బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మేధావి అరోరా
- హోదా, బీబీసీ ప్రతినిధి
2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
అయితే, బడ్జెట్‌ను సామాన్యులు కూడా సులభంగా అర్థం చేసుకోవాలంటే ఆ పరిభాష కొంత తెలుసుకోవాలి.
బడ్జెట్ ప్రసంగాన్ని, బడ్జెట్‌తో ముడిపడిన వ్యవహారాలను అర్థం చేసుకోవడంలో దోహదపడే పది ప్రాథమిక అంశాలు ఇవీ...
1. ఆర్థిక సంవత్సరం
భారత్‌లో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై, మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది.
2. వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి
ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు వ్యక్తిగత వార్షికాదాయానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంది.
3. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు
పౌరులు నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులను ప్రత్యక్ష పన్నులు అంటారు. ప్రత్యక్ష పన్నుల భారం ప్రజలపై నేరుగా పడుతుంది. ఆదాయపు పన్ను, సంపద పన్ను, కార్పొరేట్ పన్ను- ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణలు.
పరోక్ష పన్నుల భారం పౌరుడిపై నేరుగా పడదు. విలువ ఆధారిత పన్ను(వ్యాట్), అమ్మకం పన్ను, సేవా పన్ను, విలాస పన్ను, వినోద పన్ను తదితర పన్నుల స్థానంలో ప్రవేశపెట్టిన జీఎస్‌టీ- పరోక్ష పన్నులకు ఉదాహరణలు.
4. మూలధన లాభాలు
షేర్లు కొన్న తర్వాత ఏడాదిలోపు వ్యవధిలో వాటిపై ఆర్జించే లాభాలను స్వల్ప కాలిక మూలధన లాభాలు అంటారు. ఏడాది కన్నా ఎక్కువ వ్యవధిలో వాటిపై ఆర్జించే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలు అంటారు.

ఫొటో సోర్స్, facebook/nirmala.sitharaman
5. జీడీపీ- స్థూల దేశీయోత్పత్తి
ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల మొత్తం విలువను స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంటారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిని పట్టి చూపే కీలకాంశాల్లో ఇది ఒకటి.
6. ద్రవ్య లోటు
ప్రభుత్వ మొత్తం వ్యయాలు, మొత్తం రాబడిని మించితే ఆ స్థితిని ద్రవ్య లోటు (ఫిస్కల్ డెఫిసిట్) అని వ్యవహరిస్తారు. ద్రవ్య లోటును లెక్కించేటప్పుడు రుణాలను పరిగణనలోకి తీసుకోరు.
7. కరెంటు ఖాతా లోటు
వస్తు, సేవల దిగుమతుల విలువ, ఎగుమతుల విలువ మధ్య వ్యత్యాసాన్ని కరెంటు ఖాతా లోటు అంటారు.
8. పెట్టుబడుల ఉపసంహరణ
ప్రభుత్వ రంగ సంస్థల్లోని తన వాటాలను ప్రభుత్వం పాక్షికంగా లేదా పూర్తిగా విక్రయించడాన్ని 'పెట్టబడుల ఉపసంహరణ' అంటారు.
9. ఆర్థిక బిల్లు
కొత్త పన్నులను, ఉన్న పన్ను విధానంలో మార్పులను ప్రభుత్వం ఆర్థిక బిల్లులో ప్రతిపాదిస్తుంది. బడ్జెట్ సమర్పించిన వెంటనే దీనిని ప్రవేశపెడతారు.
10. రెపో రేటు
ఆర్‌బీఐ తమకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటును రెపో రేటు అంటారు.
ఇవి కూడా చదవండి:
- బడ్జెట్- మీ కోసం నిర్మల సీతారామన్ ఏం చేయగలరు
- మహాత్మా గాంధీ చివరి రోజు ఎలా గడిచింది-
- హైదరాబాద్- 200 ఏళ్ల నాటి హెరిటేజ్ బిల్డింగ్ పునరుద్ధరణ, ఈ భవనం మీకు తెలుసా-
- రిపబ్లిక్ డే- పరేడ్-లో కోనసీమ ప్రభల తీర్థం... మోదీ మెచ్చుకున్న దాని చరిత్ర ఏంటి
- ఆంధ్రప్రదేశ్- ప్రభుత్వ ఉద్యోగులను జగన్ సర్కారు ‘కేర్’ చేయటం లేదా-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












