2 వేల సంవత్సరాలు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయా? ఏదైనా ప్రళయం వచ్చి మానవ జాతి అంతరించిపోతే ఆహారం కోసం ఎక్కడ వెతకాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విలియం పార్క్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
ఒక వేళ రేపే మానవ జాతి అంతరించిపోతే, మనం ఎటువంటి ఆహారం తీసుకున్నామో భవిష్యత్ పురావస్తు శాస్త్రజ్ఞులు ఎలా కనుగొంటారు? ముఖ్యంగా వారికి నిల్వ ఉండే ఆహార పదార్ధాలు ఏమన్నా లభిస్తాయా?
సెప్టెంబర్ 8వ తేదీ 1941 వ సంవత్సరంలో నాజీ సేనలు లెనిన్ గ్రాడ్‌ని పశ్చిమ, దక్షిణ దిశల్లో, ఫిన్లాండ్ మీదుగా ఉత్తరం నుంచి చుట్టుముట్టాయి. లడోగా సరస్సు ఒడ్డున నివసిస్తున్న కొంత మంది ప్రజలకి మాత్రం రష్యాతో సంబంధాలు ఉన్నప్పటికీ, విపరీతంగా జరిగిన బాంబుల దాడి వలన వారిని అక్కడ నుంచి తరలించడం కష్టం అయింది. లెనిన్ గ్రాడ్‌ని నాజీ సేనలు దిగ్బంధం చేయడం ఇలా ప్రారంభం అయింది. ఇది చరిత్రలోనే అనేక మంది ప్రాణాలను పొట్ట పెట్టుకున్న ఘటన అని చెప్పవచ్చు.
ప్రజలు ఆకలితో అలమటిస్తున్న కొలదీ, ఆహారం కోసం ప్రజలని చంపి.. శవాలను పీక్కుని తినే పరిస్థితి తలెత్తింది. ఈ శవాలను పీక్కుని తినే పరిస్థితితో ప్రజల్లో భయం ఆవరించేసింది. ఈ చర్యలను ఆపడానికి అసంబద్ధంగా ప్రవర్తించిన వారిని జైల్లో పెడతామని పోలీసులు బెదిరించాల్సి వచ్చింది. చాలా సందర్భాల్లో, ఉద్యోగాలు లేనివాళ్లు, ఒంటరిగా ఉంటున్న తల్లులు ఇలాంటి పనులకి పాల్పడితే వారిని కాల్చి చంపకుండా, వారి మీద జాలి చూపించి జైళ్ళకి పరిమితం చేసేవారు.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక ప్రాంతంలో ఎవరూ ముట్టుకోని ఆహారం భద్రంగా ఉండేది. లెనిన్ గ్రాడ్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్ అఫ్ ప్లాంట్ ఇండస్ట్రీ తమ జీన్ బ్యాంకులో ప్రపంచంలోనే అత్యధిక రకాల విత్తనాలను సేకరించి భద్రపరిచింది. ఏవైనా వృక్ష జాతులు కానీ మొక్కల జాతులు కానీ అంతరించిపోతే, ఇక్కడ దొరికే విత్తనాల ద్వారా ఆ పంటల్ని తిరిగి పండించుకోవచ్చు.
ఆ విత్తనాలు శుష్కించిన దశలో కూడా వాటిలో జీవాన్ని శాస్త్రవేత్తలు పరిరక్షించి ఉంచారు. ఎవరైనా జీన్ బ్యాంకు మీద దాడి చేసి ఎవరికీ అందకుండా కొల్లగొడతారేమో, లేదా ఆకలితో ఉన్న ప్రజలు వాటి మీద దాడి చేస్తారేమోననే భయం శాస్త్రజ్ఞులకు ఉండేది.
1943లో జనవరి 18వ తేదీన సోవియెట్ రెడ్ ఆర్మీ ఆంక్షలని ఎత్తివేసే సమయానికి కూడా ఆ సీడ్ బ్యాంకు సురక్షితంగానే ఉంది.
