పెయిడ్ న్యూస్: ఎన్నికల వేళ వార్తల వ్యాపారం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రదీప్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీబీసీ BeyondFakeNews పరిశోధనలో ప్రపంచంలోని ఇతర దేశాలతోపాటు భారత్‌లో ఫేక్ న్యూస్ ఎంత వేగంగా వ్యాపిస్తోందో మేం గుర్తించాం.
కానీ, వార్తా ప్రపంచంలో ఉన్న జబ్బు ఫేక్ న్యూస్ మాత్రమే కాదు. పెయిడ్ న్యూస్ దాన్ని మించిపోయింది. ఇది ఎంత ఘోరంగా ఉందంటే ఇది మీడియాను తన గుప్పిట్లోకి తీసుకుంది. చాలాసార్లు ఫేక్ న్యూస్, పెయిడ్ న్యూస్ రెండూ ఒకేలా కనిపిస్తాయి. కొన్నిసార్లు వేరువేరుగా ఉంటాయి. పెయిడ్ న్యూస్ జాడ్యాన్ని మనం కాస్త తీవ్రమైనదిగా భావించాలి. ఎందుకంటే ఇందులో చిన్న చిన్న మీడియా సంస్థల నుంచి పెద్ద మీడియా గ్రూపుల దాకా అన్నీ ఉంటాయి.
పెయిడ్ న్యూస్ అనగానే ఏదైనా వార్త ప్రచురించడానికి ఎవరో ఎంతో కొంత మొత్తం చెల్లిస్తారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి వార్తల ప్రచురణ ఎన్నికల సందర్భంలో చాలా పెరుగుతుంది. ఛత్తీస్‌గఢ్ మొదటి దశ పోలింగ్‌తోపాటు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సంరంభం ప్రారంభమైన సమయంలో అది మరింత జోరందుకుంది..
ఎన్నికలు వార్తలను ఎలా ప్రభావితం చేస్తాయి?
ఛత్తీస్‌గఢ్‌తోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈరాష్ట్రాల్లో ఎన్నికలను దేశవ్యాప్తంగా ఒక విధంగా 2019 సాధారణ ఎన్నికలకు రెఫరండంగా చూస్తున్నారు.
ఎన్నికల వల్ల కేవలం ప్రభుత్వాలపైనే కాదు.. మీడియా ప్రపంచంపై కూడా ప్రభావాన్ని చూసే అవకాశం లభించింది.

ఫొటో సోర్స్, Getty Images
సమాచార మాధ్యమాల్లో ఎన్నికల వార్తల ప్రాధాన్యం కనిపించడం మొదలవుతుంది. ఎన్నికల ప్రచారాల్లో నేతల ఎన్నికల హామీల గురించి పెద్ద పెద్ద ఫొటోలు, బ్యానర్లు.. టీవీ చానళ్లలో లైవ్ డిస్కషన్స్ జోరు పెరుగుతుంది. ఇదే సమయంలో నేతలు, రాజకీయ పార్టీలు గాలి తమ వైపు తిప్పుకునేందుకు తమ పార్టీ చేసిన పనులను చాలా పెద్దవిగా చూపిస్తారు.
దానికోసం మీడియా ప్లాట్‌ఫామ్స్ వార్తల మధ్య పెయిడ్ న్యూస్ కలుపుకోవడం ఎలా ఉంటుందంటే.. అవి ఏకపక్ష సమాచారం లేదా విశ్లేషణలుగా మారిపోతాయి. అవి సాధారణ ఓటర్ల దృష్టిని ప్రభావితం చేస్తాయి.
"అందుకే మీకు ఎన్నికల సమయంలో కొత్త వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు కనిపిస్తాయి. అవి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోడానికే మార్కెట్లోకి వస్తాయి. కానీ ఇప్పుడు విషయం అక్కడితో ఆగిపోవడం లేదు. స్థానిక మీడియానే కాదు, పెద్ద పెద్ద వార్తాపత్రికలు, మీడియా గ్రూపులు కూడా ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయి" అని సీనియర్ టీవీ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్‌దేశాయ్ అన్నారు.
