రిపబ్లిక్ డే: పరేడ్‌లో కోనసీమ ప్రభల తీర్థం... మోదీ మెచ్చుకున్న దాని చరిత్ర ఏంటి

ఫొటో సోర్స్, GVL Narasimha Rao/Facebook
- రచయిత, వడిసెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో ప్రభల ఆనవాయితీ ఉంది.
వివిధ ఉత్సవాల్లో ప్రభల ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. భారీ సైజు ప్రభలను తీసుకుని రావడాన్ని గొప్పగా భావిస్తూ ఉంటారు.
కోనసీమలోని జగ్గన్నతోట ప్రభల తీర్థం నుంచి పల్నాడులోని కోటప్ప కొండ వరకూ ఈ ప్రభల ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఈసారి 74వ రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభల తీర్థం థీమ్‌తో శకటాన్ని రూపొందించింది.
గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రభల తీర్థం గురించి కొనియాడుతూ నిర్వాహకులకు లేఖ కూడా రాశారు.

ఫొటో సోర్స్, UGC
ప్రభల తీర్థం అంటే ఏమిటి?
కోనసీమలో ఏటా సంక్రాంతి సందర్భంగా ఈ ప్రభల తీర్థం జరుగుతుంది. అంబాజీపేట మండలంలోని జగ్గన్నతోట గ్రామంలో జరిగే ప్రభల తీర్థానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఉన్న చాలా ప్రాంతాల్లో ఈ ప్రభల తీర్థాలు జరుగుతాయి. 200కి పైగా గ్రామాలకు చెందిన వారు ప్రభలను మోసుకుంటూ తీసుకురావడం బాగా ఉంటుంది.
ఒకేసారి భారీగా తరలి వచ్చే ప్రభలను చూసేందుకు వేలాదిగా జనం తరలివస్తారు. అది ఒక పెద్ద తీర్థం మాదిరిగా సాగుతుంది. చాలా సందడి కనిపిస్తుంది.
జగ్గన్నతోటకి గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహరం, వ్యాఘ్రేశ్వరం, ఇరుసుమండ, వక్కలంక, పెదపూడి, ముక్కామల, మొసలపల్లి, నేదునూరు, పాలగుమ్మి, పుల్లేటికుర్రు వంటి గ్రామాల నుంచి ప్రభలు వస్తాయి.
దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సైతం సంప్రదాయ ప్రభల తీర్థంలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తారు.
కొత్తపేటలో సంక్రాంతి నాడు, జగ్గన్నతోటలో కనుమ నాడు ఈ ప్రభల తీర్థం ఘనంగా జరుగుతుంది.
వెదురు, తాటిబద్దలకు రకరకాల కొత్త బట్టలు, రంగుల కాగితాలను కొబ్బరితాళ్లతో కడతారు. నెమలి పింఛాలను నూలు తాళ్లతో అలంకరిస్తారు. మేళతాళాలు, సంప్రదాయ నృత్యాలతో తమ తమ గ్రామాల నుంచి తీసుకుని జగ్గన్నతోటకి తీసుకొస్తారు. బాణాసంచా కాల్చడం, గరగ నృత్యం వంటివి ఆనవాయితీగా జరుగుతాయి.
వాటిని మోసుకుంటూ కొబ్బరితోటలు, వరి పొలాల మధ్య తీసుకురావడం అందరినీ ఆకర్షిస్తుంది. అదే సమయంలో పెద్ద సైజులో ప్రభలను తయారుచేయడం, పోటాపోటీగా వాటిని ముందుగా తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం ఉత్సాహం రేకెత్తిస్తుంది. మధ్యలో కాలువలు వచ్చినా సరే వాటిని దాటుకుంటూ యువత పరుగులు పెట్టే దృశ్యాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి.

