పవన్ కల్యాణ్: ‘ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందాల్సిన అవసరం లేదు’

ఫొటో సోర్స్, Twitter
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
‘‘నా సభలకు వచ్చారు, చప్పట్లు కొట్టారు. కానీ ఓట్లేసేటప్పటికీ నన్ను వదిలేశారు. కానీ నాకు ఆశాభంగం లేదు. ఎందుకంటే నేను మీ కోసం పని చేస్తున్నాను’’ అని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
వివేకనంద జయంతి సందర్భంగా జనసేన పార్టీ గురువారం సాయంత్రం శ్రీకాకుళం రణస్థలంలో ఏర్పాటు చేసిన యువశక్తి సభలో పవన్ మాట్లాడారు.
ప్రత్యక్షంగా రాజకీయాలు, కులాలు, తన సినిమాలు, ఉత్తరాంధ్ర సమస్యలపై మాట్లాడిన పవన్ పొత్తుల గురించి పరోక్షంగా మాట్లాడారు.
‘‘మనల్ని ఎవడ్రా ఆపేది...’’ అంటూ స్పీచ్ మొదటు పెట్టిన పవన్ కళ్యాణ్.. ‘‘రానున్న ఎన్నికల్లో నన్ను మీరు (ప్రజలు) నమ్మితే ఒంటరిగా వెళ్తాను. లేదంటే మరో పార్టీతో కలిసి వెళ్లాల్సి పరిస్థితి వస్తుంది’’ అని చెప్పారు.
ఎన్నికల్లో ఒంటిరిగా వెళ్లి వీర మరణం అవసరం లేదన్నారు.
‘‘మీరు (ప్రజలు) గ్యారంటీ ఇస్తారా చెప్పండి?’’ అంటూ ప్రశ్నించారు. అప్పుడు ప్రజల నుంచి కేకలు వస్తే... ‘‘నేను నమ్మను’’ అని పవన్ కల్యాణ్ నవ్వుతూ అన్నారు. గతంలో ప్రజల్ని నమ్మి రాజకీయాల్లోకి దూకేశానని, అప్పుడు తనకు రక్తాలు వచ్చాయని వ్యాఖ్యానించారు.
తన సభల్లో విపరీతమైన కేరింతలు కొట్టే ప్రజలు, ఎన్నికలు వచ్చేసరికి వారి కులం వాడనో, గోత్రం వాడనో వేరొకరికి ఓటేసి, తనకు ఓటేయటం లేదని ప్రజల్ని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును తాను కలవడంపై వైసీపీ వాళ్లు లేనిపోని విమర్శలు చేస్తున్నారంటూ దానికి వివరణ ఇచ్చే సందర్భంలో పొత్తుల ప్రస్తావన పరోక్షంగా చేశారు. అయితే ఇలా పొత్తుల కోసం మాట్లాడిన టాపిక్కులో ఎక్కడ బీజేపీ ప్రస్తావన రాలేదు.
అలాగే గతంలో తాను టీడీపీని తిట్టానని, అయితే ఎదురింటి వాళ్లతోనో, పక్కంటి వాళ్లతోనో గొడవలు వస్తే మళ్లీ కలిసిపోమా, ఇది అటువంటిదేనని ప్రస్తుతం తాను టీడీపీతో కలుస్తున్న విషయాన్ని సమర్ధించుకునే విధంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్.

ఫొటో సోర్స్, Twitter
‘మూడు ముక్కల ప్రభుత్వం.. మూడు ముక్కల సీఎం’
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ విషయంలో పవన్ కల్యాణ్ ఇంతకు ముందు సమావేశాకలు భిన్నంగా తీవ్రమైన విమర్శలు చేశారు.
‘‘ఇదో మూడు ముక్కల ప్రభుత్వం, ఇతనో మూడు ముక్కల ముఖ్యమంత్రి. నేను రాజశేఖర్ రెడ్డినే ఎదుర్కొన్నవాడిని’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు.
‘‘ప్రతి జిల్లాని ఒక్కొ రాష్ట్రంగా ప్రకటించేసుకోండి. మీరు మీ కుటుంబసభ్యులు పాలించేసుకోండి. ప్రజలంతా బానిసలుగా ఉంటారు’’ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రాల్ని, దేశాన్ని ముక్కలుగా చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.
‘‘నేను మూడు సార్లు విడాకులిచ్చి పెళ్లి చేసుకున్నా.. మూడు ముక్కల ముఖ్యమంత్రి. ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రికి అంతా డంకాపలాసు సలహాదారులు’’ అని ఎద్దేవా చేశారు.
‘‘డీజీపీ గారికి కూడా చెప్తున్న మీరు సెల్యూట్ చేస్తున్నది ముఖ్యమంత్రికి కాదు. మీరు ఖైదీ నెంబర్ 6093కి సెల్యూట్ చేస్తున్నారని గుర్తు పెట్టుకోండి’’ అని విమర్శించారు.
మాట్లాడితే ప్యాకేజీ ప్యాకేజీ అంటారని అలాంటి వారు తన చేయి దగ్గరికి వచ్చి ప్యాకేజీ అనాలంటూ పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు.
ఏపీలో అరకు గంజాయికి ఫేమస్‌గా మారిపోయిందని ఆరోపించారు పవన్.

