కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్ వల్ల చైనాలో వందల మంది అనారోగ్యానికి గురయ్యారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

శ్వాస ఇబ్బందులు తీవ్రం అయ్యేలా చేసే ఈ వైరస్‌ను మొదట వుహాన్ నగరంలో గుర్తించారు. వేగంగా వ్యాపించే ఈ ఇన్ఫెక్షన్‌కు న్యుమోనియా లాంటి లక్షణాలు ఉంటాయి.

ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా అడ్డుకునేందుకు చైనా అధికారులు కొన్ని నగరాలను దేశంలోని మిగతా ప్రాంతాలతో వేరు చేశారు.

ఇది చైనాలో కొత్త సంవత్సరం వేడుకల సమయం. కానీ మారిన పరిస్థితులతో ఎన్నో కార్యక్రమాలను రద్దు చేశారు.

కింద ఇచ్చిన ఆరు మ్యాప్స్, గ్రాఫిక్స్ ద్వారా చైనాలో అసలు ఏం జరుగుతోందో మేం వివరంగా చెప్పే ప్రయత్నం చేశాం.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
కరోనా వైరస్

1.ఎక్కువ కేసులు చైనాలోనే

చైనాకు దాదాపు మధ్యలో ఉండే హుబే ప్రాంతంలో కరోనా వైరస్‌కు ప్రభావం తీవ్రంగా ఉంది.

దీంతో, చైనా అధికారులు మిగతా నగరాల నుంచి హుబే ప్రాంతానికి రాకపోకలు నిషేధించారు.

ముందు ముందు కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్ కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ప్రస్తుతం చైనాలో ఆంక్షల జాబితా పెరుగుతూ పోతోంది. ఎక్కువ దేశాల్లో కరోనా వైరస్ కేసులు వెలుగు చూడకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్‌ను ఇంకా 'అంతర్జాతీయ అత్యవసరస్థితి'గా ప్రకటించలేదు.

కరోనా వైరస్

2. ఎక్కువగా ప్రభావితమైన హుబే

హుబేలో ఇప్పటివరకూ 1,400కు పైగా ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలోని 10 నగరాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించడంతో కనీసం రెండు కోట్ల మంది ప్రభావితం అయ్యారు.

వాటిలో మొట్టమొదట కరోనావైరస్‌ను గుర్తించిన వుహాన్ నగరం కూడా ఉంది.

కరోనా వైరస్

3. కరోనావైరస్ కేసులు

చైనా బయట ఇప్పటివరకూ థాయ్‌లాండ్, వియత్నాం, తైవాన్, దక్షిణ కొరియా, సింగపూర్, నేపాల్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కేసులను ధ్రువీకరించారు.

మిగతా దేశాలు అనుమానిత కేసులను పరీక్షిస్తున్నాయి. వీటిలో భారత్, బ్రిటన్, కెనడా లాంటి దేశాలు ఉన్నాయి.

కరోనా వైరస్

4.కరోనావైరస్ లక్షణాలు

కరోనా వైరస్ చాలా సాధారణంగా ఉంటుంది.

శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు.

కానీ కరోనా కుటుంబానికే చెందిన సార్స్(సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), మర్స్(మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వంటి కొన్ని వైరస్‌లు చాలా ప్రమాదకరం.

వుహాన్ నుంచి వ్యాపించిన అంటువ్యాధులకు కారణమైన వైరస్‌కు 'నావెల్ కరోనా వైరస్ లేదా nCoV'అని పేరు పెట్టారు.

ఇది కరోనా కుటుంబానికి చెందిన కొత్త జాతి వైరస్. దీనిని ఇంతకు ముందు వరకూ మనుషుల్లో గుర్తించలేదు.

కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసుల వల్ల ఇది జ్వరంతో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. తర్వాత పొడి దగ్గు తీవ్రంగా ఉంటుంది.

వారం వరకూ అదే పరిస్థితి కొనసాగితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలవుతాయి.

కానీ సీరియస్ కేసుల్లో ఇన్ఫెక్షన్ న్యుమోనియా లేదా సార్స్‌గా మారుతుంది.

కిడ్నీలు ఫెయిలై రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. ముఖ్యంగా పార్కిన్సన్, డయాబెటిస్ లాంటి వ్యాధులు ఉన్నవారు దీనికి గురవుతున్నారు.

ఈ ఇన్ఫెక్షన్ వదిలించుకోడానికి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక చికిత్సలూ లేవు.

ఇన్ఫెక్షన్ వచ్చిన రోగులకు డాక్టర్లు ప్రస్తుతం వారి లక్షణాల ఆధారంగా చికిత్సలు అందిస్తున్నారు.

కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

5. రాకుండా ఏం చేయవచ్చు

ఇది రాకుండా ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు సాధారణ ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సూచించింది.

వీటిలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ ధరించడం, ఆహార జాగ్రత్తలు ఉన్నాయి.

శ్వాస ఇబ్బందులు ఎదుర్కుంటున్న రోగులకు దగ్గరగా ఉండకూడదని సూచించారు.

తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని, ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి, పెంపుడు జంతువులు, లేదా ఇతర జంతువులకు దూరంగా ఉండాలని చెప్పింది.

పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకుండా ఉండాలని సూచించింది.

కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌ వచ్చినవారు తుమ్ముతున్న సమయంలో ఎదురుగా ఉన్నవారికి అది రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పింది.

అంటే ముక్కుకు టిష్యూ లేదా బట్ట పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి.

కరోనా వైరస్

6. ఎవరికైనా ఇన్ఫెక్షన్ వస్తే...

చైనా ప్రభుత్వం గతంలో సార్స్ వ్యాపించినపుడు తీసుకున్న చర్యలనే కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌కు కూడా పాటిస్తోంది.

అంటే, దేశంలో ఈ వైరస్ ఎవరికైనా వచ్చినట్టు ధ్రువీకరిస్తే, వారిని మిగతా అందరికీ దూరంగా ఉంచుతారు.

కరోనాఇన్ఫెక్షన్ వచ్చిన రోగులను 'లైట్, మీడియం, సీరియస్ అనే మూడు కేటగిరీలుగా విభజించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్యులకు సూచించింది.

రోగులకు చికిత్స అందించే ఆరోగ్య సిబ్బంది ఈ వైరస్ ఇన్ఫెక్షన్‌కు గురికాకుండా అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.

ఆరోగ్య సిబ్బంది గౌన్, మాస్క్, గ్లౌజ్ ఉపయోగించడంతోపాటు ఆస్పత్రుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిన రోగుల కదలికలను నియంత్రించాలని కూడా సలహా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)