ఎరిత్రియా: ఇక్కడ సిమ్‌ కార్డులు బంగారంతో సమానం... ఏటీఎంల గురించి వారికి తెలియదు

ఎరిత్రియాలో నేషనల్ సర్వీస్ చేయడం తప్పనిసరి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎరిత్రియాలో నేషనల్ సర్వీస్ చేయడం తప్పనిసరి.

ఆఫ్రికాలో అత్యంత అణచివేతకు గురైన ప్రాంతాల్లో ఎరిత్రియా ఒకటిని అభివర్ణిస్తారు. ఇక్కడ ప్రజలకు ప్రాథమిక రాజకీయ హక్కులు లేవు, మత స్వేచ్ఛ కూడా లేదు.

ఏకపార్టీ వ్యవస్థ అమల్లో ఉన్న ఎరిత్రియాలో ఇది ఆశ్చర్యకర విషయమేమీ కాదు. 1993లో ఇథియోపియా నుంచి స్వాతంత్ర్యం వచ్చాక అప్పటి నుంచి దేశ అధ్యక్షుడిగా ఇసాయియాస్ అఫెవెర్కినే పాలిస్తున్నారు.

ప్రతిపక్ష పార్టీలను, స్థానికంగా ఉండే ప్రైవేటు మీడియాను ప్రభుత్వం నిషేధించింది. యువకులను మిలిటరీ నీడల్లో ఉండే శిబిరాల్లో ఉంచింది.

ఈ కారణంగా వేలాదిమంది ఎరిత్రియన్లు దేశం వదిలి పారిపోయారు. ప్రమాదకర సహారా ఏడారి వెంట, మధ్యదరా సముద్రం గుండా ప్రయాణిస్తూ చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

బీబీసీ అమ్హారిక్ ప్రతినిధి జిబాత్ తమీరత్ ఇటీవల ఆ దేశ అనుమతితో ప్రభుత్వ కనుసన్నల్లో అక్కడ పర్యటించారు.

ప్రజాజీవితంపై ప్రభుత్వం విధించిన అసాధారణ నియంత్రణ గురించి ఆయన వివరించారు.

దేశంలో ఇప్పటికీ అత్యధిక మంది పబ్లిక్ టెలిఫోన్‌లనే వినియోగిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, దేశంలో ఇప్పటికీ అత్యధిక మంది పబ్లిక్ టెలిఫోన్‌లనే వినియోగిస్తున్నారు.

1). సిమ్ కార్డులు బంగారమే

ప్రభుత్వ యాజమాన్యంలోని ఎరిటెల్ ఒక్కటే అక్కడి టెలికాం సేవలను అందించే సంస్థ. దీని సర్వీస్ చాలా దారుణంగా ఉంటుంది. కఠిన నియంత్రణల మధ్య ఇది పనిచేస్తుంది.

ఎరిత్రియాలో కేవలం 1 శాతం పైనే ఇంటర్నెట్ వినియోగం ఉందని అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్ యూనియన్ ఒక నివేదికలో పేర్కొంది.

ఇక సిమ్ కార్డుల విషయానికి వస్తే అవి ఎరిత్రియాలో బంగారు తునకతో సమానం. సిమ్ కార్డు కోసం ప్రజలందరూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి.

ఒకవేళ మీకు సిమ్ కార్డ్ వచ్చినా, మొబైల్ డేటా లేనందున ఇంటర్నెట్ ఉపయోగించుకోలేరు.

వైఫై ద్వారా మాత్రమే ఇక్కడ ఇంటర్నెట్‌ను వాడొచ్చు. కానీ, అది కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది.

ప్రభుత్వ సెన్సార్‌షిప్‌ను తప్పించుకోడానికి చాలా మంది వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్)ను ఉపయోగించి ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా సైట్లకు వెళతారు.

సిమ్ కార్డులు పొందడంలో చాలా ఇబ్బంది ఉండటంతో పబ్లిక్ ఫోన్‌లపైనే ప్రజలు ఆధారపడుతున్నారు.

