Ind VS Pak: 1971 యుద్ధ సమయంలో ఒకే డ్రెస్సింగ్‌రూమ్‌లో భారత్, పాక్ క్రికెటర్లు... అప్పుడేం జరిగిందంటే

1972 నాటి వరల్డ్ ఎలెవన్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1972లో పాక్ క్రికెటర్లు జహీర్ అబ్బాస్ (వెనుక వరుసలో ఎడమవైపు నుంచి రెండో వ్యక్తి), ఆసిఫ్ మసూద్ (మధ్య వరుసలో ఎడమ నుంచి అయిదో వ్యక్తి), ఇంతిఖాబ్ ఆలమ్ (కూర్చున్నవారిలో ఎడమ నుంచి నాలుగో వ్యక్తి) భారత క్రికెటర్లు సునీల్ గావస్కర్ (వెనుక వరుసలో ఎడమ నుంచి మూడో వ్యక్తి), ఫరూఖ్ ఇంజినీర్ ( ఎడమ నుంచి నాలుగో వ్యక్తి), బిషన్ బేడీ (వెనుకవరుసలో ఎడమ నుంచి ఆరో వ్యక్తి)లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నారు.
    • రచయిత, సౌతిక్ బిస్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా కప్ టోర్నీలో భారత్ పాల్గొనే అంశం సందేహంగా మారింది. టీమిండియా పాకిస్తాన్‌లో పర్యటించాలంటే భారత ప్రభుత్వ అనుమతి కావాలని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు.

వచ్చే ఏడాది పాక్‌లో జరిగే ఆసియా కప్ ఆడబోమని బోర్డు కార్యదర్శి జైషా వ్యాఖ్యానించారు. ఈ చర్య అంతర్జాతీయ క్రికెట్‌కు మంచిది కాదని.... భారత్ ఇలా చేస్తే, 2023లో భారత్‌లో జరిగే ఐసీసీ వరల్డ్ కప్‌లో పాక్ పర్యటనపై ప్రభావం చూపుతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యానించింది.

ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టి20 ప్రపంచకప్‌లో ఆదివారం భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.

ఈ నేపథ్యంలో ఒకానొకసమయంలో భారత్, పాక్ జట్ల మధ్య సత్సంబంధాలు ఎలా ఉండేవో, యుద్ధ సమయంలో కూడా ఇరు దేశాల క్రికెటర్లు ఎలా ఒక్కటిగా ఉన్నారో చూపే ఘటనల గురించి చూద్దాం.

భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఇలాంటి తన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా పాకిస్తాన్ క్రికెటర్లతో భారత ప్లేయర్లు నాలుగు నెలల పాటు డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

అది 1971.. 7000 కి.మీకు పైగా దూరంలో ఉన్న ఆస్ట్రేలియాలో, ఉపఖండానికి చెందిన స్టార్ క్రికెటర్లు 'రెస్టాఫ్ ద వరల్డ్ (వరల్డ్ ఎలెవన్)' టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆతిథ్య జట్టుతో 'రెస్టాఫ్ ద వరల్డ్' టీమ్ జట్టు ఆరడజనుకు పైగా మ్యాచ్‌లు ఆడింది.

అదే సమయంలో తొమ్మిది నెలల పాటు సాగిన యుద్ధం 1971 డిసెంబరులో ముగిసింది. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యాన్ని సంపాదించింది.

సునీల్ గావస్కర్ కూడా వరల్డ్ ఎలెవన్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు.

''బయట ఏం జరుగుతున్నప్పటికీ భారత్, పాక్ క్రికెటర్ల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తలేదు'' అని సునీల్ గావస్కర్ గుర్తు చేసుకున్నారు.

వరల్డ్ ఎలెవన్ జట్టుకు గ్యారీ సోబర్స్ నాయకత్వం వహించారు. ఆ జట్టులోని మొత్తం 17 మంది క్రికెటర్లలో ఆరుగురు ఉపఖండానికి చెందినవారే.

1952 దిల్లీలో భారత్, పాక్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో పాక్ బౌలర్ అమీర్ ఇలాహీ వేసిన బంతికి అవుటైన భారత క్రికెటర్ విజయ్ హజారే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1952 దిల్లీలో భారత్, పాక్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో పాక్ బౌలర్ అమీర్ ఇలాహీ వేసిన బంతికి అవుటైన భారత క్రికెటర్ విజయ్ హజారే

భారత్ నుంచి గావస్కర్‌తో పాటు స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ, వికెట్ కీపర్ ఫరూఖ్ ఇంజినీర్ వరల్డ్ ఎలెవన్ తరఫున ఆడారు. పాకిస్తాన్ నుంచి బ్యాట్స్‌మన్ జహీర్ అబ్బాస్, ఆల్‌రౌండర్ ఇంతిఖాబ్ ఆలమ్, పేస్ బౌలర్ ఆసిఫ్ మసూద్ కూడా వరల్డ్ ఎలెవన్‌కు ప్రాతినిధ్యం వహించారు.

