రిషబ్ పంత్, సంజూ శాంసన్.. టీమ్ ఇండియాలో చోటు ఎవరికి దక్కాలి?

సంజూ శాంసన్, రిషబ్ పంత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సంజూ శాంసన్, రిషబ్ పంత్
    • రచయిత, విధాన్షు కుమార్
    • హోదా, స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

వన్డే క్రికెట్ ప్రపంచకప్‌కు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉంది.

ఇటీవల టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో భారత జట్టు ఓడిపోయింది.

ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ముందు ఒక పెద్ద సవాలు కనిపిస్తోంది.

2011 నుంచి ఐసీసీ వన్డే ట్రోఫీ సాధించడానికి భారత్ ఎదురుచూస్తోంది.

న్యూజిలాండ్‌తో సీరీస్‌ను వచ్చే ఏడాది భారతదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు సన్నాహంగా పరిగణిస్తున్నారు.

ఇప్పుడు భారత్ ముందున్న అతి పెద్ద సమస్య.. వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా ఎవరిని తీసుకోవాలి? 

ప్రస్తుతం రిషభ్ పంత్ ఈ రేసులో ముందున్నాడు. కానీ, అతడు నిలకడగా బ్యాటింగ్ చేయట్లేదు. ఇటీవల మ్యాచుల్లో రిషభ్ తక్కువ స్కోర్లు చేయడంపై చర్చ జరుగుతోంది.

మరోవైపు, సంజూ శాంసన్ టీంలోకి వస్తూపోతూ ఉన్నాడు.

వీరిద్దరిలో ఎవరికి టీమిండియాలో చోటు దక్కాలి? ఇదీ ఇప్పుడున్న సమస్య.

సంజూ శాంసన్, రిషబ్ పంత్

ఫొటో సోర్స్, CHANDAN KHANNA

ఫొటో క్యాప్షన్, సంజూ శాంసన్, రిషబ్ పంత్

రిషభ్ పంత్.. టెస్టు క్రికెట్‌లో మ్యాచ్ విన్నర్‌, వన్డే, టీ20లలో చతికిలపడతాడు

టెస్టు క్రికెట్‌లో రిషబ్ పంత్ ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడనడంలో సందేహం లేదు.

టెస్టుల్లో అతడు దూకుడుగా ఆడతాడు. నాలుగు మ్యాచుల్లో కనీసం ఒకదాన్లోనైనా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడతాడు.

అందుకే, జట్టులో అతడిని విలువైన బ్యాట్స్‌మన్‌గా పరిగణిస్తారు. 

రిషభ పంత్ ఇప్పటివరకు 31 టెస్ట్ మ్యాచ్‌లలో 43.32 సగటుతో 2123 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతడి బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 72.65. అంటే, రిషభ్ పంత్ ఎక్కువ పరుగులు చేసినప్పుడల్లా, దాని ప్రభావం మ్యాచ్‌పై కనిపించినట్టు లెక్క. 

పంత్ ఆడిన కొన్ని టెస్ట్ మ్యాచులు చూద్దాం..

2018లో ఇంగ్లండ్‌లో తొలి టెస్టు సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్‌లో 464 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు తక్కువ స్కోరుకే టాప్ ఆర్డర్‌ను కోల్పోయింది. ఏడో స్థానంలో బ్యాంటింగ్‌కు దిగిన పంత్ 114 పరుగులు చేశాడు. అతడు క్రీజులో ఉన్నంతసేపు భారత్ 464 స్కోరు సాధించగలదని అనిపించింది.

మరుసటి సంవత్సరం పంత్ సిడ్నీ టెస్ట్ మ్యాచ్‌లో 159 పరుగులు చేశాడు. భారత్ ఈ టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. ఆ తరువాత 2021 ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో, పంత్ రెండు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ ఆడాడు. మొదట సిడ్నీలో 97 పరుగులు చేశాడు. దాంతో మ్యాచ్ డ్రా అయింది. తరువాత బ్రిస్బేన్‌లో 89 పరుగుల చేశాడు. టీమిండియా ఆ మ్యాచ్ గెలిచింది. 

