కీటోడైట్ అంటే ఏంటి? కొవ్వుకు కొవ్వే పరిష్కారమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సారా లైనార్డ్
- హోదా, బీబీసీ డిప్యూటీ హెల్త్ ఎడిటర్
తెలుగు రాష్ట్రాల్లో వీరమాచనేని రామకృష్ణ ప్రతిపాదించిన కీటో డైట్ వివాదాస్పదమైంది. దానిపైన విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు లో-కార్బ్ కీటో డైట్ ఎలా పని చేస్తుంది? కీటోసిస్, కీటోన్స్ అంటే ఏంటి? బరువు తగ్గడంలో కీటోజెనిక్ డైట్ పాత్ర ఎంత? ఆ డైట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? అనేదానిపై బీబీసీ కథనం..
ఏంటీ కీటోజెనిక్ డైట్?
తక్కువ కార్బోహైడ్రేట్ల ద్వారా శరీరాన్ని ‘కీటోసిస్’ అనే స్థితికి పంపడమే ఈ కీటోజెనిక్ డైట్‌ల లక్ష్యం. అట్కిన్స్ డైట్, డ్యూకన్ డైట్ మరియు ఎల్‌సీహెచ్‌ఎఫ్ (లో కార్బోహైడ్రేట్, హై ఫ్యాట్) డైట్ - వీటన్నిటినీ కలిపి కీటోజెనిక్ డైట్ అంటారు. అయితే వీటిలో ఫ్యాట్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్ల శాతాల్లో తేడాలు ఉండవచ్చు.
'కీటోసిస్' అంటే ఏమిటి?
సాధారణ పరిస్థితుల్లో మన శరీరం కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం నుంచి ఉత్పత్తయ్యే గ్లూకోజ్ నుంచి శక్తిని పొందుతుంది. అదే గ్లూకోజ్ లేని సందర్భంలో కీటోసిస్ జరుగుతుంది. కీటోసిస్‌లో భాగంగా శక్తి కోసం శరీరం గ్లూకోజ్ బదులుగా కొవ్వు పదార్థాలను కరిగించుకుంటుంది. మనం కార్బోహైడ్రేట్లు తీసుకోకుంటే, కాలేయం కొవ్వును కరిగించి, దాని నుంచి శక్తిని పొందుతుంది. ఈ శక్తి 'కీటోన్' అనే కణాల రూపంలో ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
వైద్యంలో కీటోజెనిక్ డైట్ పాత్ర ఏమిటి?
కీటోజెనిక్ డైట్‌ను ప్రధానంగా పిల్లల్లో ఎపిలెప్సీ చికిత్స కోసం అభివృద్ధి చేశారు. అందువల్ల ఈ డైట్‌ను డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా ప్రయత్నించరాదు. ఈ డైట్‌ను అభివృద్ధి చేసిన ఉద్దేశం వేరైనా, వెయిట్ లాస్ కోసం దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
కీటోజెనిక్ డైట్‌లో ఏయే ఆహార పదార్థాలు తీసుకోవచ్చు?
కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న మాంసం, చేపలు, నూనె పదార్థాలు, జున్ను, తక్కువ కార్బొహైడ్రేట్లు కలిగిన కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
బ్రెడ్, పాస్తా, వరి అన్నం, కాయధాన్యాలు, పండ్లు, బంగాళాదుంపలాంటి పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కాయగూరలను తక్కువగా తీసుకోవాలి.
ఎంత వరకు సురక్షితం?
కీటోన్ డైట్ అన్నది ఆరోగ్యకరమైన, బ్యాలెన్స్‌డ్ డైట్ అన్నదానికి భిన్నంగా ఉంటుంది. నిజానికి ఇది కరువు సమయాల్లో శరీరం అనుసరించే ప్రతిస్పందన. కానీ ఇప్పుడు దాన్ని లో-కార్బ్ డైట్‌లో భాగంగా అనుసరిస్తున్నారు.