''పాకిస్తాన్ వ్యక్తి నడిపే ఒక రెస్టారెంట్‌కు మేం దాదాపు ప్రతీరోజూ సాయంత్రం తినడం కోసం వెళ్లేవాళ్లం. ఆ రెస్టారెంట్ యజమాని రేడియోల్లో వచ్చే వార్తా కథనాలు విని వాటిని ఉర్దూలో ఒక పేపర్‌పై రాసి ఇంతిఖాబ్‌కు ఇచ్చేవారు. కానీ వాటిని ఇంతిఖాబ్ చూసేవాడు కాదు. పేపర్‌ను నలిపేసి బయట పడేసేవాడు'' అని తన పుస్తకం 'సన్నీ డేస్'లో గావస్కర్ రాశారు.

మైదానంలో ఆట ఆడుతున్నప్పడు తోటి అంతర్జాతీయ క్రికెటర్లు, ఉపఖండ క్రికెటర్లపై సున్నితమైన జోకులు వేసేవారు. అలా జోకులు వేసిన వారిలో ఒకరు దక్షిణాఫ్రికా క్రికెటర్ హైల్టన్ అకెర్‌మన్. గావస్కర్‌తో అకెర్‌మెన్ ఓపెనర్‌గా బరిలోకి దిగేవారు. అకెర్‌మన్ అప్పటి యుద్ధ వాతావరణాన్ని ఉపఖండ క్రికెటర్లకు ఆపాదిస్తూ జోకులు వేసేవారు.

''ఆలమ్, ఇంజినీర్ ఇద్దరూ ఒకరిపైఒకరు తుపాకీ కత్తులు దూసుకుంటున్నట్లు.. ఒక యుద్ధ విమానంలో నేను ఉండగా మసూద్ దాని తోకపై కూర్చున్నట్లు.. అదే సమయంలో బిషన్ సింగ్ బేడీ, జహీర్ ఇద్దరూ పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారంటూ ఆయన సరదాగా హాస్యాన్ని పండించేవారు'' అని సునీల్ పేర్కొన్నారు.

ఈ జోకులకు తామంతా బాగా నవ్వుకునేవారిమని గావస్కర్ రాసుకొచ్చారు.

అయితే, మైదానం అవతల కొంత ఆందోళనలు ఉన్నాయి.

2004 చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా పాక్ బౌలర్ షోయబ్ అక్తర్, రాహుల్ ద్రవిడ్ మధ్య వాగ్వాదం జరిగింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2004 చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా పాక్ బౌలర్ షోయబ్ అక్తర్, రాహుల్ ద్రవిడ్ మధ్య వాగ్వాదం జరిగింది

బొంబాయిలోని తన ఇల్లు సముద్రానికి ఎదురుగా ఉండటంతో తన భార్యాపిల్లల భద్రత గురించి ఇంజినీర్ భయపడ్డారు. వారిని లాంకషైర్‌లోని ఇంటికి వెళ్లమని చెప్పబోతున్నానంటూ స్థానిక జర్నలిస్టుకు ఇంజినీర్ చెప్పడంపై బేడీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

''బేడీ, విలేఖరులతో మాట్లాడలేదు. కానీ, తన స్వస్థలమైన అమృత్‌సర్, పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో యుద్ధం గురించి బేడీ కలత చెందారు'' అని గావస్కర్ రాసుకొచ్చారు.

బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో భారత్, పాక్ క్రికెటర్లు ఒకే డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం గురించి మాట్లాడుతూ.. అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలు, రెండు యుద్ధాలు జరిగిన దేశాలకు చెందిన క్రికెటర్ల మధ్య సత్సంబంధాలను ఇది చూపిస్తుందని గావస్కర్ అన్నారు.

1947లో భారత్ నుంచి విడిపోయిన తర్వాత అయిదేళ్ల పాటు పాకిస్తాన్ జట్టు అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. 1952లో పాక్ జట్టు భారత్‌లో పర్యటించింది. అప్పుడే రెండు జట్ల తొలి టెస్టు మ్యాచ్ జరిగింది.

