ప్రపంచ పర్యావరణ దినోత్సవం: పులి - మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?

నైజీరియా జూలో పులి - మేక World Environment Day

ఫొటో సోర్స్, YURI SMITYUK \ TASS VIA GETTY IMAGES

    • రచయిత, డేల్ షా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఓ కుక్క గుర్రం మీద స్వారీ చేస్తుంది. మరో చిన్న బాతు, పిల్లి వెంటే పరుగులు తీస్తుంటుంది. ఒక చిట్టెలుక, పాముతో కలిసిమెలిసి కనిపిస్తుంది.

సోషల్ మీడియాలో జోరుగా షేర్ అవుతున్న ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు కూడా చూసే ఉంటారు.

ఆజన్మ వైరం గల వేరు వేరు జాతుల ప్రాణుల మధ్య స్నేహం చూసి మనం మురిసిపోతుంటాం. ఆ వింతలు మనకు అద్భుతాలుగా కనిపిస్తాయి.

అసలు.. జన్మత: బద్ధశత్రువులైన కొన్ని జంతువులు పూర్తిగా ఏ తేడా లేనంతగా ఇలా ఎలా కలగలిసిపోతాయి? కొన్నిసార్లు వాటి స్నేహం ప్రమాదకరంగా కూడా ఎందుకు అనిపిస్తుంది?

ఇది ప్రకృతి విచిత్రమా, లేక వీటి వెనుక ఏవైనా శాస్త్రీయ కారణాలు ఉన్నాయా?

పిట్ట

ఫొటో సోర్స్, Getty Images

పిల్లల ఆలనా పాలనా

కోకిల పెట్టిన గుడ్లను కాకి పొదిగి, దాని పిల్లలను పెంచి పెద్ద చేసినట్లే.. రాబిన్ బర్డ్ పిల్లల పోషణను కార్డినల్ పిచ్చుక చూసుకుంటుంది.

ఇలా చాలా జాతుల్లో ఒక జీవి పిల్లలను వేరే జాతి జీవులు పెంచుకోవడం కనిపించింది.

వన్యప్రాణుల అభయారణ్యంలో తల్లికి దూరమైన మిత్ర, శివ అనే రెండు తెల్ల పులి పిల్లల బాగోగులను అంజాన అనే రెండేళ్ల చింపాంజీ చూసుకుంది.

సమర్‌సె‌ట్‌ రక్షిత అటవీ ప్రాంతంలో బ్రాక్ అనే బాడ్జర్ (నీటి కుక్క) అనాథ పిల్లలు బ్రూక్, బంబుల్ బీలకు - ఉభయచర జీవి బీవర్‌కు మధ్య అసాధరణ స్నేహాన్ని చూశారు.

మాంటెన్నాలో పీనట్ అనే స్కంక్‌ (ఉడుము లాంటిది)ను ఒక ఆడ సింహం తన పిల్ల అనబెల్‌తో పాటు పెంచి పెద్ద చేసింది.

వేటాడే జంతు జాతుల్లో కూడా ఇలాంటి సున్నిత ధోరణి వల్ల ఏదైనా ఒక పిల్లకు, దానిని పెంచే తల్లికి మధ్య మమతానురాగాలు ఏర్పడుతాయి.

ఒక అనాథ పిల్లను పెంచి పోషించాలని, దానిని రక్షించాలనే దోరణి.. జంతు జాతుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వాటి వేటాడే ధోరణిని కూడా అణచివేస్తుంది.

గుర్రం

ఫొటో సోర్స్, Getty Images

కలిసి ఆడుకోవడం

గాడిద, కుక్క మధ్య మంచి స్నేహం కుదురుతుంది. అది ఊహకు అందనిది.

ఫ్లోరిడాలో ఒక అభయారణ్యంలో బీ అనే జిరాఫ్‌ను ఉంచిన ప్రాంతంలో విల్మా అనే నిప్పుకోడి కూడా ఉండేది.

ఆ రెండూ దూరదూరంగా ఉంటాయిలే అని మొదట్లో అందరూ అనుకున్నారు. కానీ త్వరలోనే వాటి మధ్య స్నేహం ఏర్పడింది. రెండూ కలిసి కనిపించేవి.

శాండియాగో జూలో ఒక టింబర్ తోడేలు, రెండు మేకల మధ్య స్నేహం కుదిరింది. వాటిని పక్కపక్కనే ఉండే బోనుల్లో ఉంచారు. అవి బోనుకు దగ్గరగా కలిసి పరిగెత్తుతూ ఆడుకునేవి.

కలిసి జీవించడంలో ఉన్న ప్రయోజనాలు, అవి మిగతా జాతుల జంతువులంటే ఉన్న భయాన్ని కూడా అధిగమించేలా చేస్తాయి.

జిరాఫ్, నిప్పుకోడి

ఫొటో సోర్స్, Getty Images

సంరక్షణ కీలకం

మసాచుసెట్స్ పొలంలో లులు అనే ఒ పంది, బేబీ అనే ఒక కళ్లు కనిపించని ఆవుకు గైడ్‌గా మారిపోయింది.

