కేరళలో నరబలి వివాదం: 'మంత్రగాడి సలహాతో' ఇద్దరు మహిళలను హత్య చేసిన దంపతులు.. ఏం జరిగింది?

కేరళలో 'నరబలి' పేరుతో ఇద్దరు మహిళలను హత్య చేసిన ఉదంతం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణానికి సంబంధించి కేరళలోని ఎర్నాకుళంలో భార్యాభర్తలతో పాటు, ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మంత్రగాడినని చెప్పుకుంటున్న సదరు వ్యక్తి సలహా మేరకు నిందితులైన దంపతులు 'నరబలి' కోసం ఈ హత్యలు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు.
నిందితుల్లో కేరళలోని పతనమిట్టలో తిరువళ్లకు చెందిన నాటు వైద్యుడు భగావల్ సింగ్, ఆయన భార్య లైలాతో పాటు.. మంత్రగాడినని చెప్పుకుంటున్న మొహమ్మద్ షఫీ ఉన్నారు.

ఫొటో సోర్స్, BBC/ARUN CHANDRA BOSE
జూన్‌లో ఒకరు, సెప్టెంబరులో ఒకరు అదృశ్యం...
రోసలిన్ (49) కేరళలో లాటరీ టికెట్లు అమ్ముతుండేవారు. ఆమె జూన్ నుంచి కనిపించకుండా పోయారని ఆమె బంధువులు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో నివసించే ఆమె కూతురు దీనికి సంబంధించి ఆగస్టు 17వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా.. ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌లో లాటరీ టికెట్లు విక్రయించే పద్మ అనే 52 ఏళ్ల మహిళ కూడా సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అదృశ్యమైనట్లు గుర్తించారు. పద్మ స్వస్థలం తమిళనాడులోని ధర్మపురి. ఈ ఇద్దరు మహిళల అదృశ్యం మీద పోలీసులు దర్యాప్తు కొనసాగించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దర్యాప్తు వివరాలను కదవంతర పోలీసులు బీబీసీకి తెలిపారు.
''పద్మను ఎవరో తీసుకెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా మాకు తెలిసింది. అతడి పేరు రషీద్ అలియాస్ మొహమ్మద్ షఫీ అని తెలిసింది. పతనమిట్టలో గల తిరువళ్లలో నివసించే స్థానిక నాటు వైద్యుడు భగావల్ సింగ్, ఆయన భార్య లైలాల కోసం పద్మను అపహరించినట్లు కనుగొన్నాం. వారికి ఆర్థిక సమస్యలున్నాయి. వాటి నుంచి బయటపడటానికి నరబలి ఇవ్వాలని ఆ దంపతులకు మొహమ్మద్ షఫీ సలహా ఇచ్చి, ఒప్పించాడు. పద్మను నరబలి కోసం ఆ దంపతుల ఇంటికి తీసుకెళ్లారు'' అని పోలీసులు వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు
''ఎర్నాకుళం నుంచి వేర్వేరు సమయాల్లో ఇద్దరు వేర్వేరు మహిళలను తీసుకురావటంలో మొహమ్మద్ షఫీ సాయం చేశాడు. మొదట ఒక మహిళను నరబలి కోసం తీసుకురావటానికి అతడు మధ్యవర్తిగా పనిచేశాడని తొలుత మేం భావించాం. దర్యాప్తు క్రమంలో మరో మహిళను కూడా బలి ఇచ్చారని, దీని వెనుక కీలక సూత్రధారి షఫీ అని తేలింది'' అని కేరళ సౌత్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రకాష్ చెప్పారు.
దర్యాప్తు గురించి కొచ్చి నగర పోలీస్ కమిషనర్ నాగరాజు చక్కిలం మరిన్ని వివరాలు తెలిపారు.
''పద్మ ఎలా అదృశ్యమయ్యారనే అంశంపై మేం దర్యాప్తు చేసినపుడు.. ఆమె సెల్‌ఫోన్ చివరి టవర్ లొకేషన్.. ఆమె షఫీతో మాట్లాడినట్లు చూపింది. దీంతో మేం షఫీని విచారించాం. పద్మ సహా ఇద్దరు మహిళలను తిరువళ్లలో నరబలిలో చంపినట్లు అతడు అంగీకరించాడు. దీంతో ఆ జంటను మేం విచారించాం. రోసిలిన్ అనే మరో మహిళను కూడా నరబలిలో హత్య చేసినట్లు వారు అంగీకరించారు'' అని ఆయన చెప్పారు.
షఫీ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్న దంపతులను విచారించారు. ఇద్దరూ తమ నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు.
షఫీ సూచనల మేరకు బాధితురాలి శరీర భాగాలను కోసుకున్నామని దంపతులు పేర్కొన్నారు. దంపతులు మానవ మాంసాన్ని వండుకుని తిన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈ హత్యల వెనుక పూర్తి విషయాలను తెలుసుకోవటానికి ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు చెప్తున్నారు.

పద్మ కేరళకు ఎందుకు వెళ్లారు?
తమిళనాడులోని ధర్మపురిలో ఉన్న పద్మ భర్త రంగన్‌తో బీబీసీ మాట్లాడింది.
''నా భార్యను జీవనోపాధి కోసం కేరళ పంపించాను. ఇలా జరుగుతుందని నాకు ముందుగా తెలిసినట్లయితే ఆమెను పంపించేవాడిని కాదు. నేను వృద్ధాప్యం వల్ల పని చేయలేకపోతున్నాను. అందుకే ఆమె అక్కడికి వెళ్లింది. కానీ ఇలా చనిపోయింది. దీనిని జీర్ణించుకోలేకపోతున్నాను. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు'' అని చెప్పారాయన.
ప్రాథమిక దర్యాప్తులో ఈ హత్యలకు కారణం నరబలి అని వెల్లడైంది.
కేరళకు చెందిన భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ నరబలి వివాదంపై కేరళ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కేసులో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడి హస్తముందని ఆయన ఆరోపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"కేరళలో ఇటువంటి సంఘటన అసాధారణం" అని భగవాల్ సింగ్ ఇంటి సమీపంలోని నివాసితులు బీబీసీతో అన్నారు.
పద్మ, రోస్లిన్ మృతదేహాలు బయటకు తీశారు. పద్మ తన జుత్తుకు క్లిప్ పెట్టి ఉంది. ఈ క్లిప్ ఆధారంగా అది పద్మ శరీరమే అని ఆమె సోదరి గుర్తించారు.
రోసలిన్ కూతురు మంజు తన తల్లిని వెదుక్కుంటూ గత ఆగస్టులో ఉత్తర ప్రదేశ్ నుంచి కేరళ వచ్చారు. అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లి హత్యకు గురైన విషయం వార్తల ద్వారానే తనకు తెలిసిందని, పోలీసుల నుంచి అధికారికంగా సమాచారం అందలేదని ఆమె తెలిపారు.
రెండు రోజుల విచారణ ముగియడంతో భగవాల్ సింగ్, లైలా, మహ్మద్ షఫీ అనే ముగ్గురు వ్యక్తులను బుధవారం ఎర్నాకులం సబ్ డివిజనల్ అండ్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతరం కేసు విచారణ నివేదికను పోలీసులు కోర్టులో దాఖలు చేశారు.
వాటిని నమోదు చేసిన అనంతరం ముగ్గురికి అక్టోబర్ 26 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి:
- మొబైల్ ఫోన్లు చోరీ అయితే పోలీసులు ఎలా వెతికి పట్టుకుంటారో తెలుసా?
- కొల్లాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?
- బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?
- మీరు డార్క్ చాక్లెట్ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











