కరోనావైరస్: లాక్‌డౌన్‌తో ట్రాన్స్‌జెండర్లకు ఊహించని కష్టాలు

ఫొటో సోర్స్, Somsara Rielly/BBC
- రచయిత, మేఘా మోహన్
- హోదా, జెండర్ అండ్ ఐడెంటిటీ కరస్పాండెంట్, బీబీసీ
ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ కారణంగా ట్రాన్స్‌జెండర్లకు వైద్యసేవలు అందకుండా పోతున్నాయని అంతర్జాతీయ ట్రాన్స్‌జెండర్ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి. చాలామంది ట్రాన్స్‌జెండర్లకు ఆపరేషన్లు ఆలస్యమవుతున్నాయని, కొందరు హార్మోన్‌థెరపీలు, కౌన్సిలింగ్కు దూరమవుతున్నారని ఆ సంఘాలు చెబుతున్నాయి.
కరోనావైరస్ కారణంగా లింగమార్పిడి ఆపరేషన్‌లు ఆలస్యమవుతున్నాయని, మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో వైద్యసేవలను విస్తరించడంలో భాగంగా ట్రాన్స్‌జెండర్లకు జరిగే కొన్నిచికిత్సలను నిలిపేస్తున్నారని ఆ సంఘాలు చెబుతున్నాయి.
పశ్చిమదేశాలలో హార్మోన్ థెరపీలు కొనసాగితే కొనసాగుతుండవచ్చని, కానీ మిగతా ఖండాలలో పరిస్థితులు అలా లేవని తూర్పుఆఫ్రికా ట్రాన్స్‌జెండర్ హక్కుల సంఘాలు అంటున్నాయి.
''ట్రాన్స్‌జెండర్లు మామూలుగానే తీవ్రమైన బాధిత వర్గాలుగా ఉన్నాయి'' అని ఈస్ట్ ఆఫ్రికా ట్రాన్స్‌హెల్త్ అండ్ అడ్వోకసీ నెట్ వర్క్ (ఈథాన్) ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ బార్బారా వంగారే అన్నారు. వీళ్లకు మధ్దతుగా నిలిచేవాళ్లులేరనీ, కనీసం ఎల్జీబీటీ కమ్యూనిటీ కూడా వీరి గురించి పట్టించుకోవడం లేదని వంగారే వ్యాఖ్యానించారు.
'' వైద్యసేవలు నిలిచిపోతుండటం వల్ల తాము లింగ పరివర్తనకు దూరమవుతామేమో అన్న ఆందోళనను మేం చాలామంది నుంచి వింటున్నాం. ఇది వారిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది'' అన్నారు వంగారే. ఎల్జీబీటీ కమ్యూనిటీకన్నా రెట్టింపు సంఖ్యలో ట్రాన్స్‌జెండర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని 2017లో లాంకాస్టర్ యూనివర్సిటీ నిర్వహించిన సూసైడ్ ఇన్ ట్రాన్స్‌పాప్యులేషన్ అనే అధ్యయనంలో తేలింది.
ఇదే తరహాలో జరిగిన మరికొన్ని అధ్యయనాలలో కూడా వైద్యపరంగా సరైన చికిత్సలు పొందలేకపోయామన్న బాధతో ఈ వర్గంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని తేలింది. అసలు లింగ పరివర్తనపై లాక్ డౌన్ ఎలాంటి ప్రభావం చూపిందో తెలుసుకునేందుకు బీబీసీ అమెరికా, కెన్యాలకు చెందిన ఇద్దరు వ్యక్తులతో మాట్లాడింది.

ఫొటో సోర్స్, Somsara Rielly/BBC
మారిసియో ఒచెయింగ్, 30 సంవత్సరాలు, కిసుము స్టేట్, కెన్యా
మారిసియో తన సొంతూరు నుంచి ఏడుగంటలపాటు ప్రయాణించి నైరోబీ చేరుకున్నారు. అక్కడ ఆయన టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంది. ఇలా ఏడాది నుంచి తరచూ ప్రయాణాలు చేస్తున్నారు. ఇది చాలా అతనకి ముఖ్యమైంది కూడా. ''ఈ ఇంజెక్షన్లతో నా శరీరంలో మార్పులు రావడం మొదలు పెట్టాయి. నేను ఇప్పుడు స్త్రీలాగా కనిపించడం లేదు. నాకు కొంచెంకొంచెం గడ్డం వస్తోంది'' అని చెప్పారు మారిసియో.
కోరుకున్నరూపంలోకి నేను మారిపోతున్నాను. ఇప్పుడు నేను మగాడిని. ఇంకెప్పటికీ మహిళను కాను'' అన్నారు మారిసియో. కెన్యా రాజధాని నైరోబీకి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో పెరిగిన మారిసియోకు తాను మిగిలినవారికి భిన్నమైన వ్యక్తినని తెలుసు. అతనికి 150మంది సోదరులు ఉన్నారు.
కానీ, వారికి అతను ఏమీ కాడు. ''నేను నా కుటుంబంలో బ్లాక్ షీప్ లాంటివాడిని ''అంటారు మారిసియో. తన శరీరం ఎలా ఉన్నా, తాను అమ్మాయిని కానని అతనికి తెలుసు. అతని తల్లిదండ్రులేమో అతన్ని లెస్బియన్ గా భావించారు. వారికి అర్ధమయ్యేలా చెప్పేవారు కూడా లేరు. తాను స్త్రీ రూపంలో ఉన్న పురుషుడినని చెప్పినా తల్లిదండ్రులు వినిపించుకోలేదు. అతన్ని ఇంటి నుంచి బైటికి వెళ్లగొట్టారు.
16 ఏళ్ల వయసులో మారిసియో ఒంటరి వాడయ్యాడు. ఇల్లు లేదు. తనపై అనేకసార్లు లైంగిక దాడులు కూడా జరిగాయి. ఈ అత్యాచారాల కారణంగా ఏడాది తర్వాత అతను గర్భందాల్చాడు. జనం అతన్ని వీధి బిచ్చగాడికన్నా హీనంగా చూశారట. అప్పుడతను తన తల్లిదగ్గరికి వెళ్లి ''ఓ కుక్కలాగా రోడ్డు మీద ప్రసవించే దుస్థితిలో పడేయవద్ద''ని వేడుకున్నాడు. దాంతో తల్లి అతన్ని ఇంట్లోకి రమ్మన్నది.
మారిసియోకు 2007లో కూతురు పుట్టింది. అతను స్థానికంగా ఓ మార్కెట్లో చెప్పుల వ్యాపారం చేస్తుంటాడు. తాను అబ్బాయిగా మారిపోవాలని 2018లో నిర్ణయించుకున్నారు మారిసియో. దీనికి అవసరమైన టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ తీసుకోవాలంటే ఒక్కోడోసుకు కెన్యా కరెన్సీలో 1200 షిల్లింగ్ లు అవుతుంది. అంటే 9 యూరోలతో సమానం. అది అతని ఒకరోజు సంపాదనతో సమానం.
ప్రతినెలా 14గంటలు ప్రయాణించి అతను ఈ డోసు తీసుకోడానికి నైరోబీకి వెళ్లివచ్చేవాడు. తీసుకున్న ప్రతిసారి అతనికది పెద్ద విజయం అనిపిస్తుంటుంది. మారిసియో ఇప్పుడు సర్జరీ కోసం డబ్బులు దాచుకుంటున్నాడు. అతనిప్పుడు రొమ్ములు తొలగించే ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంది. ఇప్పుడు కరోనావైరస్ కెన్యాను కూడా తాకింది. లాక్ డౌన్ కష్టాలు వచ్చి పడ్డాయి.
మారిసియో దగ్గర ఇప్పుడు తరువాతి డోస్ కు అవసరమైన టెస్టోస్టిరాన్ లేదు.''నేనిప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను, డిప్రెషన్ లో కూరుకుపోతున్నాను'' అంటున్నాడు మారిసియో. ''నాకిప్పుడు ఈ వైద్యం అందకపోతే ఏమవుతుంది? జీవితాంతం ఈ బాధ ఉంటుంది '' అన్నాడతను. '' లింగమార్పిడి అంటేనే భయపడే దేశంలో నేను మగాడిగా మారిపోవాలనుకుంటున్న వ్యక్తిని. ఇప్పటికే నా శరీరంలో మార్పులు మొదలయ్యాయి. కానీ వైద్యం మధ్యలోనే ఆగిపోతే నేనొక వింతరూపంగా మారిపోనా? ఈ గోలలో నాకోసం ఎవరు పోరాడతారు, నా బాధలు ఎవరు పట్టించుకుంటారు'' అంటున్నాడు మారిసియో.