అనంతరం, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో కూడా సెంచరీలు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ మందకొడిగా ఆడుతున్నప్పుడు రిషభ్ పంత్ క్రీజులో నిబడ్డాడు. పంత్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ కావడంతో జట్టులో అతడి బ్యాటింగ్‌కు ప్రాముఖ్యం పెరుగుతుంది. 

ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ తరచుగా ఆఫ్-స్పిన్నర్లను బాదేస్తారు. పేస్ బౌలర్‌లను లైన్‌ మార్చమని అడుగుతుంటాారు. దాంతో వారు ఒక లయలో బౌలింగ్ చేయలేరు. గత కొన్నేళ్లుగా భారత జట్టులో ఎడమచేతి వాటం ఆటగాళ్ల కరవు ఉంది. అలాంటి పరిస్థితుల్లో పంత్ జట్టులో ఉండడాన్ని విలువగా భావించవచ్చు.

రిషభ్ పంత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రిషభ్ పంత్

కానీ, వైట్ బాల్‌తో ఆడే మ్యాచుల్లో రిషభ్ ఉత్తమ ప్రదర్శన కనబరచలేకపోతున్నాడు. టెస్టుల్లో దూకుడుగా ఆడే పంత్ వన్డేలు, టీ20లలో నెమ్మదిస్తాడు. పంత్‌కు ఉన్న ప్రతిభ వన్డే, టీ20 గణాంకాలలో ప్రతిబింబించట్లేదు.

పంత్ 27 వన్డేల్లో కేవలం 840 పరుగులు చేశాడు. అందులో ఒకే ఒక్క సెంచరీ చేశాడు. అంతర్జాతీయ టీ20లలో 66 మ్యాచ్‌లలో 987 పరుగులు చేశాడు. ఇక్కడ అతడి స్ట్రైక్ రేట్ 126. ఆధునిక టీ20 క్రికెట్‌లో ఇది తక్కువ కిందే లెక్క.

మొన్నటి టీ20 ప్రపంచకప్‌లో పంత్‌ కంటే దినేశ్‌ కార్తీక్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కానీ, కార్తీక్ కూడా పరుగులు సాధించలేకపోవడంతో చివరి మ్యాచ్‌ల్లో పంత్‌కు జట్టులో చోటు దక్కింది. కానీ, పేలవంగా ఆడాడు. జింబాబ్వేపై 3, ఇంగ్లాండ్‌పై 6 స్కోర్ చేశాడు. 

ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతున్న సిరీస్‌లోని రెండు టీ20 మ్యాచుల్లో వరుసగా 6, 11 పరుగులు చేశాడు. శుక్రవారం జరిగిన మొదటి వన్డేలో 15 పరుగులు చేశాడు. అంటే, గత అయిదు ఇన్నింగ్స్‌లలో పంత్ స్కోరు - 15, 6, 11, 3, 6.

ఇలాంటి స్కోర్లు జట్టు నైతిక స్థైర్యాన్ని పెంచగలదా?

సంజు శాంసన్‌

ఫొటో సోర్స్, CHANDAN KHANNA

ఫొటో క్యాప్షన్, సంజూ శాంసన్‌

సంజూ శాంసన్ ఆట తీరు

పంత్ లాగానే సంజూ శాంసన్ కూడా వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్. వేగంగా పరుగులు చేయగలడు. కానీ, శాంసన్ ఇప్పటివరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు. రిషభ్ పంత్ టెస్టుల్లో నిలదొక్కుకున్నాడు. కాబట్టి శాంసన్ లేదా మరే ఇతర ప్లేయర్‌కు అక్కడ చోటు లేదు. 