ఈ ఆట ఎంత జోరుగా సాగుతుందో ఎన్నికల సంఘం గణాంకాలతో తెలుస్తుంది. గత నాలుగేళ్లుగా 17 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సమయంలో పెయిడ్ న్యూస్‌పై 1400 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
పెయిడ్ న్యూస్ మీద ఎన్నికల సంఘం కన్ను
ఛత్తీస్‌గఢ్‌లో కొన్ని వార్తాపత్రికలు, వార్తా చానళ్లలో ఎడిటర్‌గా పనిచేసిన దివాకర్ ముక్తిబోధ్ "పెయిడ్ న్యూస్ అనేది కొత్తేం కాదు. కానీ, ఇప్పుడు దాని రూపం మరింత విస్తరించింది. ప్రతి వార్తాపత్రిక, చానల్ ఎన్నికలను క్యాష్ చేసుకునే అవకాశంగా చూస్తాయి. కాపట్టి అభ్యర్థులతో, పార్టీలతో అవి ఒక రకమైన అప్రకటిత ఒప్పందం లాంటివి చేసుకుంటాయి. తమ వార్తల ద్వారా ఆ పార్టీకి అనుకూల వాతావరణం సృష్టిస్తాయి" అని తెలిపారు.
2013లో మధ్య ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో పెయిడ్ న్యూస్ గురించి 165 ఫిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం ఈసారీ ఆ రాష్ట్రంలో ఎన్నికలపై అదనపు నిఘా పెట్టింది.
పెయిడ్ న్యూస్ అందించే పద్ధతి కూడా మారుతూ వస్తోంది. మీరు మా గురించి ప్రచురించకపోయినా ఫర్వాలేదు. కానీ, మాకు వ్యతిరేకంగా వచ్చే వార్తలు మాత్రం అసలు వేయద్దు అనే కొత్త రకం పద్ధతి మొదలైంది. అంటే, మీరు ఏవీ ప్రచురించకపోయినా మీకు డబ్బు వస్తుంది అని అర్థం. అలా చాలా జరుగుతోందని మధ్యప్రదేశ్ ఇండోర్‌లో చాలాకాలం నుంచీ విలేఖరిగా ఉన్న సమీర్ ఖాన్ అంటారు.
భారత్‌లో పెయిడ్ న్యూస్ పరిస్థితి గురించి భారత ప్రెస్ కౌన్సిల్ ఒక సబ్ కమిటీ తరఫున పరంజయ్ గుహా ఠాకుర్తా, కె. శ్రీనివాస్ రెడ్డి కలిసి ఒక విస్తృత నివేదిక సిద్ధం చేశారు. చాలా కాలం నుంచీ దానిని బహిరంగ పరచలేదు. తర్వాత 2011లో అప్పటి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆదేశాల తర్వాత ఈ నివేదికను విడుదల చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
34 వేల పదాలున్న ఈ రిపోర్టులో మేం ఎవరిపై ఆరోపణలు చేశామో వారితో కూడా మాట్లాడాం. వారి సమాధానాలను కూడా ఇందులో చేర్చాం. మేం మా రిపోర్టులో ప్రతి వార్తాపత్రిక పేరు రాశాం. కేసు వివరాలు ఇచ్చాం. ఆ ప్రతినిధుల సమాధానాలు కూడా ఇచ్చాం. కానీ, ప్రెస్ కౌన్సిల్ పది నెలల వరకూ ఆ రిపోర్టును బహిరంగ పరచలేదు అని ఠాకుర్తా చెప్పారు.
కాలక్రమేణా పెయిడ్ న్యూస్ అందించే పద్ధతులను చాలా ఫైన్ ట్యూన్ చేశారు. వార్తాపత్రికల్లో ఇవి ప్రకటనలు, వార్తల మద్రణ కన్నా ముందుకు వెళ్లిపోయింది. ప్రతిపక్షాల అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఇమేజిపై బురదచల్లడం జరుగుతోంది.
