ఏడేళ్ల వయసులో శరణార్థిగా వెళ్లిన బాలిక.. 60 ఏళ్లకు స్వదేశానికి అధ్యక్షురాలయ్యారు

ఫొటో సోర్స్, VAIRA VIKE-FREIBERGA
యుద్ధం కారణంగా నాశనమైన లాత్వియా నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి దశాబ్దాల పాటు ప్రవాసంలో గడిపిన ఆమె పరిస్థితులు మారాక సొంత దేశానికి తిరిగొచ్చి కొద్దికాలానికే ఏకంగా దేశాధ్యక్షురాలయ్యారు.
లాత్వియాకు పదేళ్ల పాటు అధ్యక్షురాలిగా ఉన్న వైరా వైక్ ఫ్రీబెర్గా ఆ దేశ అధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళ కూడా.
వైరా కుటుంబం ఏడు దశాబ్దాల కిందట లాత్వియాను విడిచి జర్మనీ వెళ్లిపోయింది. ఆ తరువాత మొరాకో, అక్కడి నుంచి కెనడా వెళ్లిపోయింది ఆ కుటుంబం.
అయితే, తన తల్లిదండ్రులు ఎన్నడూ తనను లాత్వియా దేశస్థురాలన్న విషయం మర్చిపోనివ్వలేదని వైరా 'బీబీసీ'తో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో లాత్వియాను తొలుత జర్మనీ, ఆ తరువాత సోవియట్ యూనియన్ ఆక్రమించాయి.
అప్పటి జ్ఞాపకాలు ఇంకా తనకున్నాయంటారామె. 1944 ప్రాంతంలో లాత్వియాలో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయని.. రష్యా బలగాలు లాత్వియాలో మార్చ్ చేసేవని చెప్పారు.
చిన్నతనంలో తనకు తెలియక ఆ కమ్యూనిస్ట్ రెడ్ ఆర్మీ ఎర్ర జెండాలు ఎగరవేస్తూ పిడికిలి పైకెత్తి నినాదాలు చేస్తుంటే, తను కూడా అలా పిడికిలి బిగించి హుర్రే అనే దాన్నని... కానీ, తన తల్లి 'ఇది చాలా విషాదం నిండిన రోజు.. నువ్వు అలా వారిని అనుకరించొద్ద'ని తనకు చెప్పిందని వైరా ఆనాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు.
అదే ఏడాది చివర్లో ఆ కుటుంబం స్వదేశాన్ని వీడింది.

ఫొటో సోర్స్, VAIRA VIKE-FREIBERGA
పాఠాలు నేర్పిన ప్రవాసం
వైరాకు ఏడేళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లిదండ్రులు ఆమెను తీసుకుని జర్మనీ వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఫ్రెంచి పాలనలో ఉన్న మొరాకోకు.. ఆ తరువాత కెనడాకు వెళ్లారు.
1998లో తనకు 60 ఏళ్ల వయసున్నప్పుడు వైరా మళ్లీ లాత్వియా తిరిగొచ్చారు. అలా వచ్చిన ఎనిమిది నెలల్లోనే లాత్వియాకు అధ్యక్షురాలయ్యారు.
''తెల్లవారితే కొత్త సంవత్సరం.. అదే రోజు రాత్రి లాత్వియా బలగాలతో వెళ్తున్న ఒక సరకు రవాణా నౌకలో బయలుదేరాం. లాత్వియా నుంచి వెళ్లిపోతున్న ఆ బలగాలు కొంతమంది సాధారణ పౌరులనూ తమ ఓడలో ఎక్కించుకున్నాయి. అందులో మేమూ ఉన్నాం. మేమంతా ఓడ డెక్‌పైకి ఎక్కి లాత్వియా జాతీయ గీతాన్ని ఆలపించా'మంటూ ఆమె అప్పటి ప్రవాస ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.