ఇలాంటి విపత్తు కానీ, లేదా ఒక న్యూక్లియర్ ప్రళయం కానీ, ప్రపంచ యుద్ధం కానీ మళ్ళీ మానవ చరిత్రలో సంభవిస్తే ఎటువంటి ఆహారం మిగిలి ఉంటుంది? ఆ ఆహరం ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? అది అర్ధం చేసుకోవడానికి అసలు ఆహారం ఎందుకు పాడవుతుంది అనే విషయం తెలుసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఉప్పు
కేవలం ఆహారంలో ఉండే సూక్ష్మజీవుల కారణంగానే అన్ని రకాల ఆహారాలు పాడవ్వవని లండన్ యూనివర్సిటీ కాలేజీలో పని చేస్తున్న ఫుడ్ కెమిస్ట్రీ నిపుణుడు మైఖేల్ సులు చెప్పారు. ఆహారాన్ని ఎండబెట్టడం, ఉప్పు వేసి లేదా శీతల ఉష్ణోగ్రతల్లో భద్రపరచడం ద్వారా నిల్వ చేయవచ్చు. ఇవన్నీ కూడా ఆహారంలో బాక్టీరియా పెరగకుండా తీసుకునే రక్షణ చర్యలే.
ఆహారాన్ని కేవలం గాలి చొరబడని జాడీలలో భద్రపరచడం మాత్రమే కాకుండా, వాటిని ఎండబెట్టడం, ఉప్పు వేసి నిల్వ ఉంచడం ఉత్తమమైన పద్ధతులని సులు అన్నారు.
ఏ రకంగా భద్రపరిచినా కూడా ఆహారంలో ఉండే వ్యాధికారక క్రిములని పూర్తిగా హరించడం కష్టమని తెలిపారు. అయితే, సరైన విధానాలను పాటించి వాటిని నిల్వ ఉంచడం ద్వారా బాక్టీరియా పెరగకుండా చూసే అవకాశం ఉంటుంది.
ఎండబెట్టడం వలన బాక్టీరియా నశిస్తుంది. నీటిలో బాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది.
కేవలం గాలి చొరబడని జాడీలలో ఆహారాన్ని నిల్వ చేస్తే బాక్టీరియా పెరుగుదలని నిరోధించలేము. ఎందుకంటే అప్పటికే ఆహారంలో కొంత బాక్టీరియా ఉంటుంది. ఉదాహరణకి మాంసాహారంలో ఉండే సూక్ష్మ క్రిములు ఆక్సిజన్ లేకపోయినా విపరీతంగా పెరిగిపోతాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హానికారకమని సులు అన్నారు. అందుకే ఎండబెట్టడం ఉత్తమమైన విధానం అని తెలిపారు.
మాంసాహారాన్ని ఉప్పు కలిపి ఉంచితే కాస్త మేలు. ఉప్పు ఎక్కువగా ఉండటం వలన సూక్ష్మ జీవులు పెరిగేందుకు వాతావరణం అనుకూలించదు. దీనినే ఓస్మోటిక్ షాక్ అంటారు. సూక్ష్మ జీవుల్లో ఉండే నీటి శాతాన్ని ఉప్పు హరించి అవి మరింత పెరగకుండా ఉండటానికి దోహదం చేస్తుంది.
చక్కెర
ఇదే పనిని చక్కెర కూడా చేస్తుంది. సాధారణంగా చక్కెరతో చేసిన కొన్ని ఆహార పదార్ధాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. రిఫైన్డ్ చక్కెరలో సూక్ష్మ జీవుల ఎదుగుదల ఉండదు. చాక్లెట్లు, పిండి వంటలు లాంటివి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కానీ, ఇందులో ఒక్కసారి జీడిపప్పు, బాదం, కిస్మిస్, పాలు, గుడ్లు, జెలటిన్ లాంటి పదార్ధాలని కలిపితే మాత్రం ఇవి నిల్వ ఉండే అవకాశం తగ్గిపోతుంది. చాకోలెట్స్, కారమెల్‌తో చేసిన పదార్ధాలలో ఈస్ట్ ఉండటం వలన, తయారీ దశలో బాక్టీరియాతో కూడిన పదార్ధాలను వాడటం వలన కూడా వీటిలో నెమ్మదిగా సూక్ష్మజీవులు పెరగడం మొదలవుతుంది.
