కరోనావైరస్: శ్రీకాళహస్తిలో కోవిడ్ కేసులు హఠాత్తుగా ఎలా పెరిగాయి? ఈ రెడ్ జోన్ గురించి ఎవరేమంటున్నారు?

శ్రీకాళహస్తి రెడ్‌జోన్

ఫొటో సోర్స్, KALYAN

ఫొటో క్యాప్షన్, శ్రీకాళహస్తి రెడ్‌జోన్
    • రచయిత, చిట్టత్తూరు హరికృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి పట్టణం ఇప్పుడు కరోనా కోరల్లో విలవిల్లాడుతోంది. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం 60కి పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉంటే, వాటిలో దాదాపు 50 కేసులు ఈ చిన్న పట్టణంలో, దాని పరిసరాల్లోనే ఉన్నాయి.

ఈ ప్రాంతంలో కరోనా కేసులు పెరగడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు మర్కజ్ ఘటన ఆలస్యంగా బయటపడ్డం వల్లే కోవిడ్-19 పాజిటివ్ కేసులు వ్యాపించాయని చెబుతుంటే, కొందరు శ్రీకాళహస్తిలో జీవన స్థితిగతులు కూడా అందుకు కారణని అంటున్నారు.

ఇటీవల, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే 30 ట్రాక్టర్లతో సరుకులు పంచడం వల్లే ఈ కేసులు పెరిగాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ వాదనల వెనుక అసలు నిజం ఏమిటో తెలుసుకోడానికి బీబీసీ ప్రయత్నించింది.

శ్రీకాళహస్తిని రెడ్ జోన్‌గా ప్రకటించడంతో ఇళ్లలోనే ఉంటున్న స్థానికులతో, కరోనా కట్టడి చర్యల్లో ఉన్న అధికారులతో, వలంటీర్లతో, స్థానిక ఎమ్మెల్యేతో, విపక్ష నాయకులతో మాట్లాడింది.

శ్రీకాళహస్తి రెడ్‌జోన్

ఫొటో సోర్స్, KALYAN

ఫొటో క్యాప్షన్, శ్రీకాళహస్తి రెడ్‌జోన్

కరోనా గుప్పిట్లో కాళహస్తి

మొదట ఒకటి రెండు విదేశీ కేసులు బయటపడినా, ప్రస్తుతం శ్రీకాళహస్తిలో కరోనా కేసులు పెరగడానికి కూడా మర్కజ్ ఘటనే కారణం అని పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ చెప్పారు. “ఏప్రిల్ 24 నాటికి శ్రీకాళహస్తిలో 47, రూరల్ ప్రాంతాల్లో 2 కేసులు కలిపి మొత్తం 49 కోవిడ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ ఒక్కరు మాత్రమే డిశ్చార్జ్ అయ్యారు. క్వారంటైన్లో దాదాపు 300 మంది ఉన్నారు. దిల్లీ నుంచి వచ్చిన వారిని ఆలస్యంగా గుర్తించడంతో పట్టణంలో కేసులు పెరిగాయి. వారు బాగా ఇరుకైన ప్రాంతాల్లో నివసించడం వల్ల కూడా కరోనా వ్యాప్తి పెరిగింది” అని అన్నారు.

వారం నుంచీ హోం ఐసొలేషన్లో ఉన్న శ్రీకాళహస్తి ఎమ్మార్వో జరీనా బేగం కూడా, “మేమంతా క్వారంటైన్ విధుల్లో ఉన్నాం. ప్రభుత్వ నిధులతో అక్కడ ఉన్న వారికి ఆహారం, మిగతా వసతులూ కల్పించడం మా పని. అప్పుడే అక్కడ ఉన్న ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. దాంతో, అక్కడ పనిచేసిన నాకు, మరికొతమంది ఉద్యోగులకు హోం ఐసొలేషన్లో ఉండాలని సూచించారు.

