కాపు రిజర్వేషన్లు: కేంద్రం ప్రకటనలో మతలబు ఏమిటి? బీజేపీ వ్యూహం ఏమిటి?

కాపు రిజర్వేషన్

ఫొటో సోర్స్, Mudragada Padmanabham/FB

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్ల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాజ్యసభలో జీవీఎల్ నరసింహా రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ప్రతిమా భౌమిక్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆంధ్రా రాజకీయాల్లో కీలక చర్చకు దారి తీస్తోంది.

గతంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాలు రైళ్లు తగలబెట్టే వరకూ వెళ్లిన చరిత్ర ఉంది.

చంద్రబాబు నాయుడు రెండుసార్లు కాపులకు రిజర్వేషన్ ఇచ్చినట్టు ప్రకటించారు, కానీ అమలు కాలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కాపుల రిజర్వేషన్ తన చేతుల్లో లేదు, అది కేంద్రం చూసుకోవాలి అని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిజంగా ఈ అంశంపై స్పష్టత ఇచ్చిందా? లేకపోతే కొత్త ప్రశ్నలు వేసి, సరికొత్త రాజకీయ వ్యూహాన్ని రచించిందా?

పార్లమెంటు

ఫొటో సోర్స్, Getty Images

రాజ్యసభలో అసలేం చెప్పారో చూద్దాం...

జీవీఎల్ నరసింహా రావు ప్రశ్న: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో ఏదైనా కులానికి ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలా?

మంత్రి ప్రతిమా భౌమిక్ సమాధానం: అవసరం లేదు.

జీవీఎల్ ప్రశ్న: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర వేర్వేరు బీసీ కులాల జాబితా ఉంటుందా?

మంత్రి సమాధానం: అవును. కేంద్రం 1993లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర వేర్వేరు బీసీ కులాల జాబితా ఉంటుంది.

కాపు రిజర్వేషన్లు

జీవీఎల్ ప్రశ్న: 2019లో ఏపీ అసెంబ్లీ ఒక చట్టం ద్వారా, పది శాతం ఈడబ్ల్యుఎస్ కోటా లోపల కోటాగా, కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడం చట్టపరంగా చెల్లుబాటు అవుతుందా?

మంత్రి సమాధానం: 2019లో చేసిన 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్రాలు గరిష్ఠంగా 10 శాతం రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు.

జీవీఎల్ ప్రశ్న: ఒకవేళ ఏపీ ప్రభుత్వం కాపులకు రాష్ట్ర ఉద్యోగాల్లో, విద్యలో బీసీ రిజర్వేషన్ ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించాల్సిన న్యాయ ప్రక్రియ (డ్యూ ప్రొసెస్) ఏమిటి?

మంత్రి సమాధానం: 2021లోని 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం, రాజ్యాంగంలోని 342ఏ(3) ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ కులాల జాబితా సిద్ధం చేసి, దానికి రిజర్వేషన్లు ఇవ్వవచ్చు.

జగన్

ఫొటో సోర్స్, @ANDHRAPRADESHCM

అసలు సమాధానం బయటకు రాలేదా?

ఇందులో మూడవ ప్రశ్న అతి ముఖ్యమైనది. దేశవ్యాప్తంగా ఉన్న ఓసీ కులాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ కేంద్రం 2019లో చట్టం చేసింది. దీంతో ఆ 10 శాతంలో 5 శాతాన్ని కాపులకే రిజర్వు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో చట్టం తెచ్చింది.

అలా ఒకే కులానికి సగం రిజర్వేషన్ ఇచ్చేయవచ్చా అని జీవీఎల్ అడిగినప్పుడు, ఇవ్వవచ్చు లేదా ఇవ్వకూడదు అంటూ స్పష్టమైన సమాధానం చెప్పలేదు కేంద్ర మంత్రి.