అత్యధిక కాలం నిల్వ ఉన్న ప్రొసెస్డ్ ఆహారానికి ఉదాహరణగా, ఐస్‌లాండ్‌లో మెక్ డోనల్డ్స్ ఆఖరి సారి తయారు చేసిన బిగ్ మెక్ బర్గర్ ని చెప్పుకోవచ్చు. ఆ దేశంలో 2009లో మెక్ డోనల్డ్స్ స్టోర్ పూర్తిగా మూసేసే ముందు తయారు చేసిన బిగ్ మెక్ ఇప్పటికీ ప్రదర్శనలో ఉంది. అయితే, వీరు ఈ మెక్‌ని నిల్వ ఉంచడానికి సులు చెప్పిన పద్ధతులు పాటించారని చెప్పలేము. ఈ బర్గర్‌ని గాలి చొరబడని ఒక అద్దాల అరలో పెట్టారు. దానిని తయారు చేసినప్పుడు వాడిన ప్రిజర్వేటివ్స్ మాత్రమే దానిని పరిరక్షించడానికి వాడారు తప్ప అదనంగా మరేమి వాడలేదు.
అయితే, మెక్ డోనల్డ్, కింగ్ బర్గర్ సంస్థలు రెండూ కూడా తాము తయారు చేసే బర్గర్‌లు, బన్లు, సాస్‌లలో ప్రిజర్వేటివ్స్‌ని వాడటం లేదని ప్రకటించాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రిజర్వేటివ్స్
సూపర్ మార్కెట్‌ల్లో కానీ, రెస్టరెంట్ షెల్ఫ్‌ల్లో కానీ ఆహారాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఉత్పత్తుల మీద ఉండే 'బెస్ట్ బిఫోర్ డేట్" (ఈ తేదీకి ముందు ఉత్తమం) అనే లేబుల్ అర్ధం, అవి అప్పటి వరకు తినవచ్చని కాదు, అవి పాడవడం మొదలు కావచ్చనే తేదీని అలా ప్రకటిస్తారు.
2018లో మెక్ డోనల్డ్ తాము తయారు చేసే ఉత్పత్తుల నుంచి చాలా హానికారక ప్రిజర్వేటివ్స్‌ని తొలగించింది.
సుగరీ ట్విన్కిస్ అనే ఒక పిండి పదార్దానికి సుదీర్ఘ కాలం నిల్వ ఉంటుందనే పేరు ఉంది. ఇది ‘డై హార్డ్’, ‘ఘోస్ట్ బస్టర్స్’ లాంటి హాలీవుడ్ సినిమాల్లో కూడా ప్రళయం తర్వాత కూడా మిగిలి ఉండే స్నాక్‌గా పేరొందింది. అయితే, ఇవి నిజంగానే అన్ని రోజులు నిల్వ ఉంటాయా అనే ప్రశ్న చాలా మందికి కలిగింది.
ట్విన్కి కవర్ మీద రాసిన ప్రిజర్వేటివ్ జాబితా చూస్తే మిగిలిన ప్రొసెస్డ్ ఆహారంలో వాడే లాంటివే ఉంటాయి. అంటే, ఇది కూడా మిగిలిన వాటి లాగే కొంత నిర్ణీత సమయం వరకే నిల్వ ఉంటుంది.