అప్పటికే లాత్వియా నుంచి వస్తున్న శరణార్థుల కోసం జర్మనీలో ఏర్పాటు చేసిన శిబిరాల్లోని ఒకదాంట్లో వైరా కుటుంబం ఆశ్రయం పొందింది. అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. పది నెలల వయసున్న వైరా చెల్లెలు న్యుమోనియోకు గురై ఆ శరణార్థి శిబిరంలోనే చనిపోయింది.
రష్యా సైనికుల సామూహిక అత్యాచార బాధితురాలు నిర్ణయం జీవితమంటే ఏంటో చెప్పింది
చెల్లెలు చనిపోయిన కొద్దికాలానికి వైరా తల్లి మళ్లీ గర్భం దాల్చింది. ఏడాది తరువాత ఆమెకు కొడుకు పుట్టాడు. అదే సమయంలో పక్క శిబిరంలో ఓ 18 ఏళ్ల యువతి కూడా పాపను ప్రసవించింది. కానీ, ఆ యువతి ఆ పాప ముఖం చూడడానికి కూడా ఇష్టపడలేదు. లాత్వియాలో సోవియెట్ సైనికులు సామూహిక అత్యాచారం కారణంగా ఆ యువతి గర్భం దాల్చడంతో పుట్టిన బిడ్డను తన పాపగా చూసుకోలేకపోయింది. నర్సులు ఎన్నిసార్లు ఆ పాపను ఆ యువతి వద్దకు తీసుకెళ్లినా ఆమె ఆదరించలేదు. చివరకు నర్సులు ఆ పాపకు చనిపోయిన వైరా సోదరి పేరు 'మారా' అని పెట్టారు.
ఆ ఘటన వైరాను ఎంతగానో కదిలించింది. తాము ఎంతగానో ప్రేమించే చెల్లెలు తమకు దూరమైంది.. కానీ, ఇక్కడ ఆ యువతి తనకు జన్మించిన చిన్నారినే స్వీకరించడం లేదు.. జీవితం అంటే ఇలా ఉంటుందా అని అప్పుడే తెలిసిందని వైరా చెబుతారు.

ఫొటో సోర్స్, VAIRA VIKE-FREIBERGA
బాల్య వివాహ భయం
జర్మనీలో నాలుగేళ్లు గడిపాక పదకొండేళ్ల వయసులో వైరా తల్లిదండ్రులతో కలిసి మొరాకోలోని కాసాబ్లాంకాకు వెళ్లిపోవాల్సి వచ్చింది.
''రాత్రి వేళ మేం ప్రయాణిస్తున్న ట్రక్ నుంచి మమ్మల్ని బయటకు నెట్టేశారు. అదొక చిన్న ఊరు. అక్కడ ఫ్రెంచ్ ప్రజలున్నారు. వారితో పాటు అనేక దేశాలవారున్నారు. ఇటలీ, స్పెయిన్, రష్యా ఇలా అన్ని దేశాల్లో ఇబ్బందులు పడి వచ్చినవారితో ఆ ఊరు ఒక చిన్న ప్రపంచంలా ఉంది' అని మొరాకోలో తాము చేరుకున్న ప్రాంతం గురించి వైరా చెబుతారు.
అక్కడ తండ్రితో పాటు పనిచేసే ఓ అరబ్ వ్యక్తి తనకు పెళ్లి చేసేయాలని సూచించాడని.. 15 వేల ఫ్రాంకుల కట్నం, రెండు గాడిదలు, కొన్ని పశువులు ఇస్తాను తనకిచ్చి పెళ్లి చేయాలని కోరాడని.. తండ్రి అంగీకరించకపోవడంతో ఇంకా ఎక్కువ మొత్తం ఇచ్చేందుకూ సిద్ధపడ్డాడని.. వైరా ఇంకా చిన్నపిల్ల, చదువుకుంటుందని చెప్పగా.. చదువుకోనిస్తానని కూడా చెప్పాడని.. అయితే, తండ్రి మాత్రం అందుకు అంగీకరించలేదని చెప్పారు.