అన్ని విధాలుగా ఆ పర్యటన విజయవంతమైంది. కోల్‌కతాలో టెస్టు మ్యాచ్‌ను బహిష్కరించడానికి ప్రజల మద్దతును కూడగట్టాలని ఒక రాడికల్ హిందూ గ్రూపు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ మ్యాచ్ చూడటానికి అభిమానులు తరలి వచ్చారు. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-1తో గెలుపొందింది.

గత 70 ఏళ్ల కాలంలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య కేవలం 58 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఇదే సమయంలో భారత్, ఆస్ట్రేలియాలు 97 టెస్టులు ఆడాయి.

భారత్ అభిమానులు

ఫొటో సోర్స్, Getty Images

తొలినాళ్లలో ఇరుజట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లు చప్పగా సాగేవి. డ్రాలతో ముగిసేవి. 1965, 1971 యుద్ధాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి. తర్వాత 17 ఏళ్ల పాటు ఇరు జట్ల మధ్య క్రికెట్ జరుగలేదు. దౌత్యపరమైన చర్చల తర్వాత 1978లో ఇరు దేశాల మధ్య క్రికెట్ పున: ప్రారంభమైంది. అప్పుడు పాకిస్తాన్‌లో భారత్ పర్యటించింది.

తర్వాత రెండు దశాబ్దాల పాటు ఇరు జట్ల మధ్య క్రికెట్ సిరీస్‌లు జరిగాయి. మళ్లీ ఇరు దేశాల మధ్య సంబంధాలకు రాజకీయంగా విఘాతం కలగడంతో క్రికెట్ నిలిచిపోయింది. ఈసారి పాక్‌తో ఆడటానికి భారత్ నిరాకరించింది. కశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ రక్తపాతాన్ని ప్రోత్సహిస్తుందంటూ భారత్ ఆరోపిస్తూ క్రికెట్ ఆడేందుకు తిరస్కరించింది. ఈ ఆరోపణలను పాక్ ఖండించింది. కార్గిల్ సంఘర్షణ తర్వాత జరిగిన ఒక దౌత్యపరమైన చొరవ, 2003-04లో భారత్ మళ్లీ పాక్‌లో పర్యటించేలా చేసింది.

తర్వాతి నాలుగేళ్ల పాటు ఇరుజట్ల మధ్య పరస్పర క్రికెట్ టోర్నీలు జరిగాయి. 2008లో ముంబై తీవ్రవాద దాడుల తర్వాత మళ్లీ ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. కానీ, 2012-2013లో దీనికి మినహాయింపు లభించింది. అప్పుడు 5 మ్యాచ్‌లు ఆడటం కోసం పాక్, భారత్‌కు వచ్చింది. అందులో 3 మ్యాచ్‌ల్లో పాక్ గెలవగా, రెండింటిలో భారత్ నెగ్గింది.

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ టోర్నీ అయిన ఐపీఎల్‌లో కూడా పాకిస్తాన్ క్రికెటర్లకు భాగస్వామ్యం కల్పించడం లేదు.

భారత్, పాక్ మధ్య పోటీ అనేది క్రికెటర్ల మధ్య కంటే మద్దతుదారుల మనసుల్లో, మెదడుల్లో చాలా తీవ్రంగా ఉంటుందని క్రీడా రచయిత సురేశ్ మీనన్ అన్నారు.

పాకిస్తాన్ అభిమానుల నుంచి తమకు దక్కిన ప్రేమ, ఆదరణ గురించి భారత క్రికెటర్లు ఎప్పుడూ చెబుతుంటారు. 1955లో భారత క్రికెటర్లకు స్వాగతం పలకడానికి వేలాదిమంది పాక్ అభిమానులు కరాచీ విమానాశ్రయం వద్ద గుమిగూడారు.

పాకిస్తాన్ పర్యటనల సమయంలో భారత క్రికెటర్లు, షాపింగ్‌కు వెళ్లినప్పుడల్లా అక్కడి దుకాణాదారులు వారి నుంచి డబ్బు తీసుకోవడానికి నిరాకరిస్తుంటారు.

క్రికెట్ మైదానంలో తమ జట్టు సాధించే విజయం... ఒక రాజకీయ వ్యవస్థపై లేదా ఒక మతంపై లేదా ఒక దేశంపై సాధించే విజయంగా భావించే అభిమానుల మధ్యే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మాటల యుద్ధాలు జరుగుతున్నాయని మీనన్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, INDvAUS: ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ నెగ్గింది సరే, వరల్డ్ కప్‌కు టీమిండియా సన్నద్ధంగా ఉందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)