కొంత మంది ట్విన్కి ప్రియులు వీటిని 44 సంవత్సరాల పాటు జార్లలో పెట్టి నిల్వ ఉంచడానికి ప్రయత్నించారు. 27 సంవత్సరాలు నిల్వ ఉన్న ట్విన్కిని కోసి చూపించే వీడియో యూట్యూబ్‌లో ఉంది. అయితే అదేమీ తినే పరిస్థితిలో లేదు.
స్పాంజ్ కేక్‌లతో పోల్చి చూస్తే ఈ ట్విన్కి కాస్త ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందేమో కానీ, ప్రళయం తర్వాత కూడా నిల్వ ఉంటుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
తేనె
తేనేలో చక్కెర శాతం ఎక్కువ ఉండటం వలన, నీరు లేకపోవడం వలన ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. జార్జియా సమాధుల్లో, ఈజిప్ట్ లోని తాటంకమున్ సమాధుల్లో 3000 సంవత్సరాల పాత తేనే సీసాలు లభించాయి.
ఆహారాన్ని నిల్వ చేసే విధానాలు కొన్ని తరాల నుంచి ఒకటే అని సులు అన్నారు. “ఇప్పుడు మనం వాడుతున్న చాలా పద్ధతులు, మన పూర్వీకులు పాటించినవే”.

ఫొటో సోర్స్, Getty Images
వెన్న
కొన్ని ప్రాచీన ఆహార పదార్ధాల గురించి తెలుసుకోవడం ద్వారా మన కప్ బోర్డుల్లో ఉండే ఏ పదార్ధాలని మన తర్వాతి తరం వారు కనిపెట్టగలరో అర్ధం అవుతుంది.
‘వెన్న, నూనె, చీజ్ లాంటి కొవ్వు ఎక్కువగా ఉండే పదార్ధాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి’ అని ఎవొల్యూషనరీ జెనెటిక్స్ ప్రొఫెసర్ మార్క్ థామస్ చెప్పారు.
ఐర్లాండ్, స్కాట్లాండ్ లాంటి దేశాల్లో 4000 సంవత్సరాల పాటు కప్పి పెట్టి ఉంచిన వెన్న గోతులను కనిపెట్టారు. వెన్న లాంటి పదార్ధాలని దొంగల నుంచి కాపాడుకోవడానికి, లేదా దాచిపెట్టుకోవడానికి, పూర్వీకులు గోతులు తీసి కప్పెట్టేవారని అంటారు.
ఇంత కాలం నిల్వ ఉన్న వెన్న కాస్త జిగురు రూపం సంతరించుకున్నప్పటికీ , అది పూర్తిగా పాడయినట్లు కాదని శాస్త్రవేత్తలు అంటారు. కొంత మంది ఇలా పాతి పెట్టి నిల్వ ఉంచిన వెన్నని రుచి చూసారు. అయితే అది బాగా పులిసిపోయి ఉంది. మూడు నెలల పాటు గోతిలో కప్పి నిల్వ ఉంచిన వెన్నని తిని చూస్తే సలామి రుచిని పోలి ఉందని చెప్పారు.
సరైన వాతావరణ పరిస్థితుల్లో ఆహారాన్ని కప్పి నిల్వ ఉంచడం ఒక పద్దతి.

ఫొటో సోర్స్, David Kamm, U.S Army CCDC Soldier Center
ఆల్కహాల్
జర్మనీలోని స్పెయర్‌లో ప్రాచీన రోమన్ సమాధిలో పురాతనమైన వైన్ బాటిల్ లభించింది. ఈ 1700 సంవత్సరాల ప్రాచీన వైన్ మందంగా, రంగు మారిపోయి ఉంది. ఈ వైన్ సీసాని తెరిచి పరిశీలించడానికి ఎవరూ సాహసం చేయలేదు.