ఫొటో సోర్స్, Somsara Rielly/BBC
లియామ్ పావ్ వర్త్, 30 సంవత్సరాలు, చికాగో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
అమెరికన్ ఆర్మీలో చేరిన తొలి ట్రాన్స్‌జెండర్
లియామ్ కు 2020 సంవత్సరం పాల్లోప్లాస్టీ అనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న సంవత్సరంగా, పూర్తిస్థాయిలో మగవాడిగా లింగ పరివర్తన చెందిన సంవత్సరంగా గుర్తుండి పోవాల్సింది. ''పాల్లోప్లాస్టీ అనేది మహిళలను పురుషులుగా మార్చే ఆపరేషన్. దీని ద్వారా పురుషుడు జననావయవాన్ని కూడా పొందుతారు'' అని వెల్లడించారు లియామ్.
సంవత్సరాల నుంచి తనలో ఉన్న ఫ్రస్టేషన్ తీరిపోయే రోజు దగ్గర్లోనే ఉందంటూ అతను సరదాగా చెప్పుకొచ్చాడు. కరోనావైరస్ కారణంగా లియామ్ కు జరగాల్సిన సర్జరీ 2021 చివరినాటికి కూడా జరిగేలా లేదు. అతనికి వైద్యపరంగా ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.
''ఇది నాకు పెద్ద దెబ్బ. నేను దీని కోసం నా జీవితాన్నంతా దారపోశాను'' అంటున్నాడు లియామ్. '' నేను స్కూలు వెళ్లాల్సిన వాడిని. కానీ సర్జరీ కోసం స్కూలుకు కూడా వెళ్లలేదు'' అని వాపోయాడు లియామ్. 19 ఏళ్ల వయసు నుంచి చికిత్స తీసుకుంటున్న లియామ్ కు ఈ సర్జరీయే చికిత్సలో ఆఖరిది. కానీ ఇప్పుడది వాయిదా పడింది.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?

చిన్నతనం నుంచి లియామ్ తనను తాను అమ్మాయిగా ఎప్పుడూ భావించలేదు. తనకు అబ్బాయి దుస్తులు వేయాలంటూ తన తండ్రి అంత్యక్రియల సమయంలో అతను తన అత్తతో వాదన పెట్టుకున్నాడు కూడా.
19 ఏళ్ళ వయసులో మూడు సెషన్లలో అతనికి సైకలాజికల్ థెరపీ నిర్వహించారు. తర్వాత అతనికి టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లు ఇవ్వాలని వైద్యులు సూచించారు. దీంతో అతనికి రుతుక్రమం ఆగిపోయింది.
కానీ, ఇది సుదీర్ఘమైన ప్రక్రియని, చట్టాల కారణంగా ప్రస్టేషన్ కు గురయ్యాననీ అన్నాడు లియామ్. అమెరికాలో లింగ పరివర్తనకు సంబంధించిన చట్టాలు రాష్ట్రానికొక విధంగా ఉన్నాయి. మెడికల్ ఇన్సూరెన్స్ నిబంధనలనుబట్టి డాక్టర్లు ఈ తరహా చికిత్సలను నిరాకరించవచ్చు.
2016లో తన 25వయేట తన రెండు రొమ్ములను ఆపరేషన్ ద్వారా తొలగించుకున్నాడు. ఇది ఒకరోజంతా సాగే ఆపరేషన్. సర్జరీ పూర్తయిన 12గంటల్లోనే అతను హాస్పిటల్ నుంచి బైటికి వచ్చాడు. ఇక అతని జీవితం మారిపోయింది. తాను ధైర్యంగా షర్ట్ విప్పేసి ఈత కొట్టగలుగుతున్నాడు. ట్రైయథ్లాన్ లో కూడా పాల్గొన్నాడు. 15కిలోమీటర్ల రేసుల్లో పరుగులు పెట్టాడు. అతనకిది ఎంతో స్వేచ్ఛగా అనిపించింది.
ట్రాన్స్ జెండర్లను మిలటరీలోకి రానివ్వకుండా 2017లో అమెరికా చట్టాలు చేసినా, కింది కోర్టులు ఈ చట్టాలపై ఇచ్చిన స్టేలతో 2018 ఫిబ్రవరి 23న లియామ్ అమెరికన్ ఆర్మీలో చేరిన తొలి ట్రాన్స్ జెండర్ గా రికార్డులకెక్కాడు. అప్పట్లో లియామ్ పేరును మీడియాకు ఇవ్వలేదు అధికారులు. తీవ్రమైన గాయం కారణంగా అదే సంవత్సరం మిలిటరీ సర్వీసు నుంచి బైటికి వచ్చాడు.
