కరోనావైరస్: భయం, అభద్రతల మధ్య ఆశావర్కర్ల జీవితాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చింకీ సిన్హా
- హోదా, కాండ్లా, శామలి
దేశంలోని 130 కోట్ల మంది ప్రజల్ని కరోనావైరస్ మహమ్మారి భయపెడుతున్న సమయంలో మేం ఉన్నాం అంటూ భరోసా ఇస్తున్నారు లక్షలాది మంది మహిళలు. నిత్యం ఇంటింటికీ తిరుగుతూ జనం బాగోగుల్ని కనుక్కుంటూ తగిన జాగ్రత్తలు, సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అవసరమైన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కోవిడ్-19 పోరాటంలో తగిన ఆయుధాలు లేకపోయినా సరే తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ జనం కోసం పోరాడుతున్నారు. అలాంటి ఓ ఆశా వర్కర్ కథ ఇది.
గ్రామానికి తిరిగి వచ్చిన వారి సంరక్షణ
ముఖానికి మాస్కు... పాదాల నుంచి భుజాల వరకు కప్పుకున్న ఆప్రాన్.. తలపై రక్షణగా టోపీ ధరించిన డాక్టర్ అమరేశ్ తోమర్ శనివారం ఉదయం కాంఢ్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో హడావుడిగా అడుగుపెట్టారు.
గడిచిన రెండు రోజుల్లో తమ ఆస్పత్రి పరిధిలోని రెండు గ్రామాల్లో ముగ్గురు వలస కార్మికులు తిరిగి వచ్చారని ఆశా వర్కర్లు సమాచారం అందించినట్లు ఆమె తన సిబ్బందికి చెప్పారు.
నిజానికి వారిని స్వీయ ఐసోలేషన్లో ఉండాలని సూచించినప్పటికీ వారి శరీర ఉష్ణోగ్రత తదితర ఆరోగ్య వివరాలను డాక్టర్ తోమర్ సేకరించాల్సి ఉంది. మొత్తం 24 గ్రామాలను పర్యవేక్షించడం ఆమె విధి.

ఫొటో సోర్స్, Getty Images
షమ్లీ జిల్లాలో మొదట 17 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఉన్నట్లు భావించారు. కానీ చివరకు 13 కేసులు మాత్రమేనని తేలింది.
ఆరోగ్య కేంద్రం వద్ద ఒక హోర్గింగ్ ఏర్పాటు చేశారు.

ఆ ఆరోగ్య కేంద్రంలో కరోనావైరస్ నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల బోర్డు ఓ వైపు, కోవిడ్-19 వ్యాధి లక్షణాలు, సంప్రదించాల్సిన ఆరోగ్య శాఖాధికారుల ఫోన్ నెంబర్లు మరోవైపు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
శనివారం ఉదయం పెద్దగా రోగులు రాలేదు. ఎక్కడ వైరస్ తమకు వ్యాపిస్తుందోనన్న భయం వారిని ఇంటి వద్దే కట్టిపడేసింది. మరోవైపు తగిన సమయం లేదంటూ మా ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు అక్కడ ఉన్న ఓ డాక్టర్ నిరాకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
కాండ్లా ఎందుకు వార్తల్లోకెక్కింది...
కాంఢ్లా, ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌కు 80 కిలోమీటర్ల దూరంలోనూ, ముజఫ్పర్ నగర్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న పట్టణం. నిజానికి కరోనావైరస్ నుంచి తప్పించుకోగల్గింది కానీ తబ్లిగీ జమాత్ చీఫ్ మహమ్మద్ సాద్‌కు కళ్లు చెదిరే ఫాంహౌజ్ అక్కడే ఉండటంతో వార్తల్లోంచి తప్పించుకోలేకపోయింది.
మార్చిలోని దేశ రాజధాని దిల్లీలో ఆ సంస్థ ఏర్పాటు చేసిన మత సమావేశాల కారణంగా హెడ్ లైన్స్ లో నిలిచింది.
అంతంత మాత్రంగా ఉండే వైద్యులు, అక్కడక్కడ ఉండే ఆస్పత్రుల కారణంగా కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ పరిస్థితి జబ్బుపడి మంచంపై ఉన్నట్టు ఉంది. అయితే ఈ మహమ్మారి గురించి జనాలకు వివరించేందుకు ఆశావర్కర్లు అలాగే ఇతర సామాజిక ఆరోగ్య కార్యకర్తల్ని ప్రభుత్వం వినియోగిస్తోంది.
ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తూ, వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే తమకు తగిన రక్షణ సామాగ్రి సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని వారు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాదకరంగా మారిన పని
ఒక్కసారిగా తోమర్ చేస్తున్న ఉద్యోగం ప్రమాదకరంగా మారింది. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు రక్షణ సామాగ్రి కూడా తగినంతగా లేనప్పుడు అది మరింత ప్రమాదకరమవుతుంది. ఈ పరిస్థితుల్లో లక్షలాది మంది ఆరోగ్య కార్యకర్తలు తమ విధుల్లో భాగంగా నేరుగా రోగుల వద్దకు వెళ్తుండటంతో వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది.
బయట ఓ యువకుడు ముఖానికి నల్ల ముసుగు వేసుకున్న ఓ వృద్ధుణ్ణి బండిపై లాగుతూ వెళ్తున్నాడు. యూపీలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఆ పట్టణం నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ఇవి ప్రమాదకర సంకేతాలని ఆమె వ్యాఖ్యానించారు.
2011లోనే షామిలీని జిల్లాగా ప్రకటించారు. కానీ తగినంత మంది వైద్యులు, సౌకర్యాలు లేకపోవడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రి పని చేయడంలేదు. 2015లోనే ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తగినన్ని నిధులు లేక నత్తనడకన పనులు సాగాయి. 2020 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
దీంతో ఆజిల్లాకు చెందిన రోగుల్ని అటు మీరట్ లేదా ఇటు ముజఫ్పరాబాద్ జిల్లా ఆస్పత్రులకు పంపిస్తూ ఉంటారు. ఇక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రత్యేక వైద్య నిపుణులు అంటే జనరల్ సర్జన్, ఫిజీషియన్, కార్డియాలజిస్ట్, రేడియాలజిస్ట్ వంటి వేర్వేరు విభాగాలకు సంబంధించిన వైద్యులు ఉండరు.
కేంద్ర ఆరోగ్య శాఖ ప్రమాణాల ప్రకారం జిల్లా ఆస్పత్రులలో నలుగురు వైద్యులు, ఇద్దరు ఫిజీషియన్లు, ఇద్దరు శస్త్ర చికిత్స నిపుణులు, ఇద్దరు ఆర్థోపెడిక్ సర్జన్లు, ఒక ఈఎన్టీ సర్జన్, డెంటిస్ట్, ఇద్దరు మహిళా వైద్యులు, ఒక పేతాలజిస్ట్, ఇద్దరు చిన్నపిల్లల వైద్య నిపుణులు, ఇద్దరు ఎక్స్ రే వైద్యులు, అలాగే 20 మంది స్టాఫ్ నర్సులు,12 మంది వార్డు బాయ్స్, ఆరుగురు స్వీపర్లు తదితర సిబ్బంది ఉండాలి.
2011 జనాభా లెక్కల ప్రకారం కాంఢ్లా నగర పాలిక పరిషత్లోని జనాభా 46,796.