అందుకే, నేను నా కుటుంబంతో సహా ఇంట్లోనే ఉండిపోయాను. నాకు మా ఇంట్లో అందరికీ నెగటివ్ వచ్చింది. మేం బయటికి రాగానే మళ్లీ మా విధులు కొనసాగిస్తాం” అని బీబీసీతో అన్నారు.

కాళహస్తిలో రెడ్‌జోన్ ప్రకటించక ముందు నుంచీ పట్టణంలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని చెప్పిన డీఎస్‌పీ నాగేంద్రుడు కూడా, “ప్రజల్లో నిత్యావసరాల గురించి భయాందోళనలు ఉన్నాయి. రేపు ఎలా అనే భయంతో అక్కడక్కడా కొందరు బయటికి వస్తున్నారు. అలా రాకుండా మేం 10 మొబైల్ పార్టీలను పెట్టాం. చిన్న చిన్న సందుల్లో కూడా తిరిగేలా మోటార్ సైకిళ్లతో గస్తీ ఏర్పాటు చేశాం. శ్రీకాళహస్తి అంతటా 20 పికెట్లు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం టౌన్ పూర్తిగా మా కంట్రోల్లో ఉంది” అని అన్నారు.

శ్రీకాళహస్తి రెడ్‌జోన్

ఫొటో సోర్స్, Mahesh Reddy Putta

కేసులు ఎలా పెరిగాయి?

చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తిలోనే ఇన్ని కేసులు ఎలా పెరిగాయి అనే ప్రశ్నకు అందరూ, దిల్లీ కేసులే ప్రధాన కారణమని అన్నారు.

దీనిపై ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి, “నాగాచిపాలెం ప్రాంతంలో ఈ కేసులు పెరిగాయి. మర్కజ్ నుంచి 17 మంది అక్కడకు వచ్చారు. తెలంగాణలో ఆ కేసులు బయటపడేవరకూ వారి గురించి మాకు తెలియలేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చిన్న ప్రాంతాల్లో జనం దగ్గరగా ఉంటారు కాబట్టి అది మిగతావారికి కూడా వ్యాపించింది. వాళ్లందరినీ కష్టపడి క్వారంటైన్ కేంద్రాలకు తరలించాం” అన్నారు.

అయితే, క్వారంటైన్ కేంద్రాలను తరచూ మార్చడం వల్ల కూడా కేసులు పెరిగి ఉండవచ్చని ఆయన అన్నారు.

మొదటి నుంచీ జాగ్రత్తపడి, కట్టడి చేసుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని శ్రీకాళహస్తిలోనే ఉంటున్న రిటైర్డ్ ప్రభుత్వ వైద్యులు డాక్టర్ డీవీ.రావు చెప్పారు.

రిటైర్డ్ ప్రభుత్వ వైద్యులు డాక్టర్ డీవీ.రావు
ఫొటో క్యాప్షన్, రిటైర్డ్ ప్రభుత్వ వైద్యులు డాక్టర్ డీవీ.రావు

“శ్రీకాళహస్తిలో కరోనా ఇంత పెరగడానికి పట్టణంలో ఇరుకుగా ఉన్న ప్రాంతాలు కూడా కారణం అయ్యాయి. సన్నటి వీధుల్లో చాలా ఇళ్లకు కామన్ గోడలు ఉంటాయి. కలిసి ఉండే కుటుంబాలు కూడా ఎక్కువ. అందరూ ఖాళీ సమయాల్లో బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే ఆ ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు త్వరత్వరగా పెరిగాయి” అన్నారు.

ముస్లింలు ఎక్కువగా నాగాచిపాలె వాసి అయిన బాబులు తమ ఊరిలో కరోనా కేసులు ఎక్కువగా బయటపడడంతో ఇప్పుడు తమను నేరస్థుల్లా చూస్తున్నారని అన్నారు. “మా పక్కనే ఉండే ఒక వ్యక్తికి వైరస్ సోకిందని మార్చి 29న క్వారంటైన్‌కు తీసుకెళ్లారు. ఆయనకు నయం కూడా కావచ్చింది. ఇంకొక టెస్ట్ ఉంది అది నెగటివ్ రాగానే డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు. కానీ, వ్యాధి లక్షణాలు లేకపోయినా ఎవరినీ పంపించడం లేదు. మొదట 14 రోజులు అన్నారు, ఇప్పుడు 28 రోజులు అయినా వాళ్లు రాలేదు” అన్నారు.