బాల్టిక్ సముద్ర తీరంలో ఉన్న ఒక ఓడలో 200 సంవత్సరాల పురాతనమైన షాంపేన్ దొరికింది. 2010లో క్రిస్టినా ఎక్త్రుమ్ అనే ఈతగాడు ఈ షాంపేన్‌ని రుచి చూసి, ఇదేమి పాడవ్వలేదని తీర్పు ఇచ్చారు. ఇది చాలా తీపిగా, నురగతో కూడుకుని ఉందని చెప్పారు. అయితే ఈ ఓడ సముద్రగర్భంలో అట్టడుగున ఉండటం వలన షాంపేన్ చెక్కు చెదరకుండా ఉండి ఉండవచ్చు.
ఇలా దొరికిన ఒక షాంపేన్ బాటిల్‌ని 2011లో సుమారు 26 లక్షల రూపాయలకి (30000 పౌండ్లకి) వేలంలో అమ్మారు. ఆ ఓడ 1825-1830 సంవత్సరాలకి చెందినది.
మాంసాహారం
అయితే, మాంసాహారం కూడా కాలానికి నిలబడి నిల్వ ఉంటుందా?
అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో శీతలీకరణ చేస్తే మాంసాహారం కూడా నిల్వ ఉండే అవకాశం ఉంది. అయితే, ఐస్‌లోంచి బయటకి తీస్తే ఆ ఐస్ ప్రభావం పోగానే ఇది చెడిపోతుంది. ఐస్‌లో నిల్వ చేసిన చేపలు కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండవు. ఒక్కసారి ఐస్‌లోంచి తీసి, వేడి మీద పెట్టగానే ముక్కలు, ముక్కలుగా అయిపోతాయి. ఎక్కువ రోజులు ఐస్‌లో పెట్టడం వలన వాటి రుచి కూడా చప్పగా అయిపోతుంది.
మాంసాహారంలో సహజంగా ఉండే సూక్ష్మ క్రిముల వలన అది ఎక్కువ రోజులు నిల్వ ఉండే సామర్ధ్యం కోల్పోతుంది. కానీ, టెక్నాలజీ సహాయంతో దీనిని భద్రపరచవచ్చు.
భవిష్యత్‌లో మరో పది సంవత్సరాల తర్వాత మాంసాన్ని జంతువు నుంచి తీయకుండా, కణజాలం ద్వారా పెంచడం ద్వారా తయారు చేయొచ్చని, ఇలాంటి ఆహారాన్ని ఎక్కువ రోజులు భద్రపరచగలమని సులు చెప్పారు. ‘ఇంపాజిబిల్ ఫుడ్స్' లాంటి సంస్థలు ల్యాబ్‌లో తయారు చేస్తున్న ఆహారాలని ఉదాహరణగా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Bas van Oort
ప్రళయం తర్వాత ఆహారం ఎక్కడ దొరుకుతుంది?
నాగరికత ఒకవేళ అకస్మాత్తుగా అంతరించిపోతే, మనం తినడానికి ఏమి మిగిలి ఉంటాయి అనేది ఆ నాగరికత అంతరించిన విధానం మీద ఆధారపడి ఉంటుంది.
ఏదైనా న్యూక్లియర్ లేదా కెమికల్ ప్రయోగం జరిగి ఆహారం పాడైతే తప్ప మిగిలిన సందర్భాల్లో సురక్షితంగా ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్లి అక్కడ నిల్వ ఉంచిన ఆహార పదార్థాల్లో ఏదైనా తీసుకోవచ్చని సులు చెప్పారు. ఏదైనా సహజ విపత్తు సంభవించినప్పుడు లేదా ఆహార పదార్ధాల కొరత ఏర్పడినప్పుడు నిల్వ ఉన్న ఫ్రోజెన్ కానీ టిన్ ఫుడ్స్ కానీ నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చని తెలిపారు.
“నేనైతే ఏదైనా వాక్యూమ్ ప్యాక్ కానీ, పొడిగా ఉన్న ఆహరం కానీ ఎంపిక చేసుకుంటాను" అని సులు అన్నారు. అలా చేయడం వలన బయట గాలి, తేమ ఆహారంలో ఉండే అవకాశం ఉండదు. అయితే, అధిక ఉష్ణోగ్రతల్లో బాక్టీరియా పూర్తిగా హరిస్తుందని చెప్పలేమని వెల్లడించారు.