జైపూర్‌లో ఉన్న ఒక సీనియర్ విలేఖరి నారాయణ్ బారోట్, "పెయిడ్ న్యూస్ కచ్చితంగా ఇలా ఉంటుందని చెప్పలేం. ఇవి 'క్యాష్'గా ఉండవచ్చు, 'కైండ్' కూడా కావచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రకటనలు, ఇతర ప్రయోజనాల పేరుతో ప్రభుత్వం నుంచి వాటిపై చాలా ఒత్తిడి ఉంటుంది. ప్రభుత్వం ఎక్కువగా తమకు వ్యతిరేకంగా వచ్చే వార్తలపైనే దృష్టి పెడుతుందని మనం చెప్పవచ్చు" అని అన్నారు.
పెయిడ్ న్యూస్ జబ్బు ఎంత ప్రమాదం
గతంలో కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్లో కూడా కొన్ని మీడియా సంస్థలు డబ్బుల కోసం తమ కంటెంట్ మార్చడానికి కూడా సిద్ధమవుతాయని తెలిపింది.
ప్రభాత్ ఖబర్ బీహార్ విలేఖరి అజేయ్ కుమార్ నిజానికి ఇప్పుడు పెయిడ్ న్యూస్ కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఉండదు. రోబోవు రోజుల్లో మామూలు వార్తల్లో కూడా ఇలాంటి విషయాలను మనం చూడాల్సి ఉంటుంది. ఇవి స్థానిక చర్చల నుంచి ప్రతి స్థాయిలోనూ ఉంటాయి అంటారు.
ప్రపంచంలో విలువలు ఉన్న జర్నలిజానికి ఊతం ఇచ్చే ఎథికల్ జర్నలిజం నెట్‌వర్క్ 'అన్‌టోల్డ్ స్టోరీజ్-హౌ కరప్క్షన్ అండ్ కాంఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టాక్ ది న్యూస్‌రూమ్' అనే శీర్షికతో రాసిన ఒక వ్యాసంలో "భారత మీడియా రంగంలోని బలమైన సంస్థలు ఇప్పటికైనా దీనిపై దృష్టి పెట్టకుంటే, దేశంలోని మీడియాలో కనిపిస్తున్న జర్నలిజంలో పసలేదని తేలిపోతుంది" అని ఆందోళన వ్యక్తం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
దైనిక్ భాస్కర్, నయీ దునియా వార్తా పత్రిక గ్రూప్ జనరల్ మేనేజర్‌గా పనిచేసిన మనోజ్ త్రివేది "ఎన్నికల సమయంలో వార్తాపత్రికలకు పెయిడ్ న్యూస్ ముద్రించడంలో, రాజకీయ పార్టీలకు, వాటి అభ్యర్థులకు కూడా అంతే బాధ్యత ఉంటుందని చెప్పారు.
"నిజానికి అభ్యర్థులు, రాజకీయ పార్టీల దగ్గర కూడా ఎన్నికల్లో ఖర్చు చేయడానికి బోలెడంత డబ్బు ఉంటుంది. కానీ ఎన్నికల సంఘం కఠినంగా ఉండడం వల్ల ఒక పరిమితి వరకే తమ ఖర్చు చూపించుకోగలుగుతున్నారు. అలా వాళ్లు కూడా వార్తాపత్రికలు, ఛానళ్ల యాజమాన్యాలను సంప్రదిస్తారు, వార్తాపత్రికలు కూడా అభ్యర్థులు, రాజకీయ పార్టీలను బట్టి ప్యాకేజ్‌లు కుదుర్చుకుంటాయి".
పరంజయ్ గుహా ఠాకుర్తా, కె. శ్రీనివాస్ రెడ్డి జరిపిన దర్యాప్తులో 61 మంది అభ్యర్థులు కూడా తాము తమ గురించి వార్తలు ముద్రించడానికి డబ్బులు ఇచ్చామని అంగీకరించడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది.
అంతేకాదు, కాలంతోపాటు పెయిడ్ న్యూస్ పద్ధతిలో కూడా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఇది మరింత పద్ధతి ప్రకారం జరగడం కనిపిస్తోంది.
