చైనా కరోనా వైరస్ లక్షణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ అనే ఒక కొత్త రకం వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 26 మంది చనిపోయారు. 13 పట్టణాలకు పైగా రాకపోకలను నిలిపేశారు.
ఒక పెద్ద సమూహానికి చెందిన ఈ వైరస్‌లతో జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి MERS , SARS లాంటి తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వ్యాప్తిచెందుతున్నాయి.
కరోనా వైరస్‌లు చాలా వరకు జంతువులపై ప్రభావం చూపుతాయి. ఈ రకానికి చెందిన ప్రస్తుత వైరస్ సహా కేవలం ఏడు రకాల వైరస్‌లు మాత్రమే ఇప్పటి వరకు మనుషులకు సోకినట్టు సమాచారం ఉంది.
జ్వరం, దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులు ఈ వైరస్ సాధారణ లక్షణాలు. కానీ, ఇది అవయవాలు విఫలం కావడం, న్యుమోనియా లేదా మరణానికి కూడా దారితీసే ప్రమాదముంది.


అయితే, ఇప్పటి వరకు దీనికి ఎటువంటి వాక్సిన్ అందుబాటులో లేదు. కాబట్టి దీన్ని అరికట్టాలంటే ఈ వ్యాధి సోకినవారి నుంచి ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడటమే మార్గం.
ఈ వైరస్ సోకిన వారు తుమ్మినా, దగ్గినా కూడా ఇది ఇతరులకు వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
"ఈ వైరస్ జంతువుల నుంచి వ్యాప్తి చెందుతుందని చెప్పగలం. కానీ, ఏ జంతువు నుంచి వ్యాపిస్తుంది అనేది మాత్రం కచ్చితంగా చెప్పలేకపోతున్నాం" అని వెల్‌కమ్ ట్రస్ట్ ఎపిడెమిక్స్ లీడ్ డాక్టర్ జోసీ గోల్డింగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కరోనా అనే పేరు ఎలా వచ్చింది
లాటిన్‌లో కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ వైరస్‌ను మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో ఉండటంతో దీనికా పేరు పెట్టారు.
శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే ఈ వైరస్‌ను 1960ల్లో కనుగొన్నారు. ఇప్పటి వరకూ ఆరు రకాల కరోనా వైరస్‌లను గుర్తించారు. ఇవి ఎక్కువగా పక్షులు, క్షీరదాలపై ప్రభావం చూపించేవి.
కానీ, తాజాగా విజృంభిస్తున్న కరోనా వైరస్ మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వైరస్‌కు 2019 నావెల్ కరోనా వైరస్ అని పేరు పెట్టారు.
దీంతో ఈ 2019 ఎన్‌సీవోవీ వైరస్‌ను కరోనా కుటుంబంలో ఏడో రకం వైరస్‌గా చెబుతున్నారు.
ఈ వైరస్ జన్యు క్రమాన్ని పరిశీలించినప్పుడు, ఇది గబ్బిలాల్లో కనిపించే కరోనా వైరస్, పాములో ఉన్న వైరస్‌తో కలసి కొత్తగా పుట్టిందని పరిశోధకులు గుర్తించారు.

ఫొటో సోర్స్, Reuters
వేగం దాని లక్షణం
మనుషుల నుంచి మనుషులకు సోకే లక్షణం ఉండటం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమవుతోంది.
ఈ వైరస్ జంతువుల మధ్య, జంతువుల నుంచి మనుషులకూ వ్యాప్తి చెందగలదు.
గాలి ద్వారా ఇతర ఇతరులకు సోకుతుంది. దీని బారినపడ్డ వారికి సన్నిహితంగా ఉన్నా ప్రమాదమే.
వూహాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్ ఈ వైరస్ వ్యాప్తికి కేంద్ర స్థానంగా భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ వైరస్ లక్షణాలేంటి?
ఈ వైరస్ సోకిన వారికి ముందుగా జలుబు వస్తుంది. ఆపై జ్వరం, దగ్గు, ఛాతిలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
ఆపై చికిత్స అందకపోతే తీవ్రమైన న్యుమోనియాకు దారితీయడం, కిడ్నీ వంటి కీలక అవయవాలు విఫలమై ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది.