ఫొటో సోర్స్, GVL Narasimha Rao/Facebook
భక్తితో ప్రభలు మోస్తారు..
పెద్ద పెద్ద ప్రభలను సిద్ధం చేయడం గ్రామాల్లో రోజుల తరబడి సాగుతుంది. జగ్గన్నతోటలో ప్రభల తీర్థం నాలుగు దశాబ్దాలుగా జరుగుతుందని చెబుతారు. 17వ శతాబ్దంలో మొదలైన ఈ ప్రభల తీర్థంలో 11 గ్రామాల నుంచి ఏకాదశ రుద్రుల పేరుతో ప్రభలను తీసుకొస్తారు. భక్తిశ్రద్ధలతో ప్రభల ఊరేగింపు జరుగుతుంది.
వాకలగరువు గ్రామస్తులు 52 అడుగులు, తొండవరం నుంచి 51 అడుగుల ఎత్తులో ఉన్న ప్రభలను తీసుకొచ్చినట్టు నిర్వాహకులు చెబుతారు.
‘పెద్ద పెద్ద ప్రభలను భుజాలపై మోసుకునిరావడం కష్టమే. అయినా యువత చాలా పెద్ద సంఖ్యలో పోటీపడతారు. ఎంత శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోరు.
సమాజంలో శాంతి, సౌఖ్యం విలసిల్లాలని కోరుతూ ఈ ప్రభల ప్రదర్శన ఉంటుంది. కుల, మతాలకు అతీతంగా ప్రజలంతా పాల్గొంటారు. భక్తి భావంతో చేసే ఈ కార్యక్రమం ప్రతి ఏటా విజయవంతమవుతోంది. ఏటా దీనిని నిర్వహిస్తూ వస్తున్నాం’ అంటూ అంబాజీపేటకు చెందిన అప్పల రామనరసింహరావు అన్నారు.
మా ప్రాంతంలో సంక్రాంతి అంటే ప్రభల తీర్థమే అన్నట్టుంటుందని తెలిపారు. దేశ, విదేశాల్లో ఎక్కడ స్థిరపడినా ప్రభల తీర్థం కోసం వారంతా వస్తారని ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, GVL Narasimha Rao/Facebook
‘సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా..'
శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్ప కొండలో కూడా భారీ ప్రభల ఊరేగింపు ఉంటుంది. అయితే వాటిని ట్రాక్టర్లు, ఇతర వాహనాలపై తరలిస్తారు. రాజకీయ బల ప్రదర్శనలకు కూడా ప్రభల ఉత్సవాన్ని వాడుకుంటారు.
కృష్ణా జిల్లాలో కూడా ఘంటశాల తదితర ప్రాంతాల్లో ప్రభల ఉత్సవాలు జరుపుతారు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కార్యక్రమాల సందర్భంగా ప్రభల రూపకల్పన, ప్రదర్శన విరివిగా ఉంటుంది. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కూడా ప్రభల ప్రదర్శన కనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయదారుల సంప్రదాయాన్ని, కోనసీమ ప్రభల ఉత్సవాన్ని చాటేలా రూపొందించిన శకటం అందరినీ ఆకట్టుకుందని సామాజిక విశ్లేషకుడు నేలపూడి స్టాలిన్ అన్నారు.
‘తెలుగునేల సంస్కృతి, సంప్రదాయం చాటేలా ప్రభల తీర్థాన్ని శకటం రూపంలో ప్రదర్శించడం శుభ పరిణామం. కోనసీమ కొబ్బరి చెట్లు, గరగ నృత్యం, ప్రభల ప్రత్యేకతను చాటే యత్నం అభినందనీయం.
తెలుగునేల విశిష్టతను దేశమంతా చాటే ప్రయత్నంగా దీన్ని చూడాలి. ఇలాంటి ప్రయత్నాల మూలంగా మన ఘనత అందరికీ అర్థమవుతుంది. శతాబ్దాల నాటి సంప్రదాయాలను కొనసాగిస్తున్న తీరుని చెప్పుకోవాల్సిన అవసరముంది’ అని ఆయన బీబీసీతో అన్నారు.
ప్రధాని మోదీ గుర్తించడం వల్ల ఈ ప్రభల తీర్థానికి మరింత పేరు వచ్చిందని స్టాలిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, GVL Narasimha Rao/Facebook
'అభివృద్ధిని చాటుకోవాలి'
రిపబ్లిక్ డే వంటి ఉత్సవాల్లో శకటాల ప్రదర్శన గతానికి భిన్నంగా ఉన్నట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం రాఘవాచారి అన్నారు.
‘గతంలో రాష్ట్రాలు తాము సాధించిన అభివృద్ధి చాటడానికి ఇదో మార్గంగా ఉండేది. వర్తమానంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. సంస్కృతి, సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోంది.
దానిని తప్పుబట్టాల్సిన అవసరం లేకపోయినా అభివృద్ధి, సామాజిక వికాసం వంటివి ఆలోచన రేకెత్తిస్తాయి. రాష్ట్రంలో సాధించిన పురోగతి దేశ ప్రజలను ఆకర్షించేలా శకటం ఉండాలి.
400 ఏళ్ల నాటి ప్రభల తీర్థం వంటివి కూడా అందరికీ తెలియాల్సిన అవసరముంది. దానికి ప్రత్యేక వేడుకలు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఆయన అన్నారు.
మతం, విశ్వాసాలకు ప్రాధాన్యతనివ్వడం కన్నా సాధించిన అభివృద్ధి చెప్పుకోవడం ద్వారా ఎక్కువ ఉపయోగం ఉంటుందని రాఘవాచారి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్ఆర్ఆర్: ఆస్కార్ అవార్డు రావాలంటే సినిమా ప్రమోషన్ ఏ స్థాయిలో ఉండాలి... అందుకు ఎంత ఖర్చవుతుంది?
- విన్స్టన్ చర్చిల్: హిట్లర్ మాదిరిగానే ఆయన చేతులూ రక్తంతో తడిచాయా... బెంగాల్ కరవుకు ఆయనే కారణమా?
- పఠాన్ రివ్యూ: షారుక్ ఖాన్ హిట్ కొట్టాడా
- భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీలో ఎవరెవరున్నారు? తొలి డ్రాఫ్ట్ రాసింది ఎవరు?
- పవన్ కల్యాణ్: తెలంగాణలో పోటీ చేస్తామన్న జనసేన అధినేత














