పవన్ కల్యాణ్: తెలంగాణలో పోటీ చేస్తామన్న జనసేన అధినేత

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శుభం ప్రవీణ్
- హోదా, బీబీసీ కోసం
ఎన్నికల సమయం దగ్గరపడితే తప్ప పొత్తులపై క్లారిటీ రాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
అయితే, తాను బీజేపీతో పొత్తులో ఉన్నాను కాబట్టి బీజేపీతో వెళ్తానని, లేదంటే ఒంటరిగా వెళ్తానని అన్నారు.
కలిసొస్తే, కలిసొచ్చే వారితో వెళ్తాం అని స్పష్టం చేశారు. ఓట్లు చీలకుండా ఉండాలన్నదే తన ఉద్దేశమన్నారు.
ప్రచార రథం ‘వారాహి’కి జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వాహన పూజను నిర్వహించారు. అనంతరం, ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రతి 15 ఏళ్లకు ఒకసారి కొత్త తరం యువత వస్తారని, జనాభా పెరిగే కొద్ది విభిన్న భావాలున్న ప్రజలు వస్తారని, అప్పుడు ఎక్కువ మంది నాయకుల అవసరం ఉంటుందని పవన్ అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ 'బీఆర్ఎస్'గా మారడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని, రాజకీయాల్లో మార్పు సహజం అని అన్నారు.

ఫొటో సోర్స్, UGC
తెలుగు రాష్ట్రాలు బలంగా ఉండి తగిన విధివిధానాలు ఏర్పర్చుకుంటే దావోస్ లాంటి వేదికలు ఉపయోగపడతాయని, పెట్టుబడుల వస్తాయని అన్నారు.
ఈ అంశంలో ఏపీలో ఆరంభంలో ఉన్న ఉత్సాహాన్ని తర్వాత కొనసాగించలేదని పవన్ అన్నారు.
ఇతర పార్టీల నాయకుల ఎవరూ బయట తిరగకూడదనే ఏపీలో జీవో 1 ను తీసుకొచ్చారని , అయితే మొత్తం సీట్లు గెలుస్తామన్న నమ్మకం ఉన్నవారు ఇవన్నీ చేయక్కర్లేదని, అలా చేస్తున్నారంటే వారికి గెలుపుపై విశ్వాసం సన్నగిల్లుదనడానికి సంకేతమని అన్నారు.

ఫొటో సోర్స్, UGC
తెలంగాణ నేతలతో సమావేశం
ఛలో కొండగట్టులో భాగంగా జగిత్యాల జిల్లా నాచుపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ నేతలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజా పోరాటాల నుంచి స్ఫూర్తి పొందానని అన్నారు.
తెలంగాణ, ఆంధ్ర సమస్యలు వేర్వేరని, రెండింటినీ పోల్చి చూడలేమని పవన్ కల్యాణ్ అన్నారు.
"తెలంగాణ సమస్యలపై లోతైన అధ్యయనం చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాం. తెలంగాణ ప్రాంతంలో ఏడు నుంచి 14 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తాం. ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషమే. ఎప్పుడు బీజేపీ నాకు దోస్తే" అని చెప్పారు.
"ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో అభివృద్ధి జరిగింది. రాజకీయ కారణాలతోనే ఏపీలో వారాహి వాహనానికి అనుమతి ఇవ్వలేదు. తెలంగాణలో కచ్చితంగా పర్యటిస్తా. కరీంనగర్ జిల్లాలోని సింగరేణి మైనింగ్ ప్రాంతాల్లో పర్యటించాను. ఇక్కడి సమస్యలు నాకు తెలుసు" అని పవన్ కల్యాణ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు ఏడాదికి రూ.13,500 స్కాలర్షిప్ పొందడం ఎలా?
- నరేంద్ర మోదీ: తన విమర్శకులు, స్వలింగ సంపర్కులు న్యాయమూర్తులు కారాదని కేంద్రం కోరుకుంటోందా?
- అమెరికాలో గన్ కల్చర్‌ను ఎందుకు ఆపలేకపోతున్నారు?
- హుస్సేన్ సాగర్ తీరాన... హైదరాబాద్‌లో మరో ఐకాన్
- ఆర్ఆర్ఆర్: అమెరికా సహా అనేక దేశాల ప్రేక్షకులు ఈ సినిమాకు ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












