మానసిక ఆరోగ్యం: "అమ్మకు డిమెన్షియా ఉంది... అమ్మతో నా ప్రయాణం నన్ను ఎలా మార్చిందంటే.. "

దీపాంజనా సర్కార్

మానసిక ఆరోగ్యంపై బీబీసీ అందిస్తున్న వరుస కథనాల్లో ఇదొకటి. డిమెన్షియాతో బాధపడుతున్న ఓ మహిళ సంరక్షణ బాధ్యతలు చూస్తున్న ఆమె కూతురు దీపాంజనా సర్కార్ బీబీసీతో పంచుకొన్న అనుభవాలే ఈ కథనం. ఆమె అనుభవ సారాంశం ఆమె మాటల్లోనే...

"మా అమ్మకు 'డిమెన్షియా (మతిమరుపు వ్యాధి)' ఉన్నట్లు 2017లో వైద్యులు నిర్ధరించారు. నేను అవివాహితను. అమ్మతోనే ఉంటాను. ఈ వ్యాధి వచ్చిందని తేలాక నేనే ఆమెకు ఏకైక సంరక్షకురాలిని అయ్యాను.

వ్యాధి నిర్ధరణ కాక ముందు నుంచే అమ్మకు ఊరికే చిరాకు వచ్చేది. తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ఎప్పుడూ అనుమానిస్తూ ఉండేది. అమ్మ బాల్యంలో ఆమెపై లైంగిక దాడి జరిగింది. ఈ విషయం అమ్మ 74 ఏళ్ల వయసులో నాతో మొదటిసారిగా చెప్పింది. ఈ దాడి ప్రభావంతో అమ్మ ఎవరినీ అంత తేలిగ్గా నమ్మదు. ఓ దశలో, అమ్మ మనుషులను నమ్మకపోవడమనేది మరీ ఎక్కువైంది. ఇది స్పష్టంగా కనిపించేది. ఇంట్లో పనిమనుషులు కనిపిస్తే వారి నుంచి తనకేదో ముప్పుందని అనుకొనేది. వారిని నమ్మేది కాదు. అమ్మలో ఒకేసారి ఇంత మార్పు ఎందుకు వచ్చిందో మాకెవరికీ అంతుచిక్కలేదు. ఆ తర్వాత వ్యాధి నిర్ధరణ అయ్యింది.

దీపాంజన తల్లి
ఫొటో క్యాప్షన్, దీపాంజన తల్లి

వ్యాధి తీవ్రత పెరుగుతూ వచ్చే కొద్దీ అమ్మతో నా ప్రయాణం మారిపోయింది. అప్పటికి 14 సంవత్సరాల క్రితం నాన్న చనిపోయారు. అప్పట్నుంచి అమ్మ బాగోగులు నేనే చూసుకొంటూ వస్తున్నా. శారీరక ఆరోగ్యం బాగోలేని మనిషిని చూసుకోవడానికి, మానసిక ఆరోగ్యం బాగోలేని మనిషిని చూసుకోవడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అనారోగ్యమున్నా ఆలోచనా శక్తి ఉంటే పరిస్థితి వేరేలా ఉంటుంది. ఆశ, నిరాశలు దానిమీదే ఆధారపడి ఉంటాయి.

డిమెన్షియా వ్యాధి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, "పూర్తి నిస్సహాయంగా, దుర్బలంగా ఉన్న మనిషి కళ్లలోకి చూసి, 'నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు, నీకు నేనున్నాను' అనే భరోసా ఇవ్వడంలో ఒక గొప్పతనం ఉంది. ఆ గొప్పతనాన్ని ఈ ప్రయాణం నాకు పరిచయం చేసింది. "

అన్ని రకాల ఉద్వేగాలు, అనుభవాలు

మానసిక ఆరోగ్యం సరిగా లేనివారి బాగోగులు చూసుకొనే వ్యక్తులకు అన్ని రకాల ఉద్వేగాలు, అనుభవాలు కలుగుతాయి. ఓవైపు తీవ్రమైన నిరాశ, ఆందోళన, వేదన, నిస్సహాయత, కోపం, పరాజయ భావం, అపరాధ భావం, మరోవైపు ప్రేమ, స్వచ్ఛత, సహానుభూతి, కరుణ, తన్మయత్వం, సంతృప్తి ఇలా అన్ని రకాల ఉద్వేగాలు అనుభవంలోకి వస్తాయి.