దీనిపై ఠాకూర్తా, "అన్నిరకాల పీఆర్ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. అంటే దాన్ని అంచనా వేయడం కష్టమేం కాదు. రాజకీయ పార్టీల దగ్గర ఇలాంటి వాటి కోసం ఒక మొత్తం టీమ్ పనిచేస్తోంది. ఇప్పుడు నేతల దగ్గర తమ పీఆర్ మెకానిజం ఉంది. పీఆర్ ఏజెన్సీలు ఇలాంటి సౌకర్యాలు అందిస్తామని చెబుతున్నాయి. ఇటు వార్తాపత్రికలు, చానళ్ల దగ్గర కూడా వారితో మాట్లాడ్డానికి మార్కెటింగ్ శాఖ చురుగ్గా ఉంటుంది అని చెప్పారు".
చానల్, వార్తాపత్రిక ఒక ఉత్పత్తిగా మారాయంటే అందులో సందేహమే లేదు. కానీ, ఉత్పత్తిలో పెయిడ్ న్యూస్ అనే మోసం ఉండకూడదు. మీరు డబ్బులు తీసుకుంటే, దానిని స్పష్టంగా వ్యాపార ప్రకటన అని వెల్లడి చేయవచ్చని రాజ్‌దీప్ సర్దేశాయ్ అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
2013లో భారత ఎన్నికల కమిషన్ ఆధారంగా మింట్ వార్తాపత్రిక ప్రచురించిన ఒక కథనం పెయిడ్ న్యూస్ మార్కెట్ ఎంత పెద్దదో తెలిపింది. దీని ప్రకారం "ఏదైనా రాజకీయ పార్టీ ఎన్నికల సమయంలో పార్టీ, అభ్యర్థుల కోసం ఎంతైతే ఖర్చు పెడుతుందో, అందులో దాదాపు సగం పెయిడ్ న్యూస్ కోసం వ్యయం చేసి ఉంటారు.
పెయిడ్ న్యూస్ కేసులు
ఈ కేసుల్లో ఉత్తర్ ప్రదేశ్ నేత డీపీ యాదవ్ భార్య ఉమలేష్ యాదవ్ ఉదాహరణ భారత రాజకీయాల్లో మొదటి కేసు. ఒక గెలిచిన అభ్యర్థిని అనర్హుడుగా ప్రకటించడం ఇదే మొదటిసారి. 2007 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమలేష్ యాదవ్ బదాయులో బిసౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.
ఉమలేష్ యాదవ్‌తో పోటీ చేసి ఓడిపోయిన యోగేంద్ర కుమార్ ప్రెస్ కౌన్సిల్‌కు ఆమెపై ఫిర్యాదు చేశారు. ప్రముఖ హిందీ దిన పత్రికలు దైనిక్ జాగరణ్, అమర్ ఉజాలా పోలింగ్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు ఉమలేష్ యాదవ్ తరఫున న్యూస్ ప్రచురించాయని ఆరోపించారు.
పత్రికలు మాత్రం తాము ఆ వార్తను అడ్వర్జైజ్మెంట్‌గా ప్రచురించామని చెప్పాయి. వార్తతో 'ప్రకటన' (ADVT) అని కూడా పెట్టామని చెప్పాయి.
కానీ, ఆ వార్త ప్రచురించిన ఫార్మాట్ వల్ల సాధారణ ఓటర్లపై దాని ప్రభావం పడుతుందని, అలాంటప్పుడు అది జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమని, అది ఎన్నికల నిబంధనలను కూడా ఉల్లంఘించినట్టేనని ప్రెస్ కౌన్సిల్ భావించింది.
తర్వాత 2011లో ఎన్నికల సంఘం 23 పేజీల తీర్పులో ఉమలేష్ యాదవ్ సభ్యత్వం చెల్లదని ప్రకటించింది. ఆమె మూడేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. దీనిని ఒక పెద్ద మార్పుగా భావించారు.

