తూర్పు, పశ్చిమ జర్మనీలను విడదీసిన బెర్లిన్ గోడను కూల్చి 30 ఏళ్లు .. ‘నా జీవితంలో అత్యంత అయిష్టమైన రాత్రి అదే’

తూర్పు, పశ్చిమ జర్మనీలను 30 ఏళ్ల పాటు విడదీసిన గోడ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తూర్పు, పశ్చిమ జర్మనీలను 30 ఏళ్ల పాటు విడదీసిన గోడ
    • రచయిత, స్టీవ్ రోసెన్‌బర్గ్
    • హోదా, బీబీసీ న్యూస్, బెర్లిన్

నా జీవితంలో అత్యంత గందరగోళంగా, దారీతెన్నూ లేకుండా సాగిన ప్రయాణమది. తూర్పు జర్మనీకి చెందిన చిట్టచివరి కమ్యూనిస్ట్ నేత ఎగాన్ క్రెంజ్‌తో కలిసి కారులో బెర్లిన్ చుట్టూ తిరుగుతున్నాను.

కార్ల్ మార్క్స్ స్మారకవనాన్ని(కార్ల్ మార్క్స్ అలీ) దాటుతుండగా క్రెంజ్ నాతో.. ''దీన్ని ఇంతకుముందు స్టాలిన్ అలీ అనేవారు, స్టాలిన్ మరణం తరువాత పేరు మార్చార''ని చెప్పారు.

ఆ తరువాత లెనిన్ స్క్వేర్ వచ్చింది. ''అక్కడ పేద్ద లెనిన్ విగ్రహం ఒకటుండేది. దాన్నిప్పుడు తొలగించారు'' చెప్పారాయన.

అలా చెబుతూనే కిటీకీలోంచి బయటకు చూస్తూ నవ్వారు క్రెంజ్.

ఎగాన్ క్రెంజ్‌
ఫొటో క్యాప్షన్, ఎగాన్ క్రెంజ్‌

''ఇవన్నీ జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్(జీడీఆర్) నిర్మించింది."

ఎనభై రెండేళ్ల వయసున్నప్పటికీ హుషారుగా ఉండే క్రెంజ్ ఒకప్పుడు తాను నడిపించిన దేశం కంటే తానే మెరుగ్గా ఉన్నాడు.

జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ - తూర్పు జర్మనీ - ఇప్పుడు మనుగడలో లేవు.

1989 నాటి గందరగోళ సంఘటనలు, బెర్లిన్ గోడ కూలిన తరువాత 30 ఏళ్లకు క్రెంజ్ నన్ను కలిసేందుకు అంగీకరించారు.

తూర్పు జర్మనీలోని లెనిన్ స్క్వేర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తూర్పు జర్మనీలోని లెనిన్ స్క్వేర్

సోవియట్ యూనియన్ అంటే క్రెంజ్‌కు ఎందుకంత ఇష్టం?

నాకు జర్మన్ భాష సరిగా రాకపోవడం, క్రెంజ్‌కు ఇంగ్లిష్ తెలియకపోవడం వల్ల మేమిద్దం రష్యన్‌లో మాట్లాడుకుంటున్నాం. రష్యన్ భాష ఆయనకు కొట్టినపిండి. క్రెంజ్ కాలంలో జర్మన్ డెమొక్రటిక్ రిపబ్లిక్‌ను మాస్కో(సోవియట్ యూనియన్) ప్రభావంలో ఉండేది.

"నాకు రష్యా అన్నా, సోవియట్ యూనియన్ అన్నా విపరీతమైన ప్రేమ" అంటారాయన.

"ఇప్పటికీ నాకు అక్కడివారితో సంబంధాలున్నాయి. జర్మన్ డెమొక్రటిక్ రిపబ్లిక్ సోవియట్ యూనియన్ బిడ్డ. జర్మన్ డెమొక్రటిక్ రిపబ్లిక్ పుట్టుక నుంచి చావు వరకు కూడా సోవియట్ యూనియన్ అండగా నిలబడి చెంతనే ఉంది."

ఐరోపాలో తూర్పు జర్మనీ కమ్యూనిస్ట్ రష్యాకు ప్రధాన శిబిరంలా ఉండేది. జీడీఆర్‌లో సోవియట్ యూనియన్‌కు 800 సైనిక పటాలాలు, 5 లక్షల మంది సైనికులు ఉండేవారు.

''అధికారం చెలాయించేవారా కాదా అన్నది కాదు సోవియట్ బలగాలను మేం ప్రాణ స్నేహితుల్లా చూసేవాళ్లం'' అని చెప్పారు క్రెంజ్.

''కానీ, సోవియట్ సామ్రాజ్యంలో భాగంలా మెలగడం వల్ల జీడీఆర్ ఏం సాధించింది?'' క్రెంజ్‌ను అడిగాను.

''సోవియట్ సామ్రాజ్యంలో భాగం అనేది పాశ్చాత్య నాయకులు వాడే మాట'' సమాధానం ఇచ్చారు.