ఆ కీలక ప్రశ్నను దాటవేస్తూ, ‘‘రాష్ట్రాలు గరిష్ఠంగా 10 శాతం రిజర్వేషన్ ఇవ్వొచ్చు’’ అని చేతులు దులుపుకున్నారు కేంద్ర మంత్రి.

పైగా ఇప్పటికే 2019లో ఏపీ ప్రభుత్వం పది శాతంలో కాపులకు సగం పంచుతూ చట్టం చేసినా, ఆ చట్టాన్ని కేంద్రం పక్కన పెట్టింది. ఒకవైపు తాము కుదరదని చెప్పిన విషయాన్నే మళ్లీ సభలో ప్రస్తావించినా, స్పష్టమైన సమాధానం చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం.

మరో ముఖ్యమైన అంశం, నాలుగవ ప్రశ్న.. రాష్ట్రాలు కావాలంటే సొంతంగా ఏదైనా కులానికి బీసీ రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అని మంత్రి సమాధానం చెప్పారు. దానికోసం డ్యూ ప్రొసెస్ ఏమిటనేది తెలిపారు. కానీ అక్కడే ఉంది అసలు చిక్కు.

2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా కాపులకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అది 50 శాతం దాటుతోందన్న కారణంతో 2018లో కేంద్రం దాన్ని తిరస్కరించింది. అలా 50 శాతం దాటకూడదు అనే నిబంధన గురించి ఈ సమాధానంలో అసలు మాట్లాడలేదు మంత్రి. 50 శాతం రిజర్వేషన్లు దాటకుండా, ఇప్పటికే రిజర్వేషన్ ఉన్న బీసీలకు నష్టం కలగకుండా కాపులకు బీసీ హోదా రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదు.

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, FACEBOOK

కాపు రిజర్వేషన్ విషయంలో ఏం జరిగింది?

  • ప్రస్తుతం ఆంధ్రలో బీసీలకు 29 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీల జాబితాలో కాపులను చేరిస్తే, ఇప్పటికే ఉన్న బీసీ కులాలకు నష్టం కాబట్టి వారు ఒప్పుకోరు.
  • ప్రస్తుతం ఆంధ్రలో చదువుల్లో ఓసీలకు 10 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. (వీటినే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అంటారు). కాపులకు కూడా ఆ రిజర్వేషన్ వర్తిస్తోంది. కానీ ఆ 10 శాతంలో 5 శాతాన్ని కేవలం కాపులకు కేటాయిస్తే, మిగిలిన ఓసీ కులాలైన రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, రాజు, కోమటి వంటి వాళ్లకు 5 శాతం రిజర్వేషనే మిగులుతుంది.
  • అలా ఈడబ్ల్యూఎస్ కోటా విభజించవచ్చా లేదా అన్న జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం స్పష్టంగా జవాబు చెప్పలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ పనిచేసినా దానిని కేంద్రం తిరస్కరించింది.
  • పోనీ కాపులకు కొత్తగా అంటే అటు ప్రస్తుత బీసీ రిజర్వేషన్, ఇటు ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ కాకుండా కొత్త కోటా పెట్టడానికీ లేదు. ఎందుకంటే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదు అని సుప్రీం కోర్టు గతంలో తీర్పు చెప్పింది.
  • ఆ తీర్పు చూపించి, 2017లో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన కాపు రిజర్వేషన్ చెల్లదని చెప్పింది కేంద్రం.
  • 2017లో మంజునాథ కమిషన్ నివేదిక ప్రకారం కాపులను బీసీ ఎఫ్‌గా గుర్తిస్తూ 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. 2018లో కేంద్రం ఈ బిల్లును తిరస్కరించింది.
వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: రాజకీయాలను ఇంకెంత దిగజారుస్తారు? -వీక్లీ షో విత్ జీఎస్

జీవీఎల్ అడిగిన ప్రశ్నలపై న్యాయ నిపుణలతో మాట్లాడింది బీబీసీ.

