కుల్‌దీప్ యాదవ్: బాగా ఆడుతున్నప్పటికీ ఈ క్రికెటర్‌కు భారత జట్టులో ఎందుకు చోటు దక్కడం లేదు?

కుల్‌దీప్ యాదవ్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, చంద్రశేఖర్ లూథరా
    • హోదా, బీబీసీ కోసం

ప్లేయర్లు తమ కెరియర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తుంటారు.

అయితే, ఏ స్పోర్ట్స్‌లో అయినా జాతీయ జట్టులో స్థానం కోల్పోవడం అనేది చాలా పెద్ద సవాల్. మళ్లీ జట్టులో స్థానం సంపాదించడం అంత తేలిక కాదు.

భారత క్రికెట్ జట్టు విషయంలో ఇది మరింత కష్టం. కుల్‌దీప్ యాదవ్ కథ ఇలాంటిది. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్‌పై తొలి టెస్టులో ఆయన క్రియాశీలంగా మారారు. 188 రన్ల తేడాతో భారత్ గెలుపులో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.

దీనికి 22 నెలల ముందు కుల్‌దీప్ చివరిసారిగా భారత్ కోసం టెస్టు మ్యాచ్ ఆడారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత వచ్చిన అతడు ఎనిమిది వికెట్లు తీశాడు.

కుల్‌దీప్ యాదవ్

ఫొటో సోర్స్, ANI

అంతేకాదు, తొలి ఇన్నింగ్స్‌లో అతడు 40 రన్లు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, కేఎల్‌ రాహుల్, శుభమన్ గిల్ లాంటి ప్లేయర్లు విఫలం కావడంతో.. ఆ లోటును కొంతవరకు కుల్‌దీప్ భర్తీచేశారు.

రిస్ట్ స్పిన్నర్ అయిన కుల్‌దీప్ ఇప్పటివరకు భారత జట్టు కోసం ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 14 ఇన్నింగ్స్‌లో ఐదు సార్లు నాలుగు కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. టెస్టు మ్యాచ్‌లలో ప్రతి ఆరు ఓవర్లకు కనీసం ఒక వికెట్ చొప్పున అతడు తీశాడు.

అయితే, భారత జట్టు కోసం ఈ ఎనిమిది మ్యాచ్‌లు ఆడేందుకు కుల్‌దీప్‌కు దాదాపు ఐదున్నరేళ్లు పట్టింది.

మొత్తం ఎనిమిది టెస్టులు కలిపి కుల్‌దీప్ 34 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లోనూ తాజాగా అతడు మరోసారి తనేంటో నిరూపించుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 40 రన్లకు అతడు ఐదు వికెట్లు తీశాడు. ఇది అతడి కెరియర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన. అంతేకాదు బంగ్లాదేశ్ పిచ్‌లపై భారత స్పిన్నర్‌లు ఎవరూ ఈ స్థాయిలో బౌలింగ్ వేయలేదు.

కుల్‌దీప్ యాదవ్

ఫొటో సోర్స్, ANI

ఎక్స్‌ట్రా స్పిన్నర్‌గా

కుల్‌దీప్ కెరియర్‌లో అన్నింటికంటే కష్టమైన విషయం ఏమిటంటే.. భారత జట్టులో ఎక్స్‌ట్రా స్పిన్నర్ అంటే మూడో స్పిన్నర్‌గా అతడిని జట్టులోకి తీసుకునేవారు.

టీమ్ మేనేజ్‌మెంట్ తనకు తగిన అవకాశాలు ఇవ్వడం లేదని కుల్‌దీప్ భావిస్తూ ఉండొచ్చు.

అయితే, నేటి పరిస్థితుల్లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను కాదని వేరే స్పిన్నర్‌కు టెస్టు కెప్టెన్ లేదా టీమ్ మేనేజ్‌మెంట్ చోటు ఇవ్వడం కొంచెం కష్టమే. అయితే, కుల్‌దీప్ ప్రత్యేకత ఏమిటంటే.. ఆయన సాధారణ స్పిన్నర్ మాత్రమే కాదు. లెఫ్ట్ ఆర్మ్ అన్‌అర్థోడోక్స్ స్పిన్నర్.. అంటే చైనామన్ స్పిన్నర్.

టీ20, వైట్ బాల్ మ్యాచ్‌ల హవా నడుమ ఈ తరహా స్పిన్ వేయడం ప్లేయర్లకు కొంచెం కష్టమే.

కుల్‌దీప్ యాదవ్

ఫొటో సోర్స్, ANI

అసలు కుల్‌దీప్ ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలంటే స్పిన్ బౌలింగ్ దిగ్గజం షేన్ వార్న్ వ్యాఖ్యలను మనం గుర్తుచేసుకోవాలి. కుల్‌దీప్ బౌలింగ్ చూడటమంటే తనకు ఇష్టమని ఆయన చెప్పారు.

టెస్టుల్లో కుల్‌దీప్ అరంగేట్రం గొప్పగా జరిగింది. 2017లో ధర్మశాలలో ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్‌లో అతడు నాలుగు వికెట్లు తీశాడు.

ఆ తర్వాత ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడటానికి కుల్‌దీప్‌కు నాలుగేళ్లు పట్టింది. ఈ మధ్యలోనే సిడ్నీ టెస్టులో ఐదు వికెట్లు అతడు తీశాడు. 2019లో జరిగిన ఈ మ్యాచ్‌లలో తొలిసారి ఆస్ట్రేలియాలో భారత్ టెస్టు సిరీస్ గెలిచింది.

