WHO: కరోనావైరస్ తాజా నిబంధనల్లో భారీ మార్పు.. పబ్లిక్ ప్లేసుల్లో మాస్కుల వాడకం తప్పనిసరి - కరోనా కేసుల్లో ఇటలీని దాటిన భారత్

ఫొటో సోర్స్, PA Media
ఫేస్‌మాస్క్‌ల మీద గతంలో చెప్పిన దానికి భిన్నంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త సూచనలు చేసింది.
కరోనాను నివారించడానికి ప్రజలు మాస్కులు వాడక తప్పదని స్పష్టం చేసింది. ఇన్‌ఫెక్షన్లను కలిగించే క్రిములు వ్యాప్తి చెందకుండా అడ్డుకునే శక్తి ఫేస్‌మాస్కులకు ఉందని డబ్ల్యూహెచ్‌వో తన తాజా సూచనల్లో పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు ఇప్పటికే ఫేస్‌మాస్క్ ధరించాలని సూచించడమో, తప్పనిసరి చేయడమో చేశాయి.
అయితే మాస్క్ పెట్టుకోవడం వల్ల కరోనా వైరస్ సోకదనడానికి ఎలాంటి ఆధారాలు లేవని గతంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేకసార్లు ప్రకటించింది.
ఇప్పుడు మాత్రం, ప్రజలు గుడ్డతో చేసిన, నాన్-మెడికల్ మాస్క్‌ను ధరించాలని ఆ సంస్థ టెక్నికల్ లీడ్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ మారియా వాన్ కెర్‌ఖోవ్ రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు.
మెడికల్ మాస్క్‌లు కేవలం కోవిడ్-19 చికిత్సలో పనిచేసే వైద్య నిపుణులకే అవసరమని సంస్థ చెబుతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 67లక్షల యాక్టివ్ కేసులుండగా, 400,000 మంది మరణించారని జాన్‌హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది?
వారాలపాటు సాగిన పరిశోధన తర్వాత తాము ఈ కొత్త సూచనను చేశామని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
''ఫేస్‌మాస్క్ ధరించేలా ప్రజలను ప్రోత్సహించాలని మేం వివిధ దేశాల ప్రభుత్వాలకు సలహా ఇచ్చాం'' అని డాక్టర్ కెర్‌ఖోవ్ అన్నారు.
అయితే ఫేస్‌మాస్క్‌లనేవి కేవలం వైరస్‌ను అడ్డుకునే అనేక మార్గాలలో ఒకటి మాత్రమేనని, అవే పూర్తి సంరక్షణ మార్గంగా చెప్పలేమని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నొక్కి చెప్పింది.
''ఒక్క మాస్క్‌లే మిమ్మల్ని కోవిడ్-19 నుంచి రక్షించలేవు'' అని డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియెసస్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
మార్గదర్శకాలలో భారీ మార్పు
బీబీసీ సైన్స్ ఎడిటర్ డేవిడ్ షుక్‌మాన్‌విశ్లేషణ
ఫేస్‌మాస్క్‌లు ధరించాల్సిందేనని చెప్పడం ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల్లో ఒక పెనుమార్పుగా చెప్పవచ్చు.
మాస్క్‌లు కోవిడ్-19 నుంచి సంపూర్ణ రక్షణ కల్పిస్తాయని కొందరు భావించే ప్రమాదముందని గత కొద్ది నెలలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు చెబుతూ వచ్చారు.
ప్రజలను మాస్క్‌లను ధరించాల్సిందిగా ప్రోత్సహించడం వల్ల కోవిడ్-19 చికిత్సలో పాల్గొంటున్న వైద్య సిబ్బందికి మాస్క్‌ల కొరత ఏర్పడుతుందని సంస్థ అభిప్రాయపడుతూ వచ్చింది.
ఆ వాదనలు అలా ఉండగానే, ఇప్పుడు వ్యాధి సంక్రమణపై కొత్త ఆధారాలు లభించాయని డబ్ల్యూహెచ్‌వో. ప్రకటించింది. కొందరు వ్యక్తుల్లో పూర్తిస్థాయి లక్షణాలు కనిపించడానికి ముందే పూర్తిగా ఇన్‌ఫెక్షన్‌కు గురై ఉంటారని, కొందరిలో అసలు లక్షణాలే కనిపించవని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
ఈ విషయాన్ని నేను గత వారమే రిపోర్ట్ చేశాను. సామాజిక దూరం పాటించడానికి వీలు కుదరని ప్రదేశాలు అంటే ప్రయాణ ప్రాంగణాలు, కొన్నిషాపులు, శరణార్ధి శిబిరాల్లాంటి ప్రదేశాలలో ఒకరిని నుంచి ఒకరికి ఇన్‌ఫెక్షన్ సోకుకుండా ముఖానికి ఇంట్లో తయారు చేసుకున్న మాస్క్ ధరించడం మంచిది.