2019నాటికి చట్టాలలో మరికొన్ని మార్పులు రావడం, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన స్టేలను ఎత్తేయడంతో తాను ఇక ఆర్మీలో తిరిగి జాయిన్ కాలేనని అర్ధం చేసుకున్నాడు. దీంతో అతను తన చికిత్స తదుపరి దశకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు.
అక్టోబర్ 2019లో టోటల్ లాప్రోస్కోపిక్ హిస్టరెక్టోమీ ఆపరేషన్ ద్వారా రెండు అండాశయాలను తొలగించుకున్నాడు. దాన్నికన్నా కొన్నివారాల ముందు నుంచే టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లను వాడటం నిలిపేశాడు.
ఈ సర్జరీకి కారణం, అతని గర్భాశయంలో జరిగే ఈస్ట్రోజన్ ఉత్పత్తిని నిలిపేయడం. అయితే ఇప్పుడు లియామ్ డిప్రెషన్ లో కూరుకుపోయాడు. తన జీవితం కూడా ఆగిపోయినట్లు భావిస్తున్నాడు. ఇక అతని ఆఖరి ప్రయత్నం పాల్లోప్లాస్టీ ద్వారా జననావయవాలను అమర్చుకోవడం. దానికి ఇంకొన్ని నెలల దూరమే ఉంది.
''నా దృష్టిలో నాకు ఇదే సర్వం'' అన్నాడు లియామ్. ''నేను ముందడుగు వేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు అన్నీ పక్కనబెట్టాల్సి వచ్చింది'' అని వాపోయాడతను. ఇందులో కొన్ని చట్టపరమైన సమస్యలు కూడా ఉన్నాయి.
మొదట్లో హాస్పిటల్ వాళ్లు పాల్లోప్లాస్టీకి ఇన్సూరెన్స్ వర్తించదన్నారు. అయితే ఇల్లినాయిస్ గవర్నర్ ఈ విషయంలో చొరవ తీసుకుని లియామ్ ఇన్సూరెన్స్ కు అర్హుడే అని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా అతను మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, ఆపరేషన్ కు కొత్త తేదీలను నిర్ణయించాల్సి ఉంటుందని ఇన్సూరెన్స్ కంపెనీలు చెబుతున్నాయి.
''ట్రాన్స్ జెండర్ల వైద్యహక్కులు ఈ మెడికల్ ప్రపంచంలో ఎవరికీ పట్టవు'' అన్నారు లియామ్. ఇది తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తోందని, కరోనా వైరస్ ప్రపంచానికే మహమ్మారి కాదని, తనలాంటి ట్రాన్స్ జెండర్లకు కూడా అది మహమ్మారేనని అతను అన్నాడు.
''ఈ సమయంలో మెడికల్ సిబ్బంది ఎమర్జెన్సీ కాల్స్ లో ఉంటారని, వారి ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయని నాకు తెలుసు. కానీ నాకు ఒక్కసారైనా ప్రాధాన్యత ఇస్తే చాలు'' అని వాపోయాడు లియామ్.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ సంక్షోభం: సమానత్వం, న్యాయమే పునాదిగా సరికొత్త సమాజాన్ని నిర్మించేందుకు ఇది సదవకాశమా?
- ఇండియా లాక్‌డౌన్: వలస కార్మికుల కష్టాలు.. తప్పెవరిది? మోదీ ఎందుకు క్షమాపణ చెప్పారు?
- రెమ్డెసివీర్: కరోనావైరస్పై పోరాడే శక్తి ఈ ఔషధానికి కచ్చితంగా ఉందంటున్న అమెరికా
- మాజీ క్రికెటర్ కంపెనీ రూపొందించిన వెంటిలేటర్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్
- ‘ఆర్థికవ్యవస్థ గాడిన పడాలంటే లాక్‌డౌన్ త్వరగా ముగించాలి’
- లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తేయాలో ఎలా నిర్ణయిస్తారు
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- కరోనావైరస్ లాక్ డౌన్‌తో సర్కస్‌లు ఇక అంతరించిపోయినట్లేనా?
- కరోనావైరస్: శ్రీకాళహస్తిలో కోవిడ్ కేసులు హఠాత్తుగా ఎలా పెరిగాయి? ఈ రెడ్ జోన్ గురించి ఎవరేమంటున్నారు
- సామాజిక దూరం పాటించమంటే దేశంలో వ్యతిరేకత ఎందుకు వస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