ఆ ఆవు దారిలో దేనికీ కొట్టుకోకుండా పంది దానిని గడ్డి ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లేది.

అదే రాష్ట్రంలో మరో ఫాంలో ఒక హంస, షెట్‌లాండ్ గుర్రం మధ్య కూడా దోస్తీ కుదిరింది. గుర్రం ఒకసారి జబ్బు పడడంతో వాటి స్నేహం మరింత బలంగా మారింది. ఆ గుర్రానికి చికిత్స చేసేందుకు ఎవరైనా దాని దగ్గరగా వస్తుంటే, ఆ హంస ఎగిరి ఎగిరి వాళ్లను పొడిచేది.

నిస్సహాయ స్థితిలో ఉన్న మనుషులు, జంతువులకు తిమింగలాలు, డాల్ఫిన్లు సాయం చేసినట్లు ఎన్నో కథలు ఉన్నాయి.

నిజానికి ఒక జంతువు మరో జాతి జంతువులకు సాయం చేయడానికి ఆత్మరక్షణ అనే ధోరణిని ఎందుకు వదిలేస్తాయి అనేది ఎవరికీ తెలీదు.

కొన్ని కేసుల్లో దానిని గుర్తించాలనుకుంటే, పూర్తిగా భిన్నంగా ఉండే పరిస్థితులు ఉండవచ్చు.

కొన్ని జంతువులు పొరపాటున మరో జీవిని తమ జాతివిగానే భావిస్తాయి. కానీ హంస, గుర్రం విషయంలో అలా అనుకోవటం కష్టం.

జంతువులు, పక్షులకు మనుషుల భావోద్వేగాలను వర్తింపచేయడం ప్రమాదకరమే అవుతుంది. కానీ కొన్ని ఉదంతాల్లో జంతువుల్లో సానుభూతి ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు కనిపించాయి.

జీబ్రాలు, నిప్పుకోళ్లు

ఫొటో సోర్స్, Getty Images

పరస్పర ప్రయోజనం

నిప్పు కోడి, జిరాఫ్ కలిసి ఉండడం చూశారు. ఈ రెండింటినీ వేటాడే జంతువులు చాలా ఉంటాయి.

నిప్పుకోడి దృష్టి బలహీనంగా ఉంటుంది. కానీ జిరాఫ్ సుదూరాల నుంచే చాలా బాగా చూడగలదు.

కానీ, జిరాఫ్‌కి వాసన పసిగట్టే శక్తి బలహీనంగా ఉంటుంది. ఆ సామర్థ్యం నిప్పుకోడిలో బలంగా ఉంటుంది. కలిసి ఉండడం వల్ల అవి పరస్పరం చాలా సురక్షితంగా ఉండవచ్చు.

పిల్లి, బాతు పిల్లల స్నేహం అంత ముద్దుగా లేకపోచ్చు. కానీ జంతువులు, పక్షులు ఇలా కలిసి జీవించడం విచిత్రంగా అనిపిస్తుంది.

శత్రువుతో కూడా చేయి కలిపి, వాటితో కలిసి పనిచేస్తే ప్రయోజనం ఉంటుంది అనే విషయం వాటికి తెలుసు.

పిల్లి

ఫొటో సోర్స్, Getty Images

సానుభూతి, ఒంటరితనం

పిల్లులు, పక్షులను మంచి స్నేహితులుగా భావించరు. కానీ సఫోక్(ఇంగ్లండ్)లో ఒక పొలంలో ఒక పిల్లి... నక్క దాడిలో గాయపడిన ఒక కోడిపిల్లను అక్కున చేర్చుకుంది.

దానితో స్నేహం కుదిరేవరకూ ఆ పిల్లి దానిని కంటికి రెప్పలా చూసుకునేది.

సైబీరియాలోని ఒక జూలో ఒక పులి దానికి భోజనంగా బోనులోకి వచ్చిన మేకతోనే స్నేహం చేసింది.

ఈ పులి తనకు ఆహారంగా వేసిన మిగతా అన్ని మేకలనూ సంతోషంగా ఆరగించింది. కానీ ఈ ఒక్క మేకతో మాత్రం అది స్నేహం చేసింది, రెండూ కలిసే ఉండేవి.

పులి ఇలా ప్రవర్తించడానికి ఒక వాదన వినిపిస్తున్నారు. మేకను పులి బోనులోకి పంపించినపుడు దానిని ఆకలికంటే ఒంటరితనమే ఎక్కువగా వేధిస్తోంది. అందుకే అది మేకను చంపి తినేయకుండా దానిని ఫ్రెండ్ చేసుకుంది.

మేక అదృష్టం బాగుంది కాబట్టి, అది సరైన సమయంలో సరైన చోటుకు చేరుకుంది. దీన్ని బట్టి ఒకవేళ ఈ జంతువుల్లో ఒకటి హఠాత్తుగా మరోదానిపై ఆధిపత్యం చూపిస్తే ఊహించని ఘటనలు కూడా సంభవించవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)