ఈ డైట్‌లో కార్బోహైడ్రేట్ల స్థానంలో కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటారు. కొన్నిసార్లు కిడ్నీల పరిస్థితిని బట్టి, ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అయితే చాలా కీటోజెనిక్ డైట్‌లలో ప్రొటీన్లు మధ్యస్థ స్థాయిలోనే ఉంటాయి.

ఫొటో సోర్స్, Thinkstock
బరువు తగ్గడానికి ఇది పనికొస్తుందా? ఇది మంచిదేనా?
సాధారణంగా బరువు తగ్గడానికి కీటోజెనిక్ డైట్ మంచిదే అంటారు. అది మధుమేహ వ్యాధి ఉన్న రోగులలో ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచే అవకాశం ఉంది. నిజానికి లో-ఫ్యాట్ డైట్‌తో పోలిస్తే కీటోజెనిక్ డైట్ దీర్ఘకాలంలో బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అయితే మీ శరీరం ఏ మేరకు కీటోజెనిక్ డైట్‌కు అనుగుణంగా స్పందిస్తుందనేదానిపై ఇది ఆధారపడుతుంది.
కీటోజెనిక్ డైట్‌లోని తేడాలేంటి?
బరువు తగ్గడానికి, బ్లడ్ షుగర్ నియంత్రణకు స్టాండర్డ్ కీటోజెనిక్ డైట్ (ఎస్‌కేడీ) బాగా ఉపయోగపడుతుందని పరిశోధనల్లో తేలింది. ఎస్‌కేడీలో 70-75 శాతం కొవ్వు పదార్థం, 20 శాతం ప్రొటీన్లు, 5-10 శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కీటోజెనిక్ డైట్ తీసుకునేటప్పుడు పీచుపదార్థాలు తక్కువగా ఉన్న కాయగూరలు మాత్రమే తీసుకోవడం మరచిపోకూడదు.

ఫొటో సోర్స్, iStock
కీటోజెనిక్ డైట్ ప్రారంభించే ముందు ఏం చేయాలి?
ఇలాంటి డైట్‌ను ప్రారంభించాలనుకుంటే, మొదట జనరల్ ఫిజీషియన్‌ను కలిసి, అది మీకు సురక్షితమేనా అన్నది నిర్ధారించుకోవాలి. డైట్‌ను ప్రారంభించే ముందు లివర్‌కు సహకరించే వెల్లుల్లి, ఉల్లిలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుని, చక్కెర, కెఫీన్, అల్కాహాల్ తగ్గించాలి.
కీటోజెనిక్ డైట్ విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
మధుమేహం, మరీ ప్రత్యేకించి టైప్-1 మధుమేహంతో బాధపడేవారు కీటోజెనిక్ డైట్‌ను ప్రయత్నిస్తే సమస్యలు ఎదురు కావచ్చు. అందువల్ల మధుమేహం, బ్లడ్ షుగర్ సమస్యలు ఉన్నవారు కీటోజెనిక్ డైట్ ఫలితాల గురించి డాక్టర్ సలహా తీసుకోవాలి. అదే విధంగా కిడ్నీ సమస్యలు లేదా కుటుంబ చరిత్రలో అలాంటి సమస్య ఉన్నవారు కూడా డాక్టర్‌ను సంప్రదించాలి.
కీటోజెనిక్ డైట్ దీర్ఘకాలిక ప్రభావం ఏమిటి?
కీటోసిస్ వల్ల వచ్చే ఫలితాలు చాలా వరకు తాత్కాలికమైనవి, డీహైడ్రేషన్ కు సంబంధించినవి. దీని వల్ల తలనొప్పి, నోరు పొడిగా మారడం, నోటి దుర్వాసన, అలసట, వికారంగా ఉండడం లాంటి లక్షణాలు తలెత్తొచ్చు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