మేం అక్కడ పర్యటించిన మొదటి నాలుగు రోజులు పబ్లిక్ ఫోన్లనే వినియోగించాం. ముగ్గురు సభ్యులున్న బీబీసీ బృందానికి ప్రభుత్వం ఒక సిమ్ కార్డు ఇచ్చింది. మేం దేశం విడిచివెళ్లినప్పుడు ఆ సిమ్‌ను కూడా వారికి తిరిగి ఇవ్వాలి.

డబ్బు

2) బ్యాంక్ నుంచే డబ్బులు డ్రా చేసుకోవాలి

బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసుకునే విషయంలో కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

బ్యాంకు ఖాతాలో లక్షలాది నక్ఫా (ఎరిత్రియన్ కరెన్సీ)లు ఉన్నప్పటికీ, నెలకు ఐదు వేల నక్ఫాలు మాత్రమే డ్రా చేసుకోవాలి.

అయితే, పెళ్లిళ్లకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ పెళ్లి ఐదు వేల నక్ఫాలతో పూర్తయ్యేదికాదు.

వివాహం చేసేవారు బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకునేందుకు స్థానిక ప్రభుత్వ పరిపాలన కార్యాలయాలకు వెళ్లాలి. వారికి లేఖ రాయాలి. అప్పుడు ఐదు వేల నక్ఫాల కంటే ఎక్కువ నగదు ఉపసంహరించుకోడానికి అధికారులు అనుమతి ఇస్తారు.

నగదు ఉపసంహరణపై ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు విధించిందనే దానిపై ఎరిత్రియన్లు భిన్నమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు.

ప్రజల్లో పొదుపు అలవాటును పెంపొందించడం, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కొందరు చెబితే, వాణిజ్య కార్యకలాపాలను ప్రభుత్వం ఇష్టపడటం లేదని అందుకే నగదు చలామణిని పరిమితం చేసిందని మరికొందరు చెప్పారు.

ఎరిత్రియాలో ఏటీఎంలు లేవు. ఓ కారు కొనుగోలుదారుడు మాతో మాట్లాడుతూ, గతేడాది ఇథియోపియాతో యుద్ధవాతావరణం ముగిసిన తరువాత సరిహద్దు తెరిచినప్పుడు, తాను ఉత్తర ఇథియోపియాలోని మెకెల్లె నగరానికి వెళ్లానని అక్కడ ఒక యంత్రం నుంచి డబ్బు డ్రా చేయడం చూసి నోరెళ్లబెట్టానని మాతో చెప్పారు.

ఎరిత్రియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇక్కడ టీవీలలో స్థానిక కార్యక్రమాల కంటే విదేశీ కార్యక్రమాలనే ఎక్కువగా చూస్తుంటారు.

3) ఒక్కటే టీవీ స్టేషన్

ప్రభుత్వ యాజమాన్యంలోని ఎరి-టీవీ ఎరిట్రియాలో ఉన్న ఏకైక టెలివిజన్ స్టేషన్. ఇది ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటుంది.

అయితే, శాటిలైట్ డిష్ ఉంటే బీబీసీతో పాటు ఇతర అంతర్జాతీయ ఛానెల్స్ చూడొచ్చు.

పత్రికా స్వేచ్ఛకు సంబంధించి ప్రపంచంలోనే అత్యంత సెన్సార్‌షిప్ ఉన్న దేశంగా ‘‘ది కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ (సీపీజే)’’ ఎరిత్రియాను అభివర్ణించింది. ఈ విషయంలో ఉత్తర కొరియాను మించిందని తెలిపింది.

అయితే, దీనిని ఎరిత్రియా సమాచార మంత్రి యెమనే మెస్కెల్ ఖండించారు. దేశంలోని పట్టణాలు, నగరాల్లో 91 శాతం కంటే ఎక్కువ ఇళ్లలో శాటిలైట్ డిష్‌లున్నాయని చెప్పారు. 650కి పైగా అంతర్జాతీయ టీవీ ఛానెళ్లు ఇక్కడ వస్తాయని తెలిపారు. తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఫోటోలను కూడా ట్వీట్ చేశారు.

ఇక్కడ బార్లు, రెస్టారెంట్లకు ఇటాలియన్ పేర్లు ఎక్కువగా కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇక్కడ బార్లు, రెస్టారెంట్లకు ఇటాలియన్ పేర్లు ఎక్కువగా కనిపిస్తాయి.

4). మద్యం తయారీ కంపెనీ కూడా ఒక్కటే

ఇటాలియన్ ఇంజినీర్ లుయిగి మెలోటియా 1939లో స్థాపించిన అస్మారా బ్రూవర్ దేశంలో ఉన్న ఏకైక మద్యం తయారీ కంపెనీ. ఇటీవల వరకు, ఒక బార్‌లో రెండు బీర్లు మాత్రమే తాగడానికి అనుమతి ఉండేదని స్థానికులు మాకు చెప్పారు.

ఎక్కువగా తాగాలనుకునేవాళ్లు మద్యం ముట్టని వారిని తమతో పాటు తీసుకెళ్లేవారు. వారి కోటాలు తాగేవారు. కొన్ని నెలల నుంచి మద్యం పరిమితిని తొలగించారని, ఇప్పుడు తగినంత సరఫరా ఉందని స్థానికులు చెప్పారు.

ఎరిత్రియా

ఫొటో సోర్స్, Getty Images

5) వలస వెళ్లాలని యువకుల కల

''ఇక్కడ పాస్‌పోర్ట్ పొందడమంటే కల నెరవేరడం లాంటిది '' అని మాతో డిన్నర్ చేసిన యువకుడు చెప్పారు.

సైనిక శిక్షణతో సహా నేషనల్ సర్వీస్ పూర్తి చేసే వరకు యువకులకు పాస్‌పోర్ట్ ఇవ్వరని తెలిపారు. పాస్‌పోర్ట్ కావాలంటే స్థానిక ప్రభుత్వ పరిపాలన కార్యాలయాల నుంచి అనుమతి పత్రం పొందాలని చెప్పారు.

"అప్పటికి మీకు వయసు 40 లేదా 45కు వచ్చేస్తుంది. భార్య, పిల్లలు ఉంటారు'' అని అతను చమత్కరించారు.

పాస్‌పోర్టు వచ్చినంత మాత్రాన ఎవరూ దేశం విడిచిపోలేరు. 'ఎగ్జిట్ వీసా' కూడా అవసరం. కానీ, దేశం విడిచి వెళ్లిన వారు తిరిగి రారని ప్రభుత్వం భయపడుతోంది. దీంతో ఎవరికీ వీసా వచ్చే పరిస్థితి లేదు.

అందుకే, ఎక్కువ సంఖ్యలో ఎరిత్రియన్ యువత ఇథియోపియా, సుడాన్‌లో స్థిరపడటానికి సరిహద్దులను దాటి చట్టవిరుద్ధంగా వెళుతోంది.

కొందరు సహారా, మధ్యధరా సముద్రంగుండా యూరప్ చేరుకోవడానికి ప్రాణాన్ని పణంగా పెడుతున్నారు. ఎడారిలో ఆకలి, దాహంతో చనిపోతున్నారు. సముద్రంలో మునిగిపోతున్నారు.

చాలామంది శరణార్థులు ఇథియోపియా (174,000), సుడాన్ (114,500)లలో తలదాచుకుంటున్నారు. జర్మనీ (55,300), స్విట్జర్లాండ్ (34,100)లలో కూడా కొద్దిమంది ఉన్నారు.

ముస్సోలిని అస్మారాను లిటిల్ రోమ్ చేయాలనుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముస్సోలిని అస్మారాను లిటిల్ రోమ్ చేయాలనుకున్నారు.

6) అందమైన రాజధాని

ఇటలీ ఫాసిస్ట్ నియంత బెనితో ముసోలినీ అస్మారాను ఆఫ్రికాలో లిటిల్ రోమ్‌గా ఉండాలని కోరుకున్నారు. ఎందుకంటే ఆయన 1930లలో కొత్త రోమన్ సామ్రాజ్యానికి ప్రణాళికలు వేశారు.

ఇక్కడి ఆధునిక భవనాలు చూస్తే ఇటాలియన్ వలసరాజ్య పాలనను అవి గుర్తు చేస్తాయి.

ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ యునెస్కో, అస్మారాను ప్రపంచ వారసత్వ ప్రాంత జాబితాలో చేర్చింది. ఎరిత్రియాలో అనేక రాజకీయ, ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికీ, అస్మారా ఒక అందమైన రాజధాని నగరమని చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)