పీరియడ్స్‌లో ఉన్న మహిళలు బ్యాడ్జీలు ధరించే విధానంపై 'పునరాలోచన' చేస్తున్న జపాన్ సూపర్ బజార్

రుతుస్రావం బ్యాడ్జ్

ఫొటో సోర్స్, WWD JAPAN

జపాన్‌లోని ఒక డిపార్ట్‌మెంటల్ స్టోరులో మహిళా సిబ్బంది తాము రుతుస్రావంలో ఉన్నపుడు ప్రత్యేక బ్యాడ్జీలు ధరించవచ్చు. అయితే, ఈ విధానం గురించి తాము 'పునరాలోచిస్తామ'ని ఆ స్టోర్ యాజమాన్యం చెప్తోంది.

'మిస్ పీరియడ్' అనే కార్టూన్ క్యారెక్టర్‌తో ఉండే ఈ బ్యాడ్జీలను ధరించే విధానాన్ని గత అక్టోబర్ నెలలో ప్రవేశపెట్టారు.

ఈ బ్యాడ్జీలు ధరించిన సిబ్బందికి ఎక్కువ సాయం లభించేలా చూడటం, ఎక్కువ సేపు విరామం తీసుకునేందుకు అవకాశం ఇవ్వటం ఈ విధానం ఉద్దేశం.

''సిబ్బంది రుతుస్రావ సమాచారాన్ని వినియోగదారులతో పంచుకోవటం అసలు మా ఉద్దేశం కాదు'' అని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు.

ఈ బ్యాడ్జీలను ఎందుకు ప్రవేశపెట్టారు?

ఒసాకా ఉమెడా డిపార్ట్‌మెంటల్ స్టోర్‌కు చెందిన దైమారు శాఖలో మహిళా దుస్తుల విభాగంలో పనిచేసే 500 మంది మహిళా సిబ్బంది కోసం అక్టోబర్ నెలలో రుతుస్రావ బ్యాడ్జీలు ధరించే విధానం ప్రవేశపెట్టారు.

సిబ్బంది వీటిని స్వచ్ఛందంగా ధరించవచ్చు. ఉద్యోగులే స్వయంగా సూచించిన తర్వాత వీటిని ప్రవేశపెట్టారు. అయితే.. స్టోరులో కొత్త విభాగం ప్రారంభానికీ ఈ బ్యాడ్జీకీ సంబంధం ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ బ్యాడ్జీ మీద ఒకవైపు... ఆ కొత్త విభాగం 'మహిళల సంక్షేమానికి' అంకితమైందని, అది నవంబర్ 22వ తేదీన ప్రారంభమవుతుందని చెప్తోంది. మరొకవైపు.. 'సీరీ చాన్' మస్కట్ ముద్రించి ఉంది. సీరీ అంటే రుతుస్రావం అని అర్థం.

''ఈ సమాచారం వెల్లడించటం ద్వారా సిబ్బంది పనిచేసే వాతావరణాన్ని మెరుగుపరచటం ఈ బ్యాడ్జి ఉద్దేశం'' అని దైమారు అధికార ప్రతినిధి యోకో హిగుచి బీబీసీతో పేర్కొన్నారు.

సిబ్బంది, వినియోగదారులు ఏమంటున్నారు?

ఈ బ్యాడ్జీల గురించి స్టోరు యాజమాన్యం నవంబర్ 21వ తేదీన మీడియాకు చెప్పినపుడు.. సదరు మహిళ రుతుస్రావంలో ఉన్న విషయాన్ని సహోద్యోగులతో పాటు వినియోగదారులకు కూడా తెలియజేయటం వీటి ఉద్దేశమని కొన్ని సంస్థలు తప్పుగా నివేదించాయి.

అప్పుడు ప్రజల నుంచి ''చాలా ఫిర్యాదులు'' వచ్చాయని.. ''వాటిలో కొన్ని వేధింపులపై ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చాయని''.. పేరు వెల్లడించని దైమారు ఉన్నతస్థాయి సిబ్బంది ఒకరు చెప్పారు.