ఫొటో సోర్స్, Getty Images
వ్యక్తిగత సంరక్షణ సమస్య
వ్యక్తిగత రక్షణ విషయానికొస్తే ఇప్పటికీ కొందరు మాత్రమే కచ్చితంగా పాటిస్తున్నారు. ఫలితంగా ఈ ప్రాణాంతక వ్యాధి వ్యాప్తిని నిరోధించడంలో ముందుండి పోరాడే తమలాంటి వారిలో తీవ్ర భయం నెలకొందని డాక్టర్ తోమర్ అన్నారు.
ఆమె బ్యాగులో రెండు చిన్న ప్లాస్టిక్ పెట్టెలున్నాయి. అందులో రెండు ఎన్-95 మాస్కులు ఒక సర్జికల్ మాస్కు ఉన్నాయి.
"అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయని నేను నా సొంత డబ్బులు పెట్టి కొనుకున్నాను" అని ఆమె చెప్పారు.
కరోనాపై యుద్ధంలో తమను ఓ వైపు యోధులుగా కీర్తిస్తున్నారు. కానీ ఈ యుద్ధం చేసేందుకు ఆయధాలైన పీపీఈ కిట్లు, శానిటైజర్ల కొరత మాత్రం తీవ్రంగా ఉందంటూ దేశ వ్యాప్తంగా అనేక మంది వైద్యుల నుంచి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
లాక్‌డౌన్ సమయంలో ఆరోగ్య సేవల మెరుగుదల
వ్యాధి తీవ్రతను తగ్గించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి సొంతూళ్లకు తిరిగి వలసలు కొనసాగుతునే ఉన్నాయి. మరోవైపు వైద్య సౌకర్యాలను మెరుగుపరిచే ప్రయత్నాలను వేగవంతం చేసింది ప్రభుత్వం. ముఖ్యంగా వెంటిలేటర్ల కొరతను తీర్చేందుకు, అత్యవసర వైద్య సేవలకు అవసరమయ్యే పరికరాలను తగినంతగా సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
షామ్లీ జిల్లాలో వెంటిలేటర్ల సౌకర్యం లేదు. దీంతో రోగుల్ని 16కిలోమీటర్ల దూరంలో ఉన్న ముజఫ్పర్నగర్కు పంపుతుంటారు. అక్కడ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో బెగ్రాజ్పూర్ వైద్య కళాశాల నుంచి, అలాగే జిల్లా మహిళా ఆస్పత్రి నుంచి సేకరించిన 14 వెంటిలేటర్లు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
పల్స్ పోలియో కార్యక్రమం
అనేక సవాళ్లు ఉన్నప్పటికీ తాము పోలియో నిర్మూలనకు 1995లో చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా పాటించిన విధానాల్ని తిరిగి ఇప్పుడు అమలు చేసేందుకు సిద్ధమయ్యామని ముజఫ్ఫర్నగర్లోని జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ ప్రవీణ్ చోప్రా చెప్పారు.
ఆ సమయంలో ఎటువంటి పోలియో కేసు వచ్చినా వెంటనే తగిన విధంగా స్పందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సత్వరం స్పందించే బృందాలను(రాపిడ్ యాక్షన్ టీంలు) ఏర్పాటు చేశాయి. స్థానిక సామాజిక ఆరోగ్య కార్యకర్తల సాయంతో నిర్ధిష్ట ప్రదేశాలను గుర్తించి తగిన ప్రణాళికల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి పని చేయడం ద్వారా 2011 నాటికి భారత్ను పోలియో రహిత దేశంగా మార్చారు.
"వ్యాధి ప్రభావిత ప్రాంతాలను మేం గుర్తించాం." అని డాక్టర్ ప్రవీణ్ చోప్రా తెలిపారు. ముజఫ్పర్ నగర్లో మొత్తం 19 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.
"లెక్కలేనన్ని సవాళ్లు ఉన్నాయి. చాలా భయం నెలకొని ఉంది. అందరూ మిగిలిన వ్యాధులన్నింటినీ మర్చిపోయారు. ఆందోళనలు పెరిగిపోయాయి. ఫలితంగా మాపై పని భారం కూడా పెరిగింది." అని ఆయన అన్నారు.
ముజఫ్పర్ నగర్, షాహరాన్ పూర్, మీరట్ సరిహద్దుల్లో ఈ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
"వ్యాధి మమ్మల్ని చుట్టు ముట్టింది. మేం మరింత జాగ్రత్తగా ఉండాలి. సరిహద్దుల్ని మూసివేశాం. సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. పరీక్షలు చేస్తున్నారు" అని డాక్టర్ ప్రవీణ్ చోప్రా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పల్లెల్లో డాక్టర్ల కొరత
కాంఢ్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది కొరత మిగిలిన అంశాలతో పోల్చితే తీవ్ర ఆందోళన కల్గిస్తోందని డాక్టర్ తోమర్ అన్నారు. దేవుడి దయ వల్ల వ్యాధి ఈ ప్రాంతాలకు ఇంకా వ్యాపించలేదు. అటువంటి పరిస్థితే తలెత్తితే ఎదుర్కోవడం చాలా కష్టమని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రతి పదివేల మంది జనాభాకు 22.8 మంది వైద్యులు, నర్సులు ఉండాలి. భారత్లో కోవిడ్-19 తీవ్రంగా విజృంభిస్తున్న ఈ సమయంలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అంతంత మాత్రం వైద్య సిబ్బంది సేవలు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి.
గుర్గ్రామ్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన పరిశోధన ప్రకారం దేశంలోని 71శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటుండగా, వైద్యులు, నర్సుల శాతం మాత్రం వరుసగా 34, 33 శాతం ఉంటోంది. సుమారు 80 శాతం మంది వైద్యులు, 70 శాతం మంది పారా మెడికల్ సిబ్బంది ప్రైవేటు రంగంలోనే పని చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నేషనల్ రూరల్ హెల్త్ మిషన్(NRHM) నేతృత్వంలో భారత్లోని గ్రామీణ ప్రాంతాల్లో మూడంచెల వైద్య వ్యవస్థ అమలులో ఉంది. ఈ వ్యవస్థలో ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం 48 శాతం మంది వలసదారులు దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన దిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లోనే ఉంటున్నారు.
2018-19 ఆర్థిక సర్వే ప్రకారం దేశంలోని 60 శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఒకే ఒక్క డాక్టర్ ఉంటున్నారు. 5 శాతం ఆస్పత్రులలో అది కూడా లేదు. దేశ వ్యాప్తంగా సుమారు 22 నుంచి 30 శాతం వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కొరత ఉంది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్, ఉత్తర ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్రమైన కొరత నెలకొంది.