‘‘ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ లోని 10 శాతాన్ని కులాల వారీగా విభజించే అధికారం ప్రభుత్వాలకు లేదు. అది చట్టబద్ధంగా చెల్లదు’’ అని బీబీసీతో చెప్పారు హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది అనంతుల రవీందర్.

‘‘ఒక కులానికి బీసీ హోదా ఇవ్వడం గతంలో కేంద్రం చేతిలో ఉండేది. ఇప్పుడు ఆ హక్కు బీసీ కమిషన్ చేతిలో ఉంది. కేంద్రానికి ఇబ్బంది కలగకుండా, బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించి, కులాలకు బీసీ హోదా ఇచ్చే అంశాన్ని వారి చేతిలో పెట్టింది కేంద్రం. కాపులకు బీసీ హోదా ఇవ్వాలనుకుంటే, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్‌ను కోరాలి’’ అన్నారు రవీందర్.

వీడియో క్యాప్షన్, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానన్న పవన్, వైసీపీ నేతలు ఏమన్నారంటే..

బీజేపీ వ్యూహం ఏమిటి?

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విభజన కుదరదని స్పష్టంగా తెలిసినప్పటికీ దీనిపై బాగా చర్చ జరగాలని బీజేపీ కోరుకుంటోంది. ఆ క్రమంలోనే ఒక ప్రకటన విడుదల చేశారు జీవీఎల్.

‘‘ఆంధ్రప్రదేశ్‌లో కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పదేపదే చెప్తూ కాపులను ప్రజలను తప్పుదోవ పట్టించి వైసీపీ, టీడీపీలు కాపులను దశాబ్దాలుగా పూర్తిగా మోసం చేశాయి. ఇది కాపులపై వారికున్న కపట ప్రేమకు నిదర్శనం. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో వైసీపీ, టీడీపీ అబద్ధాలు బట్టబయలయ్యాయి. కాపులను ఇంకా మోసం చేయటం వారికి సాధ్యం కాదు’’ అని ఆ ప్రకటనలో విమర్శించారు జీవీఎల్.

పార్లమెంటులో తన ప్రశ్నలకు సమాధానం వచ్చిన తరువాత ఈ వ్యాఖ్యలు చేశారు జీవీఎల్. ప్రస్తుతం జనసేన, బీజేపీ పొత్తు నేపథ్యంలో జీవీఎల్ వ్యాఖ్యలు రాజకీయ వ్యూహాన్ని సూచిస్తున్నాయి తప్ప, సమస్యపై స్పష్టత ఇవ్వడం లేదు అంటున్నారు విశ్లేషకులు.

వీడియో క్యాప్షన్, ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వివాదం: ఈ గొడవ వల్ల ఏంటి ప్రయోజనం

‘‘ఈ సమాధానం స్పష్టంగా లేదు. ఏదో వ్యూహంలో భాగంగా ఇచ్చినట్టు ఉంది. కేంద్రం ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. కాపులకు ఏదో చేస్తున్నామని చెప్పి గందరగోళానికి గురిచేస్తున్నారు. అందుకే ఈ ప్రకటనపై పెద్ద చర్చ జరగలేదు. ఎవరూ దీన్ని సీరియస్‌గా పట్టించుకోలేదు’’ అని బీబీసీతో అన్నారు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లా రావు.

1956లో కాపులను వెనుకబడిన కులాల నుంచి ఏపీ ప్రభుత్వం తొలగించింది. 1961లో మళ్లీ ఆ జాబితాలో చేర్చింది. కానీ దాన్ని హైకోర్టు కొట్టేసింది.

1994లో కాపులను బీసీలుగా గుర్తించింది ఏపీ ప్రభుత్వం. కానీ మళ్లీ హైకోర్టు ఆ ఉత్తర్వును కొట్టేసింది.

ఈ మూడు పరిణామాలు పక్కన పెడితే, తాజాగా కాపులకు కోటా ఇచ్చిన రెండుసార్లూ కేంద్రం వాటిని తిప్పి పంపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)