ఫొటో సోర్స్, Getty Images
శివరాజ్ మంత్రిపై ఆరోపణలు
ఉమలేష్ యాదవ్ తర్వాత మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నరోత్తమ్ మిశ్రాను కూడా ఎన్నికల సంఘం పెయిడ్ న్యూస్‌లో ప్రమేయం ఉన్నట్టు గుర్తించి ఆయన మూడేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. అయితే తర్వాత దిల్లీ హైకోర్టు నుంచి నరోత్తమ్ మిశ్రాకు ఊరట లభించింది.
2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి తనకు అనుకూలంగా వార్తలు ప్రచురించుకున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆయన చేతిలో ఓడిపోయిన అభ్యర్థి ఆయన పెయిడ్ న్యూస్‌కు చేరిన ఖర్చు తన ఎన్నికల ఖర్చులో చూపించలేదని ఫిర్యాదు చేశారు. దాంతో 2017లో అప్పటికే మంత్రిగా ఉన్న నరోత్తమ్ మిశ్రాను ఎన్నికల సంఘం అనర్హుడుగా ప్రకటించింది.
ఆయన కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. 2018 అక్టోబర్లో సుప్రీంకోర్టు నరోత్తమ్ మిశ్రాకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతి ఇచ్చింది. కానీ ఆరు వారాల తర్వాత ఆ కేసులో మళ్లీ విచారణ జరుగుతుందని చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
అశోక్ చవాన్ కేసు
ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు పెయిడ్ న్యూస్ గురించి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కేసు పతాక శీర్షికల్లో నిలిచింది.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్ చవాన్ మహారాష్ట్రలోని భోకార్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. ఆయన గెలిచిన తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థి ఆయనకు వ్యతిరేకంగా పెయిడ్ న్యూస్ ఫిర్యాదు చేశారు.
లోక్‌మత్ వార్తాపత్రికలో 'అశోక్ పర్వం' పేరుతో ఒక సప్లిమెంట్ వేసిందని, దానికి డబ్బు చెల్లించిన విషయాన్ని అశోక్ చవాన్ తన ఎన్నికల ఖర్చులో పేర్కొనలేదని తెలిపారు.
అదే సమయంలో ద హిందూ పత్రిక జర్నలిస్ట్ సాయినాథ్ అశోక్ చవాన్ ఎన్నికల ఖర్చుల వివరాలను వరుసగా రిపోర్టింగ్ చేశారు.
ఆ సమయంలో ఎన్నికల వ్యయం ప్రకటించిన అశోక్ చవాన్ వార్తాపత్రికల్లో ప్రకటనల కోసం 5379 రూపాయలు, టీవీల్లో ప్రకటనల కోసం 6000 రూపాయలు ఖర్చు చేసినట్టు చెప్పారు. కానీ ప్రెస్ కౌన్సిల్ విచారణ కమిటీ లోక్‌మత్ వార్తాపత్రికలోనే అశోక్ చవాన్ తరఫున 156 పేజీల ప్రకటన ముద్రించినట్టు గుర్తించింది. ఆయనకు నోటీసులు జారీ చేసింది.
చివరికి 2014లో దిల్లీ హైకోర్ట్ పెయిడ్ న్యూస్ ఆరోపణల నుంచి అశోక్ చవాన్‌ను నిర్దోషిగా విడుదల చేసింది. అది ఆయనే ఇచ్చారని నిరూపించలేకపోయారని తేల్చింది.
ఈ ఉదాహరణలతో ఒకటి స్పష్టం అవుతోంది. పెయిడ్ న్యూస్ అనే కేసులను నిరూపించడం చాలా కష్టం. దానికి కారణం చెప్పిన ఠాకూర్తా, "పెయిడ్ న్యూస్‌లో ఎవరికీ ఎలాంటి రసీదు ఇవ్వడం ఉండదు. చెక్ ద్వారా చెల్లింపులు జరగవు. ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ కూడా ఉండదు. కాబట్టి దానిని నిరూపించడం కష్టం. ఇందులో డబ్బుల లావాదేవీలు చట్టవిరుద్ధంగా జరుగుతాయి. దానిని నిరూపించడం సులభం కాదు. అది ఎన్నికల కమిషన్ పని కూడా కాదు" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








