INDvsPAK: ‘పాకిస్తాన్‌ బ్యాటర్లు హెల్మెట్ పెట్టుకోకుండానే బ్యాటింగ్ చేస్తారు, భారత్ ఫాస్ట్ బౌలర్ల వేగం సరిపోదు’

భారత-పాకిస్తాన్ మ్యాచ్‌

ఫొటో సోర్స్, GIUSEPPE CACACE

ఇంకో మూడు రోజుల్లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. సూపర్-12 గ్రూప్ మ్యాచ్‌లు అక్టోబర్ 16 నుంచి ఆరంభమవుతాయి.

అక్టోబరు 23న మెల్‌బోర్న్‌లో భారత, పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటినుంచే ఈ మ్యాచ్‌పై వాడి వేడి చర్చలు మొదలయ్యాయి. అనేక రకాల ఊహాగానాలు, వాదనలు సాగుతున్నాయి. మాజీ క్రికెటర్లు ఇరు జట్ల బలాబలాలను విశ్లేషిస్తున్నారు.

ఇప్పటి పాకిస్తాన్ జట్టు పటిష్టంగా ఉందని పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా అన్నారు. అయితే, బ్యాటింగ్‌లో భారత జట్టే బలంగా ఉందని ఆన్నారు.

"చాలాకాలం తరువాత ఈమధ్యే పాకిస్తాన్, భారత్‌పై గెలిచింది. ఈ జట్టుకు ప్రశంసలు అందించాల్సిందే. అయితే, నైపుణ్యానికి సంబంధించి భారత్, పాకిస్తాన్ కన్నా చాలా ముందుంది. బ్యాటింగ్‌లో బలంగా ఉంది. పాకిస్తాన్‌కు ఒక మెంటల్ బ్లాక్ ఉంది. గత మ్యాచ్‌లో యువ కెప్టెన్ సారథ్యంలో దాన్ని తొలగించుకుంది.

మీరు కెప్టెన్‌కు మద్దతు అందిస్తే, అతడు జట్టును ముందుకు తీసుకువెళతాడు. నేను క్రికెట్ ఆడాను, కెప్టెన్‌గా కూడా ఉన్నాను. డ్రెస్సింగ్ రూమ్‌లో మీ మాట చెల్లకపోతే, మిమ్మల్ని ఎవరో ఒకరు వెనుక నుంచి లాగుతుంటే, ఎప్పటికీ మీరు జట్టు సభ్యుల విశ్వాసం పొందలేరు. నేను బాబర్‌కు అధికారం ఇచ్చాను. 27 ఏళ్ల వయసులో అతడు ఆటను బాగా అర్థం చేసుకుంటున్నాడు. అతడికి మంచి ఆత్మవిశ్వాసం, పరిణితి ఉంది" అని రమీజ్ రాజా అన్నారు.

మరోవైపు, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ భారత్ ఫాస్ట్ బౌలింగ్‌లో పస లేదని వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ ఆటగాళ్లు సయీద్ అన్వర్, అమీర్ సోహైల్‌లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భారత ఫాస్ట్ బౌలర్ల వేగం ఏ మాత్రం సరిపోదని, వాళ్లు హెల్మెట్ పెట్టుకోకుండానే బ్యాటింగ్ చేస్తారని అన్నాడు.

టీ 20 వరల్డ్ కప్

ఫొటో సోర్స్, DAN MULLAN

భారత్ బౌలర్లపై ఒత్తిడి

ప్రస్తుతం భారత జట్టు బౌలింగ్‌పై కొంత ఆందోళన ఉంది. ఇటీవల జరిగిన మ్యాచ్‌లలో భారత బ్యాట్స్‌మెన్ బాగా రాణించినప్పటికీ, బౌలింగ్ చాలా సందర్భాలలో నిరాశపరిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బౌలింగ్ గురించి ఆందోళన వ్యక్తం చేశాడు.

జస్‌పీత్ బుమ్రా లేకపోవడంతో భారత బౌలింగ్‌ బలహీనంగా ఉందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

2013 జనవరి నుంచి భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరగలేదు. ఈమధ్య జరిగిన ఆసియా కప్‌లో ఇరు జట్లు రెండు మ్యాచ్‌లు ఆడాయి. ఒక మ్యాచ్‌లో భారత్‌, మరో మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచింది.

ఈనెల 23న మెల్‌బోర్న్‌ వేదికగా భారత్‌, పాకిస్తాన్‌లు టీ20 ప్రపంచకప్‌లో తలపడనున్నాయి.

వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో ఆడుతున్నప్పుడు తాను ఎలాంటి ఒత్తిడికి గురికానని భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అన్నాడు.

"ఒక జట్టుతో ఒకసారి ఆడిన తరువాత, రెండోసారి ఆడడానికి భయం ఉండదు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై చర్చలు మొదలయ్యాయి. కానీ, మాకు ఇది మరొక మ్యాచ్, అంతే. ఎక్కువ ఆలోచిస్తే అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది" అని చాహల్ ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు.

పాకిస్తాన్ జట్టు బాగుందని చాహల్ అన్నాడు. అయితే, మ్యాచ్ రోజు ఎలా ఆడతారన్నదే ముఖ్యమని, దాన్నిబట్టి గెలుపు, ఓటములు ఉంటాయని అన్నాడు.

ధోనీ

ఫొటో సోర్స్, MANAN VATSYAYANA

టీ20, వన్డే ప్రపంచ కప్‌లలో భారత్‌దే పైచేయి

గత ఏడాది మినహాయించి, టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ చేతిలో ఎప్పుడూ ఓడిపోలేదు. వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ పాకిస్తాన్‌తో ఎప్పుడూ ఓడిపోలేదు.

గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. విరాట్ కోహ్లి తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా ఆడలేదు. అనంతరం పాకిస్తాన్ జట్టు వికెట్‌ కోల్పోకుండా విజయం సాధించింది.

దీని తరువాత ఆసియా కప్‌లో ఇరు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. చెరొకసారి గెలిచాయి.

రానున్న టీ20 వరల్డ్ కప్ గురించి పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ, బాబర్ ఆజం కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు భారత్‌కు గట్టి ప్రత్యర్థిగా అవతరించిందన్నాడు.

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత్ చాలాసార్లు పాకిస్తాన్‌ను ఓడించిందని, ఆ తరువాత ఈ ట్రెండ్ తగ్గుముఖం పట్టిందని అఫ్రిది అన్నాడు.

"ధోనీ తన కెప్టెన్సీలో భారత జట్టు వైఖరినే మార్చేసాడు. అంతకుముందు భారత-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే ఉద్వేగాలను తుడిచిపెట్టేశాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పాకిస్తాన్ కూడా బలంగా ఉంది. బాబర్ సారథ్యంలో ఒకే ఏడాది పాకిస్తాన్, భారత్‌ను రెండుసార్లు ఓడించింది" " అని అఫ్రిది అన్నాడు.

అయితే, భారత జట్టే పటిష్టంగా ఉందని భారత జట్టు మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అభిప్రాయపడ్డారు.

పాకిస్తాన్ జట్టు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లపైనే ఆధారపడి ఉన్నదని, కానీ, భారత్‌లో కనీసం ముగ్గురు నుంచి నలుగురు మ్యాచ్‌ గెలిపించే ఆటగాళ్లు ఉన్నారని అన్నారు. బ్యాటింగ్ పరంగా చూస్తే భారత జట్టు మెరుగ్గా ఉందని ఆయన అన్నారు.

కాగా, పాకిస్తాన్ జట్టు ఇటీవల వరుస పరాజయాలతో కాస్త తడబడుతోంది. ఆసియా కప్ ఫైనల్లో ఓడిపోయిన తరువాత, ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 4-3 తేడాతో ఓడిపోయింది.

వీడియో క్యాప్షన్, హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియం దగ్గర క్రికెట్ అభిమానుల సందడి ఎలా ఉందంటే

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)