మహారాష్ట్ర పులి పిల్లలు కూడా నరభక్షకులుగా మారతాయా?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, నవీన్ సింగ్ ఖడ్కా
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహారాష్ట్రలో మనుషులను చంపిన ఆడ పులిని కాల్చిచంపడంతో అనాథలుగా మారిన దాని రెండు పిల్లలను అటవీశాఖ అధికారులు పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారు. తల్లిలాగే అవి కూడా నరభక్షకులుగా మారుతాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
13 మందిని చంపినట్లు చెబుతున్న ఆడ పులి కోసం తీవ్రంగా వేటాడిన తర్వాత అధికారులు ఈ నెలలోనే దానిని కాల్చి చంపారు. ఆరేళ్ల ఈ ఆడ పులిని పట్టుకోడానికి రెండేళ్ల నుంచీ ప్రయత్నిస్తున్నారు.
ఈ పులిని ప్రాణాలతో పట్టుకోకుండా కాల్చిచంపడం జంతు సంరక్షకులకు ఆగ్రహం తెప్పించింది. కనీసం 11 నెలల వయసున్న దాని పిల్లలకైనా మత్తిచ్చి పట్టుకుంటారని వారు భావిస్తున్నారు.
"వాటిని పట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పులి పిల్లలు మనుషులపై దాడి చేయచ్చు" అని మహారాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ కన్సర్వేటర్ ఏకే మిశ్రా బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
పిల్లలు కూడా నరభక్షకులు అవుతాయా?
పులి పిల్లలు ప్రస్తుతం యావత్మల్ అడవిలో ఉన్న చిన్న చిన్న జంతువులను చంపి బతుకుతున్నాయని అధికారులు చెప్పారు.
"కానీ ఈ ప్రాంతం అభయారణ్యం కాదు, ఇది అడవిలా కూడా లేదు. అందుకే అవి సులభంగా దొరికే జంతువుల కోసం దగ్గరలోని గ్రామాల్లోకి వెళ్లచ్చు. అలాంటి ప్రమాదం రాకుండా మేం వాటిని పట్టుకోవాలని అనుకుంటున్నాం" అని మిశ్రా చెప్పారు.
"పులి పిల్లలు ఎక్కడున్నాయో అధికారులు గుర్తించారు, కానీ ఆ ప్రాంతం కఠినంగా ఉండడంతో వాటిని పట్టుకోడానికి కాస్త సమయం పడుతోంది" అన్నారు.
"మేం వాటికి మత్తిచ్చి పట్టుకునేందుకు తగిన అవకాశం కోసం చూస్తున్నాం. వేటాడకుండా దానిని విజయవంతంగా పూర్తి చేయాలని అనుకుంటున్నాం"
టి-1 అని పిలిచే ఆ ఆడపులి కోసం సాగిన వేటలో వంద కెమెరా ట్రాప్స్ ఉపయోగించారు. గుర్రాలు, మేకలను ఎరలుగా వాడారు. చెట్లపై మంచెలు ఏర్పాటు చేసి 24 గంటలూ నిఘా పెట్టారు.

ఫొటో సోర్స్, PRATIK CHORGE/HINDUSTAN TIMES
పులి పిల్లలను పట్టుకునే ప్రయత్నం
ఈ ఆడపులి ఆగస్టులో యావత్మల్ జిల్లాలో ముగ్గురిని చంపింది. మొదటి నుంచి తల్లి వెంటే ఉన్న పులి పిల్లలు కూడా మనిషి రక్తం రుచి మరిగాయేమోనని స్థానికులు భయపడుతున్నారు.
ఆ విషయం తమకు తెలీదని మిశ్రా చెబుతున్నారు. "పులి పిల్లలను పట్టుకున్నాక, సంబంధిత అధికారులందరూ కలిసి వాటికి ఎక్కడ పునరావాసం కల్పించాలో నిర్ణయిస్తారు" అన్నారు.
ప్రపంచంలోని పులులలో 60 శాతం భారత దేశంలోనే ఉన్నాయి. మహారాష్ట్రలో 200కు పైగా పులులు ఉన్నాయి. కానీ వీటిలో మూడో భాగం మాత్రమే రాష్ట్రంలోని అభయారణ్యాల్లో ఉన్నాయి.
మనుషులు ఉంటున్న ప్రాంతాల్లోకి పులులు చొరబడుతుండడంతో తరచూ దాడులు జరుగుతున్నాయి.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశంలో ఏనుగులు, లేదా పులుల దాడి వల్ల ప్రతి రోజూ సగటున ఒకరు చనిపోతున్నారు.
ఇవి కూడా చదవండి:
- చిరుత పులి బలహీనతలేంటో మీకు తెలుసా!?
- అయోధ్య: ఇది నిజంగానే రామ జన్మస్థలమా? దీని చరిత్ర ఏమిటి?
- పెయిడ్ న్యూస్: ఎన్నికల వేళ వార్తల వ్యాపారం
- భారతదేశం ఇస్లామిక్ పేర్ల మీద యుద్ధం ప్రకటించిందా?
- ఎంపీలుగా ఓడారు.. ఎమ్మెల్యే టికెట్ పట్టారు
- ప్రవాసాంధ్రులు ఏపీకి పంపిస్తున్న డబ్బులు ఎంతో తెలుసా?
- ఆంధ్రప్రదేశ్: అనంతపురం జిల్లాలో ఎమ్మార్వో ఆఫీస్ వేలం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