ఆ ఘటన తరువాత తనకు పెళ్లి చేసేస్తారేమోన్న భయం తనను వెంటాడేదని వైరా చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, VAIRA VIKE-FREIBERGA
సెక్సిస్ట్ ప్రొఫెసర్
ఆ తరువాత కొద్దికాలానికి వైరా కుటుంబం కెనడా చేరుకుంది. 16 ఏళ్ల వయసులో వైరాకు అక్కడ ఒక బ్యాంకులో ఉద్యోగం దొరికింది. ఉద్యోగం చేస్తూనే టొరంటో యూనివర్సిటీలో చదువుకునేది. అక్కడ లాత్వియా నుంచే ప్రవాసం వచ్చిన ఇమాంట్స్ ఫ్రీబెర్గ్స్ ఆమెకు పరిచయమయ్యారు. ఆ తరువాత ఆయనే ఆమె జీవితభాగస్వామి అయ్యారు.
సైకాలజీ చదువుకున్న ఆమె 1965లో సైకాలజీలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. అయితే.. పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో ఓ ప్రొఫెసర్ తన సెక్సిస్ట్ వ్యాఖ్యలతో కంపరం పుట్టించిన ఘటనను చెప్పుకొచ్చారు.
అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు వ్యర్థం అని ఆ ప్రొఫెసర్ అనేవారని.. కానీ.. పురుషుల కంటే మహిళలు కూడా విజయాలు సాధించగలరని ఆమె అంటారు.
మాంట్రియల్ యూనివర్సిటీలో 33 ఏళ్లు పనిచేసిన వైరా అయిదు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతారు. ఇప్పటివరకు ఆమె 10 పుస్తకాలు రాశారు.

ఫొటో సోర్స్, AFP
60 ఏళ్ల వయసులో స్వదేశానికి..
వైరా 60 ఏళ్ల వయసులో 1998లో స్వదేశానికి తిరిగొచ్చారు. అక్కడ ఎమిరటస్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. ఆ పదవికి రాజీనామా చేద్దామనుకుంటున్న సమయంలో ఓ రోజు సాయంత్రం లాత్వియా ప్రధాని నుంచి ఆమెకు ఫోనొచ్చింది. లాత్వియాలో నెలకొల్పుతున్న ఓ కొత్త సంస్థ బాధ్యతలను ఆమె చేతిలో పెట్టారు.
అక్కడికి కొద్దిరోజుల్లోనే లాత్వియా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ చేసి విజయం సాధించారు. అలా ఆ దేశ అధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డులకెక్కారు.
2004లో లాత్వియా యూరోపియన్ యూనియన్, నాటోల్లో చేరడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
వరుసగా రెండుసార్లు అధ్యక్ష పదవి చేపట్టిన ఆమె 2007 వరకు అధ్యక్ష పదవిలో ఉన్నారు.
తాను అధికారంలో ఉన్నప్పుడు, ఆ తరువాత కూడా మహిళా సాధికారత కోసం ఆమె కృషి చేశారు.
మహిళలు ఏమీ సాధించలేరన్న కెనడా ప్రొఫెసర్‌పై విజయం సాధించడం కంటే ఇంకా ఎంతో సాధించానని ఆమెకు కూడా తెలుసు.
ఇవి కూడా చూడండి:
- ఎడిటర్స్ కామెంట్: ఇంటర్మీడియట్ పిల్లల చావులకు బాధ్యులెవరు?
- ‘‘సారీ అమ్మ.. ఫీజు కట్టలేదని పరీక్ష రాయనివ్వలేదు’’
- "పొరుగింటి కోడి కూత భరించలేకున్నాం" - కోర్టుకెక్కిన జంట
- భారత దేశ మొదటి బడ్జెట్ ఎంతో తెలుసా?
- బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- ఆర్థిక సర్వే: ఆదాయపన్ను చెల్లిస్తున్నారా... అయితే రోడ్లకు, రైళ్లకు మీ పేరు పెట్టొచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