మర్కజ్ వెళ్లి వచ్చిన వారిని త్వరగా గుర్తించలేకపోవడమే ఇంత సమస్యకూ కారణమని శ్రీకాళహస్తి బీజేపీ నాయకులు కోలా ఆనంద్ ఆరోపించారు.

45 మంది కాళహస్తి నుంచి మర్కజ్ వెళ్లి వచ్చారు. అప్పటివరకూ లండన్ నుంచి వచ్చిన ఒక్క కేసు మాత్రమే ఉంది. ఆయన క్వారంటైన్లో పెట్టిన తర్వాత డిశ్చార్జ్ చేశారు. కానీ దిల్లీ వెళ్లి నచ్చినవారిని గుర్తించినా సమయానికి అందరినీ క్వారంటైన్ చేయలేదు. కూరగాయల మార్కెట్ కూడా చాలా ప్రాంతాల్లో పెట్టడం వల్ల కూడా వైరస్ వ్యాపించింది అని చెప్పారు.ప్రభుత్వ అధికారులు కరోనాపై సరైన సమయానికి నిర్ణయం తీసుకుని ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చుండదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

శ్రీకాళహస్తి రెడ్‌జోన్

ఫొటో సోర్స్, Mahesh Reddy Putta

ఎమ్మెల్యే సరుకుల పంపిణీపై వివాదం

ఏప్రిల్ 11న ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి ట్రాక్టర్లలో నిత్యావసరాలు నింపుకుని రోడ్డు మీదకు రావడం, తర్వాత కొన్ని రోజులకు శ్రీకాళహస్తిలో కోవిడ్-19 కేసులు పెరగడం కూడా చర్చనీయాంశంగా మారింది.

అయితే, తాను చేసింది అసలు ర్యాలీనే కాదని, దానిపై ఇంత దుమారం రేగుతుందని అనుకోలేదని మధుసూదన్ రెడ్డి చెప్పారు.

“శ్రీకాళహస్తి ప్రజలకు అండగా ఉండడం నాకు కొత్త కాదు. ఒకసారి ఓడి ఎమ్మెల్యే అయిన నాకు ప్రజల విలువ ఏంటో తెలుసు. ఆరోజు కరోనా కష్ట కాలంలో దేశానికి భారీ విరాళాలు అందించి అండగా నిలిచిన వారి గురించి ప్రజలకు చెప్పాలనే అలా చేశాం. పార్టీలకు అతీతంగా అందరి ఫొటోలూ పెట్టాం. వారాల తరబడి ఇళ్లలో కూచుంటే అందరి పొట్ట నిండేదెలా. వారికి నా వంతు సాయం చేద్దామని ట్రాక్టర్లలో సరకులు నింపి వార్డులకు పంపించాను. నేను వెళ్లకుండా, వలంటీర్లతో పంపిణీ చేయించాను” అని అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే చేసిన ట్రాక్టర్లతో సరుకులు ఇచ్చిన సమయంలో ముస్లిం మహిళలకు కూడా వాటిని పంచారు.. అప్పుడు కూడా ఇది వ్యాపించి ఉంటుందని భావిస్తున్నామని బీజేపీ నేత కోలా ఆనంద్ అన్నారు. ‘‘క్వారంటైన్లో ఉన్న వారిని ఐదు ప్రాంతాల్లో మార్చారు. అలా వారిని మాటిమాటికీ మార్చడం వల్ల కూడా వాహనం డ్రైవర్లు, అధికారులకు కూడా అది వ్యాపిస్తుంది. 70 వేల జనాభా ఉన్న పట్టణంలో 50కి పైగా కేసులు ఉన్నాయంటే దీని తీవ్రత అర్థం చేసుకోవచ్చు’’ అన్నారాయన.