60 సంవత్సరాలు పైబడిన వాళ్లు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సరైన రక్షణ కోసం మెడికల్ మాస్క్‌లు ధరించడం కూడా మంచిదేనని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

ఫొటో సోర్స్, EPA
కరోనా కేసుల్లో ఆరో స్థానానికి భారత్
ప్రపంచంలో అత్యధికంగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో భారత్ ఆరో స్థానానికి చేరుకుంది. భారతదేశంలో జూన్ 6వ తేదీ ఉదయం 11 గంటల సమయానికి 236657 కేసులు నమోదయ్యాయని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది.
సుమారు 19 లక్షల కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉండగా, 6 లక్షల కేసులతో బ్రెజిల్, 4.49 లక్షల కేసులతో రష్యా, 2.84 లక్షల కేసులతో బ్రిటన్, 2.40 కేసులతో స్పెయిన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 3.94 లక్షలు దాటింది. చికిత్స పొంది కోవిడ్-19 బారినుంచి బయటపడిన వారి సంఖ్య 27 లక్షలు దాటింది.
ప్రపంచవ్యాప్త పరిణామాలు
ఇక నుంచి ఆసుపత్రులలో రోగులను చూడటానికి వచ్చేవారు, ఔట్ పేషెంట్లు కచ్చితంగా ఫేస్‌మాస్క్ ధరించాలని, ఆసుపత్రి సిబ్బంది క్లినికల్ సెట్టింగ్స్‌లో లేకపోయినా మెడికల్ మాస్క్‌లను కచ్చితంగా తొడుక్కోవాలని శుక్రవారంనాడు యూకే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
స్కూళ్లు, బిజినెస్‌లు ప్రారంభం కానుండటంతో ఈ ఆదేశాలు జూన్ 15 నుంచి అమలు చేయాలని సూచించింది. ఇక శుక్రవారంనాటికి 40,000 మరణాలతో అమెరికా తర్వాత అత్యధిక మరణాలు నమోదైన రెండోదేశంగా యూకే రికార్డులకెక్కింది.
మరికొన్ని విశేషాలు
- 34,000లకు పైగా మరణాలతో బ్రెజిల్ ఇటలీని దాటిపోయింది. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలను నమోదు చేసిన మూడో దేశంగా నిలిచింది.
- జూన్ చివరినాటికి సభ్యదేశాల మధ్య సరిహద్దులు తెరుస్తామని యూరోపియన్ యూనియన్ అంతర్గత వ్యవహారాల కమిషనర్ ప్రకటించారు.
- శనివారం నుంచి పోర్చుగల్ తమ దేశంలో బీచ్‌లను ఓపెన్ చేయబోతోంది.
- పోలండ్‌లో జిమ్ములు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు తెరుచుకోబోతున్నాయి.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వరుస భూప్రకంపనలు భారీ భూకంపానికి సంకేతమా?
- కరోనావైరస్: మధ్య ప్రాచ్యంలో పరిస్థితి ఏంటి? ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లగలరా?
- ‘ప్రపంచానికి నీతులు చెప్పే అమెరికా.. గోతిలో పడింది’ - అమెరికాలో నిరసనలతో ఆ దేశాలు కసి తీర్చుకుంటున్నాయా?
- కరోనావైరస్తో కలిసి జీవించటం ఇలాగే ఉంటుందా? లాక్డౌన్ అనంతర ప్రపంచం ఎలా ఉందో చూపే ఫొటోలివీ...
- పోలీస్ హీరో: నాలుగు నెలల పాప కోసం పాలు తీసుకుని రైలు వెనుక కానిస్టేబుల్ పరుగులు.. వీడియో వైరల్
- పులి, మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?
- ‘కరోనావైరస్ టీకా పరీక్షల్లో ఉంది.. ఇప్పుడే ఉత్పత్తి ప్రారంభిస్తున్నాం’ - బ్రిటన్ సంస్థ వెల్లడి, భారత్‌లోనూ తయారీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








