కుక్క నాకితే మనిషి చనిపోతాడా, కుక్క లాలాజలం అంత ప్రమాదకరమా?

కుక్క, శునకం

ఫొటో సోర్స్, Getty Images

కుక్క కరవడమే కాదు, నాకడం కూడా కొన్నిసార్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అలా తన పెంపుడు కుక్క నాకడంతో ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ సోకి జర్మనీకి చెందిన ఓ వ్యక్తి చనిపోయారని తాజాగా 'యూరోపియన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్ ఇన్ ఇంటర్నల్ మెడిసిన్‌' వెల్లడించింది.

కుక్కలు, పిల్లుల లాలాజలంలో క్యాప్నోసైటోఫాగా కానిమోర్సస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. కుక్క, పిల్లి కరవడం వల్ల ఆ బ్యాక్టీరియా సోకిన కేసులు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తుంటాయి. కానీ, జర్మనీకి చెందిన ఓ 63 ఏళ్ల వ్యక్తి కుక్క కరవకున్నా ఆ బ్యాక్టీరియా సోకి చనిపోయారు.

మూడు రోజుల పాటు తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పులతో బాధపడిన తర్వాత ఆయన ఆస్పత్రిలో చేరారు.

ఆయన ముఖం, చేతుల మీద బొబ్బలు, ఎర్రని మచ్చలు ఏర్పడ్డాయి. శరీరం లోపల కూడా అనేక అవయవాలు దెబ్బతిన్నాయి. కాలేయం పనిచేయడం ఆగిపోయింది, అది కార్డియాక్ అరెస్ట్‌కు దారితీసింది. దాంతో, ఆస్పత్రిలో చేరిన తర్వాత 16 రోజులకు ఆయన మరణించారు.

కొన్ని వారాల కింద ఆయనను పెంపుడు కుక్క నాకింది కానీ ఎలాంటి గాయం చేయలేదని జర్నల్‌లో పేర్కొన్నారు. దీనిని బట్టి, కుక్కలు, పిల్లులు నాకినా కొన్నిసార్లు ప్రమాదకరంగా మారొచ్చని తెలిపారు.

శునకం

ఇలాంటి కేసులు అరుదే, కానీ...

"కుక్క లాలాజలంలో అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది. అందులో క్యాప్నోసైటోఫాగా ఒకటి. కుక్క కరిచినప్పుడు ఆ బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కుక్క కరవకపోయినా, గాయాలున్న చోట అది నాకితే దాని లాలాజలంలోని బ్యాక్టీరియా మనకు సంక్రమించవచ్చు’’ అని హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ సైన్స్‌‌ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ బీడీపీ కళా కుమార్ వివరించారు.

అయితే, ఈ బ్యాక్టీరియా ప్రాణాంతకంగా మారిన కేసులు చాలా అరుదని, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారి మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు.

"కుక్కలను ప్రేమగా చూసుకోవడంలో తప్పులేదు. కానీ అది అతి ప్రేమ కాకూడదు. పెంపుడు కుక్కలతోనూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్నారులను కుక్కలు నాకడం, గీరడం లాంటివి చేస్తుంటాయి. నాకు తెలిసి ఈ బ్యాక్టీరియాను నిరోధించే టీకాలు లేవు. కాబట్టి, ఎవరూ అశ్రద్ధ చేయకూడదు" అని కళా కుమార్ సూచించారు.

కుక్క, శునకం

ఫొటో సోర్స్, BIRMINGHAM DOGS' HOME

కుక్క కరవకపోయినా తాకినప్పుడు, నాకినప్పుడు ముఖ్యంగా కుక్క లాలాజలం ద్వారా ఈ బ్యాక్టీరియా మనుషులకు సోకే అవకాశం ఉంటుందని, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారి మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పేర్కొంది.

ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారికి, హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్, కేన్సర్‌, మధుమేహం లాంటి రుగ్మతలతో బాధపడేవారిలో, ప్లీహం తొలగించిన వారిలో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది.

తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారిలో దాదాపు 30 శాతం మంది చనిపోయే అవకాశం ఉందని సీడీసీ తెలిపింది. గుండె పోటు, మూత్రపిండాలు పనిచేయకపోవడం, గ్యాంగ్రీన్ (రక్తసరఫరా ఆగిపోయి కణాలు చనిపోవడం) లాంటి తీవ్రమైన సమస్యలకు కూడా దారితీసే ప్రమాదం ఉంటుందని వెల్లడించింది.

ఎక్కువగా 40 ఏళ్లకు పైబడిన వారికి ఈ బ్యాక్టీరియా సోకుతుందని, కొన్ని కేసుల్లో చిన్న పిల్లలు కూడా ఉంటున్నారని, గర్భిణుల మీద కూడా దీని ప్రభావం అధికంగా ఉంటుందని సీడీసీ పేర్కొంది.

ఆస్పత్రి, హాస్పిటల్

ఫొటో సోర్స్, Getty Images

లక్షణాలు

సాధారణంగా చాలామందిలో ఈ బ్యాక్టీరియా సోకిన తర్వాత మూడు నుంచి అయిదు రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో 14 రోజుల వరకూ దాని లక్షణాలు బయటపడకపోవచ్చు.

చర్మంపై వాపులు రావడం, ఎర్రని మచ్చలు ఏర్పడటం, జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి, నీళ్ల వీరేచనాలు, కండరాల నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. తొందరగా చికిత్స ప్రారంభిస్తే యాంటీబయోటిక్ మందులతో నయం చేయొచ్చని సీడీసీ చెబుతోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)