నెమ్మదిగా ఎండబెట్టిన కొన్ని పదార్ధాల్లో సూక్ష్మజీవులు మళ్ళీ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాఫీ పొడి లాంటి పదార్ధాలను చాలా త్వరగా ఎండబెట్టడం వలన ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని చెప్పారు.
స్వాల్బార్డ్.. 50 కోట్ల విత్తనాల నిధి ఉన్న ప్రాంతం
ఒక వేళ అకస్మాత్తుగా ఏదైనా జరిగి , భూమిపైన తినడానికి ఆహారం ఏమీ లేకపోయినా ఆహరం కోసం ఎక్కడ వెతకాలో మీకు తెలిస్తే ఆహారం దొరికే అవకాశం ఉంటుంది.
నార్వేలో ఆర్కిటిక్ ద్వీపంలో ఉన్న స్వాల్బార్డ్‌లో ఉన్న మంచు పర్వతాల ప్రాంతంలో లేనిన్ గ్రాడ్ విత్తనాల బ్యాంకుని పోలిన ప్రపంచ వ్యాప్తంగా సేకరించిన 9,86,243 రకాల మొక్కల విత్తనాల నిధి ఉంది. ప్రతి శాంపిల్లో కనీసం 500 విత్తనాలు ఉన్నాయి. అంటే కనీసం 50 కోట్ల విత్తనాలు సురక్షితంగా ఉన్నాయి.
వీటిని 18 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల్లో, అల్యూమినియం కవర్లలో చుట్టి ఎప్పటికీ సురక్షితంగా ఉండేటట్లు భద్రపరిచారు.
ఒకవేళ ప్రళయం వచ్చి ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినా కూడా ఈ పర్వతాలలో సహజంగా నెలకొన్న ఉష్ణోగ్రతలు ఈ విత్తనాలు పాడవకుండా ఉండటానికి సహకరిస్తాయి.
ఇది బీబీసీ ఫ్యూచర్ లో ప్రచురితమైన ఫుడ్ సిరీస్ నుంచి తీసుకున్న వ్యాసం .
ఇవి కూడా చదవండి:
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- గుడ్లు ఎక్కువగా తింటే గుండె జబ్బులు వస్తాయా...
- కీటోడైట్ అంటే ఏంటి? కొవ్వుకు కొవ్వే పరిష్కారమా?
- విరాట్ కోహ్లి వీగన్‌గా ఎందుకు మారాడు? ఏంటా డైట్ ప్రత్యేకత?
- వీగన్ డైట్‌తో కాలుష్యానికి చెక్ పెట్టొచ్చా?
- WHO: కరోనావైరస్ నిబంధనల్లో పెనుమార్పు.. పబ్లిక్ ప్లేసుల్లో మాస్కుల వాడకం తప్పనిసరి
- దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వరుస భూప్రకంపనలు భారీ భూకంపానికి సంకేతమా?
- కరోనావైరస్: రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏం తినాలి? వేటిని దూరం పెట్టాలి?
- మంట పుట్టించే ఘాటైన ఆహారాన్ని జనాలు ఎందుకు ఇష్టపడుతున్నారు?
- మీ ఆహార వృథాను అరికట్టటానికి ఆరు మార్గాలు: ప్రపంచ ఆకలిని తగ్గించటంలో మీ వంతు పాత్ర పోషించండిలా...
- చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకెళ్లి చైనాలో అమ్ముకుంటున్నారు
- మీ ఇంట్లోనే మీకు తెలియని బంగారం వంటి లోహాలను కనిపెట్టడం ఎలా
- పసుపు, మిరప వంటి మసాలా దినుసుల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