"వార్సా ఒప్పందంతో మేం సోవియట్ భాగస్వాములుగా భావించుకున్నాం. సొంత దేశానికి సంబంధించిన అంశాల్లోనూ సోవియట్ యూనియన్ అభిప్రాయమే అంతిమంగా భావించేవాళ్లం."

బెర్లిన్ గోడ కూల్చివేత

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బెర్లిన్ గోడ కూల్చివేత

క్రెంజ్ అగ్ర నేతగా ఎలా ఎదిగారు?

క్రెంజ్ తండ్రి ఒక దర్జీ.. 1937లో జన్మించిన క్రెంజ్ కమ్యూనిస్ట్ నాయకత్వ వ్యవస్థలో త్వరత్వరగా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ పైకెదిగారు.

"నేనప్పటికి యువకుడిని. ఫ్రీ జర్మన్ యూత్(ఎఫ్‌డీజే)లో సభ్యుడిగా ఉండేవాడిని. తరువాత సోషలిస్ట్ యూనిటీ పార్టీలో చేరాను. అనంతరం పార్టీకి అధ్యక్షుడినయ్యాను.'' అంటూ క్రెంజ్ కమ్యూనిస్ట్ పార్టీలోకి ఎలా వచ్చారు? ఏమేం చేశారు అంతా చెప్పుకొచ్చారు.

తూర్పు జర్మనీకి చెందిన ప్రముఖ నేత ఎరిక్ హోనెకర్ రాజకీయ వారసుడిగా ఆయన పార్టీ పగ్గాలు చేపట్టారు.

1989 అక్టోబరులో హానెకర్ స్థానంలోకి క్రెంజ్ వచ్చేటప్పటికి అప్పటి పాలక పార్టీ తన పట్టు కోల్పోతూ ఉంది.

ఆ సమయంలో పోలెండ్ నుంచి బల్గేరియా వరకు తూర్పుప్రాంతం మీదుగా ప్రజాధికారం అంతటా వస్తోంది. తూర్పు జర్మనీ దీనికి మినహాయింపేమీ కాదు.

క్రెంజ్, గోర్బచెవ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్రెంజ్, గోర్బచెవ్

క్రెంజ్ ఎక్కడ తప్పటడుగు వేశారు

బెర్లిన్ గోడ కూల్చివేతకు వారం ముందు అప్పటి సోవియట్ నేత మిఖాయిల్ గోర్బచెవ్‌తో అత్యవసర సమావేశం కోసం క్రెంజ్ మాస్కో వెళ్లారు.

సోవియట్ యూనియన్ ప్రజలు తూర్పు జర్మనీ వారిని తమ సోదరులుగా చూస్తారని గోర్బచెవ్ నాకు చెప్పార'ని క్రెంజ్ అన్నారు.

"సోవియట్ ప్రజల తరువాత తాను అత్యంత ప్రేమించేది జీడీఆర్ ప్రజలనేనని గోర్బచెవ్ చెప్పారు. అప్పుడు నేను.. మీరు ఇప్పటికీ జర్మన్ డెమొక్రటిక్ రిపబ్లిక్‌కు తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిగా భావిస్తున్నారా అని అడిగాను. దానికి ఆయన.. 'అవును ఎగాన్' అన్నారు. దాంతో నేను.. మీరు ఒకవేళ జర్మనీ ఏకీకరణ దిశగా సంకేతాలిస్తున్నారేమో కానీ అది అజెండాలో లేదు అన్నాను'' అని క్రెంజ్ చెప్పారు.

''ఆ సమయంలో గోర్బచెవ్ నిజాయితీని నేను శంకించలేదు. అదే నేను చేసిన తప్పు." క్రెంజ్ చెప్పారు.

''అయితే, సోవియట్ యూనియన్ మీకు ద్రోహం చేసిందనుకుంటున్నారా?'' క్రెంజ్‌ను అడిగాను.

"అవును" అన్నారాయన.

గోడదాటి వెళ్తున్న తూర్పు జర్మన్లు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 1989 నవంబరు 9న గోడదాటి వెళ్తున్న తూర్పు జర్మన్లు

తూర్పు జర్మనీ ఎలా అంతమైంది?

1989 నవంబర్ 9న బెర్లిన్ గోడ కూల్చేశారు. దాంతో తూర్పు జర్మన్లు ఆనందంతో సరిహద్దులు దాటారు.

క్రెంజ్ ఆనాటి ఘటనను గుర్తు చేసుకుంటూ ''అది నా జీవితంలో అత్యంత అయిష్టమైన రాత్రి'' అన్నారు.