ఫొటో సోర్స్, Twitter
‘ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి’
మాట్లాడితే కాపులు కాపులు అంటారని కులం కోసం తాను రాలేదని పవన్ అన్నారు. ఒక్కసారి కూడా కుల ప్రయోజనాల గురించి మాట్లాడలేదన్నారు. వైసీపీ వాళ్లు ఒక్క కులంతో పదవులు అన్ని భర్తీ చేశారని పవన్ ఆరోపించారు.
‘‘నేను కుల నాయకుడిని కాదు. తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకున్నా. కాపులు బాగుండాలని కాదు. నేను ఎప్పుడు కుల ప్రయోజనాల కోసం మాట్లాడను. నా కులం నా పక్కన నిలబడకపోతే నేను ఒడిపోడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప, కులాల మధ్య చిచ్చు పెట్టి గెలవడానికి సిద్ధంగా లేను’’ అని చెప్పారు.
అలాగే జనసేన ప్రభుత్వం వస్తే.. అది పూర్తిగా జనసేనదైనా, లేదా సంకీర్ణ ప్రభుత్వమైనా ఏదైనా సరే.. వస్తే పంచాయితీ నిధులు ఇస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
‘‘ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని తీసేస్తా, వలసలు ఆపుతా, పరిశ్రమలు వచ్చేలా చేస్తాను. మత్స్యకారులకు జెట్టీలు నిర్మిస్తా. ఇది నా కమిట్ మెంట్’’ అన్నారు.
‘‘ఇప్పటి వరకు అవినీతి ప్రభుత్వాన్ని చూశారు. ఇప్పడు నీతిపరులకు అవకాశం ఇవ్వండి. ఈసారి ఒక్కసారికి నన్ను నమ్మండి. నన్ను నమ్మకపోతే మార్పు రాదు’’ అని కోరారు.
విశాఖ ఉక్కు ప్రైవేటు పరంచేయకుండా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపాలన్నారు. కేంద్రంలోని అమిత్ షాతో మాట్లాడి ఏదో విధంగా ఆపడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.
త్వరలోనే తాను వారాహితో వస్తానని చెప్పారు.

ఫొటో సోర్స్, Twitter
పవన్ కల్యాణ్ ముసుగు తీసేశారు: పేర్ని నాని
పవన్ కళ్యాణ్ విమర్శలకు అధికార వైసీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు.
“యువశక్తి పేరుతో టీడీపీ, జనసేన ఒక్కటేనని, రాబోయే ఎన్నికల్లో కలిసి పని చేయబోతున్నామంటూ పొత్తులపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారు’’ అని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.
‘‘అక్కడ సభకి వచ్చిన జనాన్ని ఉద్దేశిస్తూ తాను ప్రజలను నమ్మలేనని చంద్రబాబు వెళ్తేనే మంచిదనే నిర్ణయానికి వచ్చానని చెప్పారు. మొత్తానికి పవన్ టీడీపీ విషయంలో ముసుగు తీశేశారు’’ అని ఎద్దేవా చేశారు.
‘‘ఒక వైపు బీజేపీ, మరో వైపు టీడీపీ అంటూ.. అన్ని రకాల పార్టీలతో పొత్తుపెట్టుకుని మూడు ముక్కల రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ను మూడు ముక్కల ముఖ్యమంత్రి అనడం హాస్యాస్పదంగా ఉంది’’ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్: ‘మా అమ్మ డయానా మరణం వెనుక అసలు కారణాలపై నా ప్రశ్నలు ఇంకా అలాగే ఉన్నాయి’ - ప్రిన్స్ హ్యారీ
- కోడి పందాలు: పోలీసులు హెచ్చరిస్తున్నా రూ.కోట్లలో పందాలు ఎలా జరుగుతున్నాయి?
- మెగలొడాన్: తిమింగలాలనే మింగేసే అతి పెద్ద షార్క్ కోరను వెదికి పట్టుకున్న 9 ఏళ్ల బాలిక
- Naatu Naatu Song: తెలుగు సినీ సంగీత ప్రపంచానికి 'పెద్దన్న' ఎంఎం కీరవాణి
- ‘‘నన్ను కెమెరా ముందు కూర్చోబెట్టి నీ సెక్స్ సంబంధాల గురించి చెప్పు అని అడిగారు’’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