కొన్నేళ్ల తర్వాత బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు మళ్లీ భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది. అయితే, ఈ జట్టులో కుల్‌దీప్ లేడు. మరోవైపు వన్‌డే మ్యాచ్‌లు అంటే ఓడీఐలలో అతడికి అదృష్టం కలిసి రాలేదు. వన్‌డే క్రికెట్‌లో రెండు హ్యాట్రిక్‌లు కొట్టినప్పటికీ జట్టులో ఆ తర్వాత మ్యాచ్‌లలో అతడికి జట్టులో చోటు దక్కడం కష్టమైంది.

ఇక్కడ అదే సమయంలో యజువేంద్ర చాహల్ కూడా బౌలింగ్‌లో మంచి ప్రతిభ చూపించేవాడు. అయితే, ఇప్పుడు చాహల్.. ఇటు కుల్‌దీప్ ఇద్దరికీ జట్టులో చోటు దక్కడం కష్టమైంది.

కుల్‌దీప్ యాదవ్

ఫొటో సోర్స్, ANI

మళ్లీ గ్రౌండ్‌లోకి

అయితే, ఈ ఇబ్బందులను దాటి పాజిటివ్‌ ఆలోచనా విధానంతో కుల్‌దీప్ ముందుకు వెళ్లాడు. తనకు అవకాశం దక్కిన ప్రతిసారీ అతడు తానేంటే నిరూపించుకునేందుకు ప్రయత్నించాడు. తన బౌలింగ్‌ను మరింత పటిష్ఠం చేసుకున్నాడు. ఇటు శారీరకంగా, అటు మానసికంగా మరింత దృఢం అయ్యాడు.

22 నెలల తర్వాత మళ్లీ బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లో అతే మ్యాజిక్‌ను కుల్‌దీప్ చేసిచూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లకే 40 రన్లు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఇది అతడి కెరియర్‌లో అత్యుత్తమ ప్రదర్శన.

ఆ తర్వాత బ్యాట్ పట్టుకొని 40 రన్లు చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అతడు మూడు వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో అతడు ఎనిమిది వికెట్లు తీయడంతో.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అటు కెప్టెన్ కేఎల్ రాహుల్, కోచ్ రాహుల్ ద్రావిడ్‌లు తనపై పెట్టుకున్న నమ్మకానికి అతడు న్యాయం చేశాడు.

వీడియో క్యాప్షన్, ఆండ్రూ సైమండ్స్: కారు ప్రమాదంలో కన్నుమూసిన ఈ క్రికెటర్ జీవితంలోని ముఖ్యాంశాలు

టెస్టు మ్యాచ్‌లలో మంచి ప్రతిభ కనబరిచినప్పటికీ.. లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్‌లలో అతడి బౌలింగ్ కొంత సాధారణంగా అనిపించేది. కొన్నిసార్లు ఇతడు సాధారణ బౌలరే కదా అనిపించేలా ప్రదర్శన కూడా చేశాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌పై మ్యాచ్‌లలోనూ తన ప్రతిభ చూపించలేకపోయాడు.

నిజానికి లిమిడ్ ఓవర్ల మ్యాచ్‌లలో అతడి బాల్ వేగం చాలా తగ్గేది. అందుకే వైట్ బాల్ మ్యాచ్ జట్లలో చోటు దక్కేది కాదు. అయితే, బౌలింగ్ వేగం పెంచాలని ప్రయత్నించినప్పుడు, స్పిన్ అంత మెరుగ్గా పడేది కాదు. అందుకే ఒక్కోసారి జట్టులో చోటు దక్కినప్పటికీ, వెనుక బెంచ్‌పై కూర్చోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈ విషయం కుల్‌దీప్‌కు కూడా తెలుసు. తన ప్రదర్శనను మెరుగు పరచుకునేందుకు కుల్‌దీప్ చాలా ప్రయత్నించేవాడు కూడా.

ఆ మార్పు బంగ్లాదేశ్‌పై టెస్టు మ్యాచ్‌లో కనిపించింది. ఎడమ చేయిని చెవికి మరింత దగ్గరగా తీసుకువస్తూ.. క్రీజుకు సమాంతరంగా పరిగెడుతూ అతడు బౌలింగ్ చేస్తూ కనిపించాడు.

వీడియో క్యాప్షన్, #T20WorldCup: పాకిస్తాన్‌పై భారత్ విజయం తరువాత మెల్‌బోర్న్‌లో అభిమానుల సంబరాలు

ఎదురుచూడాలా?

బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీయడం నిజంగా గొప్ప విజయంగా చెప్పుకోవాలి. నిజానికి గాల్లో బంతితో కుల్‌దీప్ డ్యాన్స్ వేయించాడు.

అయితే, కుల్‌దీప్ స్నిన్ వేగం తక్కువగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు తరచూ చెబుతుంటారు. కానీ, ఇప్పుడు అతడు వేగం పెంచాడు. అయితే, నేడు చేయాల్సిందల్లా తన అవకాశం కోసం ఎదురుచూడటమే.

ఇదివరకు టైగర్ పటౌడీ, అజిత్ వాడేకర్ లాంటి కెప్టెన్లు నలుగురు స్పిన్నర్లను కూడా తమ జట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మళ్లీ అలానే కుల్‌దీప్‌కు జట్టులో చోటు దక్కాలని ఆశిద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)