కొంతమంది సిబ్బంది ఈ బ్యాడ్జీలను ధరించటానికి అయిష్టత చూపారని హిగుచీ తెలిపారు.

''కానీ ఇతరులు సానుకూలంగా స్పందించారు. సహోద్యోగుల్లో ఒకరు రుతుస్రావంలో ఉన్నట్లు తెలిసినపుడు.. ఆమె కోసం బరువైన వస్తువలను మనం పట్టుకెళతాం అని ముందుకు వెళ్లవచ్చు. లేదంటే ఎక్కువ సేపు విరామం తీసుకోవాలని సూచించవచ్చు. ఈ మద్దతు పరస్పరం లభిస్తుంది'' అని ఆమె పేర్కొన్నారు.

వినియోగదారులు సైతం తమ మద్దతు తెలుపుతూ ఫోన్‌లు చేశారని కూడా ఆమె తెలిపారు.

ఇప్పుడు ఏం జరుగుతోంది?

దైమారు సంస్థ ఈ విధానాన్ని రద్దు చేయటం లేదు. కానీ దీని మీద పునరాలోచన చేస్తున్నారు.

ఈ సమాచారం సాధారణ ప్రజలకు తెలియకండానే సహోద్యోగులతో పంచుకునేందుకు వేరే మార్గం వెదుకుతామని హిగుచీ చెప్పారు.

line

'చర్చ భారీగా మారుతోంది'

''చాలా దేశాల్లో మాదిరిగానే జపాన్‌లో కూడా రుతుస్రావం గురించి మహిళలు.. పురుషులతో కాదుకదా కనీసం బహిరంగంగా మాట్లాడటం అరుదు. ఈ అంశాన్ని ఎప్పుడూ సిగ్గుపడే విషయంగా పరిగణిస్తారు. అయితే ఇప్పుడు ఇందులో భారీ మార్పు వస్తోంది'' అని టోక్యోలో బీబీసీ న్యూస్ ప్రతినిధి యూకో కాటో పేర్కొన్నారు.

''రుతుస్రావం గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులతో స్వేచ్ఛగా మాట్లాడటం ఎలా అనే అంశం మీద.. ప్రభుత్వ టీవీ చానల్ ఎన్‌హెచ్‌కేలో ప్రజాదరణ గల ఉదయపు కార్యక్రమం 'అసాయ్‌చీ'లో మహిళా, పురుష వ్యాఖ్యాతలతో గంట సేపు చర్చ నిర్వహించారు'' అని ఆమె పేర్కొన్నారు.

అక్టోబర్‌లో వినియోగ పన్ను రేటును 8 శాతం నుంచి 10 శాతానికి పెంచినపుడు.. రుతుస్రావ ఉత్పత్తుల మీద కూడా ఆ పన్నును పెంచటం మహిళల్లో వ్యతిరేకతకు దారితీసిందని.. మహిళల రుతుస్రావాల గురించి సామాజిక చర్చకు ఈ విషయం కూడా దోహదపడిందని వివరించారు.

ఈ బహిరంగ చర్చకు సోషల్ మీడియా కూడా సాయపడిందని.. అలాగే ప్రకృతి విపత్తుల సమయంలో శిబిరాల్లో తలదాచుకునేటపుడు మహిళల అనుభవాలు కూడా ఈ చర్చను పెంపొందించాయని తెలిపారు.

''ఆ శిబిరాల్లో మహిళలు రక్తస్రావాన్ని నియంత్రించుకోవాలని సలహాలు ఇవ్వటం, ప్యాడ్లు కావాలని అడగటం తప్పని చెప్పటం వంటి ఉదంతాలతో సోషల్ మీడియాలో చాలా కథనాలు చూశాం'' అని యూకో పేర్కొన్నారు.

ఉదాహరణకు ఒక శిబిరంలో ప్యాడ్ కావాలని అడిగినపుడు.. ''ఇటువంటి సమయంలో సెక్స్ గురించి నువ్వె ఎలా ఆలోచిస్తావు?'' అనే స్పందన వచ్చినట్లు ఒక కథనం చెప్తోందని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)