ఫొటో సోర్స్, Getty Images
గ్రామాల్లో రాజ్యమేలుతున్న మౌనం
ఓ వైపు చెరకు తోటలు, మరోవైపు ఇటుక బట్టీల పొగ, మధ్యలో దుమ్ము తేలే రోడ్డుపై డాక్టర్ తోమర్ కారు ప్రయాణిస్తోంది. ఆమె కివనా అనే ఓ చిన్న గ్రామంలో ముందు ఓ సర్పంచ్ ఇంటి వద్ద ఆగాల్సి ఉంది.
అక్కడే ఈ ఏడాది ఏప్రిల్లో చేరిన 24 ఏళ్ల డాక్టర్ ప్రవీణ్ చౌదరినీ కలవాలని స్థానిక ఆశా కార్యకర్తలు తోమర్కు సమాచారమిచ్చారు. ఆ ఊరిలో ఎటు చూసినా నిశ్శబ్దం అలమకుంది. కనీసం కుక్కలు కూడా మొరగడం లేదు.

53ఏళ్ల తోమర్ తన వివాహం అనంతరం 1993లో కాంఢ్లా వచ్చారు. ఏడేళ్ల క్రితం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేరారు. తగిన ముందు జాగ్రత్తలు తీసుకున్నందున తనకెలాంటి భయం లేదని ఆమె చెప్పారు.
"తమ వృత్తి నిర్వహణలో భాగంగా ఇవన్నీ చేయాల్సిందే" అని ఆమె అన్నారు.
ఈ ప్రాంతంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. జసలా గ్రామంలో గత ఏడాదే 8వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మించారు. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభించారు. అయితే ఇప్పుడు కరోనా సంక్షోభం చుట్టు ముట్టిన ఈ పరిస్థితుల్లో ఇంకా ఆ 30 పడకలున్న ఆస్పత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంది.

అయితే డాక్టర్ తోమర్ మాత్రం తన ముందున్న సవాళ్ల గురించి పట్టించుకోదలచుకోలేదు.
"నేను ఇప్పుడు ఉన్న లోపాలను ఎత్తి చూపాలనుకోవడం లేదు. ఎందుకంటే అది మా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. జనంలో తీవ్రమైన భయాందోళనలు ఉన్న ఈ పరిస్థితుల్లో వారిని క్వారంటైన్ సెంటర్లకు పంపించడం అంత సులభమేం కాదు." అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాదకర పరిస్థితుల్లో ఒంటరి జీవితం
మొత్తం 24 గ్రామాలు ఆమె పర్యవేక్షణలో ఉంటాయి. వ్యాధి బారిన పడిన వారిని ఆమె కలవాల్సి ఉంటుంది. అందుకే ఆమె తన ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. ఆమె ముగ్గురు పిల్లలు తోమర్కు ఈ విషయంలో పూర్తిగా సహకరిస్తున్నారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఆమె అన్ని గ్రామాలకు వెళ్తూ వస్తున్నారు. అందుకే తనకు సంబంధించిన వస్తువులన్నింటిని ఓ ప్రత్యేకమైన గదిలో ఉంచుకున్నారు. ఆ గదికి ప్రత్యేక ద్వారం, శౌచాలయ సదుపాయాలు కూడా ఉంది.
"నా గదికి హాలుకు మధ్య ఉన్న అద్దం ద్వారా నా కుటుంబ సభ్యులను, అప్పుడప్పుడు టీవీని చూస్తుంటాను" అని తోమర్ చెప్పారు.
ఆమెకు భోజనాన్ని గది ద్వారం దగ్గర పెడతారు. గడిచిన కొద్ది రోజులుగా తన కుమార్తె ఆత్మీయ ఆలింగనం తనకు కరవయ్యిందని ఆమె చెప్పినప్పుడు ఆమె గొంతు జీరబోయింది.

ఫొటో సోర్స్, Bhumika Rai
శనివారం మొత్తం నాలుగు ఊళ్లు తిరగాలి. అందుకే భోజనాన్ని కూడా తనతో పాటే తీసుకెళ్లారు.
కివనా గ్రామానికి చెందిన 60 ఏళ్ల శివకుమార్ తమ గ్రామంలోకి తిరిగి వచ్చిన వలస కార్మికులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంలో ముందుంటారు. లాక్ డౌన్ ప్రకటించిన తరువాత కాంఢ్లా బ్లాకులోని 35 గ్రామాలకు చెందిన సర్పంచ్లతో ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు.
కోవిడ్-19 కేసులు, అలాగే ఆహార వస్తువుల సరఫరా తదితర సమాచారాన్ని జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అందిస్తూ స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ ఉంటారు. కివాన గ్రామంలో సుమారు 6,000 జనాభా ఉంటుంది.
"మమ్మల్ని మేం ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది" అని శివకుమార్ చెప్పారు.

ఆయన పక్కనే 31 ఏళ్ల పింకి దేవి ముఖానికి మాస్కు ధరించి ఉన్నారు. ఆమె ఆ గ్రామంలో ఆశా కార్యకర్తగా పని చేస్తున్నారు. ఊళ్లో జరుగుతున్న సర్వే, స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణలో ఆమె కూడా పాలుపంచుకుంటున్నారు.
వారు తమ సర్వే ప్రారంభించిన మొదట్లో ఒక్కొక్కరికీ ఒక్కో మాస్కు ఇచ్చారు. కానీ ఇప్పుడు వాళ్లు తమ చీర కొంగులను, చున్నీలనే మాస్కులుగా చుట్టుకొని ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాల్సి వస్తోంది. అలాగే చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలని, సామాజిక దూరాన్ని పాటించాలని అందరికీ సూచిస్తున్నారు. రోజూ నలుగురితో కూడిన ఆశా వర్కర్ల బృందం 50 ఇళ్లలో సర్వే నిర్వహించాలి.

ఫొటో సోర్స్, Getty Images
"మేం తలుపుల్ని ముట్టుకోం. ఒక వేళ వారింట్లో ప్రత్యేకంగా ఓ గది లేనట్టయితే స్థానిక పాఠశాలలో క్వారంటైన్లో ఉండమని చెబుతాం. మేం పదే పదే మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చిందా ? దగ్గు ఉందా అని ప్రశ్నిస్తుంటే కొందరు జనం ఆగ్రహిస్తున్నారు కూడా. కానీ మేం చేస్తున్న పని ఎంత ముఖ్యమో మాకు తెలుసు" అని పింకి దేవి చెప్పారు.
వాళ్లు డాక్టర్ తోమర్తో కలసి దేవేందర్ మాలిక్ ఇంటికి వెళ్లారు. 50 ఏళ్ల దేవేందర్ రెండు రోజుల క్రితం బిహార్లోని భాగల్పూర్ నుంచి కివనా గ్రామానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన ఇంటి వద్ద లేరు.

గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ పొలాల్లో పని చేశానని ఆయన చెప్పారు. కానీ డాక్టర్ తోమర్ మాత్రం ఆయన్ను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. శనివారం నాటికి ఆయన శరీర ఉష్ణోగ్రత 97.5 డిగ్రీల ఫారన్ హీట్ ఉంది. తనకు ఎలాంటి లక్షణాలు లేవని ఆయన అన్నారు.
పింకి, రవిత, సునిత ముగ్గురు ఆశా కార్యకర్తలు వారి ఇంటి ముందు నిల్చొని ఎప్పటిలాగే తాము చెప్పాల్సిన సూచనలను మరోసారి వారికి వివరించారు.
తరువాత వాళ్లు వెళ్లాల్సిన ఊరు రాంపూర్ ఖేరి. ఆ ఊరిలో ఇటీవలే పంజాబ్ నుంచి ఒకరు, దిల్లీ నుంచి ఒకరు వచ్చినట్టు ఆశా వర్కర్లు సమాచారమిచ్చారు.
దారిలో అక్కడక్కడ ఇటుక బట్టీలు కనిపించాయి. మిగిలిన ప్రపంచంతో సంబంధం లేకుండా పని చేస్తున్న కొంత మంది వ్యక్తులు అక్కడ కనిపించారు. అక్కడకు ఆశా వర్కర్లు కానీ, వైద్యులు కానీ వెళ్లరు. ప్రజా పంపిణీ వ్యవస్థ వంటి పథకాలు వారికి వర్తించవు. నిత్యవసరాలను అధిక ధరలకు కొనుక్కోవాల్సి వస్తోందని కొందరు చెప్పారు. కానీ వారికి అంతకన్నా మరో దారి లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర ప్రదేశ్ లోని ప్రతాప్‌ఘర్‌కు చెందిన రామ్ కిషన్ గడిచిన పదేళ్లుగా చౌదరీ ఇటుక బట్టీలో పని చేస్తున్నారు.
"ఈ వ్యాధి గురించి విన్నప్పటి నుంచి సామాజిక దూరం పాటించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరు మా వద్దకు రాలేదు." అని అక్కడ పని చేస్తున్న ఓ 30 ఏళ్ల వ్యక్తి మాతో చెప్పారు.
అదే గ్రామంలో 36 ఏళ్ల మంజు గోస్వామి.. డాక్టర్ తోమర్ కోసం వేచి చూస్తూ ఇంటి బయట నిల్చున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సుమారు 3 రోజుల సైకిల్ ప్రయాణం తర్వాత పంజాబ్ నుంచి ఏప్రిల్ 24న హోషియార్పూర్ చేరుకున్నారు 30 ఏళ్ల జానీ. ఆయన పంజాబ్లోని బెల్లం తయారీ కేంద్రాల్లో పని చేసేవారు. లాక్ డౌన్ తర్వాత చేయడానికి పని లేకుండా పోయింది. కొన్నాళ్ల పాటు ఆకలితో పోరాడిన తర్వాత మరో దారి లేక సొంత ఊరికి బయల్దేరారు.
ఆయనకు పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ ఇంట్లో ఓ వ్యక్తిని హౌజ్ క్వారంటైన్లో ఉంచినట్టు తెలుపుతూ ఓ నోటీసును ఆ ఇంటి గోడకు అతికించారు. అలాగే ఏప్రిల్ 22న దిల్లీ నుంచి వచ్చిన 22 ఏళ్ల మొహిత్ గిరిని కూడా ఇంటికే పరిమితం కావాలని ఆశా వర్కర్లు సూచించారు.

ఇటువంటి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విధులను నిర్వహించడం తనకు చాలా గర్వంగా ఉందని 30 ఏళ్ల మోనిక అన్నారు. ఆమె నాలుగేళ్లుగా ఆశా కార్యకర్తగా పని చేస్తున్నారు.
"మేం జనాలకు వీలైనంత అవగాహన కల్గిస్తున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మేం వారధులం. కచ్చితంగా కరోనాపై జరుగుతున్న పోరాటంలో విజయం సాధిస్తాం" అని ఆమె అన్నారు.
పెద్ద బాధ్యత... చిన్న జీతం
ఆశా కార్యకర్తలకు నెలకు సమారు రూ.2 వేల నుంచి రూ3 వేలు వరకు ఇస్తారు. ఈ కరోనావైరస్ సంక్షోభ సమయంలో అదనంగా మరో వెయ్యి రూపాయలు ఇస్తారు.
వాళ్లను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించరు. కొన్ని పరిమితులకు లోబడే వారి నియామకం ఉంటుంది. గర్భిణిలకు సంబంధించిన వివరాల నుంచి జనన, మరణాల వరకు అన్ని వివరాలను వారు సేకరిస్తారు. ఓ రకంగా కమ్యూనిటీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్కు వీరు అనుబంధంగా ఉంటారు. ఈ మహమ్మారి సమయంలో వారు రోజుకు ఐదారు గంటలు క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉంటుంది.

అదే సమయంలో వైద్యులకు 50 వేల రూపాయలు చెల్లిస్తున్న ప్రభుత్వాలు కనీసం అందులో పది శాతం కూడా ఆశా కార్యకర్తలకు చెల్లించడం లేదు. నిజానికి వారు అందించే నివేదికలు లేకుండా వైద్యులు క్షేత్ర స్థాయిలో ఏమీ చేయలేరు.
ఆశా వర్కర్లు వ్యాధి బారిన పడిన వారికి స్టాంప్ వేసి వారిని క్వారంటైన్కు పంపించాల్సి ఉంటుంది. అంటే వారు కచ్చితంగా కరోనావైరస్ సోకిన వారిని కలవాల్సిందే. ఆశా వర్కర్లు వివరాలు సేకరించడం చూసి ఆ వివరాలు ఎన్ఆర్సీ జాబితా కోసమని భావించి కొన్ని ప్రాంతాలలో వారి రాకను అడ్డుకుంటున్నారని డాక్టర్ తోమర్ చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యిమందికి ఒక ఆశా కార్యకర్త ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 15వేల మందికి ఒక ఆశా కార్యకర్త ఉన్నారు.
కాంఢ్లా లోని దెహత్ ప్రాంతంలో 33 ఏళ్ల ముర్షీదా బేగమ్ ఆశా కార్యకర్తగా పని చేస్తున్నారు. "మాకు ఒక్క మాస్కు ఇచ్చారు. ఏప్రిల్ 15-17 మధ్యలో మేం కరోనాకు సంబంధించిన సర్వే చేశాం. ఇప్పుడు గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం" అని ఆమె చెప్పారు. ఆమె నెల వేతనం రూ. 2 వేలు.
"మాపై పని భారం పెరిగింది. మాకు మాస్కులు లేవు. జనం మమ్మల్ని మాస్కులు అడుగుతున్నారు. మందులు అడుగుతున్నారు. మాకు భయం వేస్తోంది. మేం కలిసికట్టుగా వెళ్తున్నాం. రోజూ వస్తున్న వార్తలు మమ్మల్ని భయపెడుతున్నాయి. నేను 100 ఇళ్లలో సర్వే నిర్వహించాను." అని ఆమె చెప్పారు.
మొదట్లో మాస్కులు లేకుండానే తిరిగామని మరో ఆశా కార్యకర్త సునితా కుమారి చెప్పారు. ఆ తర్వాత తమకు మాస్కులు ఇచ్చారని అన్నారు.
కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో మార్చి 30న న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ ఓ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా అనుకోకుండా కరోనావైరస్ బారిన పడటం వల్ల తలెత్తే సమస్యల కారణంగా మరణించినప్పుడు తమ బీమా వర్తిస్తుందని పేర్కొంది. కానీ వ్యాధి బారిన పడి మంచం పడితే మాత్రం ఈ బీమా వర్తించదు.