"నేను దాన్ని మళ్లీ గుర్తు చేసుకోవాలని కానీ, అలాంటిది చూడాలని కానీ అనుకోవడం లేదు. జర్మనీ ఏకీకరణను పాశ్చాత్య దేశాల నేతలు ప్రజా వేడుక అని చెప్పినప్పుడు.. వారి మాటలను నేను అర్థం చేసుకున్నాను. అన్నిటి బాధ్యతా నేనే తీసుకున్నాను. ప్రజల్లో ఉద్వేగాలు రేగిన అలాంటి సమయంలో ఏ ఒక్కరు చనిపోయినా కూడా మేం అగ్రరాజ్యాల మధ్య సైనిక సంక్షోభంలో చిక్కుకునేవాళ్లం'' అన్నారాయన.

రెండు జర్మనీల మధ్య గోడ కూలిన తరువాత నెల రోజులకే క్రెంజ్ తూర్పు జర్మనీ నాయకత్వానికి రాజీనామా చేశారు.

ఆ తరువాత ఏడాది, తూర్పు, పశ్చిమ జర్మనీలు రెండూ కలిసిపోయాయి. జర్మనీ డెమొక్రటిక్ రిపబ్లిక్ అనేది చరిత్రలో కలిసిపోయింది.

తూర్పు, పశ్చిమ జర్మనీల మధ్య గోడ కూల్చివేతకు అవకాశమేర్పరిచిన మిఖాయిల్ గోర్బచెవ్‌ను తూర్పు ఐరోపా అంతటా హీరోగా చూస్తారు.

గోర్బచెవ్ 2013లో నాతో మాట్లాడుతూ "మధ్య, తూర్పు ఐరోపాలను ఇచ్చేశానని నాపై ఆరోపణలు చేస్తారు. కానీ నేను దాన్ని ఎవరికి ఇచ్చాను? పోలిష్ ప్రజలకు పోలండ్‌ను ఇచ్చాను. అది వారికి కాక ఇంకెవరికి చెందుతుంది'' అన్నారు.

క్రెంజ్ తన అధికారాన్ని, దేశాన్ని కూడా కోల్పోయారు. ఆ తరువాత ఆయన తన స్వాతంత్య్రాన్నీ పోగొట్టుకున్నారు.

బెర్లిన్ గోడ మీదుగా పశ్చిమ జర్మనీలోకి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న తూర్పుజర్మన్లను ఊచకోత కోశారన్న ఆరోపణల్లో 1997లో ఆయన దోషిగా తేలారు. దాంతో నాలుగేళ్లు జైలులో గడిపారు.

1989లో ఎగాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు

ఫొటో సోర్స్, Getty Images

'ముగింపు లేని ప్రచ్ఛన్న యుద్ధం'

ఎగాన్ క్రెంజ్‌కు ఇప్పటికీ రాజకీయాలపై ఆసక్తి తగ్గలేదు. అంతేకాదు, ఇప్పటికీ ఆయన మాస్కోకు మద్దతిస్తుంటారు.

"గోర్బచెవ్, యెల్సిన్ వంటి బలహీనమైన అధ్యక్షుల తరువాత ఇప్పుడు రష్యాకు పుతిన్ దొరకడం ఆ దేశ అదృష్టం'' అంటారాయన.

ప్రచ్ఛన్న యుద్ధం ఎప్పుడూ ముగియలేదని, అయితే, ఇప్పుడు పోరాటం రూపం మారిందని క్రెంజ్ అంటారు.

ప్రస్తుతం క్రెంజ్ జర్మనీలోని బాల్టిక్ సముద్రం తీరంలో ప్రశాంత జీవనం గడుపుతున్నారు.

''జీడీఆర్ పౌరుల మనవళ్లు, మనవరాళ్ల నుంచి నాకు ఇప్పటికీ లేఖలు, ఫోన్‌కాల్స్ వస్తుంటాయి. వారి తాతల పుట్టినరోజు సందర్భంగా నేను శుభాకాంక్షలు చెబితే వారు సంతోషిస్తారని అంటుంటారు. కొన్నిసార్లు ప్రజలు నా దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ అడుగుతారు, సెల్ఫీ తీసుకుంటారు''

మేమిద్దరం అలా కార్లో తిరుగుతూ బెర్లిన్ నగర నడిబొడ్డుకు వచ్చి ఆగినప్పుడు ఒక చరిత్ర ఉపాధ్యాయుడు, ఆయనతో వచ్చిన పదో తరగతి పిల్లలు కలిశారు. క్రెంజ్‌ను చూసి వారెంతో సంతోషించారు.

''మేం జీడీఆర్ చరిత్రను అధ్యయనం చేయడానికి హాంబర్గ్ నుంచి వచ్చాం. చరిత్రకు సజీవ సాక్ష్యంలా మీరు కనిపించారు. బెర్లిన్ గోడ కూలినప్పుడు మీకెలా అనిపించింది'' అంటూ ఆ ఉపాధ్యాయుడు క్రెంజ్‌ని అడిగారు.

''అదేమీ సంబరం కాదు.. ఎన్నో నాటకీయ పరిణామాలు జరిగిన రాత్రి'' అని క్రెంజ్ వారితో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)