18 షేడ్స్ ఆఫ్ బ్లాక్: ఈ మహిళలు నల్లచీరలు కట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నారు

ఫొటో సోర్స్, Midhun Divakar
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచ ఫ్యాషన్ వేదికలను దశాబ్దాలుగా ఏలుతున్న నలుపు రంగు భారతీయ వస్త్రప్రపంచంలో మాత్రం ఎన్నడూ ఆధిపత్యం చెలాయించలేకపోయింది.
ఇప్పుడు భారత్‌కు చెందిన చీరల డిజైనర్ షర్మిల నాయర్ నల్లరంగే ప్రధానంగా చీరలు రూపొందిస్తున్నారు.
'18 షేడ్స్ ఆఫ్ బ్లాక్' పేరుతో 18 మంది మహిళలు చూడముచ్చటైన నల్ల చీరలు కట్టుకుని తమ రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న లింగ వివక్షపై మాట్లాడుతుంటారు.
నాయర్ దీన్ని 'కనిపించని నియంత్రణ'గా చెబుతున్నారు. చాలా సహజంగా, అతి సాధారణంగా అనిపించే వీటిని భావిస్తూ మహిళలు ఒక్కోసారి ఈ నియంత్రణల పరిధిలోకి వెళ్లిపోతుంటారు.
గత ఏడాది శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు నిషేధం ఎత్తివేసినప్పుడు చేపట్టిన నిరసనలే స్ఫూర్తిగా తాను ఈ నల్ల చీరల ప్రచారం ప్రారంభించానని నాయర్ 'బీబీసీ'కి చెప్పారు.
ఆనాటి నిరసనల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడం చూసి ఆశ్చర్యపోయానని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, MIDHUN DIVAKAR
శబరిమల అయ్యప్ప భక్తులు ధరించే రంగు నలుపు కావడం.. ఆలయానికి 18 మెట్లుండడంతో '18 షేడ్స్ ఆఫ్ బ్లాక్' క్యాంపెయిన్ ప్రారంభించినట్లు ఆమె చెప్పారు.
''నెలసరి సమయంలో మహిళలు పరిశుద్ధంగా ఉండరని మాకు చెబుతారు. ఇలాంటి ఆలోచనలను ఇప్పుడు కొందరు కొనితెచ్చుకుంటున్నారు. నా స్నేహితుల్లోనూ కొందరు రుతుస్రావ సమయంలో ఆలయాల్లోకి వెళ్లరు. ఇళ్లలోనూ పూజల్లో పాల్గొనరు'' అని నాయర్ చెప్పుకొచ్చారు.
శబరిమలలోని దేవుడి హక్కుల కోసం అంతమంది మహిళలు పోరాడినప్పుడు మహిళల హక్కుల కోసం వారు ఎందుకు పోరాడలేరని అనిపించింది. పెద్దసంఖ్యలో మహిళలు కదిలివస్తే వారెలాంటి మార్పులు తేగలరో అని ఊహించుకుని ఈ ప్రచారం చేపట్టినట్లు చెప్పారామె.

ఫొటో సోర్స్, Midhun Divakar
ఇలాంటి నియంత్రణలన్నీ బుర్రలోకి ఎక్కడమన్నది చిన్ననాటి నుంచే మొదలవుతుందని ఆమె చెప్పారు.
''స్త్రీ పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడానికి మన సమాజం ప్రాధాన్యమిస్తుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో అమ్మాయికి 18 ఏళ్లు నిండితే ఇక తన పెళ్లి గురించి మాట్లాడడం ప్రారంభిస్తారు. పెళ్లైన తరువాత పిల్లలను ఎప్పుడు కంటావని అడుగుతుంటారు. పిల్లో పిల్లాడినో కన్న తరువాత మళ్లీ రెండో సంతానం ఎప్పుడని అడుగుతుంటారు.''
''మేం మహిళా సాధికారత గురించి మాట్లాడుతుంటాం. కానీ నిత్య జీవితంలో ఇలాంటివాటికి లొంగిపోతాం. అందుకే ఈ కనిపించని ఆంక్షల నుంచి స్త్రీ జాతిని బయటపడేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను'' అన్నారామె.