పరిస్థితులను మార్చలేననే వాస్తవాన్ని అంగీకరించడానికి నాకు ఏడాదికి పైగా పట్టింది. కొన్ని సందర్భాల్లో అమ్మతో చాలా కోపంగా ప్రవర్తించేదాన్ని. 'అమ్మ ఎందుకిలా చేస్తోంది' అని అనుకొనేదాన్ని. మా ఇద్దరివీ వేర్వేరు స్వభావాలు. మా ఇద్దరి మధ్య చాలా బేధాభిప్రాయాలు ఉన్నాయి. వాటిని చాలా ఏళ్లుగా అణచుకొంటూ వచ్చాను. కానీ అవి తొలగిపోలేదు, అమ్మ మానసిక ఆరోగ్యం క్షీణించే కొద్దీ నేను ఈ విషయాన్ని గ్రహించాను.

వీడియో క్యాప్షన్, "అమ్మకు డిమెన్షియా ఉంది... అమ్మతో నా ప్రయాణం నన్ను ఎలా మార్చిందంటే.. "

వ్యాధి నిర్ధరణ అయ్యాక మొదటి కొన్ని నెలల్లో అమ్మను చూసుకోవడం ప్రతిక్షణం కత్తిమీద సాములా ఉండేది. ఆమె తీరు అనిశ్చితంగా, అంచనాకు అందని విధంగా ఉంటుంది. దీనివల్ల నాకు నిరాశ, నిస్పృహ కలిగేవి.

అమ్మ మేం ఉండే ఇంటిని కూడా గుర్తుపట్టలేకపోయిన సందర్భాలున్నాయి. అమ్మ కొన్ని నెలలపాటు రోజులో అనేకసార్లు తన దుస్తులు తొలగించుకొని నగ్నంగా ఇంట్లో తిరిగింది. ఇవన్నీ చూసి ఒక సంరక్షకురాలిగా కంటే కూతురిగా నేను చాలా బాధను అనుభవించాను. ఎందుకంటే అమ్మతో భావోద్వేగ బంధం లేకుండా వ్యవహరించడం అసాధ్యం. ఈ పరిస్థితుల్లో అమ్మతో ఉద్వేగాలన్నీ తెంచుకొని వ్యవహరిస్తేనే తట్టుకోగలవని నాకు చాలా మంది సూచించారు. కానీ ఇది సాధ్యమయ్యేది కాదు.

మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, "మానసిక ఆరోగ్యం సరిగా లేనివారి బాగోగులు చూసుకొనే వ్యక్తులకు అన్ని రకాల ఉద్వేగాలు, అనుభవాలు కలుగుతాయి."

చనిపోయిన నాన్న కోసం వెతికేది

మొదట్లో అమ్మ తీరును నేను అంగీకరించలేకపోయేదాన్ని. 14 ఏళ్ల క్రితం చనిపోయిన మా నాన్న కోసం అమ్మ అమాయకంగా వెతుకుతుంటే నాకు నిస్సహాయంగా అనిపించేది. చాలా ఆందోళన కలిగేది. నాన్న పేరు పలుకుతూ ఆయన కోసం వెతుకులాడేది. తనను నాన్న దగ్గరకు తీసుకెళ్లమని ప్రాధేయపడేది. చిన్న పిల్లలా ఏడ్చేది. ఏంచేయాలో, ఏంచేయకూడదో, ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో నాకు తెలిసేది కాదు.

ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో డిమెన్షియాకు సంబంధించిన రంగంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి నాకు సూచించే వరకు నాకు చాలా నిస్సహాయంగా అనిపించింది. నేనప్పుడు చేయగలిగింది ఒకే ఒక్కటి- అమ్మ నిద్రపోవాలని కోరుకోవడం. మరుసటి రోజు మరో కొత్త రోజు కాబట్టి అమ్మకేదీ గుర్తుండదనే ఆశతో అలా కోరుకొనేదాన్ని.

దీపాంజన తల్లిదండ్రులు
ఫొటో క్యాప్షన్, దీపాంజన తల్లిదండ్రులు

అమ్మ కొన్నిసార్లు రాత్రి నిద్రలోంచి లేచి, లేనిది ఉన్నట్టు, కనిపించనిది కనిపించినట్టు, వినపడనిది వినపడినట్టు ప్రవర్తించేది. నాకు భయమేసేది. దీనికి అలవాటుపడిపోవడంతో మనసును ప్రశాంతంగానే ఉంచుకొనేదాన్ని. అలసటవల్ల తిరిగి నిద్రలోకి జారుకొనేదాన్ని.

అమ్మ ఉద్యోగం చేసేది. 22 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యింది. ఈ సంగతి ఆమె మెదడులోంచి చెరిగిపోయింది. కొన్నిసార్లు ఆఫీసుకు వెళ్లడానికి సిద్ధమవుతుంటుంది. "నువ్వు రిటైర్ అయ్యి చాలా కాలం అయ్యింది, ఇప్పుడు పెన్షన్ కూడా వస్తోంది" అని చెబితే పట్టలేనంత కోపంతో స్పందిస్తుంది.