కోవిడ్-19 వ్యాధికి సంబంధించిన పరీక్షలు నిర్వహించేందుకు, వ్యాధి బారిన పడ్డవారిని గుర్తించేందుకు ప్రభుత్వం ఈ ఆశా కమ్యూనిటీ వర్కర్లను వినియోగిస్తోంది.
వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్గించేందుకు, వ్యాధి లక్షణాలను గుర్తించి తగిన సలహాలు, ముందు జాగ్రత్తలను సూచించేందుకు దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 9 లక్షల మంది ఆశా కార్యకర్తలను వినియోగిస్తున్నాయి. వాళ్లు ఎప్పటికప్పుడు రోగులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంటారు. అలాగే విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వారి వివరాలను కూడా అధికారులకు అందజేస్తుంటారు.
ఆశా వర్కర్లకు నెల నెలా ఇచ్చే వేతనంతో పాటు ప్రసవ సమయంలో, ప్రసవానంతరం అందించే సేవలకు గానూ ప్రోత్సాహకం పేరిట రూ. 150 నుంచి రూ.300 వరకు ప్రభుత్వాలు అందిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిడి కారణంగా ఆరోగ్య వ్యవస్థలోని లోపాలపై మాట్లాడేందుకు వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది నిరాకరిస్తుంటారు.
32 ఏళ్ల రోహిణి పవార్ మహారాష్ట్రలోని వాల్హే గ్రామంలో ఆశా కార్యకర్తగా పని చేస్తున్నారు. ఈ పని చెయ్యడం పట్ల తన సామాజిక వర్గం వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆమె తన విధుల్ని నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్లో ఆమె ప్రాంతానికి చెందిన ఆశా కార్యకర్తలు తమకు మెరుగైన వేతనాలు ఇవ్వాలంటూ ఉద్యమం చేశారు.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ఏడాది మార్చి నెల మొదట్లోనే సర్వే నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ సమయంలో వారికి కనీసం మాస్కులను కూడా సర్కారు సమకూర్చలేదు. ఏప్రిల్ 2న వీడియో కాల్ ద్వారా శిక్షణ ఇచ్చారు. మీ ఇంట్లో ఎవరైనా విదేశాల నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారా? ఎవరికైనా జ్వరం, దగ్గు ఉన్నాయా..? ఇలాంటి ప్రశ్నలు వారు ఇంటింటికీ వెళ్లి అడగాల్సి ఉంటుంది.
"మాకు అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు కనిపిస్తే వెంటనే గ్రామ పంచాయతీకి మేం ఆ వివరాలను అందజేయాలి. రోజూ 30 ఇళ్లను సర్వే చేయాలి. అంటే సుమారు వంద మందితో మాట్లాడాలి. రెండు నెలలుగా మేం రోజూ సర్వేలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ప్రతి వెయ్యి మందికి ఓ ఆశా వర్కర్ ఉన్నారని చెబుతున్నప్పటికీ నా పర్యవేక్షణలో 1500 మంది ఉన్నారు" అని రోహిణి చెప్పారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?