ఫొటో సోర్స్, MIDHUN DIVAKAR
మా ప్రచారంలో ఫ్యాషన్‌ను పాతుకుపోయిన విశ్వాసాలపై విజయం సాధించడానికి వాడతాం. బాడీ షేమింగ్, శరీర రంగు ఆధారంగా చూపే వివక్ష, బాల్య వివాహాలు, రుతుస్రావాన్ని కళంకంగా చూపించడం.. కుల వివక్ష, పితృస్వామ్యం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడం వంటి అన్ని సమస్యలపైనా మేం పోరాడతామన్నారు షర్మిల నాయర్.
అయితే, ఇలాంటి ప్రచారంలో పాలుపంచుకోవడానికి మహిళలు అంతగా ముందుకురావడం లేదని చెప్పారామె.
''నేను 80 నుంచి 90 మంది మహిళలతో మాట్లాడాను. వారిలో చాలామంది కథలు విన్నాను. కానీ, వారిలో చాలామంది తమ కథలను బయటపెట్టుకోవడానికి ఇష్టపడలేదు. 18 మంది మాత్రం ముందుకొచ్చి తాము ఎదుర్కొన్న ఆటంకాలు, వాటిని ఎలా అధిగమించారో కూడా చెప్పారు'' అన్నారు. వీరిలో లాయర్, నటి, కవయిత్రి, సైకాలజిస్ట్, రచయిత, ఉద్యోగినులు, గృహిణులు ఉన్నారు.

ఫొటో సోర్స్, Midhun Divakar
షర్మిల నాయర్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వీడియోలలో శక్తిమంతమైన మహిళల వ్యక్తిగత కథలున్నాయి.
రచయిత రమ్య శశీంద్రన్ మాట్లాడుతూ.. ''మాతృత్వంపై రెండో మాటే లేదని చిన్నతనం నుంచి వింటూ వచ్చాను. కానీ, నేను తల్లి కావాలనుకోకపోవడంతో సమస్య వచ్చింది'' అన్నారు.

ఫొటో సోర్స్, MIDHUN DIVAKAR
మహిళకు మాతృత్వంతోనే గుర్తింపు వస్తుందనుకోవడం పొరపాటని.. తల్లి కావాలని అంతా కోరుకున్నట్లే తాను తల్లి కాకుండా ఉండాలనుకున్నానని ఆమె చెప్పారు.
సైకాలజిస్ట్ స్వాతి జగదీశ్.. తన తల్లితో తనకు సరైన సంబంధాలు లేకపోవడం, ఆమెతో ఏమీ చెప్పుకోలేకపోవడం గురించి చెప్పారు. ''కాబట్టి నేను.. నా పిల్లలు నన్ను నమ్మేలా ఉండాలనుకుంటున్నాను. వాళ్లు ఏ విషయమైనా నాతో చెప్పుకొనేలా ఉండాలి'' అన్నారామె.
ఇలాంటివన్నీ ఒక ప్రచార కార్యక్రమంతోనో, నిరసనతో పరిష్కారం కావు. ఫ్యాషన్, సృజనలను మంచి సందేశం ఇవ్వడానికి ఉపయోగించొచ్చు. '18 షేడ్స్ ఆఫ్ బ్లాక్' ప్రయత్నం కూడా అదేనన్నారు షర్మిల.
ఇవి కూడా చదవండి
- ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానమన్న కేసీఆర్, స్పందించిన ఆర్టీసీ జేఏసీ నాయకులు
- కిమ్ జీ-యంగ్, బోర్న్ 1982: దక్షిణ కొరియాలో స్త్రీవాదులు, స్త్రీవాద వ్యతిరేకుల మధ్య ఉద్రిక్తతలు రాజేసిన ఫెమినిస్ట్ సినిమా
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- #100WOMEN: మహిళ 'అందం' అనే భారాన్ని మోయాల్సిన అవసరం ఏముంది: నందితా దాస్
- ఈ ఊరిలో బిడ్డను కంటే 8 లక్షల రూపాయల బోనస్ ఇస్తారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