ఈ ట్రాక్టర్లతో సరుకుల పంపిణీ వల్లే ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా వచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి. ఈ అభిప్రాయాలను శ్రీకాళహస్తి ఎమ్మార్వో జరీనా బేగం ఖండించారు.

“ప్రభుత్వ బడ్జెట్‌తో అందించే వాటిని క్వారంటైన్లో ఉన్న వారికి అందించడం మా విధి. ఎమ్మెల్యే చేసిన పంపిణీకి, మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన వాటిని పంచినపుడు మేము, మా వీఆర్వోలు ఎవరూ పాల్గొనలేదు. మేం అక్కడ ఉంటే ఆ ఫొటోలు, వీడియోల్లో కనిపించే వాళ్లం కదా” అన్నారు.

తన పంపిణీ గురించి చెప్పిన ఎమ్మెల్యే మధు “శ్రీకాళహస్తిలో 40 శాతం చిన్న పనులు చేసుకునే కూలీలు, బీడీ కార్మికులే ఉన్నారు. వారాల తరబడి ఇళ్లలో కూచుంటే అందరి పొట్ట నిండేదెలా. అప్పటికే చాలా సంస్థలు వారికి సాయం అందించాయి. నేను కూడా నా వంతు సాయం చేద్దామని, ట్రాక్టర్లలో సరుకులు నింపి వార్డులకు పంపించాను. నేను వెళ్లకుండా, వాలంటీర్లతో వాటిని పంపిణీ చేయించాను” అన్నారు.

కాళహస్తి

రెడ్‌జోన్ అయిన తర్వాత...

శ్రీకాళహస్తిలో మార్చి 24న మొదటి కేసు, 30న రెండోది, 31న మూడోది నమోదైంది. ఏప్రిల్ 12 తర్వాత కేసులు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో పట్టణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు.

“రెడ్ జోన్‌గా ప్రకటించిన తర్వాత ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం సంతోషం. మా పోలీసులకు కూడా తగిన రక్షణ కల్పిస్తున్నాం. వారికి ఇక్కడే ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేసి, భోజనాలు కూడా మేమే అందిస్తున్నాం. పికెట్ల దగ్గర విధుల్లో ఉన్న వారికి అన్నీ అక్కడికే పంపిస్తున్నాం. తరచూ పోలీసు కాన్వాయ్‌తో పట్టణ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం” అని పట్టణ డీఎస్పీ అన్నారు.

మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ కూడా, “ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. మరో మూడు నాలుగు రోజుల్లో మరో పది మంది డిశ్చార్జ్ అవుతారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి పట్టణం అంతా క్రిమిరహితం చేస్తున్నాం. ప్రతి రోజూ ఒక స్ప్రే వెహికల్, 20కి పైగా స్ప్రేయర్లతో బ్లీచింగ్, లైజాల్ లాంటివి పిచికారీ చేస్తున్నాం. తగిన భద్రతా చర్యలు పాటిస్తున్నాం” అన్నారు.

రిజ్వాన్

స్థానికుల్లో అసంతృప్తి

కానీ, కొందరు స్థానికులు మాత్రం అధికారుల ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కైకాలవీధిలో నివసించే ఆర్టీఐ కార్యకర్త రిజ్వాన్, “రెడ్ జోన్‌గా ప్రకటించడంతో నేను మా గేటుకు తాళాలు వేసేశా. ఇక ముందు ఎలా ఉంటుందో గానీ, ఇప్పటివరకూ ఏవైనా తెచ్చుకోడానికి బయట షాపులేవీ లేవు. పిల్లలకు ఏం పెట్టాలో తెలీడం లేదు. అధికారులు కొన్ని నంబర్లు ఇచ్చారు. వాలంటీర్లు మీ ఇళ్లకే తెచ్చి ఇస్తారు అన్నారు. కానీ అందరి ఫోన్లూ స్విచాఫ్ వస్తున్నాయి” అన్నారు.

