పాకిస్తాన్‌లో రైలు ప్రమాదాలు రికార్డు స్థాయికి పెరిగాయా?

ఫొటో సోర్స్, RESCUE1122
- రచయిత, రియాలిటీ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
పాకిస్తాన్‌లో ఒక రైలులో మంటలు చెలరేగటంతో 70 మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. దీంతో.. రైలు భద్రతా చర్యల విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి.
''రైల్వే మంత్రి రషీద్ అహ్మద్ హయాంలో అత్యధిక సంఖ్యలో రైలు ప్రమాదాలు జరిగాయి'' అని పాకిస్తాన్ ప్రతిపక్ష నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ పేర్కొన్నారు.
ఇది నిజమేనా? గణాంకాలు చూద్దాం.
రషీద్ అహ్మద్ 2018 ఆగస్టులో రైల్వేమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచీ 2019 జూన్ వరకూ 74 రైలు ప్రమాదాలు జరిగాయని రైల్వే మంత్రిత్వశాఖ గణాంకాలు చెప్తున్నాయి.
ఇటీవలి ప్రమాదం దశాబ్ద కాలంలో అత్యంత ఘోరమైన ప్రమాదం. దీనితో పాటు రషీద్ హయాంలో మరికొన్ని దారుణ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. జులైలో రైలు పట్టాలుతప్పి 20 మంది చనిపోయిన ప్రమాదం కూడా వీటిలో ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అంతకుముందు సంవత్సరాల సంగతేమిటి?
రషీద్ అహ్మద్ పదవీ కాలాన్ని.. అంతకుముందు సంవత్సరాలతో పోల్చటం కష్టం. ఎందుకంటే.. అప్పటి ప్రమాదాలకు సంబంధించిన సమాచారం అసంపూర్తిగా ఉంది.
అయితే.. దాదాపు 12 నెలల్లో 74 రైలు ప్రమాదాలు అనేది.. మేం చూసిన లెక్కలను బట్టి అసాధారణం కాదు.
పాకిస్తాన్ రైల్వేలకు సంబంధించిన చారిత్రక గణాంకాలు.. 2012 నుంచి 2017 మధ్య 757 రైలు ప్రమాదాలు జరిగినట్లు చెప్తున్నాయి. అంటే.. సగటున ఏడాదికి 125 ప్రమాదాలు.
ఇందులో పట్టాలు తప్పటం, కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఢీ కొనటం వంటి ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయి.
ఈ కాలంలో 2015 సంవత్సరంలో అత్యధికంగా 175 రైలు ప్రమాదాలు సంభవించాయి. అందులో 75 ఉదంతాల్లో రైళ్లు పట్టాలు తప్పాయి. మరో 76 ఉదంతాలు రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఢీకొన్న ప్రమాదాలు.
గత ఆరేళ్లలో రైలు ప్రమాదాల్లో 150 మంది చనిపోయారని స్థానిక మీడియా కథనాలు చెప్తున్నాయి.
రైల్వే మంత్రిత్వశాఖ పార్లమెంటుకు సమర్పించిన వేరే గణాంకాలను కూడా మేం చూశాం. 2013 నుంచి 2016 మధ్య 338 రైలు ప్రమాదాలు జరిగాయని.. వాటిలో 118 మంది చనిపోయారని ఆ లెక్కలు చెప్తున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
రైలు ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి?
వంట కోసం ఉపయోగించే విస్ఫోటక గ్యాస్ సిలిండర్.. తాజా ప్రమాదానికి కారణమైందని ప్రభుత్వం చెప్తోంది. ఆ మంటలు బోగీలకు విస్తరించటంతో చాలా మంది కదులుతున్న రైలు నుంచి దూకేశారు.
కానీ.. ప్రమాదానికి సంబంధించిన ఇతర కథనాలు.. విద్యుత్ సమస్యలు దీనికి కారణం కావచ్చునని సూచిస్తున్నాయి. రైలులో సంభవించిన షార్ట్-సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణం కావచ్చునని.. ప్రమాదం నుంచి బయటపడ్డ పలువురు ప్రయాణికులు చెప్పినట్లు ఆ కథనాలు తెలిపాయి.
ఆ రైలు పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి రావల్పిండికి వెళుతోంది. దేశంలో అత్యంత పురాతనమైన, రద్దీగా ఉండే రైలు మార్గమిది.
పాకిస్తాన్‌లో.. ప్రత్యేకించి మధ్య తరగతి, దిగువ తరగతి ఆదాయ వర్గాల వారు.. రైలు ప్రయాణం అన్నిటికన్నా అధికంగా ఉపయోగించే రవాణా, ప్రయాణ సాధనం. దేశం నలువైపులా రైల్వే ట్రాక్‌లు విస్తరించి ఉన్నాయి.
అయితే.. రైలు బోగీలలో తరచుగా విపరీతమైన రద్దీ ఉంటుంది. చాలా రైళ్లు పాడైపోయిన స్థితిలో ఉన్నాయి.

విమానాశ్రయాలకన్నా రైల్వే స్టేషన్లలో భద్రతా తనిఖీలు చాలా బలహీనంగా ఉంటాయని బీబీసీ ఉర్దూ ప్రతినిధి అబిద్ హుస్సేన్ చెప్తున్నారు.
కాబట్టి.. వంట చేసే స్టవ్‌లు, ఆయిల్ క్యాన్లు, గ్యాస్ సిలిండర్లను తరచుగా రైలులోకి తెస్తుంటారు.
పాకిస్తాన్‌లో రైలు ప్రమాదాలకు మూడు ప్రధాన కారణాలు.. ట్రాక్ నిర్వహణ లోపం, సిగ్నల్ సమస్యలు, పాతబడిన ఇంజన్లేనని అధికారులు చెప్తున్నారు.
రైలు బోగీలు డిజైన్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ మంది ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటాయి కాబట్టి.. ప్రమాదాల్లో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది.
2007లో మెహ్రాబ్‌పూర్‌లో రైలు పడిపోయిన ప్రమాదంలో 56 మంది చనిపోగా.. 120 మందికి పైగా గాయపడ్డారు.
2005లో సింధ్ ప్రావిన్స్‌లో మూడు రైళ్లు ఢీకొని 130 మంది మృతిచెందారు.

ఫొటో సోర్స్, Alamy
ఇవి కూడా చదవండి:
- చైనాలోని గాజు వంతెనలను ఎందుకు మూసేస్తున్నారు
- ఇందిరాగాంధీ హత్య: అంగరక్షకులే ఆమెను ఎలా చంపారు?
- ఐఎస్ చీఫ్ బగ్దాదీ అండర్‌వేర్‌ను ఆ గూఢచారి ఎందుకు దొంగిలించారు?
- వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- స్టాకర్వేర్: భార్యలు, భాగస్వాములపై నిఘా కోసం పెరుగుతున్న స్పైవేర్ వినియోగం.. రెండో స్థానంలో భారత్
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- RCEP అంటే ఏమిటి? మోదీ ఈ ఆర్థిక బృందంలో చేరితే భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
- వాట్సాప్ మెసేజ్‌ల మీద నిఘా పెట్టాలని భారతదేశం ఎందుకు భావిస్తోంది?
- ఎరిత్రియా: ఇక్కడ సిమ్ కార్డులు బంగారంతో సమానం.. ఏటీఎంల గురించి వారికి తెలియదు
- సౌదీ అరేబియా భారతదేశంతో స్నేహం ఎందుకు కోరుకుంటోంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








