరు మాత్రం ఊరికి వెళ్లిపోవడానికే మొగ్గు చూపుతున్నారు. ''పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. డబ్బులు అయిపోతున్నాయి. వెనక్కు వెళ్లి ఏం చేయగలమో చూడాలి. ఇంటికెళ్లినా పెద్దగా చేయడానికి ఏమీ లేదు. కానీ కనీసం ఇంట్లో వాళ్లను చూసుకోవచ్చు కదా. చాలా ఆందోళనగా ఉంది'' అన్నారాయన.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- లాక్డౌన్ సడలింపు: ఏపీలో మద్యం షాపుల ముందు భారీగా క్యూలు... ఇతర దుకాణాలు తెరవడంపై గందరగోళం
- అమెరికాలో కరోనావైరస్ వల్ల కనీసం 1,00,000 మంది చనిపోతారు: డోనల్డ్ ట్రంప్
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్ మరింత బలపడతాయా?
- కరోనావైరస్ లాక్డౌన్: దేశంలో నిరుద్యోగం, పేదరికం విపరీతంగా పెరిగిపోతాయా? సీఎంఐఈ నివేదిక ఏం చెప్తోంది?
- చైనాలో యాంటీ వైరస్ కార్లు నిజమా? గిమ్మిక్కా?
- ఫేస్ మాస్కులు ధరించిన దేవుళ్లు: కరోనావైరస్ మీద జానపద చిత్రకారుల పోరు
- కరోనావైరస్ లాక్డౌన్: విమాన, రైల్వే ప్రయాణాలకు రంగం సిద్ధం... 'ఈ నెలలోనే సేవలు ప్రారంభం'
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత తయారీ రంగంలో చైనా స్థానాన్ని భారత్ భర్తీ చేస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