మార్చి 15న వారు తమకు అప్పగించిన బాధ్యతల్ని మొదలు పెట్టే సమయంలో జిల్లా ఆస్పత్రి వర్గాలు నాలుగు వాడి పారేసే మాస్కులను ఇవ్వగా, గ్రామ పంచాయతీ ఒక మాస్కును ఇచ్చింది. రెండు సీసాల శానిటైజర్లు కూడా ఇచ్చారు.
పూణె, ముంబైలో పని చేస్తున్న చాలా మంది వాలే గ్రామానికి తిరిగి వచ్చారు. ఇది వ్యవసాయ పనుల కాలం కావడంతో రాత్రి పూట వారు ఇంటికి చేరిన తర్వాత వెళ్లి సర్వే చేయాల్సి వస్తోంది. తనతో పాటు తన భర్తను కూడా తీసుకెళ్తుంటానని రోహిణి అన్నారు.
తమ గురించి ప్రభుత్వానికి వివరాలను అందిస్తూ తమను క్వారంటైన్కు తరలించడానికి కారణమవుతున్నారన్న నెపంతో తమ సొంత సామాజిక వర్గానికి చెందిన వారే కొంత మంది ఆశా వర్కర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"ఇంటి దగ్గర నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటోంది. చాలా భయం వేస్తోంది. ఆశా కార్యకర్తలందరూ ఆందోళన చెందుతున్నారు. మేం ఈ పనిని వదిలేస్తే ఇబ్బందుల్లో పడతాం. అందుకే ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ పని చేస్తున్నాం. ప్రతి రోజూ ఇక్కడ సమాచారాన్ని ప్రభుత్వాధికారులకు అందిస్తుంటాం. మాకు కుట్టిన మాస్కులను ఇచ్చారు" అని రోహిణి తెలిపారు.
అంతంత మాత్రం జీతం కోసం రోజూ కిలోమీటర్ల దూరం నడుస్తూ జీవితాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నావంటూ తన కుటుంబ సభ్యుల ఎత్తి పొడుపు మాటల్ని భరించాల్సి వస్తోందని అన్నారు.
"మూడేళ్ల నా బిడ్డను ఎత్తుకోలేకపోతున్నాను కూడా..." అని రోహిణి ఆవేదన వ్యక్తం చేశారు.
2010లో ఆమె ఈ ఉద్యోగంలో చేరిన కొత్తలో నెలకు రూ. 100 ఇచ్చేవారు. ప్రస్తుత పరిస్థితులతో పోల్చితే ఇప్పుడు ఇచ్చే వేతనం గొప్పగా ఏం లేదు. కానీ ఇది.. ఫిర్యాదులు చెయ్యాల్సిన సమయం కాదు. ఎందుకంటే ఎంతో మంది ప్రాణాలను మేం కాపాడాలి అని రోహిణి స్పష్టం చేశారు.
విదేశీ ప్రయాణాలు చేసిన చరిత్ర ఉన్నవాళ్లకు, అలాగే వ్యాధి బారిన పడిన వారికి మాత్రమే కోవిడ్-19 పరీక్షలు చేయాలని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ పరిమితులు విధించింది. అయితే మార్చి 20 నుంచి ఆ పరిమితుల్ని సడలిస్తూ తీవ్రమైన శ్వాస కోశ వ్యాధులు, జ్వరం, దగ్గు లేదా జ్వరం, శ్వాస పీల్చడంలో ఇబ్బందుల కారణంగా ఆస్పత్రులో చేరిన వారికి కూడా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
లాక్ డౌన్ విధించిన మొదట్లో లక్షలాది మంది వలస కార్మికులు తిరిగి తమ స్వస్థలాలకు కాలి నడకనే పయనమయ్యారు. దీంతో ప్రతి జిల్లాలోని పంచాయతీ అభివృద్ధి శాఖ వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిన వారి వివరాలను అందజేయాలని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య విభాగం ఆదేశించింది. ఆ వివరాలను ప్రతి జిల్లా ముఖ్య వైద్యశాఖాధికారికి, అలాగే వారి నుంచి ఆశా కార్యకర్తలకు అందించి ఆ వలస వెళ్లిన వారిని ఎప్పటికప్పుడు ట్రాక్ చెయ్యాలని ఉత్తర్వులు జారీ చేసింది.
1978 సెప్టెంబర్లో భారత్ అల్మ అట ఒప్పందంపై సంతకం చేసింది. "2000 సంవత్సరం నాటికి అందరికీ ఆరోగ్యం" అన్నది ఆ ఒప్పందం లక్ష్యం. అంటే కేవలం ఆరోగ్య రక్షణ మాత్రమే కాదు విద్య, పారిశుధ్యం, పోషకాహారం, సురక్షిత నీటి సరఫరా, మాతా శిశు సంరక్షణ ఇవన్నీ అందులో భాగమేనని ఒప్పందం చేసుకున్న దేశాల ఉద్ధేశం.
ఇందులో భాగంగా వైద్య నిపుణులకు, సాధారణ ప్రజలకు మధ్య ఒకరి నుంచి ఒకరికి సమాచారాన్ని చేరవేయడం, మధ్యవర్తిత్వం వ్యవహరించడం కూడా ఆరోగ్య సంరక్షణలో భాగమయ్యింది. అప్పుడే సామాజిక ఆరోగ్య కార్యకర్త లేదా గ్రామ ఆరోగ్య కార్యకర్తల ప్రమేయం మొదలయ్యింది. అప్పటి నుంచి ప్రజారోగ్య కేంద్రంగా రచించే వ్యూహాలలో వారు కూడా భాగమయ్యారు.

"ప్రపంచంలోనే అత్యధిక మహిళా శక్తిగా గుర్తింపు ఉన్న మహిళా సామాజిక ఆరోగ్య కార్యకర్తల కారణంగా ఇప్పుడు ప్రజారోగ్య సేవలు దేశంలో ప్రతి మారు మూల గ్రామానికి, మురికి వాడలకు అందుతున్నాయి." అని ప్రజారోగ్యంలో భాగంగా సామాజిక ఆరోగ్య కార్యకర్తల కార్యక్రమాలపై స్వతంత్రంగా పరిశోధనలు నిర్వహిస్తున్న కవితా భాటియా తన నివేదికలో పేర్కొన్నారు.
సమగ్ర శిశు సంక్షేమ పథకం కింద 27 లక్షల అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఉన్నారు. అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ ప్రోగ్రామ్ కింద సుమారు 8 లక్షల 70వేల మంది ఆశా కార్యకర్తలు, వారితో పాటు పట్టణ సామాజిక కార్యకర్తలు(USHA)మురికి వాడల్లో పని చేస్తున్నారు. వారికి తోడు మరో పది లక్షల మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కూడా ఉన్నారు.
2005లో ఆశా కార్యక్రమం మొదలయ్యింది. ఆపై మాతా శిశు ఆరోగ్య సేవలు, పోషకాహారం, విద్య, ప్రాథమిక వైద్య సేవలు కూడా అందులో భాగంగా చేర్చారు. ఇలా క్షేత్ర స్థాయిలో ముందుండే వీరు, మూడంచెల ఆరోగ్య సంరక్షణ నిర్మాణంలో భాగమయ్యారు.
అంగన్ వాడీ కార్యకర్తలకు నెల నెలా నిర్ణయించిన మొత్తాన్ని జీతంగా ఇస్తారు. వారి ఉద్యోగానికి ఎలాంటి సామాజిక భద్రత కానీ, పెన్షన్ సౌకర్యాలు కానీ ఉండవు. ఇక ఆశా వర్కర్ల విషయానికొస్తే నెల నెలా వారు చేసిన పనిని బట్టి వారికి ప్రోత్సాహకాలు ఉంటాయి.
గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్-19ను ఎదుర్కొనే విషయంలో ఆశా వర్కర్లతో పాటు అంగన్ వాడీ కార్యకర్తలకు, ఏఎన్ఎంలకు కూడా కేంద్ర ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది.
మార్చి 31 వరకు అంగన్ వాడీలను మూసివేయాలని మార్చి 18న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ వారు అందించే పోషకాహారాన్ని మాత్రం మార్చి 19 నుంచి యథావిధిగా కొనసాగించాలని ఆదేశించింది. ఫలితంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది.
పోషకాహారంలో భాగంగా 315గ్రాములు, 105 గ్రాములతో కూడిన రెండు పంజరి(గోధుమ పిండి, పంచదార, నెయ్యి, డ్రైఫూట్స్ మిశ్రమం)ప్యాకెట్లు అలాగే 330 గ్రాముల బరువుండే 12 లడ్డూల ప్యాకెట్లను ఇస్తారు.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా పాఠశాలలు మూత పడటంతో పిల్లలకు మధ్యాహ్న భోజనం అందకపోవడాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. తక్షణం అంగన్ వాడీ కార్యకర్తల ద్వారా పిల్లలకు భోజనం అందించే ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. 1975లో సమగ్ర శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్) సేవలు ప్రారంభయ్యాయి.
ఈ పరిస్థితుల్లో తాము సేవలందించడం మరింత ముఖ్యమని రాంపూర్ ఖేరికి చెందిన 38 ఏళ్ల అంగన్ వాడీ కార్యకర్త మీనా గోస్వామి అన్నారు.
"మనమంతా కలిసి కట్టుగా పని చేస్తే బహుశా ఆ వైరస్ను ఓడించగలమమో..!" అని ఆమె అభిప్రాయపడ్డారు.

అయితే ఎంత నిబద్ధతతో ఉన్నప్పటికీ ప్రస్తుతం గ్రామీణ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అంటున్నారు సామాజిక కార్యకర్త అక్రమ్ అక్బర్ చౌదరి.
"లాక్ డౌన్ కారణంగా ఇతర జబ్బులతో బాధపడుతున్న వారికి కావాల్సిన మందుల కొరత తీవ్రంగా ఉంది. మా ప్రాంతంలో టీబీ కేసులు కూడా ఎక్కువయ్యాయి. ప్రైవేటు క్లీనిక్లు చాలా వరకు మూత పడ్డాయి"అని ఆయన అన్నారు.
నిర్మానుష్యంగా కనిపిస్తున్న గ్రామాల్లోని భయం స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో మరింత మంది వలస కార్మికులు తిరిగి తమ తమ స్వస్థలాలకు రానుండటంతో డాక్టర్ తోమర్ సహా ఇతర సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు మున్ముందు పనిభారం మరింత పెరగనుంది.
అయితే ఈ అనిశ్చితి, భయాల నడుమ ఓ శుభవార్త కూడా ఉంది. కైరానాకు సమీపంలో ఉన్న శ్రీ బాలాజీ ఐటీఐ కళాశాలలో తబ్లిగీ జమాతేకి చెందిన 28 మంది సభ్యుల్ని క్వారంటైన్లో ఉంచారు. వారు క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించకుండా చూసే బాధ్యతను ఖాసిమ్ షా అనే ఉపాధ్యాయునికి అప్పగించారు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వారందరికీ నెగిటివ్ అని వచ్చిందని, త్వరలోనే వాళ్లు తమ తమ ఇళ్లకు వెళ్లిపోవచ్చని ఖాసిమ్ చెప్పారు.
ఓ వైపు రేపేం జరుగుతుందోనన్న భయం... మరోవైపు కరోనావైరస్ నుంచి తమను తాము రక్షించుకునేందుకు అవసరమైన మాస్కులు లభిస్తాయని, కనీసం ఇప్పటికైనా తాము చేస్తున్న సేవలకు తగిన గుర్తింపు వస్తుందని, తమ ప్రాణాలకు ఎలాంటి ముప్పు రాదన్న ఆశల నడుమ ఆ రాత్రికి డాక్టర్ తోమర్ సహా మిగిలిన వాళ్లంతా తమ తమ ఇళ్లకు చేరుకొని ఉంటారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: శ్రీకాళహస్తిలో కోవిడ్ కేసులు హఠాత్తుగా ఎలా పెరిగాయి? ఈ రెడ్ జోన్ గురించి ఎవరేమంటున్నారు?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ప్రపంచ దేశాల మధ్య యుద్ధానికి కారణం అవుతుందా?
- కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- కరోనా ఎఫెక్ట్: నారింజ రసం ధరలు పైపైకి
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