ఒక పరిశ్రమలో పనిచేసే కొత్తపేట వాసి సురేష్ అత్యవసర సేవల కోసం ఏప్రిల్ 15 వరకూ విధులకు వెళ్లాడు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

“బయటికెళ్లాలంటే భయంగా ఉంది. మా ఇంటి దగ్గర ఉన్న షాపులో సరుకులూ తెచ్చుకునేవాళ్లం. అప్పుడప్పుడూ కూరగాయల వ్యాన్ వచ్చేది. ఇప్పుడు అవి కూడా లేవు. వాలంటీర్లు వచ్చి ఇస్తారు అంటున్నారు. వాళ్లూ మనుషులే కదా, కరోనా వల్ల వాళ్లను కూడా గట్టిగా అడగలేం. ప్రస్తుతం వారానికి సరిపడా సరుకులు, రేషన్ బియ్యం ఉన్నాయి. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి” అన్నారు.

“నాకు ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ల కోసం కాస్తో కూస్తో కూడబెట్టాను కాబట్టి, ఇప్పుడు కాస్తో కూస్తో తినగలుగుతున్నాం. అది కూడా లేనివారి పరిస్థితి ఏంటి. అద్దె మూడు నెలలు కట్టకండి అని చెబుతున్నారు. అలాగే కరెంటు బిల్లులు కూడా మాఫీ చేయచ్చు కదా. కట్టకపోతే వంద రూపాయలు ఫైన్ అని చెబుతున్నారు” అని నాగాచిపాలెంలో ఉంటున్న బాబులు కూడా చెప్పారు.

కాళహస్తి

లంటీర్లు ఏం చెబుతున్నారు

శ్రీకాళహస్తిలో 20 వార్డులో ఇద్దరు వాలంటీర్లకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. దీనిపై బీబీసీ కొందరు వాలంటీర్లతో మాట్లాడింది.

పేరు రాయవద్దని కోరిన ముత్యాలమ్మ గుడి వీధిలోని ఒక మహిళా వాలంటీరు తమకు మున్సిపల్ కార్యాలయం నుంచి మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు అందుతున్నాయని చెప్పారు. జనం ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు నిత్యావసరాలు తీసుకెళ్లి తగిన జాగ్రత్తలతో వాళ్లకు అందిస్తున్నామని చెప్పారు.

“20వ వార్డులో రెండు కరోనా కేసులు వచ్చాయని తెలీగానే, ఒక గంట వరకూ ఆందోళనగా అనిపించింది. తర్వాత మన జాగ్రత్తల్లో మనం ఉంటే ఎందుకు వస్తుంది అనుకున్నా. మా ఉన్నతాధికారులు కూడా మాకు తగిన జాగ్రత్తలు చెబుతూనే ఉన్నారు. నేను రోజూ నడిచే వెళ్లి మా చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు సామాన్లు అందిస్తుంటాను” అన్నారు.

కాగా, శ్రీకాళహస్తి రెడ్‌జోన్ పరిధి బయటి మండలాల వాలంటీర్లు మాత్రం భిన్న వాదన వినిపిస్తున్నారు.

పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వాలంటీర్, “మాకూ చిన్న పిల్లలు ఉన్నారు సర్. ప్రభుత్వం అందరికీ అన్నీ సప్లై చేస్తుంది, కానీ, మాకు ఎలాంటి సేఫ్టీ లేదు. మాస్కులు, గ్లౌజులు ఏవీ ఇవ్వలేదు. మా జాగ్రత్తలు, పెట్రోల్ ఖర్చు అన్నిటినీ వచ్చే జీతంలోనే పెట్టుకోవాలి. ఉదయం నుంచి దాదాపు పది ఫోన్లు వచ్చాయి. అందరికీ, అన్నీ సప్లై చేయాలి. ఇక్కడ ఏఎన్ఎం, ఆశా వర్కర్లది కూడా ఇదే పరిస్థితి” అన్నారు.

రెడ్‌జోన్ ప్రకటించడంతో పట్టణంలో కరోనా వ్యాప్తికి కళ్లెం పడుతుందని స్థానికులు భావిస్తున్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)