కానీ, వన్డేలలో శాంసన్ 9 మ్యాచుల్లో 76.50 సగటుతో 294 పరుగులు చేశాడు. ఇటీవల దక్షిణాఫ్రికాపై 86 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

అంతర్జాతీయ స్థాయి టీ20లలో 16 మ్యాచ్‌లలో 21 సగటుతో 294 పరుగులు చేశాడు. శాంసన్ స్ట్రైక్ రేట్ 135. ఇది పంత్ స్ట్రైక్ రేట్ కంటే చాలా ఎక్కువ. 

శుక్రవారం నాటి వన్డే మ్యాచ్‌లో 38 బంతుల్లో 36 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. శాంసన్ బ్యాటింగ్‌లో క్లాస్ స్పష్టంగా కనిపిస్తుంది. ఐపీఎల్‌లో శాంసన్ ఆటతీరును గొప్ప క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు ప్రశంసించారు. 

అయితే, శాంసన్‌తో వచ్చిన చిక్కేంటంటే, చాలాసార్లు ఇన్నింగ్స్ శుభారంభం చేసినా, దానిని పెద్ద స్కోరుగా మలచుకోవడంలో విఫలమవుతున్నాడు. అయినప్పటికీ అవకాశం వచ్చినప్పుడల్లా మెరుపులు మెరిపిస్తూనే ఉనండు. 

కాబట్టి, వన్డే, టీ20 జట్లలో పంత్‌కు బదులు సంజూ శాంసన్‌ను చేర్చుకోవచ్చా?

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేకు ముందు, మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత వసీం జాఫర్ ట్విట్టర్‌లో తన ఫేవరెట్ XI జట్టును ప్రకటించాడు. అందులో శాంసన్‌కు బదులు పంత్‌కు చోటు దక్కింది. 

దాంతో, పంత్, శాంసన్ అభిమానులు ట్విట్టర్‌లో గొడవకు దిగారు. శాంసన్‌కు అన్యాయం జరుగుతోందని, అతడికి ఆడే అవకాశం ఇవ్వట్లేదని కొందరు, పంత్ ఎడమచేతి వాటం గల మ్యాచ్ విన్నర్ అని, అందుకే జట్టులో అతడికి స్థానం దక్కిందని కొందరు వాదించారు. 

మరోవైపు, కొందరు మాజీ క్రికెటర్లు కూడా పంత్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఒక టీవీ ఛానెల్‌లో రితిందర్ సోధి మాట్లాడుతూ, "ఎక్కువ అవకాశాలు ఇస్తున్నకొద్దీ ఆటగాడికి సమస్యలు మరింత జటిలమవుతాయి. పంత్‌ బ్యాటింగ్‌ జట్టుకు భారంగా మారుతోంది. అతడి స్థానంలో శాంసన్‌కు అవకాశం కల్పించాలి" అని అన్నాడు. 

కాగా, మొదటి వన్డేలో పంత్, శాంసన్ ఇద్దరికీ అవకాశం లభించింది. పంత్ 15 పరుగుల వద్ద అవుట్ కాగా, శాంసన్ 36 పరుగులు చేశాడు.

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లిలు తిరిగి జట్టులోకి వచ్చినప్పుడు వీరిద్దరికీ జట్టులో స్థానం లభించకపోవచ్చు. అప్పుడు సెలెక్టర్లు పంత్, శాంసన్‌లలో ఒకరినే ఎంచుకోవలసి ఉంటుంది. 

కనీసం టీ20ల్లో అయినా శాంసనన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని పలువురు భావిస్తున్నారు.

పంత్ వన్డే క్రికెట్‌లో నిలదొక్కుకోవాలంటే తన ప్రతిభను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

వీడియో క్యాప్షన్, #T20WorldCup: పాకిస్తాన్‌పై భారత్ విజయం తరువాత మెల్‌బోర్న్‌లో అభిమానుల సంబరాలు

ఇవి కూడా చదవండి: