చార్వాక ఆశ్రమం: తెలుగునాట హేతుబద్ధ ఆలోచనల వేదిక.. నాస్తిక మేళాలతో హేతువాదులకు వేడుక

- రచయిత, శంకర్ వి
- హోదా, బీబీసీ కోసం
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా హేతుబద్ధమైన ఆలోచనల వ్యాప్తి కోసం తెలుగునాట అనేకమంది కృషి చేశారు. స్వాతంత్ర్యానికి పూర్వమే ఇలాంటి ప్రయత్నాలు చాలాచోట్ల జరిగాయి. ఆ తర్వాత కూడా ఈ దిశగా కృషి జరిగింది. చార్వాక ఆశ్రమం అందులో ఒకటి.
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఉన్న చార్వాక ఆశ్రమం కూడా ఆ కోవలోకే వస్తుంది. ఒక విద్యావేత్త ఆశయంతో ఏర్పడిన ఈ ఆశ్రమం నేటికీ విస్తృత కార్యక్రమాలతో ఉభయ తెలుగు రాష్ట్రాల నాస్తికోద్యమంలో కీలక పాత్ర పోషిస్తోంది.

సంఘ సంస్కరణోద్యమాలకు కొనసాగింపుగా..
దేశంలో స్వతంత్ర్య పోరాటంతో పాటుగా సంఘ సంస్కరణల ఉద్యమాలు కూడా అనేకం జరిగాయి. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఆచరణాత్మక పరిష్కారాలతో అనేక మంది హేతువాద, నాస్తికొద్యమాలను నిర్వహించారు.
ఇప్పటికీ ఆ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థల్లో చార్వాక ఆశ్రమ ఒకటి. గుంటూరు జిల్లా మంగళగిరికి 3కి.మీ.దూరంలోని నిడమర్రులో ఈ ఆశ్రమం ఏర్పాటు చేశారు. బి.రామకృష్ణ దీని వ్యవస్థాపకులు.
1972లో ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయన అప్పటి నుంచి వివిధ మార్గాల్లో తన హేతువాద, నాస్తికవాద ఆలోచనల ప్రచారానికి పూనుకున్నారు.
తొలి భౌతికవాద తత్త్వమైన చార్వాక, లోకాయత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడమే లక్ష్యంగా ఆయన ఈ ప్రయత్నం ప్రారంబించారు. తెలుగునాట తొలినాళ్లలో వేమన, ఆ తరువాత త్రిపురనేని రామస్వామి, కొండవీటి వేంకటకవి వంటి వారు సాగించిన ప్రచారాన్ని అందిపుచ్చుకున్న రామకృష్ణ, చివరకు చార్వాక రామకృష్ణగా గుర్తింపు పొందారు.

పాఠశాలతో ప్రారంభించి...
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన బొడ్డు రామకృష్ణ తాడికొండలోని సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. అయితే ఆనాటి విద్యావిధానం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ఉద్యోగాన్ని వదిలి 1972లో ప్రగతి విద్యావనం పేరుతో చార్వాక ఆశ్రమాన్ని ప్రారంభించారు.
సొంతంగా సిలబస్ రూపొందించి విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం ప్రోత్సహించేలా పాఠశాల నడిపారు. శాస్త్రీయ విద్యా విధానంలో కొత్త తరాన్ని తీర్చిదిద్దేందుకు పూనుకున్నారు. ఆనాడు రామకృష్ణ వద్ద విద్యనభ్యసించిన అనేక మంది నేడు రాష్ట్రమంతా వివిధ సంస్థల్లో కీలక భూమిక పోషిస్తున్నారు.
"నేను ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకూ ట్యూషన్‌కు వెళ్లాను. రాత్రిపూట ఆశ్రమంలోనే చదువుకుంటూ అక్కడే ఉండేవాళ్లం. మాస్టారి జీవనవిధానం, బోధనాపద్ధతులు మమ్మల్ని ప్రభావితం చేశాయి. నాతోపాటు అనేక మంది హేతువాద దృక్పథం అలవరుచుకోవడానికి అది ఎంతగానో తోడ్పడింది. నిడమర్రుకి చెందిన నేను చదువుల తర్వాత విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాను. అనేక మంది వివిధ రంగాల్లో గుర్తింపు సాధించడానికి చార్వాక ఆశ్రమంలో దక్కిన అనుభవం తోడ్పడింది‘' అని చార్వాక ఆశ్రమంలో మాస్టారి వద్ద విద్యాభ్యాసం చేసిన పి.కోటిరెడ్డి అన్నారు. ప్రస్తుతం కార్మిక సంఘాలలో పనిచేస్తున్నారు.

ఆలోచనలు ప్రభావితం చేసేలా..
సమాజంలో మార్పు రావాలంటే భావజాల ప్రచారం అవసరమని రామకృష్ణ విశ్వసించారు. దానికి అనుగుణంగా చార్వాక పత్రికను నడిపి రాష్ట్రమంతా పంపిణీ చేశారు. తన ఆశ్రమంలో విద్యావిధానంలో తీసుకొచ్చిన మార్పుల ద్వారా హేతవాద నాస్తిక వాద ఆలోచనలు రేకెత్తించారు.
అంతేగాకుండా చార్వాక పరిసరాలనే భిన్న వాతావరణంలో తీర్చిదిద్దారు. ఆశ్రమ ద్వారం వద్ద దుస్తులు ధరించిన వేమన విగ్రహం కనిపిస్తుంది. అంతేగాకుండా ప్రాంగణం లోపలికి ప్రవేశించగానే మహాత్మా రావణ మైదానం అని ఉంటుంది.
వేమన దిగంబరుడు కాదనీ, రావణుడు హింసోన్మాదీ కాదని చాటేందుకు ఆయన ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. వేమన 300 ఏళ్ల క్రితమే విగ్రహారాధనను ఖండించడమే కాకుండా, హేతువాద భావనలతో సమాజ ఉద్దరణకు కృషి చేసిన మానవవాదిగా చార్వాక ఆశ్రమం భావిస్తోందని ప్రస్తుతం ఆశ్రమ నిర్వహణ బాధ్యతల్లో ఉన్న రామకృష్ణ వారసుడు సుధాకర్ బీబీసీతో అన్నారు.
వేమనను అపహాస్యం చేసే ప్రయత్నాలు కూడదని చెప్పేందుకే ఇలాంటి ప్రయత్నం చేశారు.
‘'మతవాదులు, భావవాదులు వేమనని దిగంబరునిగా, పిచ్చివానిగా చూపించే ప్రయత్నం చేయడాన్ని నిరసిస్తూ ఆయన విగ్రహం ఏర్పాటు చేశాం. ఆయనతో పాటుగా సామాజిక మార్పు కోసం ఉద్యమించిన అంబేడ్కర్, పెరియార్ రామస్వామి, త్రిపురనేని రామస్వామి, జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, కె.వి.కృష్ణ, సామినేని ముద్దు నరసింహం, పాయసి విగ్రహాలను ఏర్పాటు చేశాం. ఆశ్రమం లోపల భారతీయ ప్రాచీన హేతువాదులైన అజిత కేశకంబళుడు, కణాదుడు, కపిలుడు, మక్కలి గోశాలుడు తదితరుల విగ్రహాలున్నాయి. భగత్ సింగ్ విగ్రహం కూడా ఉంది. ఇవన్నీ కొత్త తరానికి హేతువాద భావనలను పరిచయం చేసే ప్రయత్నం’' అన్నారు సుధాకర్.

ప్రతీ ఏటా నాస్తిక మేళాలు..
వివిధ మతాలకు సంబంధించిన ఉత్సవాలు, వేడుకలు చాలామందికి పరిచయం ఉంటాయి. వాటికి విస్తృత ప్రచారం కూడా జరుగుతుంది. వాటికి భిన్నంగా కులమతాలకు అతీతంగా మానవులందరి శ్రేయస్సును కాంక్షించే మానవతావాదుల కోసమంటూ నాస్తిక మేళాలు ప్రారంభించామని చార్వాక ఆశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు.
1992లో రామకృష్ణ ఈ మేళాకు శ్రీకారం చుట్టగా నేటికీ ఏటా ఫిబ్రవరిలో అలాంటి సమ్మేళనాలు జరుగుతున్నాయి. నిడమర్రులోని చార్వాక ఆశ్రమం కేంద్రంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి నాస్తిక, హేతువాద, భౌతికవాద ఆలోచనలతో అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు.
పిల్లాపాపలతో కలిసి వచ్చి కుటుంబాలతో పాటుగా ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతారు. ఆ సందర్భంగా మూఢనమ్మకాలు, కులమత సమస్యలు, మహిళల అణచివేత, మానవ, సమాజ పరిణామ క్రమం, జీవవైవిధ్యం, పర్యావరణ సంబంధిత అంశాలపై చర్చలు ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తారు.
ఇవన్నీ తమకు ఒక జాతరలా ఉంటాయని, ఏటా తెలంగాణాలోని బెల్లంపల్లి నుంచి వస్తున్న మహిళా కార్యకర్త అక్కు ఉమ బీబీసీతో అన్నారు.
"మా పెళ్లి కాకముందు నుంచే మా ఆయన ఈ చార్వాక ఆశ్రమానికి వచ్చేవారు. 32 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నాం. మేళా లేనప్పుడు కూడా చార్వాక ఆశ్రమంలో చదివే పిల్లలను చూడడానికి ఇక్కడికి వచ్చేవాళ్లం. నాస్తికులకు ఇది ఓ పండుగలా ఉంటుంది. తెలియని అనేక విషయాలు వివరంగా చెబుతారు'' అన్నారామె.

వారసత్వం కొనసాగిస్తూ..
చార్వాక ఆశ్రమం స్థాపన నుంచి నిర్వహణ వరకూ మూడు దశాబ్దాల పాటు బాధ్యతలు చూసిన రామకృష్ణ 2007లో అనారోగ్యంతో మరణించారు. ఆయన తర్వాత అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వారసులు ఆశ్రమ నిర్వహణ కొనసాగిస్తున్నారు.
రోజు వారీ పాఠశాల నిర్వహణ ఆగిపోయినా, ఇతర విషయాల్లో మాత్రం రామకృష్ణ కుటుంబీకులు తమ శక్తి మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన భార్య గృహలక్ష్మి, బిడ్డలు సుధాకర్, స్నేహ, అరుణ, చార్వాక వంటి వారు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
"పిల్లలకు చిన్ననాటి నుంచే భౌతికవాద దృక్పథంతో విద్య అందిస్తే శాస్త్రీయ ఆలోచనలతో సమాజం అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో ఈ ఆశ్రమం ప్రారంభమయ్యింది. రైతులు శ్రామికుల సమస్యలను స్వయంగా పిల్లలకు అనుభవపూర్వకంగా చూపించడం, సమస్యలకు పరిష్కారాలు తెలియజేయడం 2005 వరకూ నడిచిన స్కూల్లో సిలబస్‌గా ఉండేది. ప్రముఖ శాస్త్రవేత్తలతో విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహించి వారిలో మంచి భావనలు పెంపొందించే ప్రయత్నాలు జరిగాయి. నేటికీ ప్రతీ నెలా అధ్యయన తరగతులు నిర్వహిస్తున్నాం" అని సుధాకర్ తెలిపారు.
"తిరిగి విద్యాలయం ప్రారంభించాలని అనుకుంటున్నాం. మూఢ విశ్వాసాలపై కార్యాచారణ రూపొందిస్తున్నాం'’ అన్నారాయన.
తెలుగు ప్రజల్లో హేతువాద భావజాలం కోసం గోపరాజు రామచంద్రరావు(గోరా) కాలం నుంచి అనేక ప్రయత్నాలు సాగినప్పటికీ చార్వాక ఆశ్రమానికి కొన్ని ప్రత్యేకతలున్నాయని 'న్యూ సోషలిస్ట్ ఇన్సియేటివ్' ప్రతినిధి జి.భార్గవ్ బీబీసీతో అన్నారు.
"భావవాద తత్వశాస్త్రానికి వ్యతిరేకంగా భౌతిక వాద తత్వశాస్త్రం గురించి ప్రచారం చేయడం అనేకచోట్ల చూస్తాం. అయితే భౌతికవాద భావజాలాన్ని ప్రచారం చేయడమే కాకుండా దోపిడి వ్యవస్థపై పోరాడడం, అలాంటి పోరాటాలకు సంఘీభావం తెలియజేయడం ఓ కర్తవ్యంగా ఉండాలని భావించిన సంస్థ చార్వాక ఆశ్రమం. నాలాంటి వారికి విద్యార్థి దశ నుంచి చార్వాక పుస్తకాలు పరిచయం ఉన్నాయి. ఇలాంటివి మరింత విస్తృతంగా జరగాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ‘దెయ్యం’ భయంతో మగాళ్లు మాయం
- కులం, మతం: వదులుకోవటం ఎందుకంత కష్టం?
- శాంతియుత నిరసనలు హింసాత్మకంగా ఎందుకు మారతాయి? పోలీసులతో జనం ఎందుకు ఘర్షణకు దిగుతారు?
- చింతల వెంకటరెడ్డి: మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- ఆంధ్రప్రదేశ్: గాడిద మాంసం తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా.. ఏపీలో ఎందుకంత గిరాకీ పెరుగుతోంది
- మోటేరా స్టేడియం.. అపూర్వమైన ప్రపంచ రికార్డులకు వేదిక
- 4 ఏళ్ల చిన్నారి నుంచి 62 ఏళ్ల వృద్ధుడి వరకు, ఒకే కుటుంబంలో 18 మందికి కరోనావైరస్.. అంతా ఎలా బయటపడ్డారంటే..
- తెలంగాణలో కుల అహంకార హత్య: ప్రేమించి గర్భం దాల్చిన కూతురిని చంపేసిన తల్లిదండ్రులు
- పులి, మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?
- 2 వేల సంవత్సరాలు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయా?
- దేశ రాజధానిలో తెలుగువారికి వైద్యం అందుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