ఓ వ్యక్తి

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, "శారీరక ఆరోగ్యం బాగోలేని మనిషిని చూసుకోవడానికి, మానసిక ఆరోగ్యం బాగోలేని మనిషిని చూసుకోవడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది."

ఆ నిజాన్ని అంగీకరించడం కష్టం

అమ్మ వ్యక్తిగత శుభ్రత నేనే చూసుకుంటాను. స్నానం నేనే చేయిస్తాను. అమ్మేమో ఏదో లోకంలో ఉంటుంది. చాలా విషయాలు ఆమె మెదడులో గందరగోళంగా ఉంటాయి. అమ్మ తన జ్ఞాపకశక్తి, జ్ఞాపకాలు, పరిసర జ్ఞానం అన్నీ కోల్పోతుండటం చూసి, ఆ వాస్తవాన్ని అంగీకరించాలంటే చాలా భయం కలిగేది. అంతకన్నా మనసుకు కష్టమైనదేమిటంటే- ఆమె నుంచి ఇక నేను ఏ పురోగతీ ఆశించలేననే నిజాన్ని అంగీకరించడం.

ఆశలు, జ్ఞాపకాలు, ప్రేమ, ఒకరిపై ఒకరు ఆధారపడటం, ఇలా అన్నీ నా చేతుల్లోంచి జారిపోతూ వచ్చాయి. నేనేమో ఏమీ చెయ్యలేకపోయాను. అదో పెద్ద నిస్సహాయత. మాటల్లో చెప్పలేనిది. వ్యక్తులుగా మనం ఎంత చిన్నవాళ్లమో, వాస్తవిక దృక్పథంతో ఉండటం ఎంత అవసరమో నేను ఈ సంక్లిష్టమైన ప్రయాణంలో గుర్తించాను.

కొన్నిసార్లు నా గదిలో నేను విశ్రాంతి తీసుకొంటుంటే, తనపై నేనోదో 'చేతబడి' చేస్తున్నానని అమ్మ అనుకొంది. ఈ పరిస్థితులను ఎలా తట్టుకోవాలో అర్థం కాక ఏడ్చాను. నిజానికి అప్పుడు నేను అమ్మ మానసిక స్థితిని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని కూడగట్టుకొనేందుకు విశ్రాంతి తీసుకొన్నాను.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Thinkstock

జీవిత సహజ గమనాన్ని అంగీకరించడం నేర్చుకున్నా

మానసిక అనారోగ్యం ఉన్నవారి బాగోగులు చూసుకోవడం చాలా కష్టమైన పనే. ఇందులో సందేహమే లేదు. అయితే అమ్మతో ఈ ప్రయాణం నాలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించింది.

నేను మార్చలేని వాటిని వదిలేయడం, అనివార్యమైన పరిస్థితులను, జీవిత సహజ గమనాన్ని ఎదిరించకుండా అంగీకరించడం- ఇవన్నీ ఈ ప్రయాణమే నాకు నేర్పించింది. మౌనం విశిష్టతను కూడా నాకు తెలియజెప్పింది.

పూర్తి నిస్సహాయంగా, దుర్బలంగా ఉన్న మనిషి కళ్లలోకి చూసి, "నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు, నీకు నేనున్నాను" అనే భరోసా ఇవ్వడంలో ఒక గొప్పతనం ఉంది. ఆ గొప్పతనాన్ని ఈ ప్రయాణం నాకు పరిచయం చేసింది.

దీపాంజనా సర్కార్

అవతలి మనిషి చేతులు పట్టుకొని, కేవలం ఓ చిరునవ్వు నవ్వి, ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతే కలిగే సాంత్వన బహుశా నాకెన్నడూ అనుభవంలోకి రాలేదు. ఈ ప్రయాణంలో అమ్మతో నేను అన్ని వేళలా ఉండాల్సినంత బాగా ఉండలేకపోతున్నాననే అపరాధభావం నన్ను రోజులు, నెలల తరబడి వెంటాడుతూ వచ్చింది. అపరాధ భావాన్ని జయించి అమ్మను చూసుకోగలిగిన శక్తి, ధైర్యం కూడా వచ్చాయి.

నాకు ఈ అనుభవమే ఎదురుకాకపోతే, అవతలి మనిషిని ఏమీ ఆశించకుండా, బేషరతుగా, సంపూర్ణంగా స్వీకరించడం ఎన్నటికీ తెలిసేది కాదు. ఈ అవగాహన రాత్రికి రాత్రి వచ్చింది కాదు. ఇది మనం మనలాగే ఉండేందుకు తోడ్పడుతుంది.

అమ్మాయి

ఫొటో సోర్స్, Getty Images

అమ్మ భౌతికంగా నా ముందుందిగానీ, భావోద్వేగపరంగా, మానసికంగా తను నాకు ఎప్పుడో దూరమైందనే నిజాన్ని అంగీకరించడం తేలిక కాదు. భౌతికంగానైనా తను నా ముందుండటం ఎంతో ఊరటనిస్తుంది. ఎందుకంటే ఆఫీసు నుంచి ప్రతి సాయంత్రం ఇంటికి రాగానే పలకరించేందుకు నాకంటూ ఒకరున్నారు కదా!

నాకు చేపమాంసం ఇష్టమని అమ్మకు ఇంకా గుర్తుండటం, తాను తినేదాంట్లోంచి కొంత భాగం నాకోసం పక్కకు పెట్టడం నాకెంతో సంతోషం కలిగిస్తాయి. ఆఫీసు నుంచి ఇంటికి రావడం ఆలస్యమైతే, కలసి భోంచేసేందుకు అమ్మ నాకోసం ఎదురుచూడటం కూడా సంతోషాన్నిస్తుంది.

ఆఫీసు నుంచి ఇంటికి త్వరగా వస్తే అమ్మ నన్ను చూసి నవ్వినప్పుడు ఆనందం కలుగుతుంది. అమ్మ కోసమే నేను చేసిన ఏదైనా వంటకం బాగుందని అమ్మ చెబితే, అప్పటివరకు ఎంత అలసటతో ఉన్నా, అమ్మ మాట రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది.

దీపాంజనా సర్కార్

అమ్మ అరుదుగానైనా పుస్తకం తీసుకొని చదవడానికి ప్రయత్నించినప్పుడు, లేదా రోజూ సాయంత్రం టీవీ చూసినా తన పరిస్థితి మెరుగుపడుతుందనే ఆశ కలుగుతుంది. ఈ మధ్య కొన్నింటిపై అమ్మ తన అసంతృప్తిని స్పష్టంగా వ్యక్తంచేస్తోంది. అది కూడా నాకు సంతోషాన్నిస్తోంది. అమ్మ ఇప్పటికీ తను అనుకొంటున్నది తాను చెప్పగలుగుతోందన్న ఒకే ఒక్క కారణం చాలు- నేను సంతోషపడటానికి.

అమ్మ సంరక్షకురాలిగా ఇంట్లో నాది ఒంటరి ప్రయాణమే. ఈ పయనంలో ఎన్నోసార్లు ఓటమిని, నిస్సహాయతను, అపరాధ భావాన్ని, నిస్పృహను, అయోమయాన్ని, స్తబ్ధతను ఎదుర్కొంటున్నాను. స్నేహితులు, శ్రేయోభిలాషులు, దగ్గరి బంధువులు నాకు మానసికంగా అండగా నిలుస్తున్నారు.

ఓ వ్యక్తి

అమూల్యమైన పాఠాలు నేర్పిన ప్రయాణం

మానసిక సమస్యలున్నవారి సంరక్షణ బాధ్యతలు చూస్తే ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి. ఈ అనుభవమే లేకపోతే జీవితంలోని చాలా పార్శ్వాలను నేను అర్థం చేసుకోగలిగేదాన్నే కాదేమో.

మనం చూసుకొనే మనిషి తీరుకు, వేగానికి తగినట్లుగా మనం నడుచుకోవడం చాలా కష్టం, ఇది చిరాకు కూడా పుట్టిస్తుంది. ఇదే ప్రయాణం మన తొందరను తగ్గించుకొని, తీరును మార్చుకొని, రోజువారీ జీవనంలో ఎన్నడూ పట్టించుకోని విషయాలను పట్టించుకొనేందుకు అవకాశాన్నీ ఇస్తుంది.

తను భ్రాంతిలో ఉన్నప్పుడు తన పక్కన ఉంటే మొదట్లో చిత్రంగా అనిపించేది, కంగారుపడేదాన్ని. కానీ తన ఊహా ప్రపంచంలో నేనూ భాగం కావాలని ఓ రోజు అనుకున్నా. తర్వాత పరిస్థితి మారిపోయింది.

ఒక విధంగా చూస్తే సంరక్షకురాలిగా ఈ ప్రయాణం నాకో బహుమానం. నన్ను నేను ఎంతగా మార్చుకోవాల్సిన అవసరముందో అమ్మతో నా ఈ ప్రయాణం చెప్పింది. వెలకట్టలేని జీవిత పాఠాలెన్నో నేర్పింది.

ఈ ప్రయాణంలో నేను బాగా అలసిపోయి ఉండొచ్చు. కానీ ఇది నన్ను మనిషిగా మరింత బాగా తీర్చిదిద్దింది. స్పృహ, సహనం, శక్తి, ధైర్యం, స్వీకరించేతత్వం, దయ, సహానుభూతి ఇవన్నీ నాలో పెరిగేలా చేసింది. ఈ ప్రయాణం నిజంగా నాకు చాలా సంతృప్తిని ఇస్తోంది."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)