చలికాలంలో ఈ వైరస్ తీవ్రత, వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.
ఇది సోకిన వాళ్లు తుమ్మినా, దగ్గినా వారి ద్వారా ఈ వైరస్ ఇతరుల శ్వాసకోశ నాళంలోకి ప్రవేశించడం ద్వారా వ్యాప్తి చెందుతోంది.
ఈ వైరస్ పెంపుడు జంతువులతో పాటు, ప్రధానంగా పాముల నుంచి సంక్రమించినట్లు జర్నల్ ఆఫ్ మెడికల్ వైరాలజీ ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఈ వ్యాధికి చికిత్స కానీ, అడ్డుకోగలిగిన వ్యాక్సీన్ కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేదు.
ఈ వైరస్ బారిన పడకుండా కాపాడుకోవడమే అతి పెద్ద చికిత్సా మార్గం అంటున్నారు.
ఇది సోకకుండా ఉండాలంటే, ఇతరులను, అపరిచితులను తాకకూడదు. ముఖ్యంగా ఇతరుల కళ్లు, నోరు, ముక్కు భాగాలను తాకరాదు.
నిత్యం మాస్కులు ధరించాలి. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండకూడదు. సాధ్యమైనంతగా బయటకు రాకుండా ఉంటే మంచిది.
దూర ప్రాంతాలకు ప్రయాణాలు కూడా చేయకూడదు. ఎప్పటికప్పుడు చేతుల్ని సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు కడుక్కోవాలి. కుటుంబ సభ్యులు కూడా ఒకరికొకరు దూరంగా ఉండటం మంచిది.
ముఖ్యంగా చలి వాతావరణంలో ఉండకూడదు. పెంపుడు జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి.
2002- 2003 మధ్య కరోనా కుటుంబానికి చెందిన సార్స్ వైరస్ ప్రపంచ దేశాలకూ వ్యాపించింది.
ఇప్పుడు కరోనా వైరస్ 2019nCOV విజృంభిస్తోంది.
ఈ వైరస్ నేపథ్యంలో భారత్ సహా ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, హాంగ్‌కాంగ్, అమెరికా వంటి దేశాల అంతర్జాతీయ విమానాశ్రయాల్లో చైనా నుంచి వచ్చే ప్రయాణికుల్ని క్షుణ్ణంగా థర్మోస్ స్కాన్ చేస్తున్నారు.
చైనాలో అంతర్జాతీయ యూనివర్సీటీలలో వందలాది మంది భారతీయ విద్యార్థులున్నారు.
చైనా నుంచి వచ్చిన వారిని క్షుణ్ణంగా పరిశీలించాకే భారత్‌లోకి అనుమతిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
- రజినీకాంత్ చెప్పిన దాంట్లో నిజమెంత... సీతారాముల నగ్నవిగ్రహాలకు పెరియార్ చెప్పుల దండలు వేసి ఊరేగించారా..
- బిడ్డ పుట్టిన నిమిషం లోపే బొడ్డు తాడు కత్తిరిస్తే ఏమవుతుంది
- ఈ బాలుడు పడుకుంటే.. అతని ప్రాణానికే ముప్పు
- పీరియడ్స్‌లో ఉన్న మహిళలు బ్యాడ్జీలు ధరించే విధానంపై 'పునరాలోచన' చేస్తున్న జపాన్ సూపర్ బజార్
- క్రికెట్ పోటీల్లోకి మరో కొత్త దేశం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నైజీరియా జట్టు
- ఎక్కడివాళ్లు అక్కడే... వైరస్ భయంతో చైనా నగరంలో రైళ్లు, విమానాలు బంద్
- సంగీతం వింటూ వ్యాయామం చేస్తే ఎక్కువ మేలు జరుగుతుందా?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి...
- బంగారం, ప్లాటినం కంటే ఈ లోహం ఖరీదైంది.. దీనికి ఎందుకింత